Homeఅంతర్జాతీయంచైనా నిరసనలు కొనసాగాయి..

చైనా నిరసనలు కొనసాగాయి..

డ్రాగన్ కంట్రీ చైనాలో జీరో కోవిడ్ ఆంక్షలు సడలించినా ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ విధానాలపై రగులుకున్న అసంత్రుప్తి జ్వాలలు ఇంకా మండుతూనే ఉన్నాయి. అధ్యక్షుడు షీ జిన్ పింగ్ పదవి నుంచి దిగిపోవాలనే డిమాండ్ చేస్తూనే ఉన్నారు. దేశవ్యాప్త నిరసనలతో ప్రభుత్వం దిగివచ్చి ఆంక్షలు సడలించినప్పటికీ అరెస్టు చేసిన వేలాది మందిని విడుదల చేయడం లేదు చైనా.. అందుకే ప్రొటెస్ట్ లు కొనసాగుతున్నాయి.

చైనాలో కొవిడ్‌ ఆంక్షలను సడలించినా..నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జీరో కొవిడ్‌ విధానాన్ని కఠినంగా అమలు చేస్తోన్న చైనాలో స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పోయిన నెలలో షింజియాంగ్‌ రాజధాని ఉర్ముచిలో చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోవడంతో చైనీయుల్లో ఆగ్రహం రగులుకుంది.

కొవిడ్‌ ఆంక్షల కారణంగానే ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయంటూ 39 నగరాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. వందల మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినా దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగతుండడంతో దిగివచ్చిన ప్రభుత్వం.. కొవిడ్‌ ఆంక్షలను సడలించేందుకు ఉపక్రమించింది.

ఇప్పటికే వివిధ నగరాలు, ప్రావిన్సుల మధ్య ప్రయాణ వివరాలను ట్రాకింగ్‌ చేసే యాప్‌ వినియోగాన్ని ఉపసంహరించుకోగా.. తాజాగా చాలా నగరాల్లో సూపర్‌ మార్కెట్లు, హోటళ్లు, సినిమాలు, జిమ్‌లు తిరిగి తెరుచుకునేందుకు వీలు కల్పించింది. అయినా, జీరో-కొవిడ్‌ విధానానికి వ్యతిరేకంగా చైనా వ్యాప్తంగా ఆందోళనలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.

ఇన్నాళ్లూ కట్టడి చేసి ఉన్నట్టుండి ఆంక్షలు పూర్తిగా ఎత్తివేస్తే లక్షల సంఖ్యలో కరోనా బాధితులు తయారవుతారని నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో పూర్తిగా ఆంక్షలను ఎత్తివేయలేకపోయింది. దాంతో నిరసనకారులు కూడా తమ ఆందోళనలను విరమించుకోలేదు. అయితే కొవిడ్‌ కట్టడికి చైనా అనుసరిస్తోన్న విధానంపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

వుహాన్‌, చోంగ్‌కింగ్‌, షెన్‌జెన్‌, చెంగ్డూ నగరాలతో పాటు షింజియాంగ్‌లోనూ ఆంక్షలను సడలిస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా చైనాలో అతిపెద్ద నగరాల్లో ఒకటైన షాంఘైలోని రద్దీ ప్రదేశాల్లో కొవిడ్‌ ఆంక్షలు సడలిస్తున్నట్లు తెలిపారు. సూపర్‌ మార్కెట్లు, హోటళ్లు, సినిమా హాళ్లు, జిమ్‌లతోపాటు ప్రజారవాణాపై ఉన్న ఆంక్షలనూ ఎత్తివేశారు.

ఈ ప్రాంతాల్లో కొవిడ్‌ నెగటివ్‌ సర్టిఫికెట్‌ చూపించే అవసరం లేదని తెలిపిన అధికారులు.. పాఠశాలలు, బార్‌లతో పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించే వేదికల్లో మాత్రం కొవిడ్‌ టెస్ట్‌ రిపోర్టును చూపించాలని సూచించారు. మరోవైపు కొవిడ్‌ ఆంక్షల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న యాపిల్‌ సంస్థ.. తమ ఉత్పత్తి కేంద్రాల్లో కొన్నింటిని వేరే ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

చైనాలో నిత్యం వేల సంఖ్యలో కొవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి..!

మరోవైపు చైనాలో నిత్యం వేల సంఖ్యలో కొవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో కొవిడ్‌ ఆంక్షలు సడలిస్తున్నా తిరిగి వాటిని ఎప్పుడైనా అమలు చేయవచ్చనే భయం చైనీయుల్లో ఉంది. అందుకే తమ డిమాండ్ ను తాజా ఉంచేందుకు నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఉద్యమరూపం పొందిన వీరి ఆందోళనలు నివురుగప్పిన నిప్పు అని చెబుతున్నారు విశ్లేషకులు.

చైనా మళ్లీ ఏమాత్రం తోక జాడించినా అది అగ్నిపర్వతంలా బద్దలవుతుందని హెచ్చరిస్తున్నారు. పైగా జిన్ పింగ్ సైతం కాస్త ఆచి తూచి వ్యవహరించే దోరణిని అవలంబిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఆందోళనకారులు మరిన్ని కారణాలను ఎత్తి చూపుతూ ఆయన రాజీనామాను కోరుతున్నారు.

అయతే కొవిడ్ పుట్టినిల్లైన చైనాకు మరో కొత్త చిక్కు వచ్చి పడింది. ప్రజల తిరుగుబాటు కారణంగా జీరో కొవిడ్ విధానం నుంచి ఆ దేశం పక్కకు జరగడంతో మనం ముందు చెప్పుకున్నట్టుగానే చైనీయులు భారీగా కొవిడ్ బారిన పడుతున్నారు. జ్వరం, జలుబుతో ఆస్పత్రుల ముందు భారీగా బారులు తీరుతున్నారు. చిన్న పిల్లల ఆస్పత్రులు సైతం కిక్కిరిసిపోతున్నాయి. జలుబు, జ్వరం మందులు దొరకడం చైనాలో కష్టంగా మారింది.

ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ఫోన్లు ఆరింతలుగా పెరిగినట్లు వైద్య సిబ్బంది చెబుతున్నారు. దీంతో మరోసారి కొన్ని ఆంక్షలు విధించాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో ఇక జిన్ పింగ్ ప్రభుత్వం పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. ముందు నుయ్యి వెనుక గొయ్యి చందంగా మారిన చైనా ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Must Read

spot_img