తాలిబన్లు తొలిసారి ఓ అంతర్జాతీయ ఒప్పందం చేసుకున్నారు. అసలు తాలిబన్లను గుర్తించడానికే ప్రపంచదేశాలు ఇష్టపడని సమయంలో చైనా సాయంతోనే ఇది సాధ్యమైంది. అయితే ఇది సాధ్యమయ్యే పనేనా అన్నది అనుమానాస్పదంగానే ఉందని అంటున్నారు విశ్లేషకులు. తాలిబన్లు ఈ విషయంపై చైనా కంపెనీతో అగ్రిమెంటు కూడా కుదుర్చుకున్నారు. అయితే అక్కడ తాలిబన్లతో పాటు అనేక ఉగ్రసంస్థలు తిష్ట వేసుకుని కూర్చున్నాయి. అందులో ఐఎస్ ఐఎస్ కూడా ఒకటి. ఈ సంస్థకు తాలిబన్లతో పడదు. అంతే కాదు..అటు చైనాతోనూ సానుకూలంగా ఉంటుందని చెప్పలేమని అంటున్నారు విశ్లేషకులు. అయితే ఇప్పుడు తాలిబన్లకు నిధుల అవసరం చాలా ఎక్కువగా ఉంది.. కనీస పాలనకు కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి.
అందుకే చైనా ప్రభుత్వం సహకారంతో సదరు ప్రైవేటు కంపెనీ అఫ్గానిస్థాన్ భూభాగంలో నిక్షిప్తమైన ట్రిలియన్ డాలర్ల విలువైన ఖనిజాలను వెలికి తీయనుంది. అయితే ఈ అరుదైన ఖణిజాలు చమురు గురించి చైనా ఎప్పటి నుంచో కన్నేసింది. పాకిస్తాన్ సాయంతో వాటిని వెలికి తీయడానికి అందరికన్నా ముందే ప్రయత్నించింది. కానీ పాకిస్తాన్ ఈ విషయంలో విఫలమైంది. ఎందుకంటే తాలిబన్లు పాకిస్తాన్ మాట వినడాన్ని ఎప్పుడో మానివేసారు. అందుకే స్వయంగా చైనానే తాలిబన్లను సంప్రదించింది. తాజాగా ఈ విషయంలో తొలి అడుగు వేసింది. చైనాకు చెందిన షింజియాంగ్ సెంట్రల్ ఏషియా పెట్రోలియం అండ్‌గ్యాస్ కంపెనీతో 150 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని చేసుకొంది. అయితే ఈ విషయంపై ఇతర ఉగ్రసంస్థలు ఎలా స్పంధిస్తాయో తెలియాల్సి ఉంది.
జరిగిన ఒప్పందం ప్రకారం అము నదీ పరీవాహక ప్రాంతంలో చైనా కంపెనీ చమురును వెలికి తీయనుంది. ఈ డీల్ ద్వారా నాలుగు వేల చదరపు కిలో మీటర్ల పరిధిలో చమురు అన్వేషణ, వెలికితీత జరుగుతాయి. దాదాపు 3వేల మంది అఫ్గాన్ వాసులకు ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారు. ఈ ఒప్పందం కింద చేపట్టే చమురు ప్రాజెక్టులో తాలిబన్లకు 20శాతం వాటా లభిస్తుంది. దీనిని 75శాతం వరకు పెంచుకొనే అవకాశం ఉంది. ఈ ఒప్పందంపై తాలిబన్ షాబుద్దీన్ దిలావర్ మాట్లాడుతూ వచ్చే మూడేళ్లలో చైనా నుంచి 540 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడుల రూపంలో రావొచ్చని అంచనా వేస్తున్నాట్లు తెలిపారు. ఈ ఒప్పందంపై చైనా రాయబారి వాంగ్ మాట్లాడుతూ భవిష్యత్తులో అఫ్గానిస్థాన్‌తో ద్వైపాక్షిక అభివృద్ధికి ఇది శుభారంభం అని తెలిపారు.
అయితే ఈ సందర్భంగా అఫ్గాన్ చట్టాలను చైనా కంపెనీ పూర్తిగా పాటించాలని ఆయన సూచించారు. కాంట్రాక్టుకు అనుగుణంగా పనులు పూర్తి చేయాలన్నారు. గతంలో పౌర ప్రభుత్వం ఉన్న సమయంలో అము దరియా బేసిన్‌లో చమురు ఉత్పత్తిపై ఒక అఫ్గాన్ కంపెనీతో చైనా ప్రభుత్వ రంగ పెట్రోలియం కార్పొరేషన్ సంతకం చేసింది. కానీ, తాలిబన్లు అధికారంలోకి వచ్చాక ఆ ఒప్పందాన్ని రద్దు చేసినట్లు తాజాగా ప్రకటించారు. కొత్త ఒప్పందం కింద వెలికి తీసిన చమురును అఫ్గానిస్థాన్‌లోనే ప్రాసెసింగ్ చేస్తారు. చైనాలో ప్రభుత్వ అనుమతి లేకుండా ఏ కంపెనీ తాలిబన్లతో ఒప్పందం చేసుకొనే సాహసం చేయదన్న విషయం తెలిసిందే. గతేడాది ఆగస్టులో తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత అంతర్జాతీయ సమాజం నుంచి మాత్రం గుర్తింపు తెచ్చుకోలేదు.
చైనా కూడా తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించలేదు. కానీ, వారితో కలిసి సన్నిహితంగా పనిచేస్తోంది. అయితే ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దుల్లో అంతర్గత యుధ్దం జరుగుతోంది. తాలిబన్ల గ్రూపులో భాగమైన తెహరీక్ ఏ తాలిబన్ పాకిస్తాన్ టీటీపీ పాకిస్తాన్ లో జిహాది దాడులకు తెగబడుతోంది. అటే బలోచిస్తాన్ ప్రాంతంలోనూ తమను తాము పాలించుకుంటామని పోరాటం చేస్తున్నారు. బలోచ్ సభ్యులు ఇప్పుడు టీటీపీ సభ్యులతో కలసిపోయినట్టు చెబుతున్నారు. దాంతో ఉమ్మడి శత్రువైన పాకిస్తాన్ పై దాడులను రెట్టింపు చేసారు. ఓ అడుగు ముందుకేసిన టీటీపీ పాకిస్తాన్ లోని కొన్ని ప్రాంతాలను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకుని క్యాబినెట్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. బలోచ్ లు చైనా అంటే ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చైనా కంపెనీ చమురు వెలికితీత ఒప్పందాన్ని అంగీకరిస్తారా అంటే అనుమానమే అంటున్నారు విశ్లేషకులు.