కేంద్ర బడ్జెట్ లో ఆదాయపన్ను నిర్ణయం .. వేతనజీవులకు ఊరట కలిగిస్తోంది. అయితే ఇది ఎన్నికల బడ్జెట్ అని, ఇన్ కం ట్యాక్స్ విషయంలో పెద్దగా మేలు లేదన్న వాదనను ఆర్థిక నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాత పన్ను విధానంతో పోల్చితే, అసలు కొత్త పన్ను విధానం .. ఏమేరకు లాభం అన్న చర్చ సర్వత్రా వెల్లువెత్తుతోంది.2023-24 బడ్జెట్ లో ఉద్యోగులకు ఆదాయపన్ను విషయంలో ఊరట లభించినా, అదంతా పెద్ద మేలు కాదన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. ఇన్ కంట్యాక్స్ శ్లాబ్ ల మాయాజాలమేనని నిపుణులు అంటున్నారు. దీంతో అసలు .. పన్ను విధానమేంటి..? దీనిపై నిపుణులు చెబుతున్నదేమిటి..? అన్నది చర్చనీయాంశంగా మారింది.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను లోక్‌సభకు సమర్పించారు. ప్రతి ఏటా కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ప్ర తిపాదించినప్పుడల్లా వేతన జీవులు తమకు ఇన్‌కం టాక్స్‌లో రాయితీలు ఇస్తారా? అన్న విషయాన్నే పరిశీలిస్తున్నారు. పాత ఇన్‌కం టాక్స్ పాలసీలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా కొన్ని సవరణలు చేసి, మధ్య తరగతి ప్రజలకు రిలీఫ్ కల్పించినట్లు చెప్పారు. రూ.7 లక్షల వరకు ఆదాయం గల వరకు నూతన పన్ను విధానంలో పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, ఏడు శ్లాబ్‌ల ఆదాయం పన్ను విధానాన్ని ఐదు శ్లాబ్‌లకు కుదించారు.
కానీ, కేంద్ర మంత్రి సవరించిన శ్లాబ్‌ల మాయాజాలంలో అసలు కథ వేరే ఉందని నిపుణులు అంటున్నారు. రూ. 3 లక్షల వరకు ఆదాయం పన్ను పూర్తిగా మాఫీ చేశారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. అంతకు మించి ఆదాయం ఉంటే శ్లాబ్‌ల వారీ ఆదాయం చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీకు రూ.10 లక్షల ఆదాయం వస్తుంటే, అందులో రూ.3 లక్షల ఆదాయానికి పన్ను మినహాయిస్తే మిగతా రూ.7 లక్షలపై కొత్తగా ప్రతిపాదించిన పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.70 వేలు పన్ను చెల్లించాల్సిందే.
అంతేగాక హోంలోన్, మెడికల్ బిల్లులు, మ్యూచ్‌వల్ ఫండ్స్, ఎల్‌ఐసీ పాలసీలు, స్కూల్ ఫీజులు వంటి వాటితో పన్ను మినహాయింపు ఆశలు నెరవేరని వీరంతా చెబుతున్నారు.దశాబ్దాలుగా కొనసాగుతున్న పన్ను మినహాయింపు విధానానికి మంగళం పాడేందుకు కేంద్రం తాజా బడ్జెట్‌లో పావులు కదిపింది. గత ఏడాది తీసుకొచ్చిన కొత్త పన్ను విధానానికి వేతన జీవులను మళ్లించేందుకు ప్రయత్నించింది. వచ్చే బడ్జెట్ నాటికి పాత విధానాన్ని రద్దు చేసినా ఆశ్చర్యంలేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇకపై ఏడాదిలో ఆర్జించిన మొత్తం ఆదాయానికి ప్రభుత్వం విధించిన పన్ను కట్టాల్సిందే.
కొంతమంది వివిధ సెక్షన్ల కింద ఉన్న పన్ను మినహాయింపులను వినియోగించుకోరు. అలాంటి వాళ్లకు కొత్త పన్ను విధానం మేలు. రూ.7 లక్షలలోపుఆదాయం ఉన్నవాళ్లు కొత్త విధానాన్ని ఎంచుకొంటే ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. కానీ రూ.10 లక్షలకుపైగా ఆదాయం ఉండి, ఎక్కువ మిహాయింపులు కోరేవాళ్లకు పాత విధానమే మేలని నిపుణులు చెప్తున్నారు. బడ్జెట్ ప్రసంగం విన్న వాళ్లకు, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం చూస్తున్న వాళ్లలో చాలా మంది ఈ అయోమయంలో ఉన్నారు.
