Homeతెలంగాణబీఆర్ఎస్ సర్కార్ కు కష్టాలు చుట్టుముట్టాయా..?

బీఆర్ఎస్ సర్కార్ కు కష్టాలు చుట్టుముట్టాయా..?

  • ఇప్పటికే లిక్కర్ స్కాంలో అల్లాడుతుంటే, తాజాగా పేపర్ లీకేజీ మరింత తలనెప్పిగా మారిందా..?
  • దీనికితోడు ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ గెలవడం కూడా ఇబ్బంది పెట్టనుందా..?

బీఆర్ఎస్ ప్రభుత్వానికి కష్టాలన్నీ కట్టగట్టుకొని వచ్చినట్లుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ, స్వప్న లోక్ మాల్ అగ్ని ప్రమాదం, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి విజయం వంటి ప్రతికూల సంఘటనలన్నీ ఒకేసారి వచ్చిపడ్డాయి. వాటి ఆధారంగా విపక్షాలు ముకుమ్మడిగా ముప్పేట సాగిస్తున్న రాజకీయ దాడితో ప్రగతి భవన్ పరేషాన్ అవుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీఎం కేసీఆర్ కూతురు కావడంతో ఆయన ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలు సహజంగానే లిక్కర్ స్కామ్ అస్త్రంగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి.

స్కామ్‌లో కవిత ప్రమేయంపై మొదటి నుంచి ఆమెతో పాటు కేసీఆర్ కుటుంబం కప్పదాట్లు, పిల్లి మొగ్గలు వేస్తూనే ఉంది. తాను ఏ తప్పు చేయలేదని ఎలాంటి విచారణకైనా సిద్ధమని ఈడి, బోడి, మోడీలకు భయపడేది లేదన్న కవిత, కేసీఆర్‌లు ఆచరణలో అందుకు భిన్నమైన వైఖరి అనుసరిస్తున్నారు. ఒక మహిళను ఈడీ విచారించే పద్ధతి సరిగాలేదంటూ అకస్మాత్తుగా కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించడం వెనుక ఆమె చుట్టూ కేసు బిగిస్తుందన్న సందేహాలను బలపరుస్తున్నాయి.

అయితే కవిత కేసులో సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుండా ఈడీ సైతం కేవియట్ దాఖలు చేయడం లిక్కర్ కేసును మరో మలుపు తిప్పింది. లిక్కర్ కేసులో ఇప్పటికే 9 మంది నిందితులు జైళ్లలో ఉండటం.. వారి విచారణ తుది దశకు రావడంతో కవితను, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డిని వారితో కలిపి విచారించి కేసును కొలిక్కి తీసుకురావాలన్న లక్ష్యంతో ఈడి ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలో ఈనెల 20న కవిత విచారణకు రాకుంటే ఆమెను అరెస్ట్ చేయవచ్చన్న వాదన వినిపిస్తుంది.

తెలంగాణలో అధికార బీఆర్ఎస్ ను రాజకీయంగా దెబ్బకొట్టి తాము బలపడాలన్న ఆలోచనతో ఉన్న బీజేపీ ఈడీ, సీబీఐల ద్వారా కవితను లిక్కర్ కేసులో లాక్ చేయాలని చూస్తుంది. అయితే రాజ్యాంగ సంస్థలైన ఈడీ, సీబీఐల కేసులకు తమకు సంబంధం లేదంటూనే బీజేపీ కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా పరోక్షంగా రాజ్యాంగ పరంగా వీలైనంతవరకు కవిత కేసును ఆశించిన దిశగా ముందుకు నడిపిస్తుంది. దీంతో బీఆర్ఎస్ సర్కార్ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిందన్న టాక్ హాట్ టాపిక్ గా మారింది. దీన్నుంచి తప్పించుకోవడంలోనే తలమునకలు అవుతోంది.

