- భారత్, అమెరికా వంటి దేశాలపై చైనా నిఘా పెట్టిందా..?
- అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలపై కన్నేసిందా..?
- అంతర్జాతీయ మీడియా నివేదిక వెల్లడించిన సమాచారం ఇప్పుడు యావత్ ప్రపంచాన్నే కలవరపాటుకు గురిచేస్తోంది.
- అసలింతకు ఏం జరుగుతోంది..?
- అందుకోసం .. చైనా స్పై బెలూన్ ను లాంచ్ చేసిందా..?
- దీనిపై యూఎస్ ఏమంటోంది..? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
స్పై బెలూన్ .. దీనిపై చైనా, అమెరికా మధ్య తలెత్తిన రచ్చ .. అంతా ఇంతా కాదు.. అయితే ఈ స్పై బెలూన్ .. భారత్ పై కూడా నిఘా పెట్టిందన్న వార్తలు .. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. చైనా స్పై బెలూన్ .. విషయంలో.. తాజాగా వినిపస్తోన్న కథనం.. సుమారు 40 దేశాల్లో ఆందోళనలను రేకెత్తిస్తోంది.
అమెరికాలో చైనా నిఘా బెలూన్ రేపిన కలకలం అంతా ఇంతా కాదు. నాలుగు రోజుల పాటు అమెరికాలోని రక్షణ స్ధావరాలు, అణుకేంద్రాలపై తచ్చాడిన మూడు బస్సుల సైజున్న నిఘా బెలూన్ ను ఎట్టకేలకు గత వారం అధ్యక్షుడు బైడెన్ ఆదేశాలతో కూల్చేశారు. అయితే ఇప్పుడు అలాంటివే మరిన్ని బెలూన్లు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై సంచరిస్తున్నట్లు షాకింగ్ నివేదిక అందింది. భారత్, జపాన్ తో పాటు ఐదు ఖండాల్లోని పలు దేశాలపై చైనా నిఘా బెలూన్లు సంచరిస్తున్నట్లు తాజాగా ఓ నివేదిక బయటికి వచ్చింది. ఈ కథనంలో చైనా నిఘా బెలూన్లు ఐదు ఖండాల్లో కనిపించినట్లు పేర్కొంది.
దీంతో చైనా బెలూన్ల అంశంపై ఇప్పుడు అనేక దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా చైనాతో శత్రుత్వం కలిగిన ఇండియా, జపాన్, వియత్నాం వంటివి ఆందోళన చెందుతున్నాయి. దీనిపై అమెరికా అధికారులు ఒక నివేదిక రూపొందించారు. ఈ నివేదిక ప్రకారం..ఇండియా, జపాన్‌తోపాటు 40 దేశాలు చైనా స్పై బెలూన్ నిఘాలో ఉన్నాయి. చైనా భారీ ఎత్తున నిఘా బెలూన్లను పంపించిందని అమెరికా అధికారులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయా దేశాలకు తెలియజేసినట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు. చైనా, దక్షిణ తీరంలోని హైనానా ప్రావిన్స్ నుంచి ఈ బెలూన్లను ఆపరేట్ చేస్తున్నారు.
ఆయా దేశాలకు చెందిన సైనిక సమాచారాన్ని తెలుసుకునేందుకు చైనా ఈ బెలూన్లు ఉపయోగిస్తోంది. చైనా సైన్యమైన పీఎల్ఏ ఎయిర్ ఫోర్స్ కార్యకలాపాల్లో భాగంగా, ఐదు ఖండాల్లో వీటిని ప్రయోగించింది. అనేక దేశాల గగనతలాల్లో ఈ బెలూన్లు ఎగరడం, ఆయా దేశాల సార్వభౌమాధికారాన్ని ధిక్కరించడమేనని అమెరికా అభిప్రాయపడింది. అయితే, భారత రక్షణ వ్యవస్థపై చైనా గూఢచర్యం ఎంత వరకు నిజమన్నది ఇంకా స్పష్టమైన సమాచారం తెలియాల్సి ఉంది.
యూఎస్ స్పై బెలూన్ అనేక దేశాలలో సైనిక ఆస్తులపై గూఢచర్యం చేయడానికి చైనా చేసిన కుట్రలో ఇది భాగమని అమిరికా పేర్కొంది. వ్యూహాత్మక దేశాల రక్షణ వ్యవస్థ, సైనిక శక్తి లాంటి వాటి గురించి వివరాలు సేకరించేందుకు నిఘా బెలూన్ తో చైనా అడుగులు వేస్తుందని పేర్కొంది.
