Homeతెలంగాణబీఆర్‌ఎస్‌లో తారాస్థాయికి రెబల్స్ బెడద

బీఆర్‌ఎస్‌లో తారాస్థాయికి రెబల్స్ బెడద

ఆ జిల్లాలో అధికార పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి… అధికారిక కార్యక్రమాలకు ఆ ఎమ్మెల్సీ ఎందుకు దూరంగా ఉంటున్నారు.. తన కొడుకుకు అవకాశం ఇవ్వాలంటున్న ఎమ్మెల్సీ… సందెట్లో సడేమియాగా సీనియర్ మాజీ మంత్రి నాగం చక్రం తిప్పబోతున్నారా… బద్ధ శత్రువులుగా ఉన్నవారు చెయ్యి కలపబోతున్నారా…ఆ మాజీ మంత్రితో ఎమ్మెల్సీ చేయి అందిస్తారాడా …ఇంతకు ఆ నియోజకవర్గంలో ఏమి జరుగుతుంది..

ఉమ్మడి పాలమూరులోని నాగర్ కర్నూలు జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి మధ్య పొసగడం లేదు. అధికారిక కార్యక్రమాలకు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దూరంగా ఉండడం ఈ వివాదానికి మరింత బలాన్ని చేకూర్చుతోంది. దీంతో అధికార బీఆర్ఎస్ పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఒకప్పుడు బద్దశత్రువులుగా ఉన్న మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, కూచుకుళ్ల త్వరలో కలుసుకోనున్నట్లు ప్రచారం జరుగుతుండడంతో జిల్లా అంతటా ఈ విషయంపై చర్చ సాగుతోంది. నాగం, కూచుకుళ్లలో ఎవరో ఒకరు అధికార పార్టీ ఎమ్మెల్యేకు పోటీగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది.

అధికార బీఆర్ ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఎంపికైన దామోదర్ రెడ్డి, మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి కలిసిపోయి సిట్టింగ్ ఎమ్మెల్యేను ఎదుర్కోవడానికి సన్నద్ధం అవుతున్నారని నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ప్రతిపక్ష హోదాలో నాగం జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేను బాహాటంగా విమర్శిస్తున్నారు. ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి .. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వైఖరిని ఎప్పటికప్పుడు వ్యతిరే కిస్తూ వస్తున్నారు. తన వర్గీయులపై ఎమ్మెల్యే పోలీస్ కేసులు పెట్టించడంతోపాటు ఇబ్బందులకు గురి చేస్తున్నారని గతంలో పలుమార్లు కూచుకుళ్ల ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో వారి మధ్య విభేదాలను తొలగించి కలిసి ముందుకు సాగే విధంగా అధిష్టానం చర్యలు తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది.

దీంతో ఇరువురి మధ్య టగ్ ఆఫ్ వార్ తప్పడం లేదు. అయితే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే మర్రికి చెక్ పెట్టే యోచనలో కూచుకుళ్ల ఉన్నారన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనికోసం .. గతంలో తాను మర్రితో కలిసి, ఎవరికి చెక్ పెట్టారో .. వారితోనే దోస్తీకి కూచుకుళ్ల రెడీ అయ్యారన్న టాక్ ..సెగ్మెంట్లో రచ్చ చేస్తోంది. నాగర్ కర్నూల్ లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన మాజీ మంత్రి నాగం జనార్థనరెడ్డితో .. కూచుకుళ్ల పొత్తు పెట్టుకున్నారన్న వార్తలు సెగ్మెంట్లో రాజకీయ వేడిని పెంచేశాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రేసు సైతం ఇప్పుడు రసవత్తరంగా మారిపోయింది. నాగం కు చెక్ పెట్టడానికి గత ఎన్నికల్లో కూచుకుళ్ల, మర్రి దోస్తీ కుదుర్చుకున్నారన్న విషయం తెలిసిందే.

అయితే నాగం .. ఓటమి అనంతరం కొద్దిరోజులు సైలెంట్ అయినా.. ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరి .. యాక్టీవ్ పాలిటిక్స్ దిశగా మళ్లీ అడుగులు వేస్తున్నారు. అదే సమయంలో అధికార పార్టీలో లుకలుకలు వెల్లువెత్తడం .. ఈయనకు ప్లస్ గా మారిందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. మరోవైపు అధికారపార్టీలో ఎమ్మెల్యే మర్రి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల మధ్య విబేధాలు తలెత్తాయి. కూచుకుళ్ల తన రాజకీయ వారసుడిగా కొడుకు రాజేష్ రెడ్డి ఎంట్రీకి ప్రయత్నిస్తుండడమే ఈ విబేధాలకు కారణమని తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో కూచుకుళ్ల రాజేష్ .. ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలనుకోవడంతో .. ఆయనకు చెక్ పెట్టేందుకు మర్రి ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. అందుకే ఎమ్మెల్సీ వర్గీయులపై అక్రమ కేసులు పెట్టించడం, అధికారులు సైతం కూచుకుళ్ల మాట వినకుండా చేయడం వంటి పనులు చేస్తున్నట్లు సెగ్మెంట్లో టాక్ వినిపిస్తోంది. నాగంకు చెక్ పెట్టడానికి కలిసివచ్చిన మర్రి ..తాజాగా ఫ్లేట్ ఫిరాయించడంతో, కూచుకుళ్ల సైతం మర్రిపై మండిపడుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ చేజిక్కించుకుని, మర్రికి చెక్ పెట్టాలని కూచుకుళ్ల పావులు కదుపుతున్నారు. అదేసమయంలో సిట్టింగ్ లకే టిక్కెట్లు అని కేసీఆర్ప్ర కటించినా, స్థానికంగా పట్టు ఉంటేనే, అని కూడా తేల్చేయడంతో, సెగ్మెంట్ రాజకీయాలపై రాజేష్ సైతం కన్నేశారు. దీనితో ఒకప్పుడు బద్ధ శత్రువులుగా ఉన్న నాగం, దామోదర్ రెడ్డి లలో ఎవరైనా ఒకరు పోటీలో ఉంటే మరొకరు మద్దతు ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకున్నారని ప్రచారం సాగుతోంది.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న నాగం .. ఈసారి వయోభారం రీత్యా తనకు చివరి అవకాశం కల్పించాలని అధిష్టానాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ హైకమాండ్ గనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే, నాగం పోటీకి దిగుతారని, అప్పుడు కూచుకుళ్ల ఆయనకు మద్ధతు ఇవ్వాల్సి ఉంటుందని చర్చ సాగుతోంది.
ఒకవేళ నాగంకు అధిష్టానం టిక్కెట్ నిరాకరిస్తే, రాజేష్ రెడ్డి ప్రయత్నాలు గనుక సఫలం అయి, టిక్కెట్ లభిస్తే, నాగం జనార్దన్ రెడ్డి .. ఈయనకు మద్ధతిస్తారని టాక్ వెల్లువెత్తుతోంది. దీంతో వీరి వ్యూహాలకు రాజకీయాలు హీటెక్కిపోతున్నాయని స్థానికంగా టాక్ వినిపిస్తోంది. తాజా పరిణామాల ప్రకారం వీరిద్దరిలో ఎవరికి టిక్కెట్ లభించినా, పొత్తు ప్రకారం .. మద్ధతు ఉంటుందని తెలుస్తోంది.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సెగ్మెంట్ నుంచి ఎలాగైనా పోటీ చేయాలని ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డి ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం తన తండ్రితో పాటు బీఆర్ఎస్ పార్టీలో కొనసగుతున్న రాజేష్ రెడ్డి నియోజకవర్గంలో గత కొంతకాలంగా విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. శుభ, అశుభ కార్యక్రమాలు అన్న తేడాలు లేకుండా సమాచారం ఉన్న ప్రతి చోటకు వెళుతున్నారు. ప్రజలతో అనుబంధాలను పెంచుకునేందుకు తన వంతు కృషి చేస్తున్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తాను ఎలాగైనా పోటీలో ఉంటాను అని ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డి పూర్తి ధీమాతో ఉన్నారట.. ఇటీవల జిల్లా కేంద్రంలో జరిగిన పలు కార్యక్రమాలలో పాల్గొన్న రాజేష్ రెడ్డి వచ్చే ఎన్నికలలో ఎలాగైనా పోటీలో ఉండ బోతున్నాం.. అంటూ భరోసా కల్పిస్తున్నారు. తండ్రి పుట్టిన రోజు వేడుకలలోనూ రాజేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉంటానని చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయనున్నామని, అది అధికార బీఆర్ఎస్ పార్టీనా…!? కాంగ్రెస్ పార్టీ నా..!? బీజేపీనా అన్న విషయం అప్పటికే తేలుతుందని ఆయన చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

దీంతో ఉమ్మడి జిల్లాలోని నాగర్ కర్నూల్ లో రసవత్తర రాజకీయాలు జరగడం ఖాయమని పలువురు నిపుణులు అంటున్నారు. ఎమ్మెల్యేను టార్గెట్ చేసేందుకు ఎమ్మెల్సీ కచ్చితంగా మాజీ మంత్రితో చేయి కలుపుతారని, భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో తన తనయుడికి రాజకీయ భవిష్యత్తు అందించేందుకు ఎమ్మెల్సీ అడుగులు వేస్తున్నారని వార్తలు మాత్రం వెల్లువెత్తుతున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో నాగర్ కర్నూల్ సెగ్మెంట్లో కారు జెండా ఎగురుతుందా.. హస్తం రెపరెపలాడుతుందా అన్నదీ చర్చనీయాంశంగా మారుతోంది. తాజా పరిణామాలతో రాజేష్ రెడ్డి .. టిక్కెట్ రేసులో ఏ పార్టీ నుంచి గెలుపొంది, సెగ్మెంట్లో పట్టు బిగిస్తారోనన్నదే ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధిష్టానం .. ఏం చేయనుందన్నదీ .. సెగ్మెంట్ రాజకీయాల్లో హీట్ రగుల్చుతోంది. యువతకు టిక్కెట్ ఇచ్చి .. కూచుకుళ్లను బలపరుస్తుందా.. లేక సిట్టింగ్ కే టిక్కెట్ పేరిట .. మర్రికే ఛాన్స్ఇస్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. అంతేగాక .. టిక్కెట్ రాకపోతే కూచుకుళ్ల దారెటు అన్నదీ రచ్చ చేస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Must Read

spot_img