జాతీయ పార్టీగా ప్రస్థానం ప్రారంభించిన బీఆర్ఎస్ .. ఏపీ దిశగా అడుగులు వేస్తోందా..? ముఖ్యంగా ఏపీ నేతలపై కన్నేస్తోందా..? వచ్చే ఎన్నికలే టార్గెట్ గా కేసీఆర్ వ్యూహాలు పన్నుతున్నారా..? మరి ఈ పార్టీకి కలిసివచ్చే నేతలెవరన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందా..?
ఏపీలో కూడా యాక్టివ్ అవ్వాలని అనుకుంటున్న జాతీయ పార్టీ బీఆర్ఎస్ లోకల్ నాయకత్వంపై కన్నేసినట్లు సమాచారం. ఇందులో భాగంగానే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ఆహ్వానంపంపిందట. తమ పార్టీలో చేరాలని మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ ఆహ్వానించారని సమాచారం. వైజాగ్ ఎంపీగా పోటీ చేయనున్నట్లు లక్ష్మీనారాయణ ఈ మధ్యనే ప్రకటించారు. కానీ ఏ పార్టీ అన్నది చెప్పలేదు. కొంతమందేమో ఆప్‌లో చేరి రాష్ట్ర కన్వీనర్ బాధ్యతలు తీసుకోనున్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో మళ్ళీ జనసేనలో చేరటానికి మాజీ జేడీ ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇవేమీకాదు వైజాగ్ ఎంపీగా ఇండిపెండెంట్‌గా ప్రతిపక్షాల మద్దతుతో పోటీచేయనున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.
ఈ నేపధ్యంలోనే హఠాత్తుగా బీఆర్ఎస్ నుండి ఆహ్వానం అనే విషయం బయటపడింది. పార్టీ ఆఫీస్‌ను ఏర్పాటు చేసేందుకు తలసాని విజయవాడ రానున్నారని, ఆ టైంలో తలసాని కొందరు నేతలతో సమావేశమయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. లక్ష్మీనారాయణకు ఆహ్వానం పంపినట్లుగానే కాంగ్రెస్ పార్టీలోని కొందరు సీనియర్ నేతలతోను, ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి తర్వాత కాలంలో యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేతలతో బీఆర్ఎస్ నేతలు టచ్‌లోకి వెళుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
విజయవాడలో పార్టీ ఆఫీస్ ఏర్పాటు సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ అనుకున్నారట.
ఆ సభ జరిగేనాటికి కొందరు నేతలనైనా పార్టీలో చేరేట్లుగా ఒప్పించాలని తలసానిని ఆదేశించినట్లు సమాచారం. టికెట్లు రాని వివిధ పార్టీల్లోని నేతలు బీఆర్ఎస్ వైపు చూసే అవకాశాలు ఎక్కువున్నాయి. ఏదేమైనా బీఆర్ఎస్ ఏపీలోని కొన్ని పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయటం ఖాయమనే అనిపిస్తోంది. అయితే ఎన్ని సీట్లు, ఏ నియోజకవర్గాల్లో పోటీ చేయాలనే విషయాన్ని మాత్రం ఇంకా ఫైనల్ చేయలేదట. తమ పార్టీలో చేరే నేతలను బట్టి నియోజకవర్గాలు, వాటి సంఖ్యను ఫైనల్ చేయవచ్చని కేసీయార్ అనుకుంటున్నట్లు తెలిసింది. ముందుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసే బాధ్యతలను కేసీఆర్ మంత్రి తలసానికి అప్పగించారట.
తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత్ రాష్ట్ర సమితిగా మారిపోయింది. ఈసీ నుంచి అనుమతులు రావడం, పార్టీ అధినేత కేసీఆర్ దాన్ని అధికారికంగా ప్రారంభించడం చకచకా జరిగిపోయాయి. ఇన్నాళ్లూ తెలంగాణకు మాత్రమే పరిమితమైన ఆ పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించేందుకు అడుగులు వేస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో సొంతంగా అడుగులు వేసేందుకు కేసీఆర్ వ్యూహరచన చేస్తుంటే.. మరికొన్ని రాష్ట్రాల్లో పొత్తుల ద్వారా సీట్లు, ఓట్లు సాధించాలనుకుంటున్నారు. ప్రస్తుతానికి కేసీఆర్ కున్న పెద్ద హోప్ సౌతిండియా మాత్రమే.
ముఖ్యంగా తెలంగాణను ఆనుకుని ఉన్న రాష్ట్రాలపైనే కేసీఆర్ ఎక్కువగా ఫోకస్ పెట్టబోతున్నారు. ఏపీ, మహారాష్ట్ర, కర్నాటకల్లో బీఆర్ఎస్ విస్తరణకు కేసీఆర్
సిద్ధమవుతున్నారు. అయితే టీఆర్ఎస్ వల్లే ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం చేపట్టిన కేసీఆర్ ఎట్టకేలకు దాన్ని సాధించుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సమయం నుంచే టీఆర్ఎస్ పై, కేసీఆర్ పై ఏపీలో వ్యతిరేకత ఉంది. ఆయన వల్లే రాష్ట్ర విభజన జరిగిందనే కోపం ఉంది.
రాష్ట్రం కలిసుండాలని ఏపీ వాసులు కోరుకున్నారు. విడిపోవాలని తెలంగాణ ప్రజలు ఆశించారు. ఎట్టకేలకు తెలంగాణే గెలిచింది. అయితే విభజన వల్ల తమకు అన్యాయం జరిగిందనే బాధ ఆ తర్వాత కూడా ఏపీలో కొనసాగుతోంది. రాజధాని లేకుండా పోయిందని.. పరిశ్రమలు, పెద్ద పెద్ద సంస్థలన్నీ హైదరాబాద్ కే పరిమితం అయ్యాయనే అభిప్రాయం ఏపీవాసుల్లో ఇప్పటికీ ఉంది. అందుకే తెలంగాణపైన, ముఖ్యంగా కేసీఆర్ పైన ఆంధ్రప్రదేశ్ లో వ్యతిరేకత పెరిగిన మాట వాస్తవం. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. రాష్ట్రం విడిపోయి ఎనిమిదిన్నరేళ్లు అయింది. ఈ కాలంలో ఏపీతో పోల్చితే తెలంగాణ ఎంతో మెరుగ్గా ఉంది. అన్ని అంశాల్లో ఏపీ కంటే ఎంతో అభివృద్ధి చెందింది.
కేసీఆర్ ముందు చూపు, చతురత, ఆర్థిక వనరులు లాంటి అనేక అంశాలు తెలంగాణకు కలిసొచ్చాయి.
దీంతో అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. అదే సమయంలో ఏపీలో మాత్రం పరిస్థితి ఏమాత్రం అనుకూలంగా లేదు. ముఖ్యంగా ఆర్థిక వనరులు సమృద్ధిగా లేవు. లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఆదుకుంటామని మాటిచ్చిన కేంద్రం కూడా అరకొర నిధులు మాత్రమే విదిలించి దులిపేసుకుంది.
మరోవైపు విభజన తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ, వైసీపీ రాజకీయాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో అభివృద్ధి అనుకున్నంత స్థాయిలో జరగలేదు. ఒకప్పుడు దేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామి. కానీ ఇప్పుడు రోజురోజుకూ దిగజారిపోతోంది.
ఇదే సమయంలో ఏపీ నుంచి విడిపోయన తెలంగాణ అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. దీంతో ఏపీ వాసుల్లో ఏపీ కంటే తెలంగాణే నయం అనే భావన కలుగుతోంది. తెలంగాణ ఏర్పడితే ఏపీ వాళ్లను వెళ్లగొడతారనే ప్రచారం అప్పట్లో బాగా జరిగింది. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత అందర్నీ అక్కున చేర్చుకున్నారు కేసీఆర్. దీంతో ఏపీ ప్రజల్లో తెలంగాణ పట్ల, కేసీఆర్ పట్ల సానుకూలత ఏర్పడింది. ఏపీలో ఉండడం కంటే తెలంగాణకు వెళ్తే విద్య, ఉపాధి, ఉద్యోగం లాంటి అనేక అంశాల్లో మెరుగ్గా ఉండొచ్చనే ఫీలింగ్క లుగుతోంది.
దీంతో ఒకప్పుడు తెలంగాణపై ఉన్న వ్యతిరేకత ఇప్పుడు ఏపీ వాసుల్లో లేదు.
దీన్నే అస్త్రంగా వాడుకోవాలనుకుంటున్నారు కేసీఆర్. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ పరిస్థితులను వాడుకునేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తనతో టచ్ లో ఉన్న పలువురు నేతలతో పాటు వైసీపీ, టీడీపీ పట్ల వ్యతిరేక భావజాలంతో ఉన్న నేతలపై కేసీఆర్ ప్రధానంగా దృష్టి పెడుతున్నట్టు సమాచారం. విభజన అనంతరం రాజకీయ ఉపాధి కోల్పోయిన కాంగ్రెస్ నేతలను కూడా బీఆర్ఎస్ లో చేర్చుకునేందుకు కేసీఆర్ ఆలోచిస్తున్నారు. అంతేకాక, వైసీపీ, టీడీపీలో టికెట్లు రాక భంగపడే వాళ్లకు బీఆర్ఎస్ తరపున టికెట్లు ఇవ్వడం ద్వారా ఓట్ల శాతాన్ని పెంచుకోవాలనుకుంటున్నారు.
రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం ఉంటే ఇది సాధ్యమవుతుందనే ప్రచారంతో ఏపీలో అడుగు పెట్టాలని కేసీఆర్ఆ లోచిస్తున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఇప్పటికే కొంతమంది నేతలు ఏపీలో హడావుడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ సక్సెస్ అవుతారా? లేదా? అన్నది తెలియదు కానీ ఏపీలో మాత్రం ఉనికి చాటుకోవడం అంతా ఆషామాషీ కాదు. ఏపీలో కుల రాజకీయాల ప్రభావం ఎక్కువ. ఈ లెక్కన కేసీఆర్ ఇప్పుడు కుల రాజకీయం తెరపైకి తెచ్చే అవకాశముంది.
వెలమ సామాజికవర్గానికి చెందిన కేసీఆర్ .. తన కేస్ట్ ప్రభావం అధికంగా ