HomeతెలంగాణBRS లో వరగ పోరు...!!

BRS లో వరగ పోరు…!!

ఆ జిల్లాలో అధికార పార్టీలో అసమ్మతి సెగలు రావణకాష్టంలా మారుతున్నాయా.. బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారా.. అధికార పార్టీ నేతల మధ్య ఆదిత్య పోరు కొనసాగుతోందా .. మంత్రి అండదండలతో పదవులను పొందిన నేతలే మంత్రికి ఎసరు పెడుతున్నారా… జిల్లాలో అసంతృప్తి నేతలను మంత్రి బుజ్జగించలేకపోతున్నారా… అసంతృప్తి స్వరాలను చల్లార్చలేక మంత్రి చతికిల పడుతున్నారా.. మంత్రిని కాదని ఆ నేతలిద్దరూ పార్టీలో కొనసాగుతారా… అసమ్మతిని చల్లార్చేందుకు ఆ మంత్రి ఏలాంటి అడుగులు వేయనున్నారు.. ఎవరా మంత్రి.. ఏదా జిల్లా..

తెలంగాణలో ముందస్తు ఎన్నికల టాక్ వెల్లువెత్తుతోంది. దీంతో ఎన్నికలు సమీపి స్తున్న కొద్ది అధికార పార్టీలో లుకలుకలు పెరుగుతున్నాయి. తాజాగా వనపర్తి జిల్లా భారతీయ రాష్ట్రీయ సమితి బీఆర్ ఎస్ లో అసమ్మతి సెగలు పీక్ స్టేజికి చేరుతున్నాయి. ఎక్కడ చూసినా అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు పరస్పర విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం సహజం. కానీ అధికార పార్టీలో తలెత్తే విభేదాలు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. గత కొన్ని నెలలుగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొన్ని నియోజక వర్గాల్లో అధికార పార్టీ నేతల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. వనపర్తి జిల్లాలో గత కొన్ని నెలలుగా సాగుతున్న వ్యవహారాలు మంత్రి వర్సెస్ జిల్లా పరిషత్ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, పెద్ద మందడి ఎంపీపీ మెగా రెడ్డిగా సాగుతోంది.

మంత్రి అండదండలతోనే వీరిద్దరూ పదవులను అలంకరించినప్పటికీ పేరుకే పదవులు కానీ మాకు ప్రొటోకాల్ విధానంలో ప్రాధాన్యం ఎక్కడ ఇస్తున్నారంటూ ఆరోపిస్తూ.. గత కొంత కాలంగా జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, పెద్దమందడి ఎంపీపీ మెగా రెడ్డితో పాటు మరి కొంతమంది ప్రజాప్రతినిధులు తమ అసంతృప్తి స్వరాలను అక్కడక్కడ వినిపిస్తూ వస్తున్నారు. ఆ మధ్య జరిగిన ఓ సమీక్ష సమావేశంలో జిల్లా పరిషత్ నిధులు, తదితర అంశాలకు సంబంధించి -మంత్రి నిరంజన్ రెడ్డి జోక్యం చేసుకుంటున్నారని అధికారుల ముందే మంత్రిపై తన అసహనాన్ని సైతం ప్రదర్శించారు.

