ఇండో పసిఫిక్ ప్రాంతంలో రెచ్చిపోతున్న డ్రాగన్ కు చెక్ పెట్టేందుకు ఆ మూడు దేశాల కూటమి ఆకస్ చేతులు కలిపింది. చైనా దూకుడును ఎదుర్కునేందుకు అణుశక్తితో నడిచే సరికత్త సబ్ మెరీన్లను అమెరికా సరఫరా చేయనుంది. అయితే ఈ పరిణామాలను గమనిస్తోన్న చైనా సదరు మూడు దేశాలపై మండిపడింది. ముఖ్యంగా ఇంతటికీ కారణమైన అమెరికాపై విరుచుకుపడింది. ఆకస్ కూటమి ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకుందని ఆరోపించింది..
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు కళ్లెం వేయడానికి అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాలు నడుం బిగించాయి. ఈ మూడు దేశాలతో ఏర్పడిన ఆకస్ కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. చైనాను ధీటుగా ఎదుర్కునేందుు అణుశక్తితో నడిచే సరికొత్త పోరాట జలాంతర్గాములను సిద్ధం చేయనున్నట్లు ప్రకటించాయి. ఇందుకు సంబంధించిన ప్రణాళికను తాజాగా ఆవిష్కరించాయి. దీని కింద ఆస్ట్రేలియాకు కనీసం మూడు అణు జలాంతర్గాములను అమెరికా సరఫరా చేయనుంది. ఈ పరిణామాన్ని చైనా ఖండించింది. ఈ మూడు దేశాలు స్వీయ ప్రయోజనాల కోసం అంతర్జాతీయ సమాజ ఆందోళనలను విస్మరించాయని విమర్షించింది. ప్రమాదకర మార్గాన్ని ఎంచుకున్నాయని, అణువ్యాప్తి నిరోధక ఒప్పందాని ‘ఎన్‌పీటీ’కి తూట్లు పొడుస్తున్నాయని ఆరోపించింది.
![](https://inewslive.net/wp-content/uploads/2023/03/dragan.jpg)
మంగళవారం అమెరికాలోని శాన్ డియెగోలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ల శిఖరాగ్ర సదస్సులో ఈ మేరకు ఒప్పందం కుదిరింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత పరిస్థితులను నెలకొల్పేందుకు ఇది అవసరమని నేతలు తెలిపారు. దీని ప్రకారం 2030ల ప్రారంభం నుంచి అమెరికా మూడు వర్జీనియా తరగతి జలాంతర్గాములను ఆస్ట్రేలియాకు విక్రయిస్తుంది. అవసరమైతే మరో రెండు సబ్‌మెరైన్లను కూడా సరఫరా చేస్తామని బైడెన్ అన్నారు. త్వరలో ఆస్ట్రేలియా నౌకాదళ సిబ్బందికి అమెరికా, బ్రిటన్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే 2027 నుంచి వంతులవారీగా ఆస్ట్రేలియాకు అణు జలాంతర్గాములను పంపుతామన్నారు. దీనివల్ల ఆ దేశ నౌకాదళానికి ఈ తరహా సబ్‌మెరైన్లపై తగిన శిక్షణ లభిస్తుందన్నారు.
ఆ తర్వాత బ్రిటన్, ఆస్ట్రేలియాల కోసం కొత్త రకం అణు జలాంతర్గాములను నిర్మిస్తారు. వీటిని ‘ఎస్‌ఎస్‌ఎన్-ఆకస్’గా చెబుతున్నారు. అందులో మూడు దేశాల పరిజ్ఞానాలను ఉపయోగించనున్నారు. వీటిలో సంప్రదాయ అస్త్రాలు ఉంటాయి. తాజా ఒప్పందంలో భాగంగా.. తన సబ్‌మెరైన్ నిర్మాణ సామర్థ్యాన్ని, వర్జీనియా తరగతి జలాంతర్గాముల నిర్వహణ వసతులను మెరుగుపరుచుకోవడానికి 460 కోట్ల డాలర్లను అమెరికా వెచ్చిస్తుంది. ఇది మూడు దేశాల సంబంధాల్లో నూతన అధ్యాయానికి వీలు కల్పిస్తుందని, కొత్త ఉద్యోగాలకు మార్గం సుగమం చేస్తుందని ఆల్బనీస్ తెలిపారు. కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి ఇలాంటి కొత్త బంధాలు అవసరమని సునాక్ చెప్పారు. తాజా నిర్ణయాలతో డ్రాగన్ కంట్రీ చైనా గుండెల్లో గుబులు రేగుతుందని అంటున్నారు రక్షణ రంగ నిపుణులు.
ప్రస్తుతం ఆస్ట్రేలియా వద్ద డీజిల్ ఇంజిన్ జలాంతర్గాములు ఉన్నాయి. వాటి సామర్థ్యం పరిమితంగా ఉంటుంది. వర్జీనియా తరగతి సబ్‌మెరైన్లు పొందాక.. సాగరగర్భంలో ఆస్ట్రేలియా పరిధి మరింత విస్తరిస్తుంది. శత్రువులపై దీర్ఘశ్రేణి దాడులు చేపట్టగల సత్తాను సాధిస్తుంది. హిందూ మహాసముద్రం, పశ్చిమ, మధ్య పసిఫిక్ మహాసముద్రంతో కూడిన ప్రాంతాన్ని ‘ఇండో-పసిఫిక్’గా వ్యవహరిస్తున్నారు. అక్కడ చైనా సైనిక కార్యకలాపాలు ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో స్వేచ్ఛాయుత పరిస్థితులు ఉండాలని భారత్ సహా అనేక దేశాలు చెబుతున్నాయి. అక్కడి దక్షిణ చైనా సముద్రం మొత్తం తనదేనని చైనా వాదిస్తోంది. పొరుగునున్న తైవాన్, ఫిలిప్పీన్స్ తదితర దేశాలు దీన్ని విభేదిస్తున్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఉంది.
ఈ పరిస్థితుల్లోనే వ్యూహాత్మకంగా కీలక ప్రదేశంలో ఉన్న ఆస్ట్రేలియాకు అందుబాటులో అణు జలాంతర్గాముల అవసరం ఉందన్న అభిప్రాయానికి అమెరికా, బ్రిటన్‌లు వచ్చాయి. బ్రిటన్ జలాంతర్గామి టెక్నాలజీ, అమెరికా సాంకేతికతల మేలిమి కలయికగా అణుఇంధనంతో నడిచే సంప్రదాయక ఆయుధాలు అమర్చిన జలాంతర్గామి తయారుకాబోతోంది. మూడు దేశాల మైత్రిలో కొత్త అధ్యాయం మొదలైందని ఈ సందర్భంగా మూడు దేశాల అధినేతలు వ్యాఖ్యానించారు. హిందూ మహాసముద్రం, పశ్చిమ, మధ్య పసిఫిక్ సముద్రం, దక్షిణ చైనా సముద్రాలు ఉన్న ఇండో-పసిఫిక్ ప్రాంతం భౌగోళికంగా, అంతర్జాతీయ జలరవాణాకు కీలకమైన ప్రాంతం. దక్షిణ చైనా సముద్ర జలాలపై హక్కులు తనకే చెందుతాయని చైనా వాదిస్తుండటంతో ఈ ప్రాంతంలో నిత్యం ఏదో రకంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.