Homeఅంతర్జాతీయంభారత్ తో కలిసి పని చేసేందుకు సిద్ధమన్న చైనా..!

భారత్ తో కలిసి పని చేసేందుకు సిద్ధమన్న చైనా..!

భారత్‌తో కలిసి పని చేయడానికి సిద్ధం…భారత దేశంతో సంబంధాలు నిలకడగా కొనసాగేందుకు, పటిష్టంగా వృద్ధి చెందేందుకు ఆ దేశంతో కలిసి పని చేస్తామని చైనా ప్రకటించింది. దౌత్య మార్గాల్లో సంప్రదింపులను ఇరు దేశాలు కొనసాగిస్తున్నాయని తెలిపింది. సరిహద్దు ప్రాంతాల్లో స్థిరత్వాన్ని కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది.

డిసెంబరు 9న అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ లో భారత సైన్యంతో చైనా సైనికులు ఘర్షణ పడిన నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఈ ప్రకటన చేశారు. భారత్, చైనా కమాండర్ లెవెల్ 17వ విడత చర్చలు డిసెంబరు 20న జరిగిన నేపథ్యంలో వెస్టర్న్ సెక్టర్‌లో భద్రత, సుస్థిరతలను కొనసాగించాలని ఈ సమావేశంలో అంగీకారానికి వచ్చాయి. అయితే దీనికన్నా ముందు దౌత్యరంగంలో మాటలకూ, చేతలకూ కాస్తయినా పొంతన ఉండాలి.

లేనట్టయితే దేశాల మధ్య పరస్పర విశ్వాసం అడుగంటుతుంది. అవి ఇరుగు పొరుగు దేశాలైనప్పుడూ, వాటిమధ్య తీర్చు కోవాల్సిన జటిల సమస్యలున్నప్పుడూ మరింత జాగ్రత్తగా మెలగాలి. మొదటినుంచీ చైనా ఆ విషయంలో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తోంది. అదును చూసి దాడికి దిగటం, ఆ తర్వాత భారత్‌దే తప్పన్నట్టు మాట్లాడటం, ఏమీ ఎరగనట్టు చర్చలకు రావటం దానికి రివాజుగా మారింది. ఇంత క్రితమైనా, ఈ రెండేళ్లనుంచైనా డ్రాగన్ ది ఇదే వరస.

సరిహద్దు ఘర్షణలపై ఈ నెల 20న చర్చలు జరుగుతాయన్న అవగాహన చైనాకుంది. అయినా అంతకు రెండు వారాలముందు… అంటే 9వ తేదీన అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌లో గిల్లికజ్జాలకు దిగింది. దాని తీవ్రత గురించిన స్పష్టమైన సమాచారం విడుదల చేయకపోయినా ‘ఈ ఉదంతంలో ఇరు పక్షాల సైనికుల్లోనూ కొందరు స్వల్పంగా గాయ పడ్డారని మన రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

భారత్‌ సైనిక కమాండర్‌ చొరవ తీసుకుని చైనా కమాండర్‌తో చర్చలు జరపటంతో సామరస్యత నెలకొందని ఆ ప్రకటన సారాంశం.

అయితే చైనాతో మనకున్న 4వేల 57 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖ ప్రస్తుతానికి సరిహద్దుగా ఉంది. రెండేళ్లుగా పశ్చిమ సెక్టార్‌ లఢాఖ్‌ను ఆనుకుని ఉన్న ప్రాంతంలో తరచుగా చోటుచేసుకుంటున్న ఘర్షణలపై ఇంకా చర్చల ప్రక్రియ సాగుతోంది. మూడురోజులనాటి చర్చలు అందులో భాగమేనని చెబుతున్నారు.

ఈ చర్చల ప్రక్రియ పర్యవసానంగా ప్యాంగాంగ్‌ సో ప్రాంతంలో పోయిన ఏడాది ఫిబ్రవరిలో, గోగ్రా హాట్‌ స్ప్రింగ్స్‌ లోని 17వ పెట్రోలింగ్‌ పాయింట్‌ నుంచి నిరుడు ఆగస్టులోనూ, అదే ప్రాంతంలోని 15వ పెట్రో లింగ్‌ పాయింట్‌ నుంచి నవంబర్‌ మొదట్లోనూ రెండు దేశాల సైన్యాలు వెనక్కు తగ్గాయి. ఆఖరుకు 20 మంది భారత జవాన్లను బలి తీసుకున్న గాల్వన్ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో కూడా నెమ్మదిగా సామరస్యం నెలకొంది. ఇలా పరిస్థితులు ఎంతో కొంత కుదుట పడుతున్నాయని అనుకుంటున్న దశలో తాజా చర్చలకు ముందే తూర్పు సెక్టార్‌లో చొరబాటుకు ప్రయత్నించింది చైనా.

