Homeఅంతర్జాతీయంచైనాలో వరుసగా మూడు కరోనా వేవ్ లు....

చైనాలో వరుసగా మూడు కరోనా వేవ్ లు….

చైనాలో మరోసారి వరుసగా మూడు కరోనా వేవ్‌లు వచ్చే ప్రమాదముంది. చైనాలో మరోసారి కరోనా సంక్షోభం మొదలైంది. ఈ మధ్యే కఠిన ఆంక్షల్ని సడలించింది ప్రభుత్వం. అప్పటి నుంచి భారీ స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ లెక్కలు దాచి పెట్టిన చైనా… ఇప్పుడు అధికారికంగా కేసులు పెరుగుదలపై ప్రకటన చేసింది. ఆరోగ్య విభాగానికి చెందిన అధికారులు…దేశంలో మరో మూడు కరోనా వేవ్‌లు వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. అందులో ఇప్పటికే ఓ వేవ్ మొదలైందని చెబుతున్నారు. జనవరి ముగిసే వరకూ…భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు. గత ఆదివారం దాదాపు 3 వేల కేసులు నమోదయ్యాయని బయటకు చెబుతున్నా… నిజానికి ఆ సంఖ్య అంతకు మించి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

చైనాలో ఇప్పటికే ఫస్ట్ వేవ్ మొదలైందని…జనవరి ముగిసే నాటికి రెండో వేవ్‌ వచ్చే ప్రమాదముందని అంటున్నారు. కొత్త ఏడాది వేడుకలు చేసుకునేందుకు పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడటం వల్ల కొవిడ్‌ కేసులు అనూహ్యంగా పెరిగే అవకాశాలున్నాయి. ఫలితంగా…ఫిబ్రవరి, మార్చి వరకూ ఈ ప్రభావం కొనసాగుతుండొచ్చు. అయితే…వ్యాక్సినేషన్‌ను పకడ్బందీగా నిర్వహిస్తుండటం వల్ల ప్రాణ నష్టం తక్కువగానే ఉండొచ్చని భావిస్తున్నారు.

చైనాలో…90% మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. అయితే…80 ఏళ్లు పైబడిన వారికి టీకాలు ఇచ్చినప్పటికీ…రోగనిరోధక శక్తి వారిలో తక్కువగా ఉంటుందని…వీరి ద్వారానే వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందే ప్రమాదముందని చైనా ఆందోళన చెందుతోంది. ఆంక్షల్ని ఎత్తివేయడం వల్ల చైనాలో భారీ సంఖ్యలో మరణాలు నమోదయ్యే ప్రమాదముందని అమెరికాకు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ అంచనా వేసింది. వచ్చే ఏడాదిలో అనూహ్య స్థాయిలో కేసులు నమోదవడమే కాకుండా…లక్షలాది మరణాలు సంభవించే అవకాశముందని హెచ్చరించింది.

2023 ఏప్రిల్ 1వ తేదీ నాటికి చైనా వ్యాప్తంగా కొవిడ్ కేసులు తారస్థాయికి చేరుకుంటాయని, మరణాల సంఖ్య 3 లక్షల 22 వేల వరకూ నమోదవుతుందని అంచనా వేసింది. అప్పటికి ఆ దేశ జనాభాలో మూడోవంతు ప్రజలకు కొవిడ్ సోకుతుందని తెలిపింది. నిజానికి…చైనాలో ఇప్పటికే కొవిడ్ మరణాలు పెరిగాయని.. కానీ ప్రభుత్వం ఆ లెక్కల్ని బయటపెట్టడం లేదని ఆరోపణలున్నాయి. చివరి సారి డిసెంబర్ 3వ తేదీన మరణాల సంఖ్యను వెల్లడించింది చైనా. అప్పటి నుంచి మరే వివరాలూ అందలేదు.