కొన్ని సంవత్సరాలుగా హవాయి, ఫ్లోరిడా, టెక్సాస్, గ్వామ్ మీదుగా కనీసం నాలుగు బెలూన్‌లు కనిపించాయని అమెరికా పేర్కొంది. వీటిలో మూడు ట్రంప్ పరిపాలనలో కనిపించగా.. బైడెన్ పరిపాలనలో ఒక చైనా నిఘా ఎయిర్‌షిప్‌లను గుర్తించినట్లు నివేదిక పేర్కొంది.
ఈ క్రమంలో పెంటగాన్ .. నిఘా బెలూన్ చిత్రాల వరుస చిత్రాలను విడుదల చేసింది. అమెరికా, చైనా ప్రెసిడెంట్లు బిడెన్, జిన్ పింగ్ తొలి వ్యక్తిగత శిఖరాగ్ర సమావేశం తరువాత, ఈ బెలూన్ సంఘటన మరింత వివాదానికి దారితీసింది. చైనా తన స్పై బెలూన్లను భారత్, జపాన్‌తో సహా అనేక దేశాలను లక్ష్యంగా చేసుకుని విడుదల చేసిందని నివేదిక తెలిపింది.
నిఘా బెలూన్ జపాన్, భారతదేశం, వియత్నాం, తైవాన్ మరియు ఫిలిప్పీన్స్‌తో సహా అభివృద్ధి చెందుతున్న వ్యూహాత్మక ఆసక్తి ఉన్న దేశాలు, ప్రాంతాలలోని సైనిక ఆస్తులపై సమాచారాన్ని సేకరించింది. మరోవైపు అమెరికాలో స్పై బెలూన్ల విషయంపై చైనా దౌత్యవేత్త .. అమెరికా కూల్చివేసిన బెలూన్ శిధిలాలను తిరిగి ఇవ్వాలని, ఎందుకంటే ఇది ఆసియా దేశానికి చెందినదని డిమాండ్ చేశారు.
“మీరు వీధిలో ఏదైనా తీసుకుంటే, యజమాని ఎవరో మీకు తెలిస్తే, మీరు దానిని యజమానికి తిరిగి ఇవ్వాలని ఫ్రాన్స్‌లోని చైనా రాయబారి లు షాయే అన్నారు. బీజింగ్ మాత్రం దీన్ని .. ఒక పౌర వాతావరణ పరిశోధన వాహనం అని పేర్కొనగా, అయితే ఇది నిఘా కోసం అని అమెరికా చెబుతోంది.
- అమెరికన్లు దానిని తిరిగి ఇవ్వకూడదనుకుంటే, అది వారి నిర్ణయం..
ఇది వారి నిజాయితీని ప్రదర్శిస్తుందపి వ్యాఖ్యానించింది. చైనాకు చెందిన నిఘా బెలూన్‌ను అమెరికా కూల్చివేయటంపై ఇరు దేశాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. చైనా దక్షిణ తీరంలో చాలా సంవత్సరాలుగా పాక్షికంగా నిఘా బెలూన్ వ్యవస్థ పని చేస్తోందని వాషింగ్టన్ పోస్ట్ తన నివేదికలో వెల్లడించింది. డొనాల్డ్ ట్రంప్ హయాంలో మూడు, నాలుగు సందర్భాల్లో ఇలాంటివే జరిగినా.. ఇటీవలే వాటిని చైనా నిఘా ఎయిర్ షిప్ లుగా గుర్తించినట్లు ప్రకటించింది. అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణిస్తున్న బెలూన్ ను సూపర్ సోనిక్ క్షిపణితో అమెరికా సైన్యం ధ్వంసం చేసింది.
వాటి శిథిలాలను సేకరించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను అమెరికా నేవీ విడుదల చేసింది. చైనాకు ఎయిర్ షిప్ తమ దేశం మీద ఎగురుతున్నట్టు గమనించిన అమెరికా దానిని యుద్ధ విమానాల సహాయంతో పేల్చేశారు.. మొదట దానిని గ్రహాంతర వాసి అనుకున్నారు. పేలిన బెలూన్ ను చూడగా అందులో రకరకాల పరికరాలను పరిశీలించారు..అధునాతన కెమెరాలు.. వీడియో రికార్డు చేసే పరికరాలు ఉన్నట్టు గమనించారు..
