Homeఅంతర్జాతీయంచైనాల మధ్య ఉద్రిక్తతలు ఎందుకు మొదలయ్యాయి..?

చైనాల మధ్య ఉద్రిక్తతలు ఎందుకు మొదలయ్యాయి..?

తైవాన్ కు షాకిచ్చింది హోండూరస్.. గతపదేళ్లుగా తైవాన్ తో దౌత్య సంబంధాలు కొనసాగిస్తోన్న హోండూరస్.. ఉన్నట్లుండి తెగదెంపులు చేసుకుంది.. తైవాన్ తో తమకు ఎలాంటి దౌత్యపరమైన సంబంధాలు ఉండవని హోండూరస్ ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దాదాపు పదేళ్లుగా తైవాన్‌ తో దౌత్య సంబంధాలు కొనసాగిస్తున్న హోండూరస్… ఉన్నట్టుండి తెగదెంపులు చేసుకుంది. “ప్రపంచంలో ఒకే ఒక చైనా ఉంది. దాన్ని మాత్రమే మేం గుర్తిస్తున్నాం. తైవాన్ చైనాలో భాగమే. చైనా నుంచి ఆ దేశాన్ని వేరు చేసి చూడలేం. ఇప్పటికే మేం ఆ దేశానికి సమాచారం అందించాం. ఇకపై తైవాన్‌ తో మాకు ఎలాంటి దౌత్య సంబంధాలు ఉండవని హోండూరస్ విదేశాంగ శాఖ ప్రకటించింది.

పరోక్షంగా తైవాన్‌ కు చురకలు అంటించింది. చైనా, మాండూరస్ మధ్య దౌత్య సంబంధాలు మొదలయ్యాయని చైనా అధికారిక ప్రకటన చేసింది.. “వన్ చైనా అనే నినాదానికి, విధానానికి కట్టుబడి ఉన్న 181 దేశాల జాబితాలో హోండూరస్ కూడా చేరిపోయింది. తైవాన్‌తో ఉన్న దౌత్య సంబంధాలను తెగదెంపులు చేసుకుందని చైనా విదేశాంగ శాఖ తెలిపింది. ఏడాది కాలంగా చైనా, తైవాన్ మధ్య ఘర్షణ కొనసాగుతోంది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మిలిటరీ డ్రిల్స్ కూడా నిర్వహించింది. తైవాన్‌ లోని పలు చోట్ల క్షిపణుల దాడులూ చేసింది. ఈ ద్వీప దేశాన్ని ఆక్రమించుకునేందుకు డ్రాగన్ అన్ని ప్రయత్నాలూ చేస్తూనే ఉంది. ఈ సమయంలోనే హోండూరస్ దేశం తైవాన్‌ తో తెగదెంపులు చేసుకోవడం సంచలనమైంది. దౌత్య ఒప్పందం కుదిరిన తరువాత చైనా, హాండూరస్‌ అధికారిక ప్రకటన చేశాయి. చైనా, హోండూరస్‌ మధ్య దౌత్య సంబంధాలు మొదలయ్యాయని ఇరుదేశాలు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది..

చైనా, తైవాన్ మధ్య ఎన్నో ఏళ్లుగా ఘర్షణ కొనసాగుతోంది. ఇటీవల అమెరికా జోక్యంతో ఇది కాస్తా ముదిరింది. తైవాన్‌ గురించి చైనా చేస్తున్న వాదన ఒకటే. తైవాన్.. తమ భూభాగం నుంచి విడిపోయిన ఓ ప్రావిన్స్‌ అని చెబుతోంది డ్రాగన్ దేశం. అంటే.. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో భాగమే అని అంటోంది. కానీ..తైవాన్ మాత్రం ఈ వాదనను ఎప్పటి నుంచో కొట్టి పారేస్తోంది. తమను తాము ప్రత్యేక దేశంగా చెప్పుకుంటోంది తైవాన్. అయితే ఇప్పటికీ ఈ దేశాన్ని రిపబ్లిక్ ఆఫ్ చైనాగానే వ్యవహరిస్తున్నారు. 1927లో చైనాలో అంతర్యుద్ధం మొదలైంది. నేషనలిస్ట్‌, కమ్యూనిస్ట్‌ల మధ్య ఈ యుద్ధం జరిగింది.

