Homeఅంతర్జాతీయంఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యం..

ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యం..

డ్రాగన్ కంట్రీ దూకుడుకు కళ్లెం వేయడానికి అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. అణుశక్తితో నడిచే సరికొత్త యుద్ద జలాంతర్గములను సిద్దం చేయనున్నట్లు ప్రణాళికను ఆవిష్కరించాయి..

  • ఇండో-పసిఫిక్‌లో డ్రాగన్‌కు చెక్‌ పెట్టేందుకు ఆకస్ కూటమి కొత్త వ్యూహం రచించిందా..?
  • ఆస్ట్రేలియాకు అణు జలాంతర్గములను అమెరికా సరఫరా చేయడం వెనక ప్రధాన ఉద్దేశ్యం ఏంటి..?
  • ఆకస్ కూటమి తాజా ఒప్పందాలపై చైనా ఏమంటోంది..?

ఇండో – పసిఫిక్‌ ప్రాంతంలో చైనా దూకుడుకు కళ్లెం వేయడానికి అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌ కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. అణుశక్తితో నడిచే సరికొత్త యుద్ద జలాంతర్గాములను సిద్ధం చేయనున్నట్లు ప్రకటించాయి. ఇందుకు సంబంధించిన ప్రణాళికను ఆవిష్కరించాయి. దీని కింద ఆస్ట్రేలియాకు కనీసం మూడు అణు జలాంతర్గాములను అమెరికా సరఫరా చేయనుంది. ఈ పరిణామాన్ని చైనా ఖండించింది. ఈ మూడు దేశాలు స్వీయ ప్రయోజనాల కోసం అంతర్జాతీయ సమాజ ఆందోళనలను విస్మరించాయని, ప్రమాదకర మార్గాన్ని ఎంచుకున్నాయని, అణువ్యాప్తి నిరోధక ఒప్పందానికి తూట్లు పొడుస్తున్నాయని ఆరోపించింది.

అమెరికాలోని శాన్‌ డియెగోలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, బ్రిటన్‌ ప్రధాన మంత్రి రిషి సునాక్‌, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ల శిఖరాగ్ర సదస్సులో ఈ మేరకు ఒప్పందం కుదిరింది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛాయుత పరిస్థితులను నెలకొల్పేందుకు ఇది అవసరమని ఈ కూటమి నేతలు పేర్కొన్నారు. దీని ప్రకారం 2030ల ప్రారంభం నుంచి అమెరికా మూడు వర్జీనియా తరగతి జలాంతర్గాములను ఆస్ట్రేలియాకు విక్రయిస్తుంది. అవసరమైతే మరో రెండు సబ్‌మెరైన్లనూ సరఫరా చేస్తామని బైడెన్‌ పేర్కొన్నారు.. త్వరలో ఆస్ట్రేలియా నౌకాదళ సిబ్బందికి అమెరికా, బ్రిటన్‌ లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

అలాగే 2027 నుంచి వంతులవారీగా ఆస్ట్రేలియాకు అణు జలాంతర్గాములను పంపుతామన్నారు జోబైడెన్.. దీనివల్ల ఆ దేశ నౌకాదళానికి ఈ తరహా సబ్‌మెరైన్లపై తగిన శిక్షణ లభిస్తుందన్నారు. ఆ తర్వాత బ్రిటన్‌, ఆస్ట్రేలియాల కోసం కొత్త రకం అణు జలాంతర్గాములను నిర్మిస్తారు. వీటిని ‘ఎస్‌ఎస్‌ఎన్‌-ఆకస్‌’గా పేర్కొంటారు. అందులో మూడు దేశాల పరిజ్ఞానాలను ఉపయోగిస్తారు. వీటిలో సంప్రదాయ అస్త్రాలు ఉంటాయి. తాజా ఒప్పందంలో భాగంగా..

తన సబ్‌మెరైన్‌ నిర్మాణ సామర్థ్యాన్ని, వర్జీనియా తరగతి జలాంతర్గాముల నిర్వహణ వసతులను మెరుగుపరుచుకోవడానికి 460 కోట్ల డాలర్లను అమెరికా
వెచ్చిస్తుంది. ఇది మూడు దేశాల సంబంధాల్లో నూతన అధ్యాయానికి వీలు కల్పిస్తుందని, కొత్త ఉద్యోగాలకు మార్గం సుగమం చేయనుందని ఆస్ట్రేలియా ప్రధాని అల్భనీస్ తెలిపారు. కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి ఇలాంటి కొత్త బంధాలు అవసరమని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ అభిప్రాయపడ్డారు..

ప్రస్తుతం ఆస్ట్రేలియా వద్ద డీజిల్‌ ఇంజిన్‌ జలాంతర్గాములు ఉన్నాయి. వాటి సామర్థ్యం పరిమితం. వర్జీనియా తరగతి సబ్‌మెరైన్లు పొందాక.. సాగర గర్భంలో ఆస్ట్రేలియా పరిధి మరింత విస్తరిస్తుంది. శత్రువులపై దీర్ఘశ్రేణి దాడులు చేపట్టగల సత్తాను సాధిస్తుంది. హిందూ మహాసముద్రం, పశ్చిమ, మధ్య పసిఫిక్‌ మహాసముద్రంతో కూడిన ప్రాంతాన్ని ‘ఇండో-పసిఫిక్‌’గా చెబుతున్నారు. అక్కడ చైనా సైనిక కార్యకలాపాలు బాగా పెరిగాయి.

ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో స్వేచ్ఛాయుత పరిస్థితులు ఉండాలని భారత్‌ సహా అనేక దేశాలు చెబుతున్నాయి. అక్కడి దక్షిణ చైనా సముద్రం మొత్తం తనదేనని చైనా వాదిస్తోంది. పొరుగునున్న తైవాన్‌, ఫిలిప్పీన్స్‌ తదితర దేశాలు దీన్ని విభేదిస్తున్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఉంది. ఈ పరిస్థితుల్లో ఆస్ట్రేలియాకు అణు జలాంతర్గాముల అవసరం ఉందన్న అభిప్రాయానికి అమెరికా, బ్రిటన్‌లు వచ్చాయి.

  • ఇండో – పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టాలని భావిస్తోంది ఆకస్ కూటమి..

ఆకస్ కూటమి ప్రకటించిన సబ్ మెరైన్ ఒప్పందాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.. అవి ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయని మండిపడింది.. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ లు కలిసి ఆకస్ పేరుతో భద్రతా కూటమిగా ఏర్పడ్డాయి.. 18 రోజుల క్రితం ఈ కూటమి ఏర్పడింది.. ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం కోసం ఈ మూడు దేశాలు తమ రక్షణ సామర్ధ్యాలతో పాటు క్రుత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ వనరులను పరస్పరం పంచుకోనున్నాయి..ఈ క్రమంలోనే అణుశక్తితో నడిచే జలాంతర్గముల తయారీలో అమెరికా, బ్రిటన్ దేశాలు ఆస్ట్రేలియాకు సాయం అందించనున్నాయి..

ఈ క్రమంలోనే ఆకస్ సబ్ మెరైన్ డీల్ ను ఆవిష్కరించారు.. దీనిపై చైనా విదేశాంగ ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ స్పందించారు. తాజాగా విడుదల చేసిన ప్రకటన ద్వారా ఆకస్ కూటమి దేశాలు అంతర్జాతీయంగా వస్తోన్న ఆందోళనలను పట్టించుకోలేదని స్పష్టం అవుతోంది.. వారు కేవలం వారి భౌగోళిక, రాజకీయ ప్రయోజనాలను ద్రుష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తున్నారు. వారు ప్రమాదకరమైన తప్పుడు మార్గంలో ఇంకా ముందుకు వెళ్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. ఈ ఒప్పందం ప్రచ్చన్న యుద్దం నాటి మనస్తత్వానికి నిదర్శనమని అలాగే ఈ విక్రయం అంతర్జాతీయ అణు నిరాయుధీకరణ చర్యలకు విఘాతమని మండిపడ్డారు..

అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పెద్ద పరిణామాల్లో ఒకటి ఆకస్‌ కూటమి ఏర్పాటు. అమెరికా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం రకరకాల రక్షణ కూటములను ఏర్పాటు చేస్తోంది..బలీయమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న చైనాను దెబ్బతీయడమే లక్ష్యంగా ఇప్పటికే క్వాడ్‌ కూటమిని ఏర్పాటు చేసిన అగ్రరాజ్యం… ఏడాదిన్నర క్రితం బ్రిటన్‌, ఆస్ట్రేలియాతో కలసి ఆకస్‌ కూటమిని ఏర్పాటు చేసింది.. కృత్రిమ మేథ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, సైబర్‌ భద్రత, జలాంతర్గాముల సామర్థ్యం, ఇతర అధునాతన రక్షణ వ్యవస్థల్లో సహకారం పెంపొందించుకోవడమే ఆకస్‌ ప్రధాన ఎజెండాగా ఉంటుందని కూటమి నేతలు బయటకు చెబుతున్నప్పటికీ… దీని అసలు లక్ష్యం చైనాకు వ్యతిరేకంగా అణు యుద్ధానికి రంగాన్ని సిద్ధం చేయడమేనని అంతర్జాతీయ పరిశీలకులు చెబుతున్నారు.

అమెరికా చర్య వల్ల ఫ్రాన్స్‌ 9,000 కోట్ల డాలర్ల విలువైన డీజిల్‌-ఎలక్ట్రిక్‌ సబ్‌ మెరైన్ల కాంట్రాక్టును కోల్పోయింది. ఫ్రాన్స్‌తో ఇది వరకే కుదుర్చుకున్న కోలిన్స్‌ క్లాస్‌ సబ్‌మెరైన్ల కొనుగోలు ఒప్పందాన్ని అమెరికా అణు సబ్‌మెరైన్ల కోసం ఆస్ట్రేలియా రద్దు చేసుకుంది. అమెరికా, ఆస్ట్రేలియా చర్యపై ఆగ్రహంతో రగిలిపోతున్న ఫ్రాన్స్‌ ఆ రెండు దేశాల నుంచి తన రాయబారులను వెనక్కి రప్పించింది. ఈ విషయంలో ఫ్రాన్స్‌కు యూరోపియన్‌ యూనియన్‌ బాసటగా నిలిచింది. క్వాడ్‌ ఉండగా ఆకస్‌ పేరుతో మరో త్రైపాక్షిక కూటమిని ముందుకు తేవడం ద్వారా బైడెన్‌ ప్రభుత్వం తన ఇండో-పసిఫిక్‌ వ్యూహంలో భారత్‌, జపాన్‌ల కన్నా ఆస్ట్రేలియాకు ఎక్కువ ప్రాధాన్యత నిస్తోంది.. అందుకు కారణం ఇండో – పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టాలని అమెరికా భావించడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు..తాజాగా.. ఆస్ట్రేలియాకు కనీసం మూడు అణు జలాంతర్గాములను అమెరికా సరఫరా చేయనుందని తెలియగానే.. చైనా ఆగ్రహం వ్యక్తం చేయడమే అందుకు నిదర్శనం..

ఇండో – పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టాలని భావిస్తోంది ఆకస్ కూటమి.. హిందూ మహాసముద్రం, పశ్చిమ, మధ్య పసిఫిక్‌ మహాసముద్రంతో కూడిన ప్రాంతంలో చైనా కార్యకలాపాలు బాగా పెరిగాయి. దక్షిణ చైనా సముద్రం తనదేనని చైనా వాదిస్తోంది. ఈ క్రమంలోనే ఆకస్ కూటమి ఏర్పడి.. చైనాకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తోంది..

Must Read

spot_img