Homeజాతీయంవచ్చే ఎన్నికలే టార్గెట్ గా బీఆర్ఎస్ .. పావులు కదుపుతోందా..?

వచ్చే ఎన్నికలే టార్గెట్ గా బీఆర్ఎస్ .. పావులు కదుపుతోందా..?

జాతీయపార్టీగా ప్రకటించుకున్న బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు వేసుకుంది. అందులో భాగంగానే.. ముందుగా ఏపీలో విస్తరించేందుకు వ్యూహరచన చేసింది. తాజాగా ఇందులో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, రిటైర్డ్ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి చింతల పార్థసారథి, అనంతపురం జిల్లాకు చెందిన టీజే ప్రకాశ్‌ మరికొందరు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నేతలు చేరారు. ముందుగా సరిహద్దు రాష్ట్రాల్లో విస్తరించాలనుకుంటున్న బీఆర్ఎస్.. కర్ణాటకతోపాటూ.. ఏపీపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఆ క్రమంలో ఏపీలోని కీలక నేతలతో సంప్రదింపులు జరుపుతోంది.

మహారాష్ట్ర కేడర్‌ IASగా 23 ఏళ్లపాటు పనిచేసిన చంద్రశేఖర్‌.. తన పదవికి రాజీనామా చేసి 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున గుంటూరు లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అలాగే 2019లో జనసేన పార్టీ తరపున గుంటూరు పశ్చిమ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి కూడా ఓడిపోయారు. అయినప్పటికీ ఆయన… ఏపీలోని బలమైన సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో ఆయనను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్‌ నియమించారు. ఇక రావెల కిశోర్‌బాబు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు. చంద్రబాబు మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ శాఖమంత్రిగా పనిచేశారు.

2019లో జనసేన పార్టీలో చేరి.. రెండోసారి ప్రత్తిపాడు నుంచి పోటీచేసి ఓడిపోయారు. తర్వాత బీజేపీలో చేరారు. కొన్నాళ్లకే అక్కడా రిజైన్ చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తున్నారు. చింతల పార్థసారథి IRS పదవికి రాజీనామా చేసి 2019లో అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతపురం జిల్లాకు చెందిన తుమ్మలశెట్టి జయప్రకాశ్‌ నారాయణ 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున అనంతపురం నగర నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. తాజా చేరికలతో బీఆర్ఎస్ పార్టీకి ఏపీలో ఆశలు చిగురిస్తున్నాయి. పార్టీని ఏపీలో వేగంగా వ్యాప్తి చేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఇటీవల టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చుకున్నారు కేసీఆర్. రాష్ట్ర స్థాయిలో కాదు, దేశ స్థాయిలో చక్రం తిప్పే సమయం వచ్చిందని సైతం వ్యాఖ్యానించారు.

భారత్ రాష్ట్రసమితి ఏపీలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుందా? కాపు సామాజికవర్గాన్నే టార్గెట్ చేయనుందా?

కొన్ని రోజుల కిందట ఏపీలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు సైతం దర్శనమివ్వడం హాట్ టాపిక్‌గా మారింది. దీంతో జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ..తన మొదటి అడుగు ఏపీలోనే పెట్టనున్నారా… ఇక్కడి నుంచే తన రాజకీయ వ్యూహాన్ని అమలు చేయనున్నారా అంటే అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన నేతలతో మంతనాలు జరిగాయని… ఇక కేసీఆర్‌ రంగంలోకి దిగబోతున్నారని బీఆర్‌ఎస్‌ లీడర్లు చెబుతున్నారు. బీఆర్‌ఎస్ బలోపేతం చేసేందుకు పక్కా కార్యచరణతో కేసీఆర్‌ అడుగులు పడుతున్నట్టు ఆ పార్టీ లీడర్లు చెబుతున్నారు.

ఏపీ నుంచే ఇది మొదలు అవుతున్నట్టు పేర్కొంటున్నారు. సంక్రాంతి తర్వాత ఏపీలో పర్యటించి పార్టీ బలోపేతంపై నేతలతో చర్చిస్తారు. తాను ఏపీలో ఎందుకు అడుగుపెట్టబోతున్నానో వివరించేందుకు భారీ బహిరంగ సభ కూడా ప్లాన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.విజయవాడ, గుంటూరు, విశాఖలో పర్యటన కోసం ఏర్పాల్టు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇది ప్రారంభం మాత్రమేనని ఇక రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్‌ ప్రభంజనాన్ని చూడబోతున్నారంటూ ఆ పార్టీ నేతలు బల్లగుద్ది చెబుతున్నారు. పెద్దఎత్తున కాపు సామాజికవర్గం నేతలను చేర్చుకోడం దేనికి సంకేతం? తన మిత్రుడు జగన్ కు మేలు చేయడానికేనా? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఏపీలోని ముగ్గురు కీలక నేతలను గులాబీ గూటికి చేర్చి.. ఏపీలోని మిగతా రాజకీయ పక్షాలకు గట్టి సవాల్ నే విసరనున్నారు. బీఆర్ఎస్ ను దేశ వ్యాప్తంగా విస్తరించే పనిలో ఉన్న కేసీఆర్ ముందుగా దాయాది రాష్ట్రంపై పడ్డారు. ఏపీపై సీరియస్ గా ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా రాజకీయ నేతలే కాకుండా బ్యూరోకాట్లు, పారిశ్రామికవేత్తలను పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నారు.