పాత పన్ను విధానంలో రూ.2.5 లక్షలు పరిమితిని రూ.3 లక్షలకు మాత్రమే పెంచారు కదా.. మరి రూ.7 లక్షల వరకు మినహాయింపు ఎలా వర్తిస్తుందని కొందరు అడుగుతున్నారు. మొత్తం ఆదాయంతో సంబంధం లేకుండా పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం అంటే వివిధ మినహాయింపులు తీసేయగా వచ్చే మొత్తం గరిష్ఠంగా రూ.7 లక్షలు ఉన్నాసరే ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం ఉండదు అనేది బడ్జెట్ సారాంశం. అంటే మీ వార్షిక వేతనం నెలకు రూ.50 వేలకుపైగా ఉన్నాసరే.. కొత్త విధానం కింద మీరు చెల్లించాల్సిన అవసరం లేదు.
అదే పాత విధానంలో అయితే, రూ.3 లక్షల ఆదాయం దాటితే పన్ను పరిధిలోకి వస్తారు. వేతనజీవుల్ని ఆకర్షించే రీతిలో ఆదాయపన్ను మినహాయింపు ఇచ్చారన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. ఈ మినహాయింపులు పెద్ద ఊరట కలిగించనప్పటికీ.. గతంతో పోలిస్తే బెటర్ అని చెప్పవచ్చు. పన్ను మినహాయింపులు .. వేతనజీవులు, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని చేసినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వం పై ఆగ్రహంతో ఉన్న వర్గాలను శాంతింప చేసే ప్రయత్రం చేశారని చెప్పవచ్చు.
ఈ బడ్జెట్‌లో ఆదాయపన్ను చెల్లించేవారి మీద ప్రత్యేక శ్రద్ధ చూపించారు. పన్ను చెల్లింపుదారులకు కొంత ఉపశమనం కల్పించే ప్రయత్నం చేశారు. నిర్మల సీతారామన్ 2020లో రెండో బడ్జెట్ ప్రవేశపెడుతూ కొత్త పన్ను విధానం అనేది ఆప్షనల్ అని, కావాలనుకున్న వాళ్ళే ఎంచుకోవచ్చని చెప్పారు. వద్దనుకున్న వాళ్ళు పన్ను తగ్గింపులు, రాయితీలతో కూడిన పాత విధానాన్నే అనుసరించవచ్చని సూచించారు. పాత పన్ను విధానంలో 80సి కింద రూ. 1.5 లక్షల మినహాయింపు పొందవచ్చు.
80డి కింద 25 వేల రూపాయల మినహాయింపు పొందవచ్చు. ఇలా చాలా మార్గాల్లో కొన్ని మినహాయింపులను పన్ను చెల్లించే వ్యక్తి ఉపయోగించుకోవచ్చు. అయితే, కొత్త పన్ను విధానంలో మీరు ఎలాంటి మినహాయింపులు పొందలేరు అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విధానంలో ఆదాయ పన్ను పరిమితి మొత్తం ఎక్కువగా ఉంటుంది. ఆ మేరకు పన్ను తక్కువగా పడుతుంది. ఇప్పుడు కూడా పాత విధానం కొనసాగుతోంది. ఇప్పుడు కూడా మీకు ఏది లాభదాయకంగా ఉందనుకుంటే ఆ విధానాన్ని ఎంచుకోవచ్చు.
పాత విధానంలో పన్ను రాయితీలను పొందడం ఎంచుకోవచ్చు. లేదంటే ఎలాంటి మినహాయింపులు లేని కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు. 2020లో అమల్లోకి వచ్చిన కొత్తపన్ను విధానం ప్రకారం ఏడు టాక్స్ శ్లాబ్స్ ఉన్నాయి. కొత్త పన్ను విధానంలో ఇప్పుడు 7 శ్లాబ్స్‌కు బదులు 6 శ్లాబ్సే ఉంటాయి. ఈ బడ్జెట్‌లో రెండు విధానాలకూ ప్రత్యేక ప్రాధాన్యం కల్పించారు. ఆదాయం ఏడాదికి రూ. 9 లక్షలు అయితే, మీరు కొత్త పన్ను విధానం ద్వారా రూ. 15,000 ఆదా చేసుకోగలుగుతారు. కొత్త పన్ను విధానంలోని పాత శ్లాబ్స్ ప్రకారమైతే మీరు రూ. 60,000 పన్నుగా చెల్లించాల్సి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.