HomePoliticsఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ హవా మామూలుగా లేదు..!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ హవా మామూలుగా లేదు..!

సిట్టింగ్ లకే టికెట్లనే గులాబీ బాస్ ప్రకటన దేనికి సంకేతం ? అసమ్మతులకు చెక్ పెట్టేందుకే బాస్ ఈ నిర్ణయం తీసుకున్నారా ? అందుకే ఆ జిల్లాలో
అసమ్మతి నేతలంతా అలెర్ట్ అయ్యారా ? ఇన్నాళ్లు అండర్ గ్రౌండ్ లో ఉండి ఇప్పుడు హడావిడి చేస్తుంది అందుకేనా ? మరింతకీ అక్కడ ఏం
జరుగుతోంది ?

అసలు ఊసే లేని ఉమ్మడి నల్గొండ జిల్లాలో, తాజాగా బీఆర్ఎస్ పార్టీ హవా మామూలుగా లేదు. నాడు పట్టున్న టీడీపి, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు కూడా కారును ఢీకొని యాక్సిడెంట్ అయిపోయాయి. దీంతో చాలా మంది విపక్ష నేతలు భవిష్యత్ కోసం కారెక్కేశారు. ఇక ఇప్పుడు కారు ఓవర్ లోడ్ తో కొన్ని చోట్ల గ్రూపులు ఏర్పడడం, ఇంకొన్ని చోట్ల నేతలు వివాదాలకు పోవడం హై కమాండ్ కు పెద్ద తలనొప్పిగా మారింది.

ఆ గొడవల్లో కాస్త ముందు వరసలో ఉంది నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం. నాడు కమ్యూనిస్టులకు కంచుకోట అయిన ఈ సెగ్మెంట్ .. 2009 నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ పట్టు సాధించింది. ఆ పార్టీ నుంచి చిరుమర్తి లింగయ్య విజయం సాధించారు. ఆ తర్వాత 2014 లో కారు జోరులో ఓటమి పాలయ్యారు. మళ్ళీ 2018 లో కాంగ్రెస్ పార్టీ నుంచే చిరుమర్తి విజయం సాధించినా, గులాబీ బాస్ ఆపరేషన్ ఆకర్ష్ లో బాగంగా కారెక్కేశారు.

దీంతో నియోజకవర్గంలో రాజకీయాలు ఓ రేంజ్ లో మారిపోయాయి. ఇక ఎప్పుడైతే చిరుమర్తి లింగయ్య బీఆర్ ఎస్ లో పార్టీలో చేరారో .. అప్పటి నుంచి పాత, కొత్త నాయకత్వాల మధ్య గ్యాప్ పెరిగింది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య అంతర్గత ఆధిపత్యపోరు ఓ రేంజ్ లో సాగుతూ వస్తుంది. అయితే ఇద్దరి మధ్య గొడవలు ఎప్పుడూ బయటికి రాకున్నా ..లోలోపల మాత్రం పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంతగా వార్ ఉందని నియోజకవర్గ వాసుల మాట.

ఇక మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పార్టీలో హవా తగ్గినా… తనకంటూ ఓ వర్గాన్ని, వ్యవస్థను ఏర్పరచుకున్నారు. ఇప్పటికీ కేడర్ చేజారకుండా కాపాడుకుంటూనే వస్తున్నారు. నకిరేకల్, చిట్యాల మున్సిపాలిటీల్లో తన అనుచరులను రెబల్ గా పోటీ చేయించారు. అయితే వీరేశం ప్రత్యక్షంగా ప్రచారం చేయకున్నా..తెరవెనక కథ నడిపారని నియోజకవర్గంలోనే ఓపెన్ సీక్రెట్ గా చర్చ నడిచింది. దీంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనీ వీరేశంపై హైకమాండ్ కు ఎన్నో పిర్యాదులు వెళ్లాయి. అప్పటి నుంచి ఆయన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది అధిష్టానం.

పార్టీ తలపెట్టిన ఏ కార్యక్రమానికి వీరేశం కు ఆహ్వానం అందడంలేదు. ఇక ఇన్నాళ్లు తనకు బాస్ అండదండలు ఉన్నాయని, రానున్న ఎన్నికల్లో నకిరేకల్ టికెట్ తనదేనని చెప్పుకుంటూ వచ్చారు వీరేశం. కేడర్ కు భరోసా ఇస్తూ ఇన్నాళ్లు కాలం గడిపారు. అంతలోనే గులాబీ బాస్ చిరుమర్తికి గుడ్ న్యూస్ చెప్పారు.

కేసీఆర్ కుండబద్దలు కొట్టేశారు..

సిట్టింగ్ లకే సీట్లు అని కేసీఆర్ కుండబద్దలు కొట్టేశారు. ఇక ఈ ప్రకటన ఆశావహులకు, అసమ్మతులకు షాకిచ్చింది. దాంతో అప్పటినుంచి వీరేశం గేర్ మార్చారనే టాక్ వినబడుతుంది. ఇన్ని రోజులు సైలెంట్ గా అండర్ గ్రౌండ్ వర్క్ చేసుకున్న వీరేశం….ఇక ఫీల్డ్ లోకి వచ్చేశారట. నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ దూకుడు పెంచేశారు. టికెట్ పై ఆశలు వదులుకుని, పట్టు కోసం ప్రయత్నాలు షురూ చేశారు.

కేసీఆర్ ప్రకటనతో వీరేశానికి టికెట్ ఆశలు గల్లంతు కావడంతో అనుచర గణం సైతం ఒక్కొక్కరుగా చిరుమర్తి పంచన చేరుతున్నారు. ఇటు కాంగ్రెస్ లో కూడా సరైన లీడర్ లేకపోవడంతో ఆ పార్టీ కేడర్ కూడా చిరుమర్తి లాగేసుకుంటున్నారు. తాజాగా కేసీఅర్ ప్రకటన చిరుమర్తి లింగయ్య వర్గంలో ఫుల్ జోష్ నింపింది. అసమ్మతి నేతలను చెక్ పెట్టాలనే ఆలోచన తోనే బాస్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని టీఆరెఎస్ శ్రేణులు అంటున్నాయి.