అయితే…ఇంతలో రెండో ప్రపంచ యుద్ధం ముంచుకొచ్చింది. చైనాను ఆక్రమించాలని చూసిన జపాన్‌ ను అడ్డుకోవటంలో మునిగిపోయింది డ్రాగన్ ప్రభుత్వం. ఆ సమయంలో అంతర్యుద్ధానికి తెర పడింది.రెండో ప్రపంచ యుద్ధం ముగిసిపోయాక, మరోసారి అంతర్యుద్ధం మొదలైంది. 1949లో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ CCP,పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను ఏర్పాటు చేసి, బీజింగ్‌ ను రాజధానిగా ప్రకటించారు. అయితే నేషనలిస్ట్‌లు అంతా ఉన్నట్టుండి తైవాన్‌కు వెళ్లిపోయారు. ఆప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. రిపబ్లిక్ ఆఫ్ చైనా రాజధానిని తైపెయ్‌గా ప్రకటించుకున్నారు. వారితో పాటు దాదాపు 12 లక్షల మంది దీనికి ఆమోదం తెలిపారు. అప్పటి నుంచి ఆస్ట్రేలియా..

దాదాపు రెండు దశాబ్దాల వరకూ చైనా రాజధానిని తైపెయ్‌గానే గుర్తించింది.1971లో యునైటెడ్ నేషన్స్ బీజింగ్‌ ను చైనా రాజధానిగా గుర్తిస్తూ ఓ తీర్మానం పాస్ అయింది. అప్పుడే ప్రపంచమంతా చైనా రాజధానిగా బీజింగ్‌ ను గుర్తించాల్సి వచ్చింది. తైవాన్ మాత్రం.. రిపబ్లిక్ ఆఫ్ చైనా రాజ్యాంగ ప్రకారం తమదీ ఓ దేశమేనని వాదిస్తున్నాయి. నియంతృత్వ పాలన నుంచి బయటపడి ప్రజాస్వామ్య దేశంగా మారామని ప్రకటించుకుంది. చైనాతో తైవాన్ సంబంధాలు వందల ఏళ్ల క్రితం నుంచే కొనసాగుతున్నాయి. 1683లో క్వింగ్ రాజవంశం తైవాన్‌ను నియంత్రణలోకి తీసుకుంది. కానీ అంతర్జాతీయ రాజకీయాలలో తైవాన్ పేరు మొదటి చైనా-జపాన్ యుద్ధం అనంతరం బయటకు వచ్చింది.

ఈ యుద్ధంలో చైనా క్వింగ్ సామ్రాజ్యాన్ని ఓడించిన జపాన్.. తైవాన్‌ను ఆక్రమించుకుంది. అయితే రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ఓడిపోయింది. దీంతో యుద్ధ సమయంలో మిత్రరాజ్యాల పక్షం వహించిన చియాంగ్ కై-షెక్ నేతృత్వంలోని చైనీయులకు తైవాన్‌ను తిరిగి ఇచ్చారు. 1949లో చియాంగ్‌తో పాటు అతని పార్టీ, కుమింటాంగ్ చైనాలో అంతర్యుద్ధాన్ని ఎదుర్కొన్నాయి. ఈ క్రమంలో చియాంగ్.. మావో జెడాంగ్ నేతృత్వంలోని కమ్యూనిస్టుల చేతిలో ఓడిపోయారు. అనంతరం చియాంగ్ వర్గం వారు తైవాన్‌కు పారిపోయి, ఆ ప్రాంతంపై పరిపాలనా నియంత్రణను కొనసాగించారు. మావో తైవాన్‌పై దాడి చేయాలని నిర్ణయించిన తరుణంలో..

