Homeఅంతర్జాతీయంఅటు మార్స్, ఇటు చందమామ.. రెండింటిపై ఫోకస్ !!

అటు మార్స్, ఇటు చందమామ.. రెండింటిపై ఫోకస్ !!

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష కార్యక్రమాలన్నీ నెమ్మదించాయంటే అతిశయోక్తి కాదు. అన్ని దేశాలలో ప్రతిపాదిత యాత్రలు రాకెట్ ప్రయోగాలు ఆలస్యమయ్యాయి. ఈ నేపథ్యంలో 2023 సంవత్సరంలో మాత్రం లెక్కకు మించిన అంతరిక్ష ప్రయోగాలు జరగబోతున్నాయి. కరోనా తగ్గు ముఖం పట్టడంతో పెండింగ్ ప్రయోగాలు పూర్తి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి…

ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మైండ్ బ్లోయింగ్ అంతరిక్ష ప్రయోగాలు జరగనున్నాయి. కరోనా కారణంగా రెండేళ్లు ఆలస్యమవడంతో అన్ని దేశాలకూ 2023 అత్యంత కీలకమైందిగా మారింది. ఈ సంవత్సరం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈసా, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో కీలక ప్రయోగాలు చేయబోతున్నాయి. చందమామ, శుక్రగ్రహంపై పరిశోధనతో పాటు… ఓ గ్రహశకలానికి సంబంధించిన ప్రయోగం కూడా ఈ సంవత్సరంలో జరగబోతున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంవత్సరం మొదటి మూడు నెలల్లో.. నాసా.. తన మొదటి కమర్షియల్ స్పేస్ మిషన్‌ను చందమామ చెంతకు పంపబోతోంది. దీని పేరు పెరిగ్రిన్ మిషన్ వన్.. ఇందులో భాగంగా… రాకెట్ కొన్ని సైన్స్ పరికరాలతోపాటూ… ఐరిస్ రోవర్ ను చందమామపై దింపనుంది.

ఇది మొట్ట మొదటిసారిగా ఓ అమెరికా విద్యార్థి తయారుచేసిన, చందమామపై దిగబోతున్న రోవర్. నాసా సెప్టెంబర్‌లో ఈ మిషన్ చేపట్టే అవకాశం ఉంది. 2016లో నాసా ఓ స్పేస్‌క్రాఫ్ట్‌ని బెన్ను గ్రహశకలం చెంతకు పంపింది. అది గ్రహశకలంపై మట్టిని సేకరించింది. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో ఈ స్పేస్‌క్రాఫ్ట్ భూమిని చేరుకోనుంది. అది సేకరించిన మట్టిని పరిశీలించడం ద్వారా సౌర వ్యవస్థ ఎలా ఏర్పడిందో తెలిసే వీలు ఉంటుందని నమ్ముతున్నారు శాస్త్రవేత్తలు. ఇది నాసా అక్టోబర్‌లో చేపట్టబోయే ప్రాజెక్ట్. ఇందులో సైషీ మిషన్… సైషీ 16 గ్రహశకలాన్ని పరిశీలించనుంది. సాధారణంగా గ్రహశకలాలు.. రాళ్లు, మంచుతో తయారవుతాయి. సైషీ మాత్రం లోహాలతో తయారైనట్లు భావిస్తున్నారు. దీన్ని పరిశీలించడం ద్వారా.. భూమి కేంద్రంలో ఎలా ఉంటుందో, విశ్వ ఆవిర్భావ సమయంలో ఏం జరిగిందో తెలుస్తుంది.

