ఏపీలో మళ్లీ కేబినెట్ మార్పు .. హాట్ టాపిక్ గా మారిందా..?
దీనిపై వైసీపీ వర్గాలు ఏమంటున్నాయి..?
ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఏపీ సీఎం జగన్ తన టీమ్ లో మార్పుచేర్పులు చేయాలని అనుకుంటున్నట్లుగా ప్రో వైసీపీ మీడియా ప్రచారం ప్రారంభించింది. తాము చేయాలనుకున్న పనులు.. చక్కబెట్టాలనుకుంటున్న వ్యవహారాలకు ఆ మీడియాను వైసీపీ పెద్దలు వాడుకోవడం కామనే. ఆ ప్రకారం ఇప్పుడు మంత్రి వర్గ మార్పు చేర్పులపై మళ్లీ చర్చ ప్రారంభించారు. ఇది నిజంగానే మార్పు చేర్పులకు కారణం అవుతుందా లేదా ఇంకేదైనానా అన్నది వారికే తెలుసు. ఆరు నెలల కిందటే జరిగిన ఓ కేబినెట్ సమావేశంలో కూడా జగన్ ముగ్గురు, నలుగురు మంత్రులకు ఉద్వాసన తప్పదని హెచ్చరించారు.
ఓ సందర్భంలో సీఎం జగన్ సతీమణి భారతిపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న సమయంలో మంత్రులు స్పందించడం లేదంటూ.. కేబినెట్ సమావేశంలోనే సీఎం జగన్ కొంత మంది మంత్రులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముగ్గురు, నలుగురు మంత్రుల్ని తప్పిస్తానని అప్పట్లోనే చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. అయితే మంత్రులు తర్వాత ఎగ్రెసివ్ గా మారడంతో మళ్లీ అలాంటి వార్తలు రాలేదు. మళ్లీ ఇప్పుడే అలాంటి ప్రచారం తెరపైకి వచ్చింది. కొత్తగా తీసుకుంటున్న ఎమ్మెల్సీల్లో కొంత మందికి మంత్రి పదవులు ఇస్తారని అంటున్నారు. మర్రి రాజశేఖర్ అనే నాయకుడిని అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వలేదు కానీ మంత్రిని చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. మంగళగిరిలో లోకేష్ పై గెలిచిన ఆర్కేకు పదవి ఇస్తామన్నారు. ఇవ్వలేదు. జగన్ చెప్పాడంటే చేస్తాడనే ప్రచారం కోసం అయినా వారికి పదవులు ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నారని అంటున్నారు.
అంతా అయిపోయే.. చివరిలో ఇచ్చే పదవులు అయినా సరే.. ఏదో ఇచ్చామంటే ఇచ్చాం అనిపించుకోవడానికి బాగానే ఉంటాయనుకుంటున్నారు. అదే సమయంలో మంత్రి పదవుల నుంచి తీసేసిన పేర్ని నాని, కొడాలి నానినే పార్టీ కోసం పని చేస్తున్నారు. ఇతర మంత్రి పదవులు తీసుకున్న వారు సైలెంట్ అయిపోయారు. వారికీ కూడా మళ్లీ పదవులివ్వాలన్న డిమాండ్ వైసీపీలో ఉంది. వీటిపై ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారేమోనని వైసీపీ నేతలు ఎదురు చూస్తున్నారు. ఎన్నికల ముహూర్తం దగ్గరపడుతున్న సమయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచనల నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోసారి మంత్రి మండలిని విస్తరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కేబినెట్ మార్పుల టాక్ తో .. పదవులపై భారీగా ఆశావహుల సమస్య కూడా తలెత్తవచ్చని సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై నివేదిక తెప్పించుకున్న జగన్ ఈ మేరకు కేబినెట్‌లో మార్పులు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఐదుగురు మంత్రులకు ఉద్వాసన పలికేందుకు యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే మంత్రిమండలి విస్తరణ ఉంటుందని ఊహాగానాలు వస్తున్నాయి. సీఎం జగన్ తన తొలి కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ ముఖ్యమంత్రులతో కలిపి మొత్తం 25 మందికి చోటు కల్పించారు. అయితే రెండున్నళ్ల తరువాత మంత్రిమండలిలో మార్పులు ఉంటాయని ముందే ప్రకటించారు. చెప్పినట్లే గతేడాది కేబినెట్‌లో మార్పులు చేశారు. పాత వారిలో 11 మందికి చోటు కల్పించి.. కొత్తగా 14 మందికి మంత్రి మండలిలో చోటు కల్పించారు.
మంత్రి పదవి కోల్పోయిన వారికి ఆయా జిల్లాల పార్టీ బాధ్యతలు అప్పగించారు. పక్కాగా సామాజిక సమీకరణాలు అమలు చేస్తూ.. అన్ని వర్గాలకు సమన్యాయం ఉండేలా కేబినెట్ రూప కల్పన చేశారు. పాతవారిలో పలువురికి శాఖలు మార్చారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లను క్లీన్‌స్వీప్ చేయాలనే లక్ష్యంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం ప్రవేశపెట్టి.. మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రతి ఇంటికి వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని.. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా..? గ్రౌండ్ లెవెల్‌లో ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకుని పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. సరిగా పనిచేయని ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కదని ముందే హెచ్చరిస్తున్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై రిపోర్ట్ తెప్పించుకున్న సీఎం జగన్.. చర్యలు తీసుకునేందుకు రెడీ అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముందుగా మంత్రిమండలి నుంచి ఐదుగురిని తప్పించాలని చూస్తున్నట్లు సమాచారం. సామాజిక సమీకరణాలు బ్యాలెన్స్ చేస్తూ.. ఐదుగురిని తొలగించి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి.. ఆశావహులకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైన వారిలో కూడా మంత్రులుగా అవకాశం కల్పించే యోచన ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఎవరెవరికి అవకాశం రానుందన్నదే ఆసక్తికరంగా మారింది.
అయితే కేబినెట్ నుంచి ఔట్ అయ్యే ఆ ఐదుగురు ఎవరు అనేది ఉత్కంఠగా మారింది. ఏపీ మంత్రివర్గంలో ట్విస్ట్ ఉంటుందా…మరోసారి జగన్ మంత్రివర్గంలో మార్పులు చేస్తారా? అంటే ఇటీవల మంత్రివర్గం మార్పులపై చర్చ నడుస్తున్న సందర్భంలో చిన్న మార్పు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే వాస్తవ రూపం దాలుస్తుందా లేదా? అనేది క్లారిటీ లేదు. ఇప్పటికే జగన్ రెండుసార్లు మంత్రివర్గంలో మార్పులు చేశారు. మొదటే 25 మందితో ఒకేసారి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మధ్యలో మండలి రద్దు అని చెప్పి ఎమ్మెల్సీలుగా ఉన్న పిల్లి సుభాష్, మోపిదేవి వెంకటరమణలని మంత్రివర్గం నుంచి తప్పించి..వారిని రాజ్యసభకు పంపి..మంత్రివర్గంలో చెల్లుబోయిన వేణుగోపాల్, సీదిరి అప్పలరాజులని చేర్చుకున్నారు.
ఇక మధ్యలో సగం మంది మంత్రులని పక్కన పెట్టి కొత్తవారికి అవకాశం ఇచ్చారు. పాత, కొత్త కలయికతో మంత్రివర్గం ఏర్పాటైంది. అయితే ఇప్పుడు మరోసారి మంత్రివర్గ విస్తరణ చేస్తారని ప్రచారం వస్తుంది. ప్రస్తుత కేబినెట్ లో అయిదుగురు మంత్రులపై వేటు పడనుందని సమాచారం. అయితే ఈ ఐదు స్థానాలని ఎమ్మెల్సీలతో భర్తీ చేయనున్నారని సమాచారం. ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక వారు కూడా వచ్చాక..మంత్రివర్గంలో మార్పులు చేస్తారని తెలుస్తోంది. అయితే పార్టీ కోసం సేవ చేసి..పదవులు దక్కని వారికి ఈ సారి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అటు పార్టీ ఇటు ప్రభుత్వంలో అనుభవం ఉన్న వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రులుగా తీసుకోవాలని నిర్ణయించిన వారికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తరువాత కేబినెట్ విస్తరణకు అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే జగన్ ఎవరి పైన వేటు వేస్తారు..ఎవరికి కేబినెట్ లో సీటు ఇస్తారనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
ఈ నేపథ్యంలో ఊస్టింగ్ ఎవరికి, పోస్టింగ్ ఎవరికి అన్నది సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఎంత మందిని ప్రస్తుత మంత్రి వర్గం నుంచి తొలగిస్తారు? కొత్త వారికి ఎవరికి అవకాశం ఇస్తారన్న దానిపై ఫ్యాన్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది. దీంతో కేబినెట్ మార్పులు చేర్పులపై .. పార్టీలోనే కాక .. రాష్ట్రవ్యాప్తంగా కాక రేగుతోంది. అయితే ఈ లెక్కల్లో .. ఎవరెవరు మారనున్నారన్న చర్చపై విశ్లేషకులు సైతం సర్వత్రా ఆసక్తి కనబర్చుతున్నారు.
మొత్తం మీద మూడో సారి మంత్రి వర్గ విస్తరణకు సిద్ధమవుతున్నారు. మరి ఇదెంతమేరకు సక్సెస్ అవుతుందన్నదే చర్చనీయాంశంగా మారింది.