ప్రపంచంలోని బీద దేశాలన్నింటి వెంట బడి రుణాలను ఆశ చూపడం చైనాకు మొదటి నుంచీ అలవాటు. మొదట ప్రాజెక్టుల పేరిట ఆయా దేశాల నేతలకు లంచాలతో లొంగదీసుకుని ఒప్పందాలు చేయించుకుంటుంది. ఆపై అది తీర్చలేనంతగా అప్పులకు బానిసగా మారుస్తుంది. దివాలా తీసిన దేశాలలో ముఖ్యమైన ప్రదేశాలను సొంతం చేసుకుంటు తమ స్థావరాలను ఏర్పాటు చేసుకుంటుంది. ఇదీ స్థూలంగా చైనా డెబ్ట్ ట్రాప్ కాన్సెప్ట్ గా ఉంటుంది.
ప్రపంచంలోని బీద దేశాలకు అత్యధికంగా రుణాలిచ్చిన దేశం చైనా..మీకు తెలుసా.. చైనా గత 10 సంవత్సరాలలో మధ్య, దిగువ ఆదాయ దేశాలకు రుణాలు ఇవ్వడంలో మూడు రెట్లు ముందుకెళ్లింది. 2020 నాటికి చైనా ప్రపంచంలోని వివిధ దేశాలకు ఇచ్చిన మొత్తం అప్పు 170 బిలియన్ డాలర్లు. అంత పెద్ద స్థాయిలో అప్పులివ్వడమే కాదు..వాటిని ఎలా వసూలు చేసుకోవాలో చైనాకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. అయితే, వాస్తవంలో ఈ సంఖ్య ఇంతకన్నా మరింత పెద్దదేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు చైనా ఇచ్చిన రుణాలలో సగానికి పైగా అధికారికంగా నమోదు కానే కాలేదని అమెరికాలోని విలియం అండ్ మేరీ విశ్వవిద్యాలయంలోని రిసెర్చ్ ల్యాబ్ ‘ఎయిడ్‌డాటా’ చెబుతోంది.
ఈ రుణాలను చైనా ప్రభుత్వ బ్యాలెన్స్ షీట్‌లో నమోదు చేయరు. ఎందుకంటే, చాలా సార్లు ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీ లేదా బ్యాంకు ద్వారా చైనా రుణాలు అందిస్తుంది.
నేరుగా ప్రభుత్వాలకు అప్పు ఇవ్వదని ఎయిడ్‌డాటా చెబుతోంది. దాదాపు 42 దేశాలకు చైనా ఇచ్చిన అప్పులు ఆ దేశాల జీడీపీలో 10 శాతం కన్నా ఎక్కువ అని ఎయిడ్‌డాటా 2021 సెప్టెంబర్‌లో ప్రచురించిన ఒక రిపోర్ట్‌లో పేర్కొంది. పేద దేశాలు చైనాకు సులువుగా లొంగిపోతున్నాయని లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్రొఫెసర్ హర్ష్ పంత్ అన్నారు. “ఈ దేశాలు పేదవి, వాటికి వనరులు అవసరం. చాలా సులభంగా చైనా నుండి ఒత్తిడికి లోనవుతున్నాయి. కొన్నిసార్లు అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు తీసుకోవడం చాలా కష్టం.
చైనా సులభంగా రుణాలు ఇస్తుంది. అలాంటప్పుడు నిబంధనలు ఏకపక్షంగా ఉంటాయి. వాటిలో పారదర్శకత ఉండదు. అప్పులు తీసుకున్న దేశాలు చైనా ఒత్తిడికి లొంగిపోతున్నాయి” అని ఆయన అన్నారు. “అంతేకాకుండా చైనా అధిక రేటు వద్ద రుణాలు ఇస్తుంది. పేద దేశాలు రుణ ఒప్పందాలపై సంతకాలు చేస్తాయి. ఆ దేశాలలో మౌలిక సదుపాయాలు నిర్మించడానికి చైనా సహాయం చేస్తుంది. కానీ, అప్పు తీర్చేటప్పుడే ఆ దేశాలకు అసలు విషయం తెలుస్తుంది. వాటిలో చాలా ‘హిడెన్ చార్జీలు’ ఉంటాయి. అవన్నీ కలుపుకుని ఆ రుణాలు భారంగా మారుతాయి. అలాంటప్పుడు చైనా ఆ దేశాల నుంచి రాజకీయ మద్దతు కోరుతుంది లేదా ఆస్తిని లీజు కింద తీసుకుంటుంది. ఇలా చేసే, చాలా దేశాలు తైవాన్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించకుండా చేసింది.
జిబౌటీ, కిర్గిజ్‌స్థాన్, జాంబియా, లావోస్ దేశాలకు చైనా ఇచ్చిన అప్పు ఎంత పెద్దదంటే, వారి మొత్తం జీడీపీలో 20 శాతం ఉంటుంది. రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, మైనింగ్, ఇంధనం వంటి మౌలిక సదుపాయాలను నిర్మించడానికి చైనా ఈ దేశాలకు రుణాలు ఇస్తుంది. ఈ రుణాలు చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో భాగం. గత దశాబ్ద కాలంగా చైనా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఏం చేసైనా సరే… ప్రపంచంలో అమెరికా స్థానాన్ని కొల్లగొట్టడమే చైనా లక్ష్యమని చైనా వ్యవహారాల నిపుణుడు డాక్టర్ ఫైసల్ అహ్మద్ అన్నారు. “బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద పలు దేశాలకు ఇచ్చిన రుణాలు ఎప్పటికీ తిరిగి రావని చైనాకు బాగా తెలుసు. ప్రపంచంలో అమెరికా స్థానాన్ని చేజిక్కించుకోవాలన్నది చైనా అభిలాష.
దాని కోసమే ఇదంతా చేస్తోందనడంలో సందేహం లేదు. ప్రపచంలో అగ్ర శక్తిగా ఎదగాలన్నదే దాని ప్రయత్నం.
ఇండో-పసిఫిక్‌లో చైనా కన్నా శక్తిమంతమైన దేశం లేదన్నది నిజం. కానీ, చైనాకి అది సరిపోదు. ప్రపంచంలో అగ్రస్థానానికి ఎగబాకడమే దాని లక్ష్యం. 2021లో జరిగిన జీ7 సదస్సులో అమెరికా ‘బిల్డ్ బ్యాక్ బెటర్ వరల్డ్’ అనే ఇనిషియేటివ్‌ను ప్రారంభించింది. అయితే సంవత్సరం తిరిగిన తరువాత కూడా అది ఎంత ముందుకెళ్లిందో ఎవరికీ తెలీదు. దిగువ ఆదాయ దేశాల విషయంలో అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు తీసుకొచ్చే విధానాలు చాలాసార్లు కాగితంపైనే నిలిచిపోతాయి” అని ఫైసల్ అహ్మద్ వివరించారు. ఇతర దేశాలను అప్పుల ఊబిలో ముంచుతోందని, ఆపై వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోందని ఆయన అన్నారు.