ఇదే సమయంలో ఇప్పటికే కవిత లిక్కర్ కేసు నుంచి ఎలా బయటపడాలన్న దానిపై అపసోపలు పడుతున్న కేసిఆర్ కుటుంబానికి టీఎస్పీఎస్సీ పేపర్‌ల లీకేజీ వ్యవహారం గోరుచుట్టుపై రోకటి పోటులా వచ్చి పడింది. పేపర్ల లీకేజీలో కేసీఆర్ కుటుంబ సభ్యులు టార్గెట్ గా ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం వారికి మరింత సమస్యాత్మకంగా తయారైంది. లీకేజీ వ్యవహారంలో నాలుగు పరీక్షలు రద్దుచేసి, మరికొన్నింటిని వాయిదా వేసినప్పటికి నిరుద్యోగుల్లో ఆందోళనలు, ప్రతిపక్షాల నిరసనలు ఆగడం లేదు. ఒకవైపు బీజేపీ బండి సంజయ్, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి, బీఎస్పీ నుంచి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, ఇంకోవైపు వైఎస్ఆర్టీపీ షర్మిల, టీజేఎస్ కోదండరామ్‌లకు తోడు విద్యార్థి సంఘాలు పేపర్ల లీకేజీపై రాజకీయ మంటలు రగిలిస్తున్నాయి.

కేసీఆర్ సర్కారుకు తలనొప్పిగా మారిన పేపర్ల లీకేజీ ఇద్దరు వ్యక్తుల తప్పుడు పని మాత్రమేనని, మొత్తం వ్యవస్థను తప్పు పట్టడం.. నన్ను రాజీనామా చేయమనడం ఎంతవరకు సమంజసమని, లీకేజీకి నాకు ఏమి సంబంధం అంటూ కేటీఆర్ చిందులు తొక్కడం ఈ వ్యవహారానికి మరింత ఆజ్యం పోసింది. ఐటీ మంత్రిగా ఉన్న కేటీఆర్ టీఎస్పీఎస్సీకి సాంకేతిక మద్దతునిచ్చి పరీక్షలు సజావుగా నిర్వహించాలని చూడడంలో విఫలమయ్యారని, లీకేజీ నిందితులు పేపర్లను బిఆర్ఎస్ వారి కోసమే లీక్ చేశారని, లీక్ లో కేటీఆర్ పీఏ ఉన్నారని, లీకేజీ వెనక కుటుంబ ప్రమేయం ఉందంటూ బండి, రేవంత్, ప్రవీణ్ కుమార్ లు ఆరోపిస్తున్నారు. దీంతో పేపర్ల లీకేజీ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక అంశంగా మారింది.

పేపర్ లీకేజీ ఇద్దరు వ్యక్తుల పనిగా చూడాలని.. నాకు సంబంధం లేదన్న కేటీఆర్ గడుసు వాఖ్యలను విపక్షాలు మరోలా చూస్తున్నాయి. పేపర్ లీకేజీతో నీకు సంబంధం లేకపోతే లిక్కర్ కేసులో కవిత ఇరుక్కుంటే తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు, మహిళలకు ఏం సంబంధం అని, వారికి ఎట్లా అవమానమని కేటీఆర్‌ను నిలదీస్తున్నాయి. టీఎస్పీఎస్సీ రాజ్యాంగ సంస్థ అయినా ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తుందా..? అలాగైతే ఆ సంస్థ ఇచ్చే ఉద్యోగాలను తామే ఇచ్చామని ప్రభుత్వం ఎందుకు చెప్పుకుంటుందన్న ప్రశ్నలు కేటీఆర్‌కు తెలియనివి కాదని ఎద్దేవా చేస్తున్నాయి.