అయితే ఈ పరికరాలతో ఫోటోలు తీసి అవి ఎక్కడి నుంచి అయితే ప్రయోగించబడ్డాయో అక్కడికి వాటిని పంపిస్తున్నాయి.. వాటిని నిలువరించడం సాధ్యం కాని సాఫ్ట్వేర్ అప్లోడ్ చేయడంతో అమెరికా అధికారులు ఆ ఫోటోల అప్ లోడ్ ను నిలువరించలేకపోయారు.. అయితే ఇది ఎక్కడి నుంచి ప్రయోగించబడిందో, దాని రిమోట్ సెన్సింగ్ ఆధారంగా అమెరికా అధికారులు గుర్తించారు. అయితే ఈ స్పై బెలూన్ కేవలం అమెరికాను మాత్రమే ఉద్దేశించి ప్రయోగించినది కాదు. భారత్, జపాన్, ఫిలిప్పీన్స్ మీదుగా ఇది అమెరికా వెళ్ళింది.
భారత్ తో పాటు జపాన్ దేశాలు ఎందుకు గుర్తించలేకపోయాయి? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే 60 వేల అడుగుల ఎత్తులో నెమ్మదిగా ప్రయాణించే ఎయిర్ షిప్ లాంటి దానిని సివిల్, మిలటరీ గ్రౌండ్ రాడార్లు గుర్తించలేవు. ఎయిర్ షిప్ ఎలాంటి వేడిని విడుదల చేయదు కాబట్టి హీట్ సిగ్నేచర్ అంటూ ఏదీ ఉండదు.. కాబట్టి ఉపగ్రహాలు కూడా గుర్తించలేవు. ఎయిర్ షిప్ లేదా పెద్ద పెద్ద బెలూన్లను గుర్తించాలి అంటే భూ దిగువ కక్ష్యలో ఉండే శాటిలైట్లు కావాలి.. వాటిని నియర్ ఎర్త్ ఇమేజింగ్ టెక్నాలజీ లు గుర్తించగలవు. కానీ ఇది చాలా ఖరీదైన వ్యవహారం కాబట్టి మన దేశంతో పాటు జపాన్ దగ్గర లేకపోవడంతో గుర్తించలేకపోయాయి. అమెరికా దగ్గర ఆ సాంకేతిక పరిజ్ఞానం ఉంది కాబట్టి వెంటనే గుర్తించగలిగింది.
దానిని మానిటర్ చేయగలిగింది. ప్రస్తుతం అమెరికా, జపాన్, భారత్ లు .. చైనా కి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి కాబట్టి ఒకవేళ యుద్ధం అంటూ వస్తే ఎలాంటి టెక్నాలజీని వాడి దెబ్బతీయవచ్చు? అనే కోణంలో చైనా ఈ ప్రయోగం చేసింది. యుద్ధం అంటూ వస్తే ఇదే ప్రయోగించి వైరస్ ను విడవవచ్చు.. లేదా పరిమితి పరిధిలో ప్రభావం చూపగలిగే స్ట్రాటజిక్ అణు బాంబులను ఉపయోగించవచ్చు.
ఈ బెలూన్ ను ధ్వంసం చేసిన అనంతరం అమెరికా చైనా పై నిరసన తెలిపింది. కానీ చైనా విదేశాంగ శాఖ మాత్రం అది కేవలం వాతావరణ పరిశోధన కోసం ప్రయోగించినది అని, నియంత్రణ తప్పి అమెరికా భూభాగం వైపు ప్రయాణించిందని వివరణ ఇచ్చింది. దీని మీద తాము విచారం వ్యక్తం చేస్తున్నామని పేర్కొంది. చైనా అధికారులు ఇచ్చిన వివరణలోనే అది కంట్రోల్ తప్పింది అనే పదం వాడింది కాబట్టి అది బెలూన్ కాదు కంట్రోల్ ఎయిర్ షిప్ అని పరోక్షంగా
ఒప్పుకున్నట్టు అయింది..
ఇప్పటికే సరిహద్దుల్లో అలజడులకు తెగబడుతోన్న డ్రాగన్ కంట్రీ .. స్పై బెలూన్ తో మరింత కుట్రలకు తెర తీసిందన్న వార్తలు .. ప్రపంచ దేశాల్లో
వణుకు పుట్టిస్తున్నాయి. దీంతో చైనా తీరుపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది..