కొలీజియం వ్యవస్థపై దేశంలో రెండు అత్యున్నత శాఖల మధ్య వివాదం తలెత్తుతోంది. న్యాయమూర్తుల నియామకంపై ఏర్పాటైన కొలీజియంపై కేంద్రం, సుప్రీంకోర్టు మధ్య .. కనపడని వైరం నడుస్తోంది. తాజాగా ఈ అంశంపై సుప్రీం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.
తాజా పరిణామాలతో ఇప్పటివరకు కనపడని వైరం.. ఇప్పుడు బయటపడిందన్న వాదనలు వెల్లువెత్తుతున్నాయి. అసలు .. ఏ అంశంపై వివాదమన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
కేంద్ర పెద్దల వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు వ్యాఖ్యానాలు ..
న్యాయమూర్తుల నియామకం, బదిలీకి సంబంధించిన కొలీజయం వ్యవస్థ అనేది భారతదేశం రూపొందించిన చట్టం. దాన్ని ఎవరైనా సరే తప్పనిసరిగా
పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టంగా చెబుతోంది. పరోక్షంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొలీజియం వ్యవస్థకు సంబంధించి నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి సుప్రీంకోర్టుతో బయటకు కనపడని వైరం నడుస్తోంది. ఇటీవలే న్యాయమూర్తుల బదిలీకి సంబంధించి సిఫార్సులను కేంద్రం ఆమోదించలేదు. కొలీజియం ఈ సిఫార్సులు చేసింది.
అంతేకాకుండా ఉప రాష్ట్రపతి, న్యాయశాఖ మంత్రి కొలీజియంపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన కొలీజియం వ్యవస్థ సిఫార్సు చేసిన పేర్లను ఆమోదించాల్సి ఉంటుంది. కానీ వాటిని ఆమోదించకుండా కేంద్రం తాత్సారం చేస్తోందంటూ సుప్రీంకోర్టులోనే పిటిషన్లు దాఖలమయ్యాయి. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు కొలీజియం వ్యవస్థపై ఎలా వ్యాఖ్యలు చేస్తారంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాంటివారిని నియంత్రించాలని ఆదేశాలు జారీచేసింది.
కేంద్రం తిరిగి సూచించిన పేర్లనే రెండు సందర్భాల్లో కొలీజయం వెనక్కితీసుకుందని, దీనిప్రకారం సుప్రీంకోర్టుకే స్పష్టత లేదన్న అనుమానాలు తలెత్తతున్నాయని అటార్నీ జనరల్ వ్యాఖ్యానించారు. పునరుద్ఘాటించిన పేర్లను తప్పనిసరిగా ఆమోదించాలన్న ధర్మాసనం ఉత్తర్వులను విస్మరించే వీలు లేదంది. కేంద్రం కూడా ఇటీవల 19 పేర్లను తిప్పి పంపింది. చట్టానికి సంబంధించి సుప్రీం న్యాయస్థానమే తుది నిర్ణేత అని, చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉన్నా, అవన్నీ న్యాయస్థానాల్లో సమీక్షకు లోబడి ఉండాల్సిందేనని పేర్కొంది.
దీంతో ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి, సుప్రీంకోర్టుకు బయటకు కనపడని వైరం నడుస్తోందన్నది న్యాయనిపుణుల అభిప్రాయంగా ఉంది. ఈ వైరం ఎటువంటి మలుపులు తిరుగుతుందోనని వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకం విషయలో అనుసరిస్తున్న కొలీజియం వ్యవస్ధపై తాజాగా ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధన్ కర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఇదే కార్యక్రమానికి హాజరైన సీజేఐ డీవై చంద్రచూడ్ ముందే కొలీజియం వ్యవస్ధపై విమర్శలు చేశారు. ప్రజలు ఎన్నుకున్న పార్లమెంట్ నిర్ణయాన్ని కాదనడాన్ని ఎక్కడాచూడలేదన్నారు. దీనిపై సుప్రీంకోర్టు స్పందించింది. హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో జాప్యంపై కేంద్రాన్ని తీవ్రంగా హెచ్చరించిన పది రోజుల తర్వాత.. న్యాయవ్యవస్థ నియామకాల కొలీజియం వ్యవస్థపై వస్తున్న విమర్శలపై సుప్రీంకోర్టు కేంద్రాన్ని నిలదీసింది. కొలీజియం వ్యవస్థ అనేది ఈ భూమి చట్టమని, సమాజంలోని కొన్ని వర్గాలు కొలీజియం వ్యవస్థకు వ్యతిరేకంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేసినంత మాత్రాన దాని అమలు ఆగదని పేర్కొంది.
కొలీజియం వ్యవస్ధలో కొందరు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఈ విషయంలో వారికి తగు సలహా ఇవ్వాలని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణిని ఆదేశించింది. అదే సమయంలో సుప్రీంకోర్టు ఆదేశించే ఏ చట్టం అయినా అందులో భాగస్వాములైన వారందరూ కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఓ చట్టాన్ని రూపొందించే హక్కు పార్లమెంటుకు ఉందని, కానీ దానిని పరిశీలించే అధికారం కోర్టుకు ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఈ కోర్టు నిర్దేశించిన చట్టాన్ని అమలుచేయడం చాలా ముఖ్యమని తెలిపింది. లేకుంటే ప్రజలు సరైనదని భావించే చట్టాన్ని అనుసరిస్తారని సుప్రీం కోర్టు నర్మగర్భ వ్యాఖ్యలు చేసింది.
కొలీజియం వ్యవస్థను అమలు చేయాల్సిందే: సుప్రీం …
అటార్నీ జనరల్ కేసును ప్రభుత్వంతో చర్చిస్తారని పేర్కొంటూ, అత్యున్నత న్యాయవ్యవస్థకు న్యాయమూర్తుల నియామకంలో జాప్యంపై కేసును సుప్రీంకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. సుప్రీం, హైకోర్టుల్లో జడ్జిల నియామకానికి సంబంధించిన కొలీజియం వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తరుణంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
కొలీజియం వ్యవస్థ అనేది ఈ దేశం రూపొందించిన చట్టమని, దీన్ని తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ విషయంలో రెండో అభిప్రాయానికి తావు లేదని కేంద్రానికి సర్వోన్నత న్యాయస్థానం సూటిగా సమాధానం ఇచ్చింది. న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను ఆమోదించడంలో కేంద్రం జాప్యం చేస్తోందంటూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ విక్రమ్‌నాథ్‌ల ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ రాజ్యాంగబద్ధమైన పదవుల్లో పనిచేస్తున్న వారు కొలీజియం వ్యవస్థపై వ్యాఖ్యలు చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాంటి వారిని నియంత్రించాలని అటార్నీ జనరల్(ఏజీ) ఆర్.వెంకటరమణికి సూచించింది.
సుప్రీంకోర్టుకు న్యాయసమీక్ష అధికారం లేదని ప్రభుత్వంలో ముఖ్యంగా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారే చెబుతున్నారు. రేపు రాజ్యాంగ మౌలిక స్వరూపం కూడా రాజ్యాంగంలో లేదనిఅంటారు. కొలీజియం వ్యవస్థకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై మాకు చాలా అభ్యంతరం ఉంది. దీనిపై నియంత్రణ పాటించాలని వారికి సలహా ఇవ్వండని ఏజీకి ధర్మాసనం సూచించింది. కొలీజియం రాజ్యాంగ ధర్మాసనం ఆమోదించిన వ్యవస్థ. కొంత మందో కొన్ని వర్గాలో దీనికి వ్యతిరేకంగా అభిప్రాయాలు వ్యక్తం చేసినంత మాత్రానా అది చట్టం కాకుండా పోదు.
పార్లమెంటులో చేసిన చట్టాలను కూడా సమాజంలో కొన్ని వర్గాలు అంగీకరించవు. అలాగని క్షేత్రస్థాయిలో వాటి అమలును న్యాయస్థానాలు నిలిపివేయాలా? అంటూ ఏజీని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. ఏ చట్టాన్ని పాటించాలి, దేన్ని పాటించకూడదన్న విషయాన్ని సమాజంలోని వ్యక్తులకు విడిచిపెడితే మొత్తం వ్యవస్థే కుప్పకూలిపోతుందని సుప్రీం హెచ్చరించింది. ముందుగా ప్రస్తావించిన పేర్లను రెండు సందర్భాల్లో కొలీజియం వెనక్కితీసుకుందని, దీని ప్రకారం చూస్తే సుప్రీంకోర్టుకే స్పష్టత లేదన్న అనుమానాలు తలెత్తుతున్నాయని ఏజీ చేసిన వ్యాఖ్యలపై ధర్మాసనం మండిపడింది.
అలాంటి అరుదైన సందర్భాలను ఆధారంగా చేసుకొని ప్రస్తావించిన పేర్లను తప్పనిసరిగా ఆమోదించాలన్న రాజ్యాంగధర్మాసనం ఉత్తర్వులను విస్మరించే అధికారం ప్రభుత్వానికి లేదని పేర్కొంది. ఈ విషయంలో సీనియర్ న్యాయ అధికారిగా అటార్నీ జనరల్ తనవంతు పాత్ర తప్పనిసరిగా పోషించాలి. న్యాయపరంగా ఉన్న స్థితిని ప్రభుత్వానికి వివరించాలి. చట్టానికి సంబంధించి సుప్రీంకోర్టే తుది నిర్ణేత. చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంది. కానీ అవన్నీ న్యాయస్థానాల సమీక్షకు లోబడి ఉండాలి. సుప్రీం నిర్దేశించిన చట్టాలను అందరూ అనుసరించాలని ధర్మాసనం కేంద్రానికి గట్టిగానే సమాధానం చెప్పింది.
అలాగే హైకోర్టుల్లో తాత్కాలిక న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కేంద్రం జారీ చేసిన ప్రక్రియ గందరగోళంగా ఉందని దీన్ని మరింత సరళతరం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. కొద్ది రోజులుగా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కొలీజియంపై తరుచూ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్ సైతం ఏకంగా భారత ప్రధాన న్యాయమూర్తి ముందే వ్యతిరేకంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.
దేశంలో న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థల మధ్య కొలీజియం చిచ్చును పెట్టిందన్న వాదనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ సమస్యకు పరిష్కారం చర్చలేనని.. ఇరువర్గాల మధ్య చర్చ సాగితేనే, సమస్య తీరుతుందని విశ్లేషకులు, నిపుణులు సూచిస్తున్నారు.