Homeఅంతర్జాతీయంచైనాలో వేగంగా తగ్గిపోతున్న జనాభా..

చైనాలో వేగంగా తగ్గిపోతున్న జనాభా..

ప్రపంచంలో జనాభా సంఖ్యలో అగ్రస్థానంలో ఉన్న చైనాలో జనాభా తగ్గుముఖం పడుతోంది.. గత రెండేళ్లుగా చైనాలో జననాల సంఖ్య బాగా తగ్గిపోయింది.. జనాభాను పెంచేందుకు చైనా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టినా.. జనాభా ఎందుకు పెరగడం లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..

చైనాలో 1979లో ప్రవేశపెట్టిన వన్ – చైల్డ్ పాలసీ ఆ దేశ జనాభా దిశను మార్చేసిందా..? గత 60 ఏళ్లలో తొలిసారిగా జనాభా తగ్గడం దేనికి సంకేతం…? జనాభా సంక్షోభంతో చైనా ఎలాంటి సవాళ్లు ఎదుర్కోనుంది..?

చైనా జనాభా గత 60 ఏళ్లలో మొదటిసారిగా తగ్గింది. గతేడాదిలో చైనా దేశ జనాభా సుమారు 8.50 లక్షలు తగ్గి… 141.175 కోట్లుగా నమోదైంది. 2021లో ఇది 141.260 కోట్లుగా ఉంది. జననాల రేటు ప్రతి 1,000 మందికి 6.77గా నమోదైంది. 2021లో జననాల రేటు 7.52గా ఉంది. చైనా జననాల రేటు కొన్నేళ్లుగా క్షీణిస్తోంది. ఈ ధోరణి తగ్గించడానికి ఒకరినే కనాలనే విధానాన్ని 2016లో రద్దు చేసింది.

2021లో అమెరికాలో ప్రతి 1,000 మందికి 11.06 జననాలు, బ్రిటన్‌లో 10.08 జననాలు నమోదయ్యాయి. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనాను అధిగమించేందుకు సిద్ధంగా ఉన్న భారతదేశంలో అదే ఏడాది జననాల రేటు 16.42గా రికార్డ్ అయింది.

చైనాలో గతేడాది తొలిసారిగా జననాల కంటే మరణాల రేటు పెరిగింది. 1976 తర్వాత చైనాలో అత్యధిక మరణాల రేటు 2022లో నమోదైంది. 1,000 మందికి 7.37 మరణాలు నమోదయ్యాయి. 2021లో ఇది 7.18గా ఉంది. ఇది దీర్ఘకాలంలో చైనా శ్రామిక శక్తిని తగ్గిస్తుంది. ఆరోగ్య సంరక్షణ, ఇతర ఖర్చులపై భారాన్ని పెంచుతుంది. జపాన్, దక్షిణ కొరియా వంటి ఇతర తూర్పు ఆసియా దేశాలలో కూడా జనాభా తగ్గిపోతోంది. వృద్ధాప్యం పెరుగుతోంది.. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్‌లోని ప్రధాన ఆర్థికవేత్త యు సు దీనిపై స్పందిస్తూ “ఈ ధోరణి కొనసాగుతుంది. కోవిడ్ తర్వాత మరింత దిగజారవచ్చు” అని అభిప్రాయపడ్డారు. 2023 నాటికి చైనా జనాభా మరింత తగ్గిపోతుందని భావించే వారిలో సు ఒకరు. ‘నిరుద్యోగం పెరగడం, ఆదాయాలు తగ్గడం వంటి కారణాల వల్ల పెళ్లి చేసుకోవడం లేదా పిల్లలను కనడాన్ని వాయిదా వేస్తారు. అందువల్ల జననాల రేటు తగ్గుతుంది’సు అభిప్రాయపడ్డారు…

జనాభా పెరుగుదల నియంత్రించడానికి 1979లో ప్రవేశపెట్టిన వివాదాస్పద వన్-చైల్డ్ పాలసీ చైనా జనాభా దిశను మార్చేసింది. నిబంధనలను ఉల్లంఘించిన కుటుంబాలకు జరిమానా విధించారు. కొన్ని సందర్భాల్లో వాళ్లు ఉద్యోగాలు కూడా కోల్పోయారు. బాలికల కంటే అబ్బాయిలకు ప్రాధాన్యతనిచ్చే సంస్కృతిలో ఈ విధానం 1980ల నుంచి బలవంతపు అబార్షన్‌లు, లింగ నిష్పత్తి తేడాలకు దారితీసింది. 2016లో ఈ పాలసీని రద్దు చేసి పెళ్లయిన జంటలు ఇద్దరు పిల్లలను కనేందుకు అనుమతించారు.

ఇటీవల చైనీస్ ప్రభుత్వం పడిపోతున్న జనన రేటును పెంచడానికి ప్రోత్సాహకాలు ప్రకటించింది. వీటిలో పన్ను మినహాయింపులు, మెరుగైన ప్రసూతి ఆరోగ్య సంరక్షణ తదితరాలు ఉన్నాయి. కానీ, ఈ విధానాలు జననాలలో స్థిరమైన పెరుగుదలకు దారితీయలేదు. అయితే పనులకు వెళ్లే తల్లులకు ప్రసవాన్ని ప్రోత్సహించే విధానాలు పెద్దగా ప్రయోజనం ఇవ్వలేదు. పిల్లల సంరక్షణ, విద్య తదితరాలు ఇందులో లేకపోవడం కారణమని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

2022 అక్టోబరులో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ జనన రేటును పెంచడానికి ప్రాధాన్యతనిచ్చారు. బీజింగ్‌ లో ఐదేళ్లకోసారి జరిగే కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్‌ సభలో జిన్‌పింగ్ మాట్లాడుతూ.. వృద్దాప్య జనాభా పెరుగుతున్న నేపథ్యంలో తమ ప్రభుత్వం “చురుకైన జాతీయ వ్యూహాన్ని అనుసరిస్తుందని” ప్రకటించారు.పిల్లలను కనడానికి ప్రోత్సాహకాలను అందించడమే కాకుండా, చైనా గృహాలు, కార్యాలయాలలో లింగ సమానత్వాన్ని కూడా మెరుగుపరచాలని నిపుణులు సూచించారు.

బుసరవాన్ సింగపూర్ నేషనల్ యూనివర్శిటీ సెంటర్ ఫర్ ఫ్యామిలీ అండ్ పాపులేషన్ రీసెర్చ్ డైరెక్టర్. ఇటువంటి నిర్ణయాలు సంతానోత్పత్తి రేటును మెరుగుపరుస్తాయని స్కాండినేవియన్ దేశాలు చేసి చూపించాయని ఆమె తెలిపారు. సింగపూర్ మాజీ చీఫ్ స్టాటిస్టిషియన్ పాల్ చియుంగ్ మాట్లాడుతూ జనాభా సమస్య పరిష్కరించడానికి చైనాకు పుష్కలమైన మానవశక్తితో పాటు సమయం కూడా ఉందని తెలిపారు. అయితే కేవలం జననాల రేటు పెంచడం వల్ల చైనా జనాభా వృద్ధి మందగమనం పరిష్కరించలేమని పరిశీలకులు అంటున్నారు.

డిసెంబర్ 2022 – జనవరి 2023 మధ్య చైనా హాస్పిటల్స్ లో సుమారు 60వేల మంది కోవిడ్ కారణంగా మరణించారని అధికారులు వెల్లడించారు. చైనాలో తగ్గుతున్న జనాభా ఆ దేశ సంక్షోభానికి దారితీస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆరు దశాబ్దాలలో మొదటిసారి.. సంతానోత్పత్తి కంటే మరణాల రేటు ఎక్కువగా ఉందని ‘న్యూయార్క్ టైమ్స్’ వెల్లడించింది. ఇదిలాగే ఉంటే చైనా స్థానాన్ని భారత్ భర్తీ చేయనుంది.