డిసెంబర్ నెల మొదట్లోనే చైనాలో విధించిన జీరో కోవిడ్ ఆంక్షల్ని సడలించింది జిన్ పింగ్ ప్రభుత్వం. అప్పటి నుంచి కొవిడ్ వ్యాప్తి పెరుగుతోంది. వచ్చే నెల నాటికి దేశ జనాభా అంతటికీ వైరస్ సోకుతుందని ఆందోళన చెందుతున్నారు. అమెరికాకు చెందిన IHME..జీరో కొవిడ్ పాలసీ వల్లే చైనాలో ఒమిక్రాన్ వేరియంట్ ఎక్కువగా సోకకుండా అడ్డుకోగలిగారని తేల్చి చెప్పింది. చైనా నేషనల్ హెల్త్ కమిషన్ చేసిన ప్రకటన ఆధారంగా చూస్తే… పీసీఆర్ టెస్టింగ్ విషయంలో ఇప్పటి వరకూ ఉన్న నిబంధనలకు కాస్త మినహాయింపులు ఇవ్వనున్నారు. లాక్‌డౌన్‌ లను కూడా క్రమంగా తొలగించనున్నారు. సివియర్ సింప్టమ్స్ లేని బాధితులు ఇంట్లోనే ఐసోలేట్ అయ్యేందుకు అవకాశం కల్పించ నున్నారు. పబ్లిక్ బిల్డింగ్స్‌లోకి వెళ్లాలంటే ఇప్పటి వరకూ చైనా పౌరులు తమ ఫోన్‌లో గ్రీన్ కోడ్‌ను అధికారులకు చూపించాల్సి వచ్చేది. ఇప్పుడా అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

కరోనా వైరస్ భయానికి డిసెంబర్ 18న చైనాలోన ఉత్తర, దక్షిణ భాగాలు పూర్తిగా నిర్మానుష్యమయ్యాయి. డిసెంబర్ 7 నుంచి కరోనా మరణాల వార్తలు ప్రపంచానికి తెలియనివ్వకుండా చైనా జాగ్రత్త పడుతున్నా… అక్కడి నగరాల్లో జనసంచారం పరిస్థితిని గమనిస్తే విషయమేంటో అర్థం చేసుకోవచ్చు. శ్మశానవాటికల దగ్గర నిత్యం రద్దీగా ఉంటోంది. గత మూడేళ్లుగా జీరో కొవిడ్ వ్యూహంతో చైనా ప్రభుత్వం వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసిప్పటికీ… వ్యాధి వ్యాప్తి పూర్తిగా అదుపులోకి రాలేదు. ఐసోలేషన్ నిబంధనలు సడలించినా జనాల్లో కొవిడ్ భయం ఇంకా పోలేదు.. చైనా చీఫ్ ఎపిడెమియాలజిస్ట్ వ్ యూ జున్‌యూ
అంచనాల ప్రకారం..

ఈ శీతాకాలం సీజన్‌లో కొవిడ్‌-19 కేసులు అత్యధికంగా ఉన్న టాప్ 3 దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంది. ఇక వచ్చేనెల జనవరిలో కొత్త ఏడాది సంబరాలకు విదేశాల్లో ఉన్న చైనా దేశీయులు, చైనాలో ఉన్న ఇతర దేశాల పౌరులు సొంత దేశాలకు వచ్చే అవకాశం ఉండటంతో పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సర్వేలు చెప్తున్నాయి. ప్రస్తుతం చైనాలో కరోనా తొలి వేవ్‌ నడుస్తోంది. దీనిపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మాత్రం మరోలా ప్రచారం చేస్తున్నారు.

దేశంలో కొవిడ్ ఆంక్షలు ఎత్తేసినప్పటి నుంచి ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదని చెప్తూ ప్రజలను నమ్మిస్తున్నారు. అదే నిజమైతే చైనాలోని ప్రధాన నగరాలైన బీజింగ్, చెంగ్ డూ నగరాల్లో శ్మశాన వాటికలు ఎందుకు రద్దీగా ఉన్నాయని ప్రజలు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. చైనాలో ఊహించిందే జరుగుతోంది. కరోనా విలయతాండవం చేస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి వెల్లువతో చైనా ప్రజలు అల్లాడుతున్నారు. సరిపడా టెస్టులు లేవు. కావల్సిన మందులు లేవు.ఆస్పత్రుల్లో బెడ్‌లు దొరకడం లేదు. చివరకు ఆఖరి మజిలీకి శ్మశనాల్లోనూ ఎదురుచూడాల్సిన దుస్థితి. జీరో కోవిడ్ విధానాన్ని ఎత్తేసిన చైనాను వైరస్ కమ్మేస్తోంది. ఇప్పుడు చూస్తోంది శాంపిలేనని..పెను విధ్వసం పొంచి ఉందని వైద్య నిపుణులు చేస్తున్న హెచ్చరికలు తీవ్ర భయాందోళన కలిగిస్తున్నాయి.

హైరౌ స్మశానవాటికలో ఓ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి మూడు రోజుల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది. చైనాలో కరోనా విధ్వంసానికి ఇదో ఉదాహరణ. ఇది ఊహించిందే అయినప్పటికీ… ఈ పరిస్థితులు ఎదుర్కోవడం చైనాకు సవాల్‌గా మారింది. జీరో కోవిడ్ విధానానికి వ్యతిరేకంగా గత నెల చివరి వారానికి నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ నెల ప్రారంభానికి చైనా అంతటా ఆందోళనలు పెల్లుబికాయి. యూనివర్శిటీలో జిన్‌పింగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించాయి. ఫలితంగా కరోనా కఠిన నియమావళి ఎత్తేయక తప్పలేదు. ఇలా జీరో కోవిడ్ విధానం ఎత్తివేశారో లేదో…అలా వైరస్ విజృంభణ మొదలయింది. 15 రోజుల్లోనే పరిస్థితి చేయిదాటిపోయింది.

అసలు కరోనా ఎంతమందికి సోకిందన్నది కచ్చితమైన లెక్కలు తేలడం లేదు. కోవిడ్ మందులకు కొరత ఏర్పడుతోంది. ఆస్పత్రులు, మెడికల్ షాపులు కిటకిటలాడుతున్నాయి. చైనాలో ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా అన్ని వేరియంట్లలోనూ ఇదే అన్నింటికన్నా వేగంగా వ్యాప్తి చెందేది. ఓ వ్యక్తికి వైరస్ సోకిందని తెలుసుకునే లోపే..

వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు ఒమిక్రాన్ బారిన పడుతున్నారు. దీంతో చైనాలోని చాలా నగరాల్లో కుటుంబాలకు కుటుంబాలు కరోనా బారిన పడుతున్నాయి. వైరస్ తీవ్రతతో కరోనా మరణాలూ మొదలయ్యాయి. ఇద్దరు చైనా జర్నలిస్టులు వైరస్‌తో చనిపోయారు. అయితే ఆ సీనియర్ జర్నలిస్టులిద్దరూ 70 ఏళ్ల పైబడ్డవారే. సాధారణ ప్రజలతో పాటు రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు, నర్సులు ఒమిక్రాన్‌ బారిన పడుతున్నారు. స్మశానవాటిక సిబ్బందికి సైతం కరోనా సోకడంతో..అక్కడ విధి నిర్వహణ కష్టంగా మారింది.

కరోనా తీవ్రంగా వ్యాపించిన ఏప్రిల్‌ కన్నా ఎక్కువగా ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి. వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడానికి మళ్లీ ఆంక్షల బాట పట్టడం మినహా మరో మార్గం కనిపించడం లేదు చైనాకు. వాణిజ్య నగరం షాంఘైలో ఇప్పటికే ప్రభుత్వం ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని ఆదేశించింది. చాలా స్కూళ్లలో టీచర్లు, స్కూల్ సిబ్బంది కరోనాతో బాధపడుతున్నారు. నర్సరీలు, డే కేర్ సెంటర్లు మూసివేస్తున్నారు. పెరుగుతున్న కేసులుకు తగ్గట్టుగా చికిత్స సదుపాయాలు పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

చైనా వ్యాప్తంగా తాత్కాలిక ఆస్పత్రులు, మెడికల్ సెంటర్లు అందుబాటులోకి తెస్తున్నారు. షాంఘైలో అదనంగా 2లక్షల 30వేల అదనపు బెడ్లు సమకూర్చారు. మరోవైపు చైనాలో కరోనా వ్యాప్తిపై వైద్యనిపుణులు చేస్తున్న హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. రానున్న రోజుల్లో చైనాలో కరోనా విస్ఫోటనం చూస్తామని…అమెరికాకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ హెల్త్ మెట్రిక్స్ హెచ్చరించింది.

ఇప్పటికన్నా2023లో కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉంటుందని, చైనా ప్రజల్లో మూడోవంతుమంది వైరస్ బారిన పడనున్నారని అంచనా వేసింది. ఏప్రిల్ ఒకటి నాటికి వైరస్ వ్యాప్తి తీవ్రస్థాయికి చేరుతుందని తెలిపింది. పదిలక్షలమంది కరోనాతో చనిపోయే ప్రమాదముందని వెల్లడించింది. చైనాలో మరికొన్ని సంస్థలు..జనవరిలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నాయి. 60శాతం జనాభాకు వైరస్ సోకుతుందని, వృద్ధులకు ముప్పు ఎక్కువగా ఉంటుందని అంచనావేశాయి.

ప్రపంచంలోనే అతి ఎక్కువ జనాభా ఉన్న దేశమైన చైనా.. ఆ స్థాయిలో ప్రజలకు వ్యాక్సిన్ పంపిణీ చేయలేదు.జీరో కోవిడ్ విధానం రూపొందించింది కానీ..ప్రజలకు కరోనా నుంచి రక్షణ కల్పించే వ్యాక్సిన్లపై దృష్టి పెట్టలేదు.అసలు చైనా వ్యాక్సిన్లు ఒమిక్రాన్‌ను ఏమీ చేయలేకపోతున్నాయి. షాంఘైలోని ఫుడాన్ యూనివర్శిటీ అంచనాలు మరింత భయానకంగా ఉన్నాయి.

15లక్షల 50వేలమంది కరోనాతో మరణించే ప్రమాదముందని, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లకు ఇప్పుడున్న వాటి కన్నా 15.6 రెట్లు ఎక్కువ డిమాండ్ పెరుగుతుందని తెలిపాయి. 80 ఏళ్లు పైబడినవారిలో వ్యాక్సిన్ వేయించుకోని 80లక్షల మంది ప్రజలకు రిస్క్ ఎక్కువగా ఉందని, షుగర్ పేషెంట్లూ తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని పరిశోధకులు హెచ్చరించారు. మూడేళ్లగా ఆంక్షల మధ్య గడిపిన ప్రజలు కరోనా నిబంధనల ఎత్తివేతతో దేశమంతా స్వేచ్ఛగా
తిరుగుతున్నారు. అంతే స్వేచ్ఛగా కరనా వ్యాపిస్తోంది. చైనా కొత్త సంవత్సరం వేడుకలు జరిగే జనవరి చివరి వారం నాటికి కేసులు భారీగా నమోదవుతాయన్నఆందోళన వ్యకమవుతోంది. గ్రామాలకు వెళ్లే చైనీయులు మాస్క్, భౌతిక దూరం వంటి నిబంధనలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు..

జీరో కోవిడ్ విధానంతో చైనాకు ఇప్పటి వరకు హెర్డ్ ఇమ్యూనిటీ రాలేదు. దీనికి తోడు కావల్సినన్ని వ్యాక్సిన్లు అందుబాటులో లేవు. దీంతో కరోనా విస్ఫోటనంగా మారుతోంది. ఇది బద్ధలవ్వకముందే…కేసుల నియంత్రణకు చర్యలు తీసుకోనుంది జిన్ పింగ్ ప్రభుత్వం.

Must Read

spot_img