Homeఅంతర్జాతీయంచార్లీ చాప్లిన్ శవపేటిక దొంగిలించబడింది..!

చార్లీ చాప్లిన్ శవపేటిక దొంగిలించబడింది..!

చార్లీ చాప్లిన్.. సినిమా అనే వినోద మాధ్యమాన్ని ఒక కళగా మలచిన గొప్ప నట దర్శక నిర్మాత… కఠిన పేదరికంలో పుట్టి, కష్టాల మధ్య పెరిగిన చార్లీ చాప్లిన్.. తన సినిమాలను అన్ని రకాలుగానూ అద్భుతంగా తీర్చిదిద్దారు.

చార్లీ చాప్లిన్ సమాధిని తవ్వి.. డెడ్ బాడీని ఎత్తుకెళ్లి డబ్బు కావాలని డిమాండ్ చేశారా..? చార్లీని అమెరికా నుంచి ఎందుకు బహిష్కరించారు..? చార్లీ చాప్లిన్ మరణం వెనక ఏమైనా మిస్టరీ ఉందా..?

జీవితంలోని కఠినమైన సవాళ్లను, విషాదాలను హాస్య రూపంలో తెరపైకి ఎక్కించి.. సినిమా అనే వినోద మాధ్యమాన్ని ఒక కళగా మలచిన గొప్ప నట దర్శక నిర్మాత చార్లీ చాప్లిన్. ఆయన 45 ఏళ్ల క్రితం కన్నుమూశారు. 1977 డిసెంబర్ 25న ప్రపంచం చాప్లిన్ కు కన్నీటి వీడ్కోలు చెప్పింది.

చార్లీ చాప్లిన్ చనిపోయాక.. ఆయన సినిమాల్లోని కొన్ని పాత్రల్లాగా ఓ ఇద్దరు దొంగలు ఆయన శవాన్ని ఎత్తుకుపోయి, డబ్బులు కావాలని డిమాండ్ చేశారు. ఈ కథను ప్రపంచం దాదాపుగా మర్చిపోయింది. హాస్య నటుల్లో అత్యంత గొప్పవాడిగా చాలా మంది చార్లీని పరిగణిస్తారు.

లెజెండరీ చార్లెస్ స్పెన్సర్ చాప్లిన్ కఠిన పేదరికంలో పుట్టి, కష్టాల మధ్య పెరిగారు. విధితో మనిషి విషాద సంఘర్షణలను హాస్యభరితంగా చెపుతూ అద్భుతంగా మానవత్వీకరించారు.. హాస్య నటుడిగా మాత్రమే కాదు.. రచయిత, సంగీతకారుడు, దర్శకుడు కూడా. తన సినిమాలను అన్ని రకాలుగానూ అద్భుతంగా తీర్చిదిద్దారు. నల్ల మీసం, బ్యాగీ పాయింట్, టైట్ కోటు, పెద్ద బూట్లు, చిన్న గుండ్రని టోపీ‌తో కాళ్లీడ్చుకుంటూ నడిచే చాప్లిన్ పాత్ర.. ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా పలకకుండా కోట్లాది మంది ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు. అప్పుడప్పుడూ కొన్ని కన్నీళ్లు కూడా పెట్టించారు.

మూకీ సినిమాలకు మాటలు వచ్చినపుడు.. ఈ మౌన నటుడు తను చెప్పాల్సింది చాలా ఉందని చూపించారు..

తన తొలి టాకీ సినిమా ‘‘ది గ్రేట్ డిక్టేటర్’’లో చిట్టచివరన చేసిన ఆయన ప్రసంగం.. అద్భుతమైనది. ప్రజాస్వామ్యాన్ని సమర్థించే ప్రగతిశీల ప్రసంగమది.

అయితే అడాల్ఫ్ హిట్లర్ పాలనలోని జర్మనీ, బెనిటో ముస్సోలిని పాలనలోని ఇటలీ, ఫ్రాన్సిస్కో ఫ్రాంకో పాలనలోని స్పెయిన్‌లలో ఆ ప్రసంగం వినిపించలేదు. ఎందుకంటే వారు ముగ్గురూ ఆ సినిమాను నిషేధించారు. చార్లిన్ తన లక్ష్యాన్ని గురిచూసి కొట్టారనటానికి ఆ నిషేధమే నిదర్శనం.

చాప్లిన్ జీవితంలో వివాదాస్పద అంశాలూ ఉన్నాయి. ఒక నాజీ నాయకుడి గురించి కామెడీ చేయటం ఆ వివాదాల్లో ఒకటి. అయితే.. హిట్లర్‌ ను నవ్వులపాలు చేయటం అవసరమని, అందుకే ఆ కామెడీ చేయాలని తాను నిశ్చయించుకున్నానని చాప్లిన్ ఆ తర్వాత ఒక సందర్భంలో రాశారు. చాప్లిన్ వ్యక్తిగత జీవితం కొన్నిసార్లు వార్తా పత్రికల్లో సంచలనాలుగా మారినప్పటికీ.. రాజకీయ అంశాలు ఆయనను సమస్యల్లోకి నెట్టాయి.