ఇదే చైనా కపటనీతికి నిదర్శనం అని అంటున్నారు విశ్లేషకులు. అంటే.. అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే నైజాన్ని చైనా ప్రదర్శిస్తోంది. ఒకవైపు ఈ కలకలం జరుగుతూనే ఉన్నా రెండు దేశాల మధ్య 100 బిలియన్లకు పైగా దిగుమతులు ఎగుమతులు జరుగుతూనే ఉన్నాయి. ఈ మాత్రం వ్యాపారం చైనాకు భారత్ వల్లే సాధ్యం అని దానికి బాగా తెలుసు. అందుకే భారత్ తో సంబంధాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తెంచుకోవడానికి ఇష్టపడదు.

ఇప్పుడు మళ్లీ తవాంగ్ ఘటన తరువాత భారతదేశంతో రాజీ ప్రస్తావన తేవడం అందులో భాగమేనంటున్నారు. చైనాతో కోర్‌ కమాండర్‌ల స్థాయిలో ఇంతవరకూ 16 విడతల చర్చలు జరిగాయి. ప్రతి సందర్భంలోనూ మన ప్రభుత్వం చర్చల తేదీని ముందుగానే ప్రకటించటం, ఆ చర్చలు పూర్తయ్యాక అందులోని ముఖ్యాంశాలను వివరిస్తూ ప్రకటన విడుదల చేయటం రివాజు.

17వ విడత చర్చల విషయంలో ఆ సంప్రదాయాన్ని పాటించలేదు..

కానీ ఈసారి మాత్రం 17వ విడత చర్చల విషయంలో ఆ సంప్రదాయాన్ని పాటించలేదు. చర్చలు పూర్తయిన మూడు రోజుల తర్వాత మాత్రమే ప్రకటన వెలువడింది. కారణాలు ఊహించటం కష్టమేమీ కాదు. తవాంగ్‌లో జరిగిన తాజా ఘర్షణలపై పార్లమెంటు ఉభయ సభల్లోనూ అలజడి రేగటం, ప్రభుత్వం ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్‌ చేయటం ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టింది.

ఇలాంటి సమయంలో చర్చలంటే భావోద్వేగాలు మరింత పెరుగుతాయి. అంతమాత్రాన ఏం జరుగుతున్నదో దేశ ప్రజలకు వెంటవెంటనే తెలియజేయకపోవటం సరి కాదని ప్రభుత్వం గుర్తించాలి. ఆ సంగతలా ఉంచితే నిరంతర ఘర్షణ వాతావరణం ఏ దేశానికీ మంచిది కాదన్న విషయం కూడా రెండు దేశాలు గమనంలో ఉంచుకోవాలి. స్పష్టమైన సరిహద్దు లేనిచోట భారీగా సైన్యాలను మోహరించటం, ఎప్పుడో ఒకప్పుడు ఫలానా ప్రాంతం తమదేనంటూ కయ్యానికి దిగటం, ఘర్షణలు చోటుచేసుకోవటం పరిస్థితిని మరింత జటిలం చేస్తుంది. అది చివరకు యుద్ధంగా పరిణమించినా ఆశ్చర్యంలేదు.

కనుక ఎంతటి క్లిష్ట సమస్యకైనా చర్చల ప్రక్రియ ఒక్కటే పరిష్కార మార్గం. అదే సమయంలో స్నేహం నటిస్తూనే ద్రోహ చింతనతో మెలగుతున్న చైనా కపటనీతిని బయటపెట్టడం కూడా అవసరం. మన సైనిక దళాల ప్రధానాధికారి జనరల్‌ మనోజ్‌ పాండే గత నెలలో ఎల్‌ఏసీ గురించి చెబుతూ అక్కడ పరిస్థితి స్థిరంగానే ఉన్నా అనూహ్యంగా ఉన్నదని వ్యాఖ్యానించిన సంగతి గుర్తుంచుకోవాలి. ఒకపక్క కొవిడ్‌తో చైనా అల్లకల్లోలంగా ఉంది.

కఠినమైన ఆంక్షలకు నిరసనగా రోడ్లపైకి వచ్చిన జనమే ఇప్పుడు బయటకు రావటానికి హడలెత్తుతున్నారు. ఏం చేయాలో చైనా సర్కారుకు పాలు బోవటం లేదు. దాన్నుంచి జనం దృష్టి మళ్లించటానికి కూడా ఎల్‌ఏసీలో చైనా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడి ఉండొచ్చు. వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవటానికి ప్రయత్నిస్తూనే, వాటితో సంబంధం లేకుండా ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పరుచు కుందామని చైనా 80వ దశకంలో ముందుకొచ్చింది.

నిజానికి గత కొన్ని దశాబ్దాలుగా మనకన్నా ఎక్కువ లాభపడుతున్నది కూడా చైనాయే…!

కానీ అంతర్గతంగా అవసరం పడినప్పుడల్లా ఎల్‌ఏసీ వద్ద మంట పెట్టాలని చూస్తుంటుంది. ఈ పోకడలు ఎంత త్వరగా విరమిస్తే చైనాకు అంత మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఘర్షణలు ముదురుతున్న తీరు చూశాక మన దేశం ఎల్‌ఏసీలోని మూడు సెక్టార్లలోనూ చైనాతో సమానంగా మౌలిక సదుపాయాల మెరుగుకు చర్యలు తీసుకోవటం మొదలెట్టింది.

నిర్ధారిత సరిహద్దు లేని చోట ఇరు దేశాలూ సైన్యాలను మోహరిస్తే, ఏదో ఒక పక్షం కయ్యానికి దిగుతుంటే సహజంగానే పరిస్థితులు ప్రమాదకరంగా పరిణమిస్తాయి. కనుక విజ్ఞతతో మెలగటం అవసరమనీ, అంతర్గత విషయాల్లోనైనా, విదేశీ సంబంధాల్లోనైనా శాంతి సుస్థిరతలు ఏర్పడాలంటే కొన్ని విలువలనూ, నియమ నిబంధనలనూ పాటించటం ముఖ్యమనీ చైనా నాయకత్వం గ్రహించాలి.

మరో గమ్మత్తైన విషయంతో ఈ అంశాన్ని ముగించేద్దాం..మొన్న తవాంగ్ ప్రాంతంలో వందల సంఖ్యలో పొలోమని మన సరిహద్దు వైపు వచ్చిన సైనికులు ఘర్షణ కోసం రాలేదని ఇండో – పసిఫిక్‌ ఫర్‌ స్ట్రాటెజిక్‌ కమ్యూనికేషన్స్‌ సంస్థ ఓ నివేదికలో వెల్లడించింది. చేసిన ఆధ్యయంనలో తేలింది. వారు మన సరిహద్దు వైపు పెరిగే ఓ విలువైన కార్డిసెప్స్ సేకరణ కోసం వచ్చారట.

పుట్టగొడుగు రకానికి చెందిన కార్డిసెప్స్‌ ను గొంగళి పురుగు ఫంగస్‌ లేదా హిమాలయన్‌ గోల్డ్‌గా పిలుస్తారు. అరుదుగా లభించే ఈ ఫంగస్‌లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయట. పసుపు, కాషాయం రంగులో అండే వీటిని సూపర్‌ మష్రూమ్స్‌ అని కూడా పిలుస్తారు. వీటి ధర బంగారం కంటే చాలా ఎక్కువ. 10 గ్రాముల కార్డిసెప్స్ ధర.. సుమారు 56 వేల రూ.లు ఉన్నట్లు సమాచారం. చైనా నైరుతిలోని కింగై – టిబెట్‌ వంటి ఎత్తయిన ప్రదేశాల్లో కార్డిసెప్స్‌ ఎక్కువగా కనిపిస్తుంటాయి. అంతర్జాతీయంగా కార్డిసెప్స్‌ మార్కెట్‌ విలువ వెయ్యి మిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు అంచనా.

అత్యధికంగా ఉత్పత్తయ్యే కింగై ప్రాంతంలో రెండు సంవత్సరాలుగా వీటి సాగు తగ్గింది. ఈ కారణంగా వీటికి విపరీతమైన డిమాండ్‌ పెరిగింది. అయితే.. వీటి కోసమే అరుణాచల్‌ ప్రదేశ్‌లోకి చైనా సైనికులు చొరబడినట్లు ఐపీసీఎస్సీ వెల్లడించింది.

Must Read

spot_img