1950లో కొరియాతో యుద్ధం చేయాల్సి వచ్చింది. దీంతో మావో ఉత్తర కొరియాలోనికమ్యూనిస్టులకు సహాయం చేయడంపై దృష్టి పెట్టారు. ఫలితంగా అప్పట్లో తైవాన్‌పై దాడిని విరమించుకున్నారు. ఈ క్రమంలో తైవాన్ భద్రత, స్వతంత్య్రానికి అమెరికా హామీ ఇచ్చింది. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో, ఆ తరువాత కూడా తూర్పు ఆసియాలో చైనా ప్రాబల్యాన్ని నిరోధించడానికి అమెరికా పావులు కదిపింది. ఈ క్రమంలో తైవాన్‌కు మిత్రదేశంగా మారింది.

ప్రస్తుతం కొందరు తైవాన్‌ వాసులు చైనాతో పునరేకీకరణకు మద్దతు ఇస్తున్నారు. జాతివాదం, పౌర జాతీయత ఇందుకు కారణాలని చెప్పుకోవచ్చు. కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ 2020లో నిర్వహించిన పోల్స్ ప్రకారం.. తైవాన్ నివాసితులలో దాదాపు మూడింట రెండు వంతుల మంది తమ గుర్తింపును కేవలం ‘తైవానీస్’ గానే పరిగణిస్తున్నారు. కేవలం మూడు శాతం మంది మాత్రమే తమను తాము ‘చైనీయులు’గా భావిస్తున్నారు. తైవానీస్ గుర్తింపు అనే బలమైన భావన.. చైనాతో తైవాన్ పునరేకీకరణకు అవరోధంగా మారుతోంది.

తైవాన్ భవిష్యత్తు అయిన లక్షలాది మంది తైవానీస్ యువకులు.. తమకు చైనాతో ఎలాంటి సాంస్కృతిక సంబంధాలు లేవని భావిస్తున్నారు. తైవాన్ని వాసితులు తమ దేశంలోని ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థపై విధేయత చూపుతున్నారు. చాలా మంది తైవానీస్ ప్రజలు “ఒక దేశం-రెండు వ్యవస్థలు” విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే తైవాన్ ప్రజలు ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నారు. స్వేచ్ఛను కోరుకునే ఈ ప్రాంత వాసులు.. చైనా లాంటి కమ్యూనిస్టు పాలనను కోరుకోవట్లేదు.పునరేకీకరణ తర్వాత తైవాన్‌ కు స్వయం ప్రతిపత్తిని ఇస్తామన్న చైనా వాగ్దానాన్ని సైతం తైవాన్ వాసులు విశ్వసించట్లేదు. ప్రత్యేకించి హాంకాంగ్‌ విషయంలో చైనా వ్యవహార శైలిని వారు ఎత్తిచూపుతున్నారు.

చైనా కమ్యూనిస్ట్ పార్టీ తైవాన్‌ ను.. తమ దేశం నుంచి విడిపోయిన ప్రావిన్స్‌గా పరిగణిస్తుంది. ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్ పింగ్ .. తైవాన్ చైనాలో విలీనం కావాలని, అవుతుందని స్పష్టంగా చెప్పారు. చైనా ముందు నుంచి తైవాన్‌ ను చారిత్రాత్మకంగా తమ దేశంలోని ఒక భాగంగా పరిగణించింది. జాతీయత, ప్రాదేశిక సమగ్రత లక్ష్యాలుగా డ్రాగన్ దేశం తైవాన్‌ పునరేకీకరణకు పావులు కదుపుతోంది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా 100వ వార్షికోత్సవం జరిగే 2049 నాటికి చైనాను అతిపెద్ద శక్తిగా నిలిపేందుకు ప్రణాళికలు రచించారు జిన్‌పింగ్.

ఆసియాలో ఆర్థిక ప్రాబల్యంతో పాటు టిబెట్, హాంకాంగ్, తైవాన్ వంటి భూభాగాలను విలీనం చేసుకొని “గ్రేటర్ చైనా” పేరుతో నియంత్రణను తిరిగి పొందడానికి చైనా అధ్యక్షుడు పావులు కదుపుతున్నట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి. తైవాన్‌కు స్వాతంత్ర్యం ప్రకటిస్తే.. జిన్‌పింగ్, చైనా కమ్యూనిస్ట్ పార్టీ జాతీయవాదానికి అవరోధాలు ఎదురవుతాయి. ఇది టిబెట్, జిన్జియాంగ్‌లలో వేర్పాటువాద ఉద్యమాలను ప్రోత్సహిస్తుంది. ఇవన్నీ డ్రాగన్‌ దేశానికి అమవానాలుగా మిగిలిపోతాయి. చైనా పునరేకీకరణ లక్ష్యాల్లో ప్రధానమైనది..

తైవాన్‌పై చైనా దాడి చేస్తే.. రక్షణకు హామీ ఇస్తామని అమెరికా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఆ ప్రాంతానికి సాయం అందిస్తూనే ఉంది. సాధారణంగా అంతర్జాతీయ సంబంధాల విషయంలో.. ఆర్థిక శక్తి, వ్యూహాత్మక, సైద్ధాంతిక కారణాలతోనే చిన్న దేశాలకు పెద్ద దేశాలు హామీ ఇస్తాయి. తైవాన్- అమెరికా సంబంధాల విషయంలోనూ ఈ మూడు కారకాలను పరిగణనలోకి తీసుకోవాల్సిందే.ఎందుకంటే అమెరికాకు 10వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలుస్తోంది తైవాన్. ఈ ప్రాంతం చైనా ఆదీనంలోకి వెళ్తే.. 600 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, హైటెక్ పరిశ్రమ, సెమీకండక్టర్ ఉత్పత్తిపై డ్రాగన్ దేశం పట్టు సాధిస్తుంది. దీనికి తోడు చైనా నియంత్రణలోకి తైవాన్ వెళ్తే.. ఈ ప్రాంతానికి తూర్పు వైపు 150 నాటికల్ మైళ్ల దూరంలో క్షిపణి పరిధిని చైనా పెంచవచ్చు.

ఇది చైనాను తూర్పు చైనా సముద్రంలో ఆధిపత్య శక్తిగా చేస్తుంది. దీంతో పాటు ఆ దేశం జపాన్ లేదా యూఎస్ ద్వీపం భూభాగమైన గువామ్‌పై దాడి చేయడం సులభం అవుతుంది. అందువల్ల తైవాన్‌ పునరేకీకరణను అమెరికా సమర్థించట్లేదు. ఈ కారణాల వల్ల.. అన్ని విధాలుగా తైవాన్ తమకు అత్యంత ముఖ్యమైన మిత్రదేశమని యూఎస్ భావిస్తోంది.

ఒకవేళ చైనా తైవాన్‌పై దాడి చేస్తే.. దాని ఫలితాలు తీవ్రంగా ఉండవచ్చు. దీనివల్ల చైనా ఆర్థిక, దౌత్యపరమైన నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ద్వీపంపై దాడి చేస్తే చైనాపై అంతర్జాతీయంగా వ్యతిరేకత పెరుగుతుంది. తైవాన్ సానుభూతిని పొందుతుంది. ఫలితంగా ప్రపంచ నాయకుడిగా తనను తాను నిలబెట్టుకోవడానికి చైనా చేసే ప్రయత్నాలకు విలువ లేకుండా పోతుంది. తైవాన్ అధికారికంగా స్వతంత్ర్యం ప్రకటించుకోవడం కూడా అసంభవమని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు విశ్లేషిస్తున్నారు.

చాలా మంది తైవానీస్ ప్రజలు యథాతథ స్థితికి మద్దతు ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్వతంత్య్రం ప్రకటించుకుంటే, చైనా తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడకపోవచ్చని ప్రజలు భావిస్తున్నారు. మరోవైపు చైనా తైవాన్ కంటే సైనికపరంగా ఎంతో ముందజలో ఉంది. దీనికి తోడు చైనా ఆదేశంపై దండయాత్ర చేస్తే.. తాము రక్షిస్తామని అమెరికా ఎలాంటి హామీ ఇవ్వలేదు. అందువల్ల తైవాన్ సైతం స్వతంత్య్రాన్ని ప్రకటించుకోకపోవచ్చు. అందువల్ల చైనా బెదిరింపులు కొనసాగుతున్నప్పటికీ..భవిష్యత్తులో కూడా యథాతథ స్థితి కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Must Read

spot_img