మంత్రి, జిల్లా పరిషత్ పుర చైర్మన్ లోకనాథ్ రెడ్డి మధ్య వాదనలు కూడా జరగడం ఉమ్మడి పాలమూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మంత్రి అత్యంత సన్నిహితుడు, ప్రస్తుతము పెద్దమందడి ఎంపీపీ మెగా రెడ్డి సైతం అసమతి రాగం ఎత్తుకున్నారట. ఇటీవల మెగారెడ్డి అనుచరుడు శివ అనే వ్యక్తి మంత్రికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియోను షేర్ చేయడం సంచలనంగా మారింది. ఈ వ్యవహరంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి శివను అరెస్టు చేశారు. దీంతో అధికార పార్టీ కార్యకర్తలు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటూ సామాజిక మాధ్యమాల్లో ఎప్పటికప్పుడు తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో శివ పై పోలీసుల ప్రతాపాన్ని నిరసిస్తూ పలు సంఘాల నేతలు సైతం విమర్శలు చేస్తున్నారు. ముఖ్య నేతలు ఈ అంశాలపై నోరు మెదపక పోయినప్పటికీ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాల వెనక అ నేతల ప్రమేయం దాగి ఉందని ప్రచారం సాగుతోంది.తన నియోజకవర్గానికి దాదాపుగా ప్రతి మండలానికి సాగునీరు అందించడంతోపాటు అభివృ ద్ధి కార్యక్రమాలలోనూ తన వంతు పాత్రను పోషిస్తున్న మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న.. నియోజ కవర్గంలో అసంతృప్తి సెగలు బయటకు వస్తుండడం అధికార పార్టీ శ్రేణుల్లో రకరకాలుగా చర్చలు సాగుతున్నాయి.

వచ్చే రెండు మూడు వారాల్లో వనపర్తి అధికార బీఆర్ఎస్ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ కు అత్యంత ఆప్త్తుడిగా పేరొందారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఉద్యమ సమయం నుంచే నిరంజన్ రెడ్డి కెసిఆర్ కు రైట్ హ్యాండ్ గా మెలుగుతూ వస్తున్నారు.. ప్రతి అంశంలో కేసీఆర్ తీసుకునే నిర్ణయాల్లో కూడా నిరంజన్ రెడ్డి ముఖ్య భూమిక పోషిస్తూ వచ్చారు.. కెసిఆర్ తో అత్యంత సన్నిహితంగా మెలిగిన నిరంజన్ రెడ్డికి ఉమ్మడి జిల్లాలో రాజకీయంగా ఎదురులేకుండా పోయింది… ఆయన మాట సీఎం కేసీఆర్ కూడా తీసివేయలేడు అనే స్థాయికి నిరంజన్ రెడ్డి గ్రాఫ్ పెరిగింది…

ఇలా తన జిల్లాలో నిరంజన్ రెడ్డి ఎవరికి పదవి కట్టపెట్టాలన్న క్షణాల్లో జరిగిపోయేది.. నిరంజన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన లోకనాథ్ రెడ్డికి కూడా ఎన్నో ఆటంకాలు ఎదురైనా జెడ్పి చైర్ పర్సన్ గా పదవి కట్టబెట్టడంలో ఆయన కీ రోల్ ప్లే చేశారు. అలాగే పెద్దమందడి ఎంపీపీ వ్యాపారవేత్త కాంట్రాక్టర్ మెగా రెడ్డి కూడా నిరంజన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడే.. ఏక్కడ ఏ కాంట్రాక్టు పని ఉన్న మెగారెడ్డి కే పనులు అప్పగించే విధంగా నిరంజన్ రెడ్డి పరోక్షంగా కృషి చేస్తారని ప్రచారం కూడా సాగింది… ఇలా తనకు అత్యంత సన్నిహితులకు ఏ పదవి కావాలన్నా వారికి న్యాయం చేసేలా నిరంజన్ రెడ్డి పట్టుదలతో కృషి చేస్తాడని పేరు ఉంది… కానీ రోజులు గడుస్తున్న కొద్ది నిరంజన్ రెడ్డికి ఆయన సన్నిహితులైన లోకనాథ్ రెడ్డి, ఎంపీపీ మెగా రెడ్డిల మధ్య దూరం పెరుగుతూ వచ్చింది..

