HomePoliticsఎవరి మద్ధతు కోసం చంద్రబాబు ఇంతగా ప్రయత్నిస్తున్నారు..?

ఎవరి మద్ధతు కోసం చంద్రబాబు ఇంతగా ప్రయత్నిస్తున్నారు..?

తెలంగాణలో మద్ధతిచ్చి, ఏపీలో మద్ధతు పొందాలన్న వ్యూహంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారట. ఇంతకీ ఎవరి మద్ధతు కోసం బాబు ఇంతగా ప్రయత్నిస్తున్నారు..? ఇది ఏమేరకు కలిసిరానుంది అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సంక్షోభాలను, సవాళ్లను విజయంగా మలుచుకున్న నేత చంద్రబాబు. ఇప్పుడు ఏపీలో అధికారంలోకి రావడం ఆయన ముందున్న కర్తవ్యం. అందుకు ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. ఏడు పదుల వయసులో కూడా శక్తికి మించి కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏ చిన్న అవకాశాన్ని జారవిడుచుకోవడానికి ఇష్టపడడం లేదు. ఏపీలో అధికారంలోకి రావడానికి ఇప్పుడు తెలంగాణలో అడుగుపెట్టబోతున్నారన్న వార్తలు వస్తున్నాయి.

అందుకు అనుగుణంగానే ఆయన అడుగులు పడుతున్నాయి. తెలంగాణలో టీడీపీని రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీ ప్రభావముండే ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ లో టీడీపీని బలోపేతం చేసే పనిలో పడ్డారన్న టాక్ నడుస్తోంది. ఖమ్మంలో భారీ బహిరంగ సభతో తెలంగాణలో టీడీపీ పునరాగమనానికి గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

టీఆర్ఎస్ లో ఉన్న మాజీ మంత్రిని టీడీపీలోకి రప్పించడం ద్వారా పాతకాపులను దగ్గరకు చేర్చుకునేందుకు భారీ స్కెచ్ వేశారు. ఏపీలో వచ్చే ఎన్నికలు చంద్రబాబుతో పాటు టీడీపీకి జీవన్మరణ సమస్య. పార్టీని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి తేకుంటే జరిగే మూల్యం చంద్రబాబుకు తెలుసు. అందుకే బలమైన ప్రత్యర్థిని ఢీకొట్టేందుకు ఆయన పొత్తులకు ముందే తలుపులు తెరిచారు. జనసేనతో పాటు బీజేపీని కలుపుకొని పోవాలని చూస్తున్నారు. కానీ బీజేపీ అంతరంగం ఆయనకు అంతుపట్టడం లేదు.

చిక్కినట్టే చిక్కి బీజేపీ తప్పించుకుంటోంది. గత అనుభవాల దృష్ట్యా చంద్రబాబుతో కలిసేందుకు బీజేపీ కేంద్ర నాయకత్వం అంతగా ఆసక్తి చూపడం లేదన్న వార్తలు వస్తున్నాయి. అందుకే బీజేపీ తన స్నేహాన్ని అందిపుచ్చుకునేందుకు ఏ అవకాశాన్ని చంద్రబాబు జారవిడుచుకోకూడదని భావిస్తున్నారు. అందుకే తెలంగాణలో రీ ఎంట్రీ ఇచ్చి బీజేపీకి దగ్గరవ్వాలని భావిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఎన్ని చేయాలో అన్నీ చేస్తోంది. కొంతవరకూ వర్కవుట్ అయినా.. తెలంగాణలో కొంత పార్టులోనే తన ప్రభావం చూపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపుకు ఈ బలం సరిపోదు. మరోవైపు టీఆర్ఎస్ భారతీయ రాష్ట్రసమితిగా మారి జాతీయ పార్టీగా రూపాంతరం చెందింది. తద్వారా ఇంతకాలం ప్రాంతీయ వాదంతో నడిచిన రాజకీయం ఇక చెల్లని పరిస్థితి. అందుకే అదునుచూసి చంద్రబాబు తెలంగాణలో రీఎంట్రీ ఇస్తున్నారు. గ్రౌండ్ లెవల్ లో ఉన్న జవసత్వాలకు నీరుపోయాలని భావిస్తున్నారు.

సెలెక్టివ్ జిల్లాలను ఎంపిక చేసుకొని రాజకీయం మొదలు పెట్టాలని భావిస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ మాజీ మంత్రి, పూర్వాశ్రమం టీడీపీలో యాక్టివ్ గా పనిచేసిన నేతను తిరిగి పార్టీలోకి చేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ప్రాంతీయ వాదంతో టీడీపీని తెలంగాణలో నిర్వీర్యం చేసిన నేపథ్యంలో చాలామంది నేతలు తెలుగుదేశం కు దూరమయ్యారు.

ఇతర పార్టీల్లో ఉన్నారు. వారందర్నీ తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు చంద్రబాబు పావులు కదపడం ప్రారంభించారు. తెలంగాణలో ఎన్నికలకు మరో 10 మాసాలే ఉన్న నేపథ్యంలో టీడీపీని యాక్టివ్ చేస్తే బీజేపీని దగ్గర చేర్చుకోవచ్చని భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఏపీ రాజకీయాలను కాస్తా పక్కన పెట్టి తెలంగాణపై ఫోకస్ పెంచారు. ఖమ్మం బహిరంగ సభను గ్రాండ్ సక్సెస్ చేసి తెలంగాణలో టీడీపీ ఇంకా బతికే ఉందని.. బరిలో ఉందని సంకేతాలు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

తెలంగాణ ఎన్నికల నాటికి టీడీపీని బలోపేతం చేసి కనీసం 30 సీట్లలో ప్రబలమైన శక్తిగా మార్చితే బీజేపీ తన దరికి వస్తుందని భావిస్తున్నారు.

ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీకి తప్పనిసరిగా టీడీపీని తన కూటమిలో కలుపుకుంటుంది. ఆ కూటమి కానీ తెలంగాణలో వర్కవుట్ అయితే ఏపీలో కూడా బీజేపీ తన వెంట రాక తప్పని అనివార్య పరిస్థితులు కల్పించాలన్నది చంద్రబాబు వ్యూహం.

అటు గతంలో మాదిరిగా ఆంధ్రా నాయకుల పెత్తనం అన్న మాట భారతీయ రాష్ట్ర సమితిగా మారిన టీఆర్ఎస్ నుంచి వినిపించడానికి వీలులేదు. దీంతో కరెక్ట్ టైం చూసి బాబు తెలంగాణలో రాజకీయాలు మొదలు పెట్టారని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ వైసీపీకి తెరవెనక సాయం చేయబట్టే గెలిచిందనే విషయం టీడీపీ అంతర్గత చర్చల్లో కామన్ గా తేలింది. దీంతో రానున్న ఎన్నికల్లో తమకు మద్దతివ్వమని బీజేపీని అడుగుతున్నారు.

కానీ బీజేపీవైపు నుంచి ఎటువంటి స్పందన ఉండటంలేదు. మరోవైపు ఆ పార్టీకి తెలంగాణ ఎన్నికలు అత్యంత కీలకం. కేసీఆర్ ను ఓడించి అధికారంలోకి రావాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. ఇప్పుడు తెలంగాణలో బీజేపీకి ఈ పార్టీ ఓటు బ్యాంకు అవసరం. ప్రస్తుతం తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఓటుబ్యాంకు 2 శాతంగా ఉంది. దాన్ని 5 నుంచి 7 శాతానికి పెంచాలనే లక్ష్యంతో చంద్రబాబు ఇప్పుడు పనిచేస్తున్నారు.

కార్యకర్తల బలం ఉండటంతో అది పెద్ద కష్టమేమీ కాదని పార్టీ భావిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు గ్రేటర్ హైదరాబాద్ లో గట్టిగా పట్టున్న తెలుగుదేశం ముందుగా ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహిస్తోంది. దానితర్వాత గ్రేటర్ హైదరాబాద్ లో ఒక సభ నిర్వహించనుంది. టీడీపీ ఓటుబ్యాంకు పెరిగితే అంతటి ఓటుబ్యాంకు శాతాన్ని బీజేపీ వదులుకోదు. తెలంగాణలో మద్దతు అడుగుతుంది. అప్పుడు ఇక్కడ అవసరమైన మద్దతు బీజేపీకి ఇస్తూనే ఏపీలో తెరవెనక వైఎస్ జగన్ కు అందుతున్న మద్దతును నిలిపివేసేలా అడుగులు వేస్తోంది.

మరి బాబు వ్యూహం ఏమేరకు కలిసివస్తుందో వేచి చూడాల్సిందే.

Must Read

spot_img