Homeఅంతర్జాతీయంచైనా రుణ విధానం ఇతర దేశాల కన్నా భిన్నంగా ఉంటుందా..?

చైనా రుణ విధానం ఇతర దేశాల కన్నా భిన్నంగా ఉంటుందా..?

ప్రపంచంలోని పలు దేశాలకు అత్యధిక రుణాలు ఇస్తున్న దేశం చైనా. గత పదేళ్లలో దిగువ, మధ్యతరగతి ఆదాయ దేశాలకు రుణాలు ఇవ్వడంలో మూడు రెట్లు ముందుకెళ్లింది.. చైనా రుణాల కారణంగానే ఆయా దేశాలు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నాయనే వాదన తెరపైకి వచ్చింది..దిగువ, మధ్య ఆదాయ దేశాలకు చైనా ఎంత అప్పు ఇస్తోంది…? చైనా పేద దేశాలను అప్పుల ఊబిలోకి దించుతోందనడానికి రుజువు ఏమిటి..? చైనా రుణ విధానం ఇతర దేశాల కన్నా భిన్నంగా ఉంటుందా..? ఇంతకీ చైనా అవలంబిస్తున్న రుణ విధానం ఏమిటి…? చైనా అప్పు తీర్చడం కష్టమా…?

భారతదేశం ఈ నెల 12-13 తేదీల్లో ‘వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్’ అనే సదస్సును నిర్వహించింది.సదస్సు మొదటిరోజు గురువారం భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మాట్లాడుతూ దక్షిణ దేశాలకు అనిశ్చితి పొంచి ఉందని అన్నారు. కోవిడ్ 19 మహమ్మారి.. ప్రపంచీకరణ కేంద్రీకృతం కావడం వలన కలిగే నష్టాలను, బలహీనమైన సప్లై చైన్ ను బహిర్గతం చేసిందని అన్నారు. ఈ వర్చువల్ కాన్ఫరెన్స్‌లో 125 దేశాలు పాల్గొన్నాయి.

ఇక్కడ గ్లోబల్ సౌత్ అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు, ముఖ్యంగా దిగువ ఆదాయ దేశాలు. జై శంకర్ చైనాను ఉద్దేశించి, అభివృద్ధి చెందుతున్న దేశాలు
ప్రపంచీకరణను వికేంద్రీకరించాలని, తద్వారా మరిన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఇందుకోసం స్థానికీకరణ, మెరుగైన కనెక్టివిటీ, సరఫరా గొలుసులను పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు. కొంతకాలంగా పాశ్చాత్య దేశాలు కూడా చైనా విధానాలను తప్పుబడుతూ వస్తున్నాయి. ముఖ్యంగా, చైనా అభివృద్ధి చెందుతున్న దేశాలకు రుణాలిచ్చి అప్పుల ఊబిలోకి నెడుతోందని, ఆ దేశాలు చైనా ఒత్తిడికి గురవుతున్నాయని ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను చైనా తోసిపుచ్చింది.

ప్రపంచంలో అత్యధికంగా రుణాలిస్తున్న దేశం చైనా…చైనా గత 10 సంవత్సరాలలో మధ్య, దిగువ ఆదాయ దేశాలకు రుణాలు ఇవ్వడంలో మూడు రెట్లు ముందుకెళ్లింది. 2020 నాటికి చైనా ప్రపంచంలోని వివిధ దేశాలకు ఇచ్చిన మొత్తం అప్పు 170 బిలియన్ డాలర్లు. అయితే, వాస్తవంలో ఈ సంఖ్య ఇంతకన్నా పెద్దదని విశ్లేషకులు భావిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు చైనా ఇచ్చిన రుణాలలో సగానికి పైగా అధికారికంగా నమోదు కాలేదని అమెరికాలోని విలియం అండ్ మేరీ విశ్వవిద్యాలయంలోని రిసెర్చ్ ల్యాబ్ ‘ఎయిడ్‌డాటా’ చెబుతోంది.

ఈ రుణాలను చైనా ప్రభుత్వ బ్యాలెన్స్ షీట్‌లో నమోదు చేయరు. ఎందుకంటే, చాలా సార్లు ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీ లేదా బ్యాంకు ద్వారా చైనా రుణాలు అందిస్తుంది. నేరుగా ప్రభుత్వాలకు అప్పు ఇవ్వదని ఎయిడ్‌డాటా చెబుతోంది. ఈ రుణాలను చైనా ప్రభుత్వ బ్యాలెన్స్ షీట్‌లో నమోదు చేయరు.ఎందుకంటే, చాలా సార్లు ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీ లేదా బ్యాంకు ద్వారా చైనా రుణాలు అందిస్తుంది. నేరుగా ప్రభుత్వాలకు అప్పు ఇవ్వదని ఎయిడ్‌డాటా చెబుతోంది. 42 దేశాలకు చైనా ఇచ్చిన అప్పులు ఆ దేశాల జీడీపీలో 10 శాతం కన్నా ఎక్కువ అని ఎయిడ్‌డాటా 2021 సెప్టెంబర్‌లో ప్రచురించిన ఒక రిపోర్ట్‌లో పేర్కొంది.

పేద దేశాలు చైనాకు సులువుగా లొంగిపోతున్నాయని లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్రొఫెసర్ హర్ష్ పంత్ అన్నారు.”ఈ దేశాలు పేదవి, వాటికి వనరులు అవసరం. చాలా సులభంగా చైనా నుండి ఒత్తిడికి లోనవుతున్నాయి. కొన్నిసార్లు అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు తీసుకోవడం చాలా కష్టం. చైనా సులభంగా రుణాలు ఇస్తుంది. అలాంటప్పుడు నిబంధనలు ఏకపక్షంగా ఉంటాయి. వాటిలో పారదర్శకత ఉండదు. అప్పులు తీసుకున్న దేశాలు చైనా ఒత్తిడికి లొంగిపోతున్నాయి” అని ఆయన అభిప్రాయపడ్డారు..

“అంతేకాకుండా చైనా అధిక రేటు వద్ద రుణాలు ఇస్తుంది. పేద దేశాలు రుణ ఒప్పందాలపై సంతకాలు చేస్తాయి. ఆ దేశాలలో మౌలిక సదుపాయాలు నిర్మించడానికి చైనా సహాయం చేస్తుంది. కానీ, అప్పు తీర్చేటప్పుడే ఆ దేశాలకు అసలు విషయం తెలుస్తుంది. వాటిలో చాలా ‘హిడెన్ చార్జీలు’ ఉంటాయి. అవన్నీ కలుపుకుని ఆ రుణాలు భారంగా మారుతాయి. అలాంటప్పుడు చైనా ఆ దేశాల నుంచి రాజకీయ మద్దతు కోరుతుంది లేదా ఆస్తిని లీజు కింద తీసుకుంటుంది. ఇలా చేసే, చాలా దేశాలు తైవాన్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించకుండా చేసిందనేది విశ్లేషకుల అభిప్రాయం..

జిబౌటీ, కిర్గిజ్‌స్థాన్, జాంబియా, లావోస్‌ దేశాలకు చైనా ఇచ్చిన అప్పు ఎంత పెద్దదంటే, వారి మొత్తం జీడీపీలో 20 శాతం ఉంటుంది.రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, మైనింగ్, ఇంధనం వంటి మౌలిక సదుపాయాలను నిర్మించడానికి చైనా ఈ దేశాలకు రుణాలు ఇస్తుంది. ఈ రుణాలు చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో భాగం. గత దశాబ్ద కాలంగా చైనా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ ఇది. ప్రపంచంలో అగ్రస్థానానికి ఎగబాకడమే చైనా లక్ష్యం’.. ప్రపంచంలో అమెరికా స్థానాన్ని కొల్లగొట్టడమే చైనా లక్ష్యమని చైనా వ్యవహారాల నిపుణుడు డాక్టర్ ఫైసల్ అహ్మద్ వ్యాఖ్యలే నిదర్శనం..”బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద పలు దేశాలకు ఇచ్చిన రుణాలు ఎప్పటికీ తిరిగి రావని చైనాకు తెలుసు. ప్రపంచంలో అమెరికా స్థానాన్ని చేజిక్కించుకోవాలన్నది చైనా అభిలాష.

దాని కోసమే ఇదంతా చేస్తోందనడంలో సందేహం లేదు. ప్రపంచంలో అగ్రశక్తిగా ఎదగాలన్నదే డ్రాగన్ కంట్రీ ప్రయత్నం. ఇండో-పసిఫిక్‌లో చైనా కన్నా శక్తిమంతమైన దేశం లేదన్నది నిజం. కానీ, చైనాకి అది సరిపోదు. ప్రపంచంలో అగ్రస్థానానికి ఎగబాకడమే దాని లక్ష్యం.2021లో జరిగిన జీ7 సదస్సులో అమెరికా ‘బిల్డ్ బ్యాక్ బెటర్ వరల్డ్’ అనే ఇనిషియేటివ్‌ ను ప్రారంభించింది. అయితే సంవత్సరం తిరిగిన తరువాత కూడా అది ఎంత ముందుకెళ్లిందో ఎవరికీ తెలీదు. దిగువ ఆదాయ దేశాల విషయంలో అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు తీసుకొచ్చే విధానాలు చాలాసార్లు కాగితంపైనే నిలిచిపోతాయి.

బ్రిటన్ గూఢచార సంస్థ ఎంఐ6 చీఫ్ రిచర్డ్ మూరే… చైనా ఇతర దేశాలను అప్పుల ఊబిలో ముంచుతోందని, ఆపై వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోందని వెల్లడించారు.. దీన్ని ఆయన ‘డెట్ ట్రాప్‌’గా పేర్కొన్నారు. పేద దేశాలు రుణాలు తిరిగి చెల్లించలేనప్పుడు, వాటి ఆస్తులను చేజిక్కించుకుంటుందని మూరే అన్నారు. అయితే, ఈ ఆరోపణలను చైనా ఖండిస్తూ వస్తోంది. విమర్శకులు చైనా వేసే రుణాల ఉచ్చుకు ఉదాహరణగా శ్రీలంకలోని హంబన్‌తోట నౌకాశ్రయాన్ని చూపిస్తారు. శ్రీలంక ఈ పోర్ట్‌ను చైనా సహాయంతో నిర్మించింది. అయితే, క్షీణిస్తున్న ఆర్థిక పరిస్థితులు, పెరిగిపోతున్న రుణభారం వలన శ్రీలంక ఆ అప్పు తిరిగి తీర్చలేకపోయింది. దాంతో, చైనా హంబన్‌తోట పోర్టును 99 సంవత్సరాలకు లీజుకు తీసుకుంది.

మరిన్ని పెట్టుబడులు పెడతామని హామీ ఇచ్చింది. అయితే, చైనా డెట్ ట్రాప్ గురించి చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు లేవని బ్రిటన్ థింక్ ట్యాంక్ చాతమ్‌హౌస్ 2020లో ప్రచురించిన ఒక నివేదికలో పేర్కొంది. పేద దేశాలను లక్ష్యంగా చేసుకుని చైనా రుణాలు ఇస్తూ, వాటిని తనకు అనుగుణంగా మార్చుకుంటోందనడానికి రుజువులు లేవని ఈ నివేదికలో పేర్కొన్నారు. ఇందులో వాదనల ప్రకారం, శ్రీలంకలో హంబన్‌తోట పోర్టు నిర్మించాలనే ప్రతిపాదన చైనా నుంచి రాలేదు. శ్రీలంక మాజీ ప్రధాని మహింద రాజపక్ష కోరికపై చైనా సహాయం అందించింది.

శ్రీలంకకు అత్యధిక రుణాలిచ్చిన దేశం చైనా కాదు. చైనా హంబన్‌ తోట పోర్టును లీజుకు తీసుకున్నాక మిలటరీ కార్యకలాపాలకు వినియోగించిన దాఖలాలు లేవు.”చైనా దిగువ ఆదాయ దేశాలను డెట్ ట్రాప్‌లో బంధిస్తోందని పశ్చిమ దేశాలు వ్యాప్తి చేస్తున్న కథనం. శ్రీలంక ను ఉదాహరణగా తీసుకుంటే, శ్రీలంక మొత్తం అప్పులో చైనా నుంచి తీసుకున్న రుణం 10 శాతం.

బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద చైనా శ్రీలంకకు హంబన్‌తోట పోర్టు నిర్మాణంలో సహాయం అందించింది. శ్రీలంక 2007-08లో ఈ పోర్ట్ నిర్మాణం కోసంఅమెరికా సహాయాన్ని కోరింది. అమెరికా అందుకు నిరాకరించింది. భారత్‌ నూ కోరింది. ఈ దేశాలు సహాయం చేయకపోవడంతో చైనాను ఆశ్రయించింది..”పేద దేశాలకు మౌలిక సదుపాయాల అవసరం ఉంది. వారికి ఏదో ఒక దేశం సహాయం అందించాలి. చైనా ఆ పని చేస్తోంది. శ్రీలంక అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు ప్రపంచ బ్యాంకు ఎందుకు సహాయం చేయలేదన్న ప్రశ్న రావాలి. ప్రపంచ బ్యాంకు నియమాలు ఎంత కఠినంగా ఉంటాయంటే, పేద దేశాలు దాని నుంచి రుణం తీసుకోవాలన్న ఆలోచన కూడా చేయలేవు. శ్రీలంక సంగతి చూస్తే, ఆ దేశం జపాన్, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ నుంచి అత్యధిక రుణాలు తీసుకుంది. చైనా నుంచి కాదు..

చైనా తన విదేశీ రుణాల గురించి పబ్లిక్ రికార్డులలో ఉంచదు. రుణగ్రహీతలు కూడా ఈ వివరాలను వెల్లడించకూడదని ఒప్పందం చేసుకుంటుంది. అంతర్జాతీయ రుణాలలో ఈ పద్ధతి సాధారణమని చైనా వాదిస్తోంది.”చైనా రుణ ఒప్పందాలు అధికారుల స్థాయిలోనే ఉండాలని, సామాన్య ప్రజలకు తెలియక్కర్లేదని చైనా భావిస్తుంది.

శ్రీలంక హంబన్‌తోట ఒప్పందం సంగతి ప్రజలకు తెలిస్తే, దేశ ఆస్తిని 99 ఏళ్లు లీజుకు ఇవ్వడాన్ని వాళ్లు ముందే తీవ్రంగా వ్యతిరేకించి ఉండేవారు. ఇలాంటి వివాదాలను నివారించడానికే చైనా రుణ ఒప్పంద నిబంధనలను రహస్యంగా ఉంచుతుంది..పలు పారిశ్రామిక దేశాలు ‘పారిస్ క్లబ్’ అని పిలిచే సమూహంలో సభ్యులు. ఇందులోని దేశాలు తమ విదేశీ రుణాల సమాచారాన్ని పంచుకుంటాయి. కానీ, చైనా ప్యారిస్ క్లబ్‌లో భాగం కాదు.అయితే, ప్రపంచబ్యాంకు డేటా, చైనా వేగవంతమైన వృద్ధిని చూస్తే చైనా ఎంత అప్పు ఇస్తుందో అంచనా వేయడం కష్టమేమీ కాదు.

పాశ్చాత్య దేశాలతో పోలిస్తే చైనా అధిక రేటుకు రుణాలు ఇస్తుంది. చైనా రుణ రేటు 4 శాతం. ఇది వాణిజ్య మార్కెట్ రేటుకు దగ్గరగా ఉంది. ఈ రేటు ప్రపంచ బ్యాంకు రేటు కంటే నాలుగు రెట్లు ఎక్కువ. చైనా రుణాల చెల్లింపు వ్యవధి తక్కువ ఇస్తుంది. ఈ వ్యవధి 10 ఏళ్ల కన్నా తక్కువ ఉంటుంది. కాగా, పశ్చిమ దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు రుణాన్ని తిరిగి చెల్లిండడానికి 28 సంవత్సరాల వరకు వ్యవధి ఇస్తాయి.

కొన్నిసార్లు దిగువ ఆదాయ దేశాలకు ఎక్కువ చాయిస్ ఉండదని, చైనా సులువుగా రుణాలు ఇస్తుంది కాబట్టి ఆ దేశం నుంచి అప్పు తీసుకుంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు..”ఇదే కాకుండా, చైనా అప్పులిచ్చి, మౌలిక సదుపాయాలు నిర్మించడంలో సహాయపడుతుంది. కొన్నిసార్లు పేద దేశాలకు చైనాతో చేసుకున్న ఒప్పందంపై సరైన అవగాహన లేక అప్పుల ఊబిలో కూరుకుపోతుంటాయి.. చివరకు చేసేదేమీ లేక చైనా చెప్పిన నిబంధనలకు అంగీకరించాల్సి ఉంటుంది.. అలా పరోక్షంగా సహాయం పేరుతో చైనా పలు దేశాలను అప్పుల ఊబిలో పడేస్తుందనేది విశ్లేషకుల అభిప్రాయం..

Must Read

spot_img