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో.. హిట్లర్‌ను అణచివేయటానికి పశ్చిమ దేశాలు సోవియట్ రష్యాతో కలిసి అతడి మీద రెండో యుద్ధ రంగం ప్రారంభించాలంటూ చాప్లిన్ చేసిన ప్రసంగాలు చాలా మంది సంప్రదాయవాదులకు కోపం తెప్పించాయి.. ఆ తర్వాత ప్రచ్ఛన్న యుద్ధం మొదలయ్యాక చాలా మంది ప్రముఖ కళాకారులతో చాప్లిన్‌కు గల స్నేహాల కారణంగా.. ఆయనను కమ్యూనిస్టు సానుభూతిపరుడిగా భావించిన అమెరికా అధికారులు ఆగ్రహించారు.

బ్రిటిష్ పౌరుడైన చాప్లిన్‌ ను చివరికి 1952లో అమెరికా దేశం నుంచి దాదాపుగా బహిష్కరించారు. ఆ తర్వాత దాదాపు 20 ఏళ్లకు.. ‘20వ శతాబ్దపు సినిమాను ఒక కళగా మలచటంలో చాప్లిన్ కృషి అమూల్యమ’ని కీర్తిస్తూ అమెరికాకు చెందిన అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆయనకు ఆస్కార్ అవార్డు ఇచ్చింది. కానీ.. 1952లో అమెరికా నుంచి ఇంగ్లండ్ వెళ్లేందుకు ఓడ ఎక్కిన చాప్లిన్‌కు.. ఆయన మీద ‘రాజకీయ ధోరణి, నైతిక పతనం’ అభియోగాలు ఉన్నాయని, వాటికి సమాధానం చెప్పటానికి సిద్ధంగా ఉంటేనే తిరిగి అమెరికాలోకి అనుమతిస్తామని అమెరికా ఇమిగ్రేషన్ విభాగం చాప్లిన్ కు చెప్పింది.

అమెరికా అధికారుల వేధింపులతో విసిగివేశారని చాప్లిన్ స్విట్జర్లాండ్‌ కు మకాం మార్చారు. అక్కడే ఆయన 88 ఏళ్ల వయసులో చనిపోయారు. తన కుటుంబం సంప్రదాయబద్ధమైన క్రిస్మస్ వేడుకలను ప్రారంభించడానికి కొన్ని గంటల ముందు ఆయన కన్నుమూశారు. చాప్లిన్ మరణానికి కారణం వృద్ధాప్యమని వైద్యులు చెప్పారు. ఆ సమయంలో ఆయన నాలుగో భార్య ఊనా, 11 మంది పిల్లల్లో నలుగురు చాప్లిన్‌తోనే ఉన్నారు.

చాప్లిన్ సినీ జీవితం 1914లో ప్రారంభమై, 1967లో ముగిసింది. 81 సినిమాలు రూపొందించారు. నటనా జీవితానికి ముగింపు చెప్పిన పదేళ్లకు ఆయన కన్నుమూశారు. చాప్లిన్ చనిపోయిన రెండు రోజుల తర్వాత లేక్ జెనెవా కొండల మీద ఖననం చేశారు.

కానీ చాప్లిన్ కథ అక్కడితో ముగియలేదు. ఆయన చనిపోయిన కొన్ని నెలల తర్వాత 1978 మార్చిలో ఇద్దరు దొంగలు చార్లీ చాప్లిన్ శవపేటికను వెలికి తీసి దొంగిలించారు. చాప్లిన్ శవ పేటికను తిరిగి ఇవ్వాలంటే 4 లక్షల పౌండ్లు – నేటి విలువ ప్రకారం 23.5 లక్షల డాలర్లు చెల్లించాలని బెదిరించారు.

చాప్లిన్ మమరణించిన తర్వాత ఆయన భార్యకు 1.2 కోట్ల పౌండ్లు వారసత్వ ఆస్తిగా అందాయి. దొంగలు డిమాండ్ చేసిన డబ్బు చెల్లించటానికి ఆమె నిరాకరించారు. డబ్బులు ఇవ్వకపోతే ఆమె పిల్లలు ఇద్దరికి హాని చేస్తామని దొంగలు ఆ తర్వాత ఫోన్ కాల్స్‌లో బెదిరించారు.