టీఎస్పీఎస్సీ రాజ్యాంగ సంస్థ ఎట్లనో.. కవిత కేసు విచారిస్తున్న ఈడీ, సీబీఐలు కూడా స్వతంత్ర రాజ్యాంగ సంస్థలే కదా అని బీజేపీ గుర్తు చేస్తుంది. ఈ రచ్చతో బీఆర్ఎస్ కు మరో తలనెప్పి షురూ అయిందన్న టాక్ తెలంగాణవ్యాప్తంగా వెల్లువెత్తుతోంది. ఇక కవిత విచారణ ఘట్టం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు బండి సంజయ్ ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలను రెండు రోజులు ఆలస్యంగా డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా బీఆర్ఎస్ నిరసనలకు వాడుకున్న ప్రభుత్వం.. పేపర్ల లీకేజీలో తప్పును నిందితుల్లో ఒకరు బీజేపీకి చెందిన వాడని, లీక్ వెనుక ఉద్యోగ నోటిఫికేషన్ ఓర్వలేని విపక్షాల కుట్ర ఉండవచ్చని అంటూ కేటీఆర్ మరోసారి డైవర్షన్ పాలిటిక్స్ మాటలే అందుకుంది.

పేపర్ల లీకేజీలో రాజకీయ కుట్ర కోణం ఉంటే ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీదే ఉన్నందునా వారి ఆధీనంలోని సిట్‌ను విచారణకు వాడుకునే వెసులుబాటు ఉండనే ఉందని, అలాంటప్పుడు రాజకీయ కుట్ర కోణం అంటూ కేటీఆర్ బడాయి మాటలతో పేపర్ లీకేజీ వ్యవహారం నుంచి ప్రజల, నిరుద్యోగుల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నించడం ఎందుకని విపక్షాలు వాదిస్తున్నాయి. కేటీఆర్ మాటలు పేపర్ లీకేజీ కేసును తక్కువ చేసి, తన వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్న విపక్షాల వాదనకు ఊతమిచ్చాయి. లీకేజీ కేసులో ఒక నిందితురాలి తల్లి బీఆర్ఎస్ సర్పంచ్‌గా, సోదరుడు ఆ పార్టీ నాయకుడిగా ఉన్న విషయం మాత్రం కేటీఆర్ ఈ సంధర్భంగా మరిచిపోయారా అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

లీకేజీ వ్యవహారాన్ని ఇద్దరి వ్యక్తుల తప్పుగా కాకుండా 30 లక్షల మంది నిరుద్యోగుల బాధగా ప్రతిపక్షాలు అభివర్ణిస్తుండడం గమనార్హం. అదిగాక పేపర్ల లీకేజీలో తానేందుకు రాజీనామ చేయాలన్న కేటీఆర్.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లీకేజీలపై ఎందుకు రాజీనామాలు చేయలేదంటూ ప్రశ్నించడం, టిఎస్పీఎస్ బోర్డును వెనుకేసుకురావడం సరైనదా కాదా అన్న చర్చను రగిలించింది. ఏది ఏమైనా పేపర్ల లీకేజీ వ్యవహారం లిక్కర్ స్కాంలు సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో విపక్షాలకు బలమైన ఆయుధాలుగానే అందగా దేశమంతా విస్తరించాలనుకుంటున్న బీఆర్ఎస్‌కు ఇంటిపోరుగా మారి ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న పరిస్థితులను సృష్టించాయి.

లిక్కర్, పేపర్ లీకేజీ స్కాం నడుస్తున్న క్రమంలోనే రంగారెడ్డి- హైదరాబాద్-మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం బీఆర్ఎస్‌కు రాజకీయంగా మరింత ఇబ్బందికర పరిస్థితులను కల్పించింది. దీంతో ప్రభుత్వ పనితీరుపై ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాల్లో అంతర్లీనంగా దాగిన వ్యతిరేకతను చాటాయన్న విషయాన్ని వెల్లడించినట్లైంది. దీనికితోడు ఈ సమస్యలు చాలావన్నట్లుగా స్వప్నలోక్ అగ్ని ప్రమాదంలో ఆరుగురు యువతీ యువకులు చనిపోవడం ప్రభుత్వ పనితీరును ప్రజల్లో మరింత పలచన చేసింది.

మరి కేసీఆర్ ఏం చేస్తారన్నదే ఆసక్తికరంగా మారింది..

Must Read

spot_img