ఒకానొక సమయంలో జడ్పీ చైర్ పర్సన్ లోక్నాథ్ రెడ్డి బహిరంగంగానే నిరంజన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ వచ్చారు.. భవిష్యత్తులో లోకనాథ్ రెడ్డి కూడా ఏదైనా ఒక పార్టీలో చేరి ఎమ్మెల్యే కు పోటీ చేస్తాడని ప్రచారం కూడా మొదలైంది.. ఇదే సమయంలో నిరంజన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా మేలిగిన మెగారెడ్డి సైతం నిరంజన్ రెడ్డి ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు.. ఈ క్రమంలోనే మెగా రెడ్డి వర్గానికి చెందిన శివ అనే వ్యక్తి విషయంలో నిరంజన్ రెడ్డి మెగా రెడ్డి వర్గాలుగా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చీలిపోయారు.. భవిష్యత్తులో లోక్నాథ్ రెడ్డి వెంబడి మెగా రెడ్డి కూడా పయనిస్తాడని ఇద్దరు కలిసి మంత్రి నిరంజన్ రెడ్డి కు చెక్ పెట్టే విధంగా వ్యూహాలు రచిస్తారని ప్రచారం కొనసాగుతోంది… కానీ భవిష్యత్తులో అన్ని సద్దుమనుగుతాయని బిఆర్ఎస్ సీనియర్ నాయకులు చెబుతున్నారు.

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మంత్రిని వ్యతిరేకిస్తున్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్ లోక నాథ్ రెడ్డి, పెద్దమందడి ఎంపీపీ మెగా రెడ్డి తది తరులపై అవిశ్వాస తీర్మానం పెట్టి పక్కకు తప్పించాలనుకున్నారు. అయితే ఎన్నికల సమయంలో అసంతృప్తి సెగలు బయటకు రాకుండా ఉండేందుకు వీలుగా వారికి నచ్చ చెప్పి పార్టీలో కొనసాగే విధంగా చేయాలని అధిష్టానం మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. వారికి వారుగా తమ పదవులకు రాజీనామా చేసి ఇతర పార్టీలోకి వెళతారని, కొందరు.. ఇదే పార్టీలో కొనసాగుతారని మరికొందరు అంటున్నారు.

మొత్తంగా వచ్చే నెలలో వనపర్తి జిల్లాలో అధికార పార్టీని ఇరకాటంలో పెట్టే విధంగా మార్పులు చేర్పులు తప్పకుండా ఉంటాయన్న ప్రచారం సైతం ఊపందుకుంది..ఏదేమైనా వనపర్తి జిల్లాలో అధికార పార్టీలోనే రోజురోజుకు కుమ్ములాటలు మొదలు కావడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయంశంగా మారుతోంది.
మంత్రి ఇలాకాలోనే ఇలాంటి అసమ్మతి రాగాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో కూడా అక్కడక్కడ ఇలాంటి అసమతి రేగే అవకాశం కచ్చితంగా ఉంటుందని సీనియర్ నాయకులు చెబుతున్నారు .. తమకు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ప్రియారిటీ ఇవ్వడం లేదని బీఆర్ఎస్​లోని సెకండ్​కేడర్​ లీడర్లు మంత్రిపై గుర్రుగా ఉన్నారు.తమకు కనీస సమాచారం ఇవ్వకుండా గ్రామాల్లో పల్లె నిద్ర లాంటి కార్యక్రమాలు చేపట్టడంపై నారాజ్​ అవుతున్నారు.

వివిధ ప్రభుత్వ శాఖల్లోని అధికారులపై అవినీతి ఆరోపణలు వస్తున్నా మంత్రి స్పందించకపోవడంపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వస్తున్నాయి. మంత్రితో లింక్ ​అయి ఉన్న ఈ ఇష్యూస్​ బీఆర్ఎస్​ విజయావకాశాలను ప్రభావితం చేయనున్నాయి. పోలీసులను అడ్డుపెట్టుకుని మంత్రి ప్రతిపక్షాలను భయపెడుతున్నారన్న టాక్ నడుస్తోంది. వనపర్తి మున్సిపాలిటీలో వచ్చిన అవినీతి ఆరోపణలను మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ పట్టించుకోకపోవడం, మంత్రి నిరంజన్ రెడ్డి కూడా జోక్యం చేసుకోకపోవడంతో నెగటివ్​ టాక్ వచ్చిందని కేడర్ సైతం చెబుతున్నారు.

Must Read

spot_img