చాప్లిన్ శవపేటిక విషయంలో దొంగల బెదిరింపుల గురించి ఆ కుటుంబం బయటకు చెప్పలేదు. అయినప్పటికీ, శవపేటిక అదృశ్యంపై వదంతులు వ్యాపించాయి. చాప్లిన్ యూదుడని, కాబట్టి ఆయన శవాన్ని బయటికి తీసి యూదుల స్మశానంలో ఖననం చేశారని ‘హాలీవుడ్’ పత్రిక ఒక ఊహాజనిత కథనం రాసింది.

మరోవైపు… స్విస్ పోలీసులు 200 టెలిఫోన్ కియోస్క్‌ల మీద నిఘా పెట్టారు. చాప్లిన్ టెలిఫోన్‌ను కూడా ట్యాప్ చేశారు.

ఆ తర్వాత ఐదు వారాలకు, చాప్లిన్ శవపేటికను కిడ్నాప్ చేసిన వారిని గుర్తించిన పోలీసులు, వారిని అరెస్ట్ చేశారు.లేక్ జెనెవాలోని ఒక మొక్కజొన్న చేనులో కిడ్నాపర్లు పాతిపెట్టిన శవపేటికను పోలీసులు గుర్తించారు. చాప్లిన్ శవాన్ని దొంగలించిన ఇద్దరి వ్యక్తులపై కేసు నమోదు చనిపోయిన వ్యక్తి ఆత్మ శాంతికి భంగం కలిగించాలని చూసిన ఇద్దరి వ్యక్తులపై కేసు దాఖలు చేసినట్టు జెనెవా పోలీసు చీఫ్ సూపరిటెండెంట్ గాబ్రియల్ సెట్టౌ చెప్పారు.

చాప్లిన్ మరణించిన ఏడాది తర్వాత, డిసెంబర్ 11, 1978లో జరిగిన విచారణలో, స్విస్ కోర్టు ముందు శవ పేటికను దొంగలించినట్టు పోలాండ్ శరణార్థి 24 ఏళ్ల రోమన్ వార్దాస్ ఒప్పుకున్నాడు. శవాన్ని ఖననం చేసిన ప్రదేశం నుంచి వెలికితీసి, ఆ హాస్యనటుడి కుటుంబం నుంచి డబ్బు రాబట్టాలని చూసినట్టు తెలిపాడు.

ఆటో మెకానిక్ రోమన్ వార్దాస్, తనకు ఉద్యోగం రాకపోవడంతో ఈ పని చేయాల్సి వచ్చిందని తెలిపాడు. ఇందుకోసం 38 ఏళ్ల వయసున్న బల్గేరియా స్నేహితుడు గాంట్చో గనేవ్ సాయం కోరినట్లు చెప్పాడు.

ఇటలీలో ఇలాంటి కేసుకు సంబంధించిన న్యూస్‌ను ఒక వార్తాపత్రికలో చదవడం ద్వారా తన కష్టాల నుంచి బయటపడేందుకు ఈ పని చేయాల్సి వచ్చిందని చెప్పాడు. ‘‘నేను చార్లి చాప్లిన్ శవాన్ని దాయాలనుకున్నాను. ఇలా దాయడం ద్వారా నా సమస్యలన్నింటి నుంచి బయటపడాలనుకున్నాను’’ అని వెవీ డిస్ట్రిక్ కోర్టుకు తెలిపాడు. శవపేటికను తీయడంలో నేనేమీ ఆందోళన చెందలేదు’’ అని అతను అన్నాడు.

‘‘శవపేటికను ఎత్తడంలో నాకేమీ ఇబ్బంది అనిపించలేదు. నేనెక్కడి నుంచి వచ్చాను అన్నదానికి మరణానికి సంబంధం లేదు’’ అని వార్దాస్ స్నేహితుడు కోర్టుకు తెలిపాడు. వార్దాస్‌కు ఆ రోజు రాత్రి సాయం చేసిన తర్వాత.. ఇక ఆ విషయంలో తానేమీ జోక్యం చేసుకోలేదని చెప్పాడు.

ఈ కేసులో వార్దాస్‌కు నాలుగున్నరేళ్ల జైలు శిక్ష పడగా.. అతడి స్నేహితుడికి 18 నెలల శిక్ష పడింది. చాప్లిన్ శవాన్ని మొదట అంత్యక్రియలు నిర్వహించిన ప్రదేశంలోనే తిరిగి ఖననం చేశారు. అయితే ఈసారి ఎలాంటి దొంగతనానికి వీలు కాకుండా.. కాంక్రీట్‌తో ఆయన సమాధిని నిర్మించారు.

చాప్లిన్ సినీ జీవితం 1914లో ప్రారంభమై, 1967లో ముగిసింది. 81 సినిమాలు రూపొందించారు. నటనా జీవితానికి ముగింపు చెప్పిన పదేళ్లకు ఆయన కన్నుమూశారు. చార్లిచాప్లిన్ సమాధిని తవ్వి దొంగిలించిన ఘటన అప్పట్లో కలకలం రేపింది..

Must Read

spot_img