కాపు సామాజికవర్గానికి చెందిన తోట చంద్రశేఖర్ కు బీఆర్ఎస్ నాయకత్వ బాధ్యతలు అప్పగించి, కాపులను బీఆర్ఎస్ వైపుటర్న్ చేసేందుకు కేసీఆర్ ఎత్తుగడ వేస్తున్నారు. అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు కూడా బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.ఈయన మాజీ ఐఆర్ఎస్ అధికారి. చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన నేత. మరో ఐఆర్ఎస్ మాజీ అధికారి చింతల పార్థసారధి,వ్యాపారవేత్త ప్రకాష్ సైతం బీఆర్ఎస్ గూటికి చేరనున్నారు. ఇందులో ప్రకాష్ బలిజ సామాజికవర్గానికి చెందిన నేత. అనంతపురం జిల్లాలో బలమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. అటు పార్థసారధి కూడా జనసేనలో యాక్టివ్ గా పనిచేశారు.

అయితే ఏపీలో కీలక నేతలు కారెక్కడం వెనుక కేసీఆర్ పెద్ద వ్యూహమే రూపొందించుకున్నట్టు తెలుస్తోంది. తొలుత టీడీపీ నుంచి బీఆర్ఎస్ లోకి చేరికలు ఉంటాయని భావించారు. కానీ అక్కడ జనసేనతో టీడీపీ పొత్తు ఉంటుందని.. ఆ రెండు పార్టీలు కలిస్తే అధికారంలోకి రావడం ఖాయమని ఎక్కువ మంది నేతలు నమ్ముతున్నారు. అందుకే టీడీపీ నేతలెవరూ పెద్దగా స్పందించలేదు. ఏపీలో బీఆర్ఎస్ రాజకీయ వ్యవహారాలను చూస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చాలామంది టీడీపీ నేతలను సంప్రదిస్తే వారు పెద్దగా రియాక్టు కాలేదు. ఎన్నికల తరువాత ఉన్న పరిస్థితులు బట్టి నిర్ణయం తీసుకుంటామని బదులిచ్చారు. దీంతో గులాబీ బాస్ ఆలోచన మారింది.

ముందుగా కులసంఘాల నాయకులను చెరదీద్దామని.. తరువాత నాయకుల సంగతి చూద్దామని భావించారు. కాపు, బలిజ సామాజికవర్గంపై ఫోకస్ పెట్టారు. అయితే బీఆర్ఎస్ లో చేరుతున్న మెజార్టీ నాయకులు ఆ రెండు కులాలకు చెందిన వారే కావడం గమనార్హం. తెలంగాణలో బీఆర్ఎస్ తో బీజేపీ గట్టిగానే పోరాడుతోంది. అటు చంద్రబాబు సైతం పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. బీజేపీకి తెలంగాణలో సహకరించేందుకే చంద్రబాబు పావులు కదుపుతున్నారని వార్తలు వస్తున్నాయి. దాని ద్వారా ఏపీలో బీజేపీ, జనసేన సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి టీడీపీ నాయకులెవరూ బీఆర్ఎస్ లోకి వచ్చేందుకు ఆసక్తిచూపకపోవడంతో కేసీఆర్ దృష్టి జనసేన, బీజేపీలపై పడినట్టు తెలుస్తోంది.

మరోవైపు జగన్ కు కాపులు, బలిజలు దూరమయ్యారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కడితే మాత్రం ఆ రెండు సామాజికవర్గాలు అటు వైపు మొగ్గుచూపే అవకాశముంది. అదే జరిగితే జగన్ కు భారీగా దెబ్బ తగులుతుంది. అందుకే కేసీఆర్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. కాపులు, బలిజలను బీఆర్ఎస్
వైపు తిప్పుకుంటే బీజేపీ, టీడీపీకి దెబ్బకొట్టినట్టవుతుంది. అటు జగన్ కు మేలు చేసినట్టవుతుంది. అందుకే ఏపీ నుంచి చేరికల విషయంలో కేసీఆర్ భారీ ప్లాన్తో ముందుకు సాగుతున్నారు. ఏపీలో బీఆర్ఎస్‌లో చేరడానికి ఎవరూ లేరని.. ఓ మాదిరి గుర్తింపు ఉన్న నేత అయినా దొరుకుతారా అన్న చర్చ జరుగుతూండగా…

ప్రధాన పార్టీల తరపున పోటీ చేసినా ఎప్పుడూ గెలుపు ముఖం చూడని నేత బీఆర్ఎస్‌కు ఆప్షన్ గా లభించినట్లయిందన్న వాదన వినిపిస్తోంది. రావెల కిషోర్ బాబు .. పిలిచి టిక్కెట్ ఇచ్చి.. మంత్రి పదవి ఇచ్చిన టీడీపీ ఆయనను పక్కన పెట్టింది. జనసేన, బీజేపీల్లో చేరి బయటకు వచ్చారు. ఇటీవల టీడీపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. కానీ కుదర్లేదు. ఇప్పుడు..బీఆర్ఎస్‌లో చేరుతున్నారు. పార్థసారధి కూడా గతంలో పీఆర్పీ తరపున ఎంపీగా పోటీ చేశారు. మొత్తంగా మాజీ నేతలకు బీఆర్ఎస్‌లో మంచి స్థానాలు దక్కనున్నాయి. అయితే వీరెంతమేరకు పార్టీ బలోపేతానికి తోడ్పడతారన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Must Read

spot_img