Homeఆంధ్ర ప్రదేశ్సరైన టైమ్ లో సరైన నిర్ణయం అంటూ కాలయాపన చేసే చంద్రబాబు..

సరైన టైమ్ లో సరైన నిర్ణయం అంటూ కాలయాపన చేసే చంద్రబాబు..

  • వైసీపీ అసంతృప్త నేతలపై టీడీపీ వ్యూహం మారిందా..?
  • వారి కోసం సొంతనేతల్ని దూరం చేసుకోకూడదని నిర్ణయించుకుందా..?
  • కోటంరెడ్డి విషయంలో బాబు నిర్ణయమే ఫైనల్ గా మారిందా..?
  • తమ్ముళ్ల వ్యతిరేకత వేళ బాబు ఏం చేయనున్నారన్నదే ఆసక్తికరంగా మారింది.

వైసీపీలో జరుగుతున్న పరిణామాలతో టీడీపీ అలెర్ట్ అయ్యిందా? తొలుత సంబరపడినా.. తరువాత జాగ్రత్తపడిందా? కోటంరెడ్డి, ఆనం విషయంలో స్పీడు తగ్గించడానికి అదే కారణమా? వైసీపీ అసమ్మతి ఎమ్మెల్యేలను నెత్తిన ఎక్కించుకుంటే.. టీడీపీలో నేతలను కోల్పోయే అవకాశముందా? అందుకే చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు వ్యూహాత్మకంగా పాటిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్నపరిణామాలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. వచ్చే ఎన్నికలకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్న జగన్ ధిక్కార స్వరాలపై దృష్టిపెట్టారు.

ఒక్క ఆనం, కోటంరెడ్డే కాదు.. అటువంటి వారు ఓ పాతిక మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు గుర్తించారు. వారికి ఎన్నికలు సమీపించేసరికి పక్కకుతప్పిస్తారన్న టాక్ ఉంది. అయితే అధికార వైసీపీలో విభేదాలు చూసి టీడీపీ సంబరపడింది. అక్కడ వారికి చుక్కెదురు అయితే ఇక్కడికే వస్తారన్నధీమా కనిపించింది. కానీ వారు వచ్చేలోపే అభద్రతా భావంతో టీడీపీ నుంచి నేతలు దూరమవుతున్నారు. కైకలూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్ చార్జి జయమంగళం వెంకటరమణ, మంగళగిరి నాయకులు నేరుగా సీఎం జగన్ ను కలిశారు. దీంతో చంద్రబాబు, అండ్ కోకు తత్వం బోధపడింది.

తాము ఒక వ్యూహంతో అడుగు వేస్తే ప్రత్యర్థులు కూడా అంతే వ్యూహంతో అడుగులు వేస్తారని భావించి వ్యూహాత్మకంగా సైలెంట్ అవుతున్నారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామక్రిష్ణంరాజు విషయంలో చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు చూపిన సానుభూతి కోటంరెడ్డి ఎపిసోడ్ లో చూపించలేదు. కోటంరెడ్డికి అన్యాయం జరుగుతోందని ఆరోపించడం లేదు. కేవలం ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసి విడిచిపెట్టేశారు.

అంతకంటే ముందుకు వెళితే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు ప్రత్యర్థులుగా ఉన్న టీడీపీ నాయకులు, తటస్థ నేతలను వైసీపీ తన వైపు లాక్కునే అవకాశం ఉంది. అందుకే జగన్ కూడా వ్యూహాత్మకంగా ముందుగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన ధిక్కారస్వరాలపైనే దృష్టిపెట్టారు. అక్కడ ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని చూసుకున్న తరువాతే అసంతృప్త ఎమ్మెల్యేలు బయటపడేలా చూసుకున్నారు.

  • మిగతా సామాజికవర్గాల ఎమ్మెల్యేల విషయంలో మాత్రం జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు..

టీడీపీకి, అటు ధిక్కార ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమీపంలో వారిని అచేతనం చేసి ..వారి స్థానంలో కొత్తవారిని దించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇది తెలిసే చంద్రబాబు కూడా ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా సైలెంట్ గా ఉన్నారు. ఎన్నికల సమయానికి వైసీపీకి దూరమయ్యే వారు వస్తారని.. అలాగని ముందుగానే వారి గురించి మాట్లాడితే పార్టీలో ఉన్న నేతలు బయటకు వెళ్లే అవకాశముందని భావిస్తున్నారు. ఎన్నికల దాకా మౌనాన్ని ఆశ్రయిస్తేనే ఫలితం దక్కుతుందన్న భావనతో చంద్రబాబు ఉన్నారు.

ఎమ్మెల్యే కోటంరెడ్డి రాజకీయ అడుగులు ఎటు. టీడీపీలోకి ఖాయమని చెబుతున్న వేళ కొత్త ట్విస్టులు తెర మీదకు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కోటంరెడ్డి టీడీపీ నుంచే పోటీ చేస్తారని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం తరువాతనే కోటంరెడ్డి సొంత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నుంచి నెల్లూరు రూరల్ అభ్యర్ధిగా ఎంపీ ఆదాల వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని పార్టీ ప్రకటించింది. కోటంరెడ్డి ఎంట్రీ పై టీడీపీ నుంచి భిన్నవాదన వినిపిస్తోంది.