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గ్రూపు గొడవలు లేకుండా చూడాలనేది హై కమాండ్ ప్లాన్ అట. అందుకే పార్టీకి నష్టం తలపెట్టి వారిని ఎక్కడిక్కడ నియంత్రించే చర్యలు చేపట్టినట్టు పార్టీలో టాక్. ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నట్లు గా సొంత రాష్ట్రం లో పరిస్థితులు చక్కదిద్ది దేశంలో చక్రం తిప్పాలనే వ్యూహంతోనే కలుపు మొక్కలను ఏరి పారేస్తున్నట్టు పార్టీ శ్రేణుల్లో చర్చ ఓ రేంజ్ లో నడుస్తుంది.

అందుకే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కాస్త సీరియస్ గానే యాక్షన్ షురూ చేశారట. ఆ వడపోతల కార్యక్రమంలో భాగంగానే వీరేశం దూకుడుకు బ్రేకులు వేసిందట హై కమాండ్. అందుకే చిరుమర్తి లింగయ్య కు ఫుల్ పవర్స్ ఇచ్చారని ఉమ్మడి నల్గొండ జిల్లాలో చర్చ జరుగుతుంది. ఈ మధ్య పలు మార్లు కేసీఅర్ ని కలిసిన సందర్భంలో కూడా నిత్యం నియోజక వర్గ ప్రజలతోనే ఉండాలని చిరుమర్థికి సూచించారట బాస్.

పని చేసుకుంటూ వెళ్లమని భుజం తట్టారట. దాంతో అప్పటి నుంచి నకిరేకల్ లో చిరుమర్తి లింగయ్య దూకుడు పెంచారట. అదే సమయంలో చిరుమర్తి పార్టీలో చేరికలు పెంచేందుకు సైతం బిజీబిజీ గా ఉంటున్నారు. ఇక ఎలాగూ టికెట్ రాదన్న విషయం తెలిసినా, వీరేశం కూడా ఏ మాత్రం తగ్గడం లేదని సెగ్మెంట్లో వినిపిస్తోంది. దీంతో వీలైతే ఏదో పార్టీ టికెట్ లేదంటే ఇండిపెండెంట్ గా నైనా తొడ గొట్టెందుకు సిద్దంగా ఉన్నారట. ఎలాగూ టికెట్ పై క్లారిటీ వచ్చింది కాబట్టి సైడ్ ట్రాక్ లో వెళ్లే వ్యూహాలకు పదును పెట్టారట వీరేశం.

బాస్ ప్రకటన తో రెబల్స్ నెక్స్ట్ స్టెప్ ఏంటో…

అధికారం చేతిలో ఉండడంతో చిరుమర్తి దూసుకుపోతు వీరేశం వర్గానికి చెక్ పెట్టె ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంతో ఒకప్పుడు నియోజకవర్గంలో అన్నీ తానై చక్రం తిప్పిన మాజీ ఎమ్మెల్యే వీరేశం ఇప్పుడు తన అనుచరులను కాపాడుకోలేని స్థితిలో ఉన్నారంటే ఇక్కడ చిరుమర్తి ఏరేంజ్ లో దూసుకుపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్ లో చేరిన నాటినుండే దూకుడు ప్రదర్శిస్తూ తన వర్గానికి పెద్దపీట వేసి వీరేశం వర్గాన్నినిర్వీర్యం చేసేపనిలో సక్సెస్ అయ్యారని విశ్లేషకులు సైతం చెబుతున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలల్లో టికెట్ల పంపిణీతో పాటు, సభ్యత్వ నమోదులోను వీరేశాన్ని పక్కన పెట్టారట ఎమ్మెల్యే చిరుమర్తి. దీంతో నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేతల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల్లో చిరుమర్తి కి అండగా ఉంటామని చెప్పిన నేతలంతా వీరేశం వైపు యూ టర్న్ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వీరేశం నియోజకవర్గంలో అనేక సేవ కార్యక్రమాలు చేస్తూ నియోజక ప్రజలకు అండగా మారుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా గులాబీ బాస్ నిర్ణయం నకిరేకల్ లో అసమ్మతులకు గుబులు రేపుతోంది.

ఏడాది ముందే టికెట్ పై ఓ క్లారిటీ ఇవ్వడం తో సస్పెన్స్ తెరపడిందనే చర్చ నకిరేకల్ లో జోరుగా సాగుతోంది. నకిరేకల్ నియోజకవర్గంలో రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. అయితే ప్రస్తుతం ఒకే పార్టీ నేతల మధ్యనే మనస్పర్థలు ఏర్పడడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారయ్యింది.

దీంతో అధిష్టానం పెద్దలకు వీరి వ్యవహరం పెద్ద తలనొప్పిగా మారిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. సిట్టింగులకే టికెట్ ఇస్తామని కేసీఆర్ స్వయంగా ప్రకటించినా, ఆశావహులు మాత్రం తమ ప్రయత్నాలను ఆపడం లేదు. దీంతో కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు.

ఇటీవలి కాలంలో టీఆర్ఎస్ నేతల మధ్య ఉన్న వర్గ విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. పార్టీ నేతల్లో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుతోంది. అయితే.. టీఆర్ఎస్ లో రోజుకో చోట వర్గ విభేదాలు బయటకు రావడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఈ ప్రభావం రానున్న ఎన్నికలపై పడనుందని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

Must Read

spot_img