2023 ప్రథమార్థంలో విడుదలయ్యే బాలీవుడ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలను నమోదు చేస్తాయా? అంటే అవుననే ఆశాభావం వ్యక్తమవుతోంది. 2022 బాలీవుడ్ కి ఏమాత్రం కలిసి రాలేదు. ఒకట్రెండు విజయాలతో సక్సెస్ 2 శాతానికి పడిపోయింది. దీంతో హిందీ పరిశ్రమ అగ్రజులు తీవ్రంగా బెంగ పెట్టుకున్నారు. కనీసం 2023 లో అయినా కంబ్యాక్ సాధ్యమవుతుందా? అంటూ కలతలో ఉన్నారు.
బాలీవుడ్ లో 2023 ప్రథమార్థంలో విడుదలయ్యే భారీ చిత్రాలు సంచలనాలు నమోదు చేస్తాయని భావిస్తున్నారు బాలీవుడ్ మేకర్స్. పఠాన్, షెహజాదా, టైగర్ 3, జవాన్ లాంటి భారీ చిత్రాలు హిట్ అవుతాయని పరిశ్రమకు పూర్వ వైభవం తెస్తాయని అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. గతించిన ఏడాది బాలీవుడ్ కి కలిసిరాకపోయినా…కొత్త సంవత్సరం ఆరంభమే చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది. పలువురు క్రేజీ హీరోలు నటించిన సినిమాలు భారీ లైనప్ తో థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నందున అంతా చాలా ఆశలు పెట్టుకున్నారు.
బాక్సాఫీస్ వద్ద భారీ విజయాల్ని నమోదు చేసి లాభాల్ని కళ్లజూడాలని ఉత్తరాది పంపిణీ వర్గాలు ఆశిస్తున్నాయి. అన్నివైపుల నుంచి విమర్శకులకు సమాధానమిచ్చేలా బాలీవుడ్ తనను తాను పునరుద్ధరించుకోగలదనే ఆశ ఇప్పటికీ ఇంకా సజీవంగా ఉంది. సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న పఠాన్` లాంటి భారీ సినిమాతో 2023 ఘనంగా ఆరంభం కానుంది. కింగ్ ఖాన్ షారుఖ్ – దీపికా పదుకొణె – జాన్ అబ్రహం నటించిన ఈ చిత్రం 25 జనవరి 2023న థియేటర్లలోకి రాబోతోంది. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత షారుఖ్ ఖాన్ పునరాగమనంపై క్యూరియాసిటీ నెలకొంది. అతడి అభిమానులలో గొప్ప ఉత్సాహం నెలకొంది.
యువహీరో కార్తిక్ ఆర్యన్ చిత్రం షెహజాదా 2023 ఫిబ్రవరి 10న విడుదల కానుంది. ఇది టాలీవుడ్ బ్లాక్ బస్టర్ అలవైకుంఠపురములో చిత్రానికి రీమేక్. కృతి సనోన్ హిందీలో కథానాయిక. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. కార్తీక్ ప్రస్తుతం బాక్సాఫీస్ కింగ్ గా వెలిగిపోతున్నాడు. భూల్ భులయా 2తో బ్లాక్ బస్టర్ కొట్టి ఫ్రెడ్డీతోను మెప్పించాడు. అందుకే ఇదే వరుసలో షెహజాదా
హిట్ అవుతుందని భావిస్తున్నారు. ప్రథమార్థంలో షారూక్ ఖాన్- రణవీర్ సింగ్- కార్తీక్ ఆర్యన్ లాంటి టాప్ హీరోల సినిమాలు భారీగా రిలీజవుతుండగా.. ఇంతమందితో పోటీపడుతూ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వార్ లోకి దూసుకొస్తున్నాడు.