ఈ సంవత్సరం జూన్‌లో భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చంద్రయాన్-3 ప్రయోగం చేపట్టనుంది. చంద్రయాన్-2కి ఇది అదనపు ప్రయోగం. ఇందులో ఒక ల్యాండర్ చందమామపై దిగుతుంది. అందులోంచీ వచ్చే రోవర్.. చందమామపై కలియ తిరుగుతుంది. తద్వారా చందమామ ఉపరితల రియల్ ఫొటోలను ఇస్రో సేకరించగలుగుతుంది. పైగా గతంలో ఎవరూ ద్రుష్టి పెట్టని అనేక అంశాలపై ఇస్రో ద్రుష్టి కేంద్రీకరించనుంది. చంద్రయాన్2 ప్రయోగం 95శాతం సక్సెస్ సాధించింది. అయితే చంద్రుడి ఉపరితలంపై ల్యాండింగ్ చేసే సమయంలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా అది కొద్ద అడుగుల ఎత్తు నుంచి క్రాష్ అయిందని చెబుతున్నారు. ఇప్పుడు ప్రయోగించబోయే చంద్రయాన్ 3 అలాంటి సమస్యలు లేకుండా ల్యాండింగ్ చేయనుంది.

మొదటిసారిగా ప్రైవేట్ సంస్థ అయిన రాకెట్ ల్యాబ్స్.. ఈ సంవత్సరం మేలో నిర్వహించబోయే ప్రయోగం కూడా అనేక ప్రత్యేకతలు సంతరించుకుంది. ఇందులో… ఓ మిషన్.. శుక్రగ్రహంని చేరుతుంది. అక్కడ మనుషులు జీవించేందుకు వీలయ్యే వాయువులు… మేఘాలు, వాతావరణంలో ఉన్నాయో లేదో తెలుసుకుంటుంది. ఇది చాలా కీలకమైన ప్రయోగంగా చెబుతున్నారు. ఒకవంక ప్రైవేటు సంస్థలు అంతరిక్ష ప్రయోగాలలో రాణించడం ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ రాకెట్ లాంచింగ్ తో మొదలైంది. ఇప్పటికే నాసా తన రాకెట్ ప్రయోగాల కాంట్రాక్టును స్పేస్ ఎక్స్ సంస్థతో కుదుర్చుకుంది. చాలా వరకు రాకెట్ ప్రయోగాలన్నీ ఇప్పుడు స్పేస్ ఎక్స్ తోనే జరుపుతోంది. ఫాల్కన్ నైన్ రీయూజబుల్ రాకెట్ ద్వారా అతి తక్కువ ఖర్చుతో సురక్షతంగా రాకెట్లను లాంచ్ చేస్తోంది.

జుపిటర్ మీద ప్రయోగాలను జరిపేందుకు జ్యూస్ అనే కాన్సెప్ట్ తో రెడీ అవుతోంది ఈసా. ఇది ఈ సంవత్సరం ఏప్రిల్‌లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చేపట్టే ప్రయోగంగా చెబుతున్నారు. ఇందులో.. జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్స్‌ప్లోరర్ మిషన్.. గురుగ్రహం చెంతకు వెళ్లడం లక్ష్యంగా పెట్టుకున్నారు. జుపిటర్ గ్రహం చుట్టూ తిరిగే.. మంచుతో ఉన్న గనీమేడ్, కాల్లిస్టో, యూరోపో ఉపగ్రహాలను ఈ స్పేస్ క్రాఫ్ట్ మూడేళ్లపాటు పరిశీలిస్తుంది. 2015-2025 మధ్య ESA చేపట్టే అతి పెద్ద ప్రాజెక్ట్ ఇదేనని చెబుతున్నారు విశ్లేషకులు.గనీమేడ్ ఉపగ్రహంపై అచ్చం భూమిపై ఉన్నట్టు అతిపెద్ద సముద్రాలు ఉన్నాయని చెబుతున్నారు. నీరు ఉంది కాబట్టి జీవం కూడా అక్కడ అభివ్రుద్ది చెంది ఉంటుందని ఊహిస్తున్నారు. ఈ విషయాలన్నింటినీ ఈ స్పేస్ క్రాఫ్ట్ కవర్ చేయనుంది.

Must Read

spot_img