దీంతో కోటంరెడ్డి టీడీపీలోనే చేరుతారా..చంద్రబాబు సీటు ఇస్తారా..తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో అందుతున్న సంకేతాలేంటి.. అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే, వచ్చే ఎన్నికల్లో తాను టీడీపీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి స్పష్టం చేసారు. చంద్రబాబు నిర్ణయం ఫైనల్ అని తేల్చి చెప్పారు. సొంత ప్రభుత్వం పైన ఆరోపణలు చేయటానికి ముందే చంద్రబాబు నుంచి సీటు పైన కోటంరెడ్డి హామీ పొందారని ప్రచారం సాగింది.

దీంతో..వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆదాల.. టీడీపీ నుంచి కోటంరెడ్డి నెల్లూరు రూరల్ బరిలో ఉంటారని అందరూ భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు టీడీపీ నేతలు మాత్రం ఎక్కడా కోటంరెడ్డి పార్టీలోకి రావటం పైన సానుకూలంగా స్పందించలేదు. సీనియర్ నేత సోమిరెడ్డి లాంటి వారు ఎవరికి వారు సీట్ల గురించి ప్రకటన చేసుకోవటం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేసారు. నెల్లూరులోని ఇద్దరు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం.. కోటంరెడ్డి టీడీపీ నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం ఉన్నా..స్థానికంగా మాత్రం ఆ ఇద్దరికీ టీడీపీ నేతల నుంచి మద్దతు లభించటం లేదు.

  • కోటంరెడ్డి టీడీపీలో చేరికపై టీడీపీ నెల్లూరు పార్టీమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ కీలక వ్యాఖ్యలు చేసారు..

టీడీపీ నేతలపై దాడులు చేసినవారు, టీడీపీ నేతలపైనే కేసులు పెట్టినవారు, బెట్టింగ్ బాబులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని బెదిరించేవారు.. ఇలాంటి గంజాయి మొక్కలు టీడీపీలోకి అవసరం లేదని పరోక్షంగా కోటంరెడ్డిని కామెంట్ చేశారు అబ్దుల్ అజీజ్. కోటంరెడ్డి టీడీపీలో చేరికపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. తాను చంద్రబాబు..లోకేష్ తో చర్చలు చేసిన సమయంలో ఆ ప్రస్తావన రాలేదన్నారు. కోటంరెడ్డిని పార్టీలోకీ తీసుకోవాలని భావిస్తే జిల్లా నాయకత్వంతో చర్చించిన తరువాతనే నిర్ణయం ఉంటుందని చెప్పారు.

జిల్లా కు చెందిన నేతలు..కార్యకర్తలు ఈ విషయం పైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. దీంతో..కోటంరెడ్డి వైసీపీని వీడి పార్టీలో చేరినా.. చంద్రబాబు ఆదేశించినా.. క్షేత్ర స్థాయిలో టీడీపీ నేతలు – కేడర్ ఎంత వరకు సహకారం అందిస్తుందనేది ఇప్పుడు కొత్త సందేహాలకు తావిస్తోంది. అదే సమయంలో కోటంరెడ్డి టీడీపీలోకి ఎంట్రీ అధికారికం అయితే.. ఇప్పటి వరకు కోటంరెడ్డి పైన రాజకీయ పోరాటం చేసిన టీడీపీ నేతలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది మరో చర్చనీయాంశంగా మారింది.

కోటంరెడ్డికి టీడీపీలో ప్రాధాన్యత దక్కుతుందని అనుచరులు భావిస్తున్నారు. వైసీపీలో ఇప్పటి వరకు కోటంరెడ్డి వెనుక ఫాలో అయిన వారు ఎన్నికల సమయానికి ఎంత మంది ఆయనతో నిలుస్తారేది స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం వైసీపీ నుంచి ప్రజాప్రతినిధులుగా గెలిచిన వారు మెజార్టీ సంఖ్యలో పార్టీకే మద్దతు ప్రకటిస్తున్నారు. కోటంరెడ్డి టీడీపీలో చేరితే..కొద్ది రోజుల క్రితం వరకు ఆయనకు వ్యతిరేకంగా పని చేసిన టీడీపీ శ్రేణులు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వటం సులువైన విషయం కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

కోటంరెడ్డి ఎపిసోడ్ తర్వాత, నెల్లూరు జిల్లా టీడీపీలో కలవరం మొదలైంది. కోటంరెడ్డి రూరల్ సీటు ఖాయమంటున్నారు, రామనారాయణ రెడ్డి మరో సీటుకి పోటీగా వస్తున్నారు, ఈ దశలో ఇప్పటి వరకు పార్టీని నమ్ముకుని, టికెట్లపై ఆశలు పెట్టుకున్నవారు ఏం కావాలనే ప్రశ్నలు వినపడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీ నుంచి వచ్చిన భరోసాతో వైసీపీని దాదాపుగా వీడిన ఎమ్మెల్యే కోటంరెడ్డి .. టీడీపీలో ఎదురవుతున్న పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గం సిద్దం చేసుకుంటున్నారా అనే చర్చ కూడా వినిపిస్తోంది. అయితే, చంద్రబాబు పైన కోటంరెడ్డి పూర్తి భరోసాతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. దీంతో..నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తిగా మారుతోంది.

మరి సరైన టైమ్ లో సరైన నిర్ణయం అంటూ కాలయాపన చేసే చంద్రబాబు కోటంరెడ్డి విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారన్నదే ఆసక్తికరంగా మారింది.

Must Read

spot_img