‘నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్’ డేటా ప్రకారం… 2022లో చైనాలో 95 లక్షల 60వేల మంది జన్మించగా, కోటి 41వేల మంది మరణించారు. 1960 నుండి చైనాలో జననాల కంటే మరణాలు ఎక్కువగా నమోదు కావడం ఇదే తొలిసారి. రానున్న రోజుల్లో చైనాలో కార్మికశక్తి తగ్గిపోయే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జనాభాను పెంచేందుకు చైనా చర్యలు చేపట్టింది. 35 సంవత్సరాలుగా అమలులో ఉన్న ‘ఒక బిడ్డ’ విధానానికి స్వస్తి పలికింది. ఈ పరిమితిని మూడుకు పెంచింది. సంతానోత్పత్తికోసం పలు రకాలప్రోత్సాహకాలను అందించింది చైనా. అందులో పన్ను తగ్గింపులు, ఆస్తి పన్ను రాయితీలు కూడా ఉన్నాయి.

ఒక దేశం అభివృద్ధి చెందుతూ ఉంటే, సంతానోత్పత్తి రేటు సహజంగా తగ్గుతుంది. అభివృద్ధి కారణంగా అక్రాస్యత పెరగడం, ఎక్కువ మంది కెరీర్ మీద దృష్టి పెట్టడం, ఇతర సామాజిక అంశాల కారణంగా సంతానోత్పత్తి తగ్గుతుంది. జపాన్, దక్షిణ కొరియాలాంటి దేశాల్లో కూడా ఇటీవల కాలంలో సంతానోత్పత్తి రేటు రికార్డు స్థాయిలో తగ్గుతూ కనిపిస్తోంది. జనాభా తరుగుదల సమస్యాత్మకం కావడానికి కారణం ఏమిటంటే, జనాభా తగ్గుతున్నకొద్దీ వృద్ధుల సంఖ్య పెరిగి యువత సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. ఇది దేశ ఉత్పత్తిని, ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తుంది. ప్రజారోగ్య, సాంఘిక వ్యవయాలు పెరుగుతాయి. 2010 జనాభా లెక్కలతో పోలిస్తే చైనాలో 16 నుంచి 59 సంవత్సరాల వయసు జనాభా 4 కోట్లు తగ్గిందని ప్రస్తుత గణాంకాలు చెబుతున్నాయి..

అయినప్పటికీ, శ్రామిక జనాభా 2021 నాటికీ 88 కోట్లు ఉంది.. అయితే, చైనా ఇప్పటికే జనాభా తరుగుదలపై చర్యలు తీసుకుంటోంది. 2016లో వివాదాస్పదమైన ‘వన్ చైల్డ్ పాలసీ’ని రద్దు చేసింది. ఎక్కువ మంది పిల్లల్ని కనే దిశలో దంపతులను ప్రోత్సహిస్తోంది. ఈ చర్యల కారణంగా వెనువెంటనే ఫలితాలు కనిపించినా, దీర్ఘకాలంలో జనాభా తరుగుదలను నివారించలేకపోయింది. గత మూడు నాలుగు దశాబ్దాలుగా చైనాలో జనాభా పెరుగుదల రేఖను వన్ చైల్డ్ పాలసీ నియంత్రించిందనే చెప్పొచ్చు. కాగా, ప్రస్తుతం చైనాలో జనాభా తరుగుదల ఇతర ప్రపంచ దేశాలపై కూడా ప్రభావం చూపిస్తుందని నిపుణులు అంటున్నారు. గతంలో చైనా అత్యధిక జనాభా కారణంగా జనాభాను నియంత్రించింది.. గత రెండేళ్లుగా చైనాలో జనాభా పెరుగుదల నెమ్మదించింది.. తమ దేశ జనాభాను పెంచేందుకు చైనా ప్రభుత్వం పిల్లలను కనాలని తల్లిదండ్రులకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తోంది..

చూడాలి చైనాలో జనాభా ఎప్పటిలాగే పెరుగుతుందో లేదో మరీ..

Must Read

spot_img