Homeఅంతర్జాతీయం71 యుద్ధ విమానాలతో తైవాన్ పై చైనా దూకుడు 

71 యుద్ధ విమానాలతో తైవాన్ పై చైనా దూకుడు 

ఓవైపు దేశంలో కరోనా విచ్చలవిడిగా చెలరేగిపోతున్నా తైవాన్ ను ఆక్రమించుకునేందుకు డ్రాగన్ కంట్రీ చైనా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తాజాగా తైవాన్ పై ఆధిక్యం ప్రదర్శించేందుకు పెద్ద ఎత్తున యుధ్దవిమానాలను యుధ్దనౌకలను తైవాన్ భూభాగానికి తరలించింది. అయితే తైవాన్ చైనా చేస్తున్న ఈ బెదిరింపులను ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. చైనాను ఢీ కొట్టేందుకు కొత్తగా చట్టాన్ని కూడా తీసుకురానుంది.

స్వతంత్రం రాజ్యంగా ఉన్న తైవాన్‌కు పొరుగునే ఉన్న చైనా నుంచి ముప్పు పొంచి ఉందన్న సంగతి చాలా సందర్భాలలో మనం చూస్తూనే ఉన్నాం. తైవాన్‌పై దాడి చేసి, ఆ దేశాన్ని ఆక్రమించుకునేందుకు చైనా చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. అయితే, ఈమధ్య కాలంలో ఈ ప్రయత్నాల్ని మరింత పెంచింది. ఇప్పటికే పలుసార్లు చైనా తన యుద్ధ విమానాల్ని తైవాన్ గగనతలంలోకి పంపింది.

ఏదో రకంగా ఆ దేశాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. చైనా-తైవాన్ సరిహద్దులో భారీ స్థాయిలో సైనికుల్ని, యుద్ధ సామగ్రిని మోహరించింది. తైవాన్‌పై చైనా ఎప్పుడైనా దాడి చేయొచ్చు. ఈ నేపథ్యంలో తైవాన్ అప్రమత్తమవుతోంది. చైనాను ఎదుర్కొనేందుకు మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది.

ఇకపై దేశంలోని ప్రతి ఒక్కరూ సైన్యంలో కనీసం ఏడాదిపాటు తప్పనిసరిగా పని చేసేలా చట్టం తేనుంది. గతంలో కూడా ఈ చట్టం అమలులో ఉండేది. అయితే, కొంతకాలం క్రితం దీన్ని నాలుగు నెలలకు తగ్గించారు. అంటే ప్రతి ఒక్కరూ సైన్యంలో కనీసం నాలుగు నెలలు పని చేయాల్సి ఉంటుంది. ఈ సమయం చాలా తక్కువని అక్కడ చాలా మంది అంటున్నారు. పైగా చైనా నుంచి దాడి ప్రమాదం పొంచి ఉంది. అందుకే ఇకపై ప్రతి ఒక్కరూ కనీసం ఏడాదిపాటైనా సైన్యంలో పని చేసేలా చట్టం రూపొందిస్తోంది.

ఇప్పటికే ఉన్న నాలుగు నెలల గడువును ఏడాదికి పెంచనుంది. 2024 నుంచి ఈ నిబంధనను అమలు చేయనుంది తైవాన్. ఒకప్పుడు తైవాన్.. చైనాలో భాగంగా ఉండేది. 1949 చైనా సివిల్ వార్ సందర్భంగా, ఆ దేశం నుంచి విడిపోయి స్వతంత్రంగా ఉంటోంది.

కానీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ రాజ్య విస్తరణ కాంక్షలో భాగంగా తైవాన్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నారు. చైనా తైవాన్‌ను తనలో కలిపేసుకోవాలి అనుకుంటుంటే.. తైవాన్ దీనికి నిరాకరిస్తోంది. తాము తమకు నచ్చినట్టుగా స్వతంత్రంగానే ఉండాలని కోరుకుంటోంది. ఇందుకు పొరుగు దేశాలతో పాటు అగ్రరాజ్యం అమెరికా కూడా మద్దతు ఇస్తోంది. చైనా యుధ్దానికి దిగితే తాను అండగా ఉంటానని భరోసా ఇస్తోంది.

ఇప్పటిక ఈ దిశగా ఆర్థిక సాయం, ఆయుధాలను కూడా సరఫరా చేసింది. అంతే కాదు తైవాన్ తో పాటు సైనిక విన్యాసాలలోనూ పాల్గొంటోంది. ఈ నేపథ్యంలోనే అవసరమైతే సైనిక చర్య ద్వారా అయినా సరే తైవాన్‌ను స్వాధీనం చేసుకోవాలని జిన్ పింగ్ భావిస్తున్నారు.

దేశంలో కరోనాతో వేలాదిగా జనం చనిపోతున్నా పొరుగుదేశాలపై చైనా కవ్వింపు చర్యలు ఆగడం లేదు. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లోకి చొరబడడానికి ప్రయత్నించిన చైనా సేనలు.. రెండు రోజులుగా తైవాన్‌ను భయపెట్టేలా భారీస్థాయిలో యుద్ధ విమానాలను బరిలోకి దింపాయి. ఏకంగా 71 విమానాలు తైవాన్‌ జలసంధి మీదుగా దూసుకుపోయాయి. వీటికి తోడు మరో ఏడు యుద్ధ నౌకలూ రంగంలోకి దిగాయి.

క్షిపణి వ్యవస్థలతో ఈ కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించామని, తమ గగనతలంలో చైనా వైమానికదళం చేసిన అతి పెద్ద చొరబాటు ఇదేనని తైవాన్‌ సైన్యం తెలిపింది. ఈ నేపథ్యంలో తైవాన్ కూడా చైనాను ధీటుగా ఎదుర్కునేందుకు సన్నాహాలు ప్రారంభించింది.

ప్రస్తుతం కొందరు తైవాన్‌ వాసులు చైనాతో పునరేకీకరణకు మద్దతు ఇస్తున్నారు. జాతివాదం, పౌర జాతీయత ఇందుకు కారణాలని చెప్పుకోవచ్చు. కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ 2020లో నిర్వహించిన పోల్స్ ప్రకారం.. తైవాన్ నివాసితులలో దాదాపు మూడింట రెండు వంతుల మంది తమ గుర్తింపును కేవలం ‘తైవానీస్’ గానే పరిగణిస్తున్నారు. కేవలం మూడు శాతం మంది మాత్రమే తమను తాము ‘చైనీయులు’గా భావిస్తున్నారు. తైవానీస్ గుర్తింపు అనే బలమైన భావన.. చైనాతో తైవాన్ పునరేకీకరణకు అవరోధంగా మారుతోంది. తైవాన్ భవిష్యత్తు అయిన లక్షలాది మంది తైవానీస్ యువకులు.. తమకు చైనాతో ఎలాంటి సాంస్కృతిక సంబంధాలు లేవని భావిస్తున్నారు. తైవాన్ నివాసితులు తమ దేశంలోని ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థపై విధేయత చూపుతున్నారు.

తైవాన్ భవిష్యత్తు అయిన లక్షలాది మంది తైవానీస్ యువకులు.. తమకు చైనాతో ఎలాంటి సాంస్కృతిక సంబంధాలు లేవని భావిస్తున్నారు.

Must Read

spot_img