Homeఅంతర్జాతీయంశాంతి వచనాలు పలుకుతోన్న చైనా

శాంతి వచనాలు పలుకుతోన్న చైనా

ఈ మధ్య కాలంలో చైనా శాంతి వచనాలు పలుకుతోంది.

ఇరాన్ సౌదీల మధ్య దౌత్యసంబంధాల పునరుద్దరణ, ఉక్రెయిన్ యుధ్దం నిలిపివేసే దిశగా రష్యా పర్యటన చేసిన డ్రాగన్ ఓ కొత్త పాటతో ముందుకు వస్తోంది. చైనా ఏమంటోందంటే..భారత్‌, రష్యాలతో సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు తాము సిద్ధం..అని. రష్యా కొత్త విదేశాంగ విధానంపై చైనా సానూకూలంగా స్పందించింది. దీని గురించి విలేకరులు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి మావోనింగ్‌ స్పందన కోరగా..చైనా రష్యా, భారత్‌ గుర్తించదగిన రీతిలో అతిపెద్ద శక్తులుగా ఎదుగుతున్నాయి. పైగా ప్రభావంతంగా అభివృద్ధి చెందుతున్నాయి కూడా. ప్రస్తుతం అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలు సంక్లిష్ట మార్పులకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా, భారత్‌ సహా అంతర్జాతీయ సమాజంతో సంబంధాల బలోపేతం చేసుకోవడానికి తాముగా సిద్ధంగా ఉన్నాం. అని ప్రకటించింది. అంతేగాదు పరస్పర గౌరవం, శాంతియుత జీవన, గెలుపు-విజయాల సహకారంతో కూడిన ఈ సరికొత్త విదేశాంగ విధానంతో సంబంధాలను మరింతగా పెంపొందించడానికి చైనా రష్యాలు అంకితభావంతో పనిచేస్తున్నాయి అని సదరు విదేశాంగశాఖ ప్రతినిధి చెప్పారు. కాగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ గత శుక్రవారమే కొత్త విదేశాంగ విధానంపై సంతకం చేశారు. దీనిలో రష్యా చైనా, భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసే దౌత్యపరమైన ప్రాధాన్యత గురించి కూడా ప్రస్తావించారు. ఈ మేరకు 42 పేజీల ఆ కొత్త విదేశాంగ విధానం డాక్యుమెంట్లలో చైనా భారత్‌ సంబంధాలను ప్రత్యేకంగా హైలైట్ చేయడం జరిగింది. అంతేగాదు యురేషియా ఖండంలో ఉన్న స్నేహపూర్వక సంబంధాలను మరింతగా పెంచుకోవడం, సమన్వయం చేసుకోవడం వంటి ప్రాముఖ్యతను కూడా రష్యా నొక్కి చెప్పింది. అలాగే ఈ ప్రాంతంలో భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం, వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకోవడంపై దృష్టిసారిస్తామని, అలాగే ప్రత్యర్థి దేశాలు, కూటములు చేపట్టే ‘విధ్వంసకర చర్యల’ను నిరోధిస్తామని పుతిన్‌​ ఆ విదేశాంగ విధానంలో వివరించారు.

భారత్ రష్యాల సంగతి వేరు..

అది దశాబ్దాల మిత్రుత్వం..దానిని ఎవరూ చెరిపేయలేరు. కానీ ఈ మధ్యలో చైనా భారతదేశం పేరును తీసుకోవడం పైనే అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే డ్రాగన్ కంట్రీ చైనా నిత్యం భారత్‌పై బుసలు కొడుతుంది. నోటితో ప్రశంసిస్తూ నొసటితో వెక్కిరిస్తున్నట్టుగా వ్యవహరిస్తోంది. గతంలో పలుమార్లు సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడిన చైనా ఇపుడు కూడా మరోమారు తన వక్రబుద్ధిని చూపించింది. భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలను ఆక్రమించుకున్న చైనా… ఇపుడు ఆ ప్రాంతాల పేర్లను మారుస్తోంది. తాజాగా 11 ప్రాంతాల పేర్లను మార్చింది. చైనీస్, టిబెటిన్, షిన్యన్ అక్షరాలతో వీటి పేర్లను విడుదల చేసింది. మూడో విడత చర్యలో భాగంగా ఈ ప్రాంతాలను ఎంచుకుంది. చైనా మంత్రివర్గం జారీ చేసిన భౌగోళిక పేర్లపై నిబంధనలను అనుసరించి చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా చైనీస్, టిబెటన్, షిన్యిన్ అక్షరాలతో ప్రామాణిక పేర్లను విడుదల చేసింది. ఈ జాబితాలో రెండు భూభాగాలను, ఐదు పర్వత శిఖరాలను, రెండు నదులతో పాటు సబార్డినేట్ అడ్మినిస్ట్రేటివ్ జిల్లాలు ఉన్నాయి. ఈ విషయాన్ని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. 2017లో తొలి విడతలో ఆరు ప్రాంతాలకు, 2021లో రెండో విడతలో 15 ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టింది. ఇపుడు మూడో విడతగా 11 ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టబోతున్నట్టు రాసుకొచ్చింది. పైగా, ఈ పేర్ల ప్రకటన చట్టబద్ధమైన చర్య అని, అది చైనా సార్వభౌమ హక్కు అని చైనా నిపుణులను ఉటంకిస్తూ తెలిపింది. అంతే కాదు..చాలా రోజులుగా చైనా ద్రుష్టంతా హిందు మహా సముద్రంపైనే ఉంది. నిజానికి ఆ సముద్రం కారణంగానే కొన్నేళ్లుగా భారత్‌తో సత్సంబంధాల కోసం పశ్చిమ దేశాలు ఉవ్విళ్లూరుతున్నాయి. భౌగోళికంగా ఈ సముద్రంలో భారత్‌ అత్యంత వ్యూహాత్మక స్థానంలో ఉంది. అంటే కీలక స్థానంలో భారత్ ఉంది కాబట్టే చైనాకు కంటగింపుగా ఉంది.

దీనిలో పసిఫిక్‌-హిందూ మహాసముద్రాల్లోకి పరస్పరం ప్రయాణించేందుకు ఉన్న షార్ట్‌కట్‌ మార్గమైన మలక్కా జలసంధి ఇక్కడే ఉంటుంది.

దీని నుంచి ఏటా 90 వేల నౌకలు ప్రయాణిస్తాయి. వీటిల్లో సుమారు 9.4 బిలియన్‌ టన్నుల సరకులు రవాణా అవుతాయి. ప్రపంచ వాణిజ్యంలో 40శాతం ఇక్కడి నుంచే జరుగుతోంది. దీనికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే భారత్‌కు చెందిన అండమాన్‌ దీవులు ఉన్నాయి. ఇక్కడ భారత త్రివిధ దళాల సంయుక్త కమాండ్‌ ఉంది. బ్రూకింగ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ అంచనాల ప్రకారం భారత్‌ అభివృద్ధిని అత్యంత వేగవంతం చేసే శక్తి ఈ సముద్రానికి ఉంది. ఇది మన పొరుగు దేశం చైనాకు కంట్లో నలుసులా మారింది. ఇక్కడ భారత్‌ శక్తిని దెబ్బతీసేలా వ్యూహాలకు పదును పెడుతోంది. దక్షిణ చైనా సముద్రం, హిందూ మహా సముద్రంలోని 33 కీలక ప్రదేశాల వద్దకు ఇక నుంచి క్రమం తప్పకుండా చైనా సర్వే నౌకలను పంపించాలని డ్రాగన్‌ నిర్ణయించింది. ఈ విషయాన్ని నేషనల్‌ నేచురల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ చైనా అధికారికంగా ప్రకటించింది. వీటిల్లో ఆరు సర్వేపాయింట్లు పసిఫిక్‌ సముద్రంలోని అమెరికా సైనిక స్థావరాల సమీపంలో ఉన్నాయి. చైనాను కట్టడి చేయడానికి పసిఫిక్‌లో అమెరికా ఈ సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. చైనా సర్వే నౌకలు ప్రయాణించనున్న మార్గాల్లో.. తైవాన్‌- ఫిలిప్పీన్స్‌ మధ్యలోని లోతైన ప్రదేశం కూడా ఉంది. ఇది జలాంతర్గాముల ప్రయాణానికి అత్యంత కీలకమైన మార్గంగా ఉంటుంది. హిందూ మహా సముద్రంలో కూడా చైనాను కట్టడి చేయడానికి అమెరికా పలు స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని చైనా ఈ సముద్రంలో కూడా అడుగుపెట్టింది. చైనా నిర్ణయించిన సర్వే పాయింట్లలో రెండు భారత్‌ సమీపంలోనూ ఉన్నాయి. దాదాపు ప్రతి నెలా ఈ పాయింట్ల వద్దకు చైనా నౌకలు రావచ్చు. అవి ఏం సర్వేలు చేస్తాయో మాత్రం వెల్లడించలేదు. భారత్‌ గత కొన్నేళ్లుగా బంగాళాఖాతంలో పలు క్షిపణులను పరీక్షిస్తోంది.

తాజాగా చైనా ప్రకటించిన సర్వే పాయింట్లు.. క్షిపణి పరీక్షల రేంజిలో ఉన్నాయి.

అంటే భారత్‌ చేపట్టే పరీక్షలను విశ్లేషించడానికి డ్రాగన్‌కు అవకాశం లభించనుంది. ఆమధ్య శ్రీలంకలో ఇంధనం నింపుకునేందుకు ఓ సర్వే నౌక వద్దన్నా వినకుండా భారత్‌ పక్కపక్కనే నిఘా పెట్టే ప్రయత్నం చేసింది. గతేడాది డిసెంబర్‌లో భారత్‌ ఒడిశాలోని అబ్దుల్‌ కలామ్‌ ద్వీపం నుంచి 5000 కిలోమీటర్ల రేంజి అగ్ని-5 పరీక్షను నిర్వహించే ‘నోటమ్‌’ జారీ చేసిన సమయంలో చైనా సర్వే నౌక యువాన్‌వాంగ్‌-5 హిందూ మహాసముద్రంలోకి వచ్చింది. అగ్ని-5 తొలి యూజర్‌ ట్రయల్‌. ఈ క్షిపణి పరిధిలోకి చైనా ఉత్తర ప్రాంతాలు కూడా వస్తాయి. ఇంత ముఖ్యమైన పరీక్ష సమయంలో చైనా నౌక శ్రీలంకలోని హంబన్‌టోట రేవు వద్ద ఉండటం భారత్‌-శ్రీలంక మధ్య దౌత్య వివాదానికి కారణమైంది. అంతకు ముందు నెలలో కూడా అగ్ని-3 క్షిపణి పరీక్షకు నిర్ణయించిన తేదీల్లో చైనా నౌక యువాన్‌వాంగ్‌-6 హిందూ మహా సముద్రంలో ఉంది. దీంతో అప్పట్లో పరీక్ష తేదీలను మార్చారు. ప్రపంచంలో మరే దేశం వద్దా లేనంత స్థాయిలో చైనా దగ్గర 60 సర్వే నౌకలు ఉన్నాయి. కాకపోతే ఈ నౌకలు చేపట్టే మిషన్లలో ఎటువంటి పాదర్శకత ఉండదు. పైకి సర్వే నౌకలని చెబుతున్నా.. ఇవి నిఘా కార్యక్రమాలు నిర్వహిస్తాయి. చాలా సర్వే నౌకలు చైనా పీఎల్‌ఏ స్ట్రాటజిక్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ పరిధిలో పనిచేస్తాయనే ఆరోపణలు ఉన్నాయి. భారత్‌కు వ్యహాత్మకంగా అత్యంత కీలకమైన అండమాన్‌ దీవుల సమీపంలోకి అపారమైన చైనాకు సంబంధించిన సైనిక పరికరాలు చేరుతున్నాయి. ఈ దీవులకు అత్యంత సమీపంలోని మయన్మార్‌కు చెందిన కోకో దీవుల్లోకి సైనిక పరికరాల ఆధునికీకరణ జరుగుతున్నట్లు ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. కోకాదీవులను లైజనింగ్‌ పోస్ట్‌గా చైనా వాడుకుంటోందనే అనుమానాలు ఉన్నాయి. ఇన్ని కుట్రపూరిత పనులు చేస్తున్న చైనా రష్యా భారత్ దేశాలతో స్నేహ హస్తాన్ని కోరుతున్నామని అంటే ఎవరు మాత్రం నమ్ముతారు అని అంటున్నారు విశ్లేషకులు.

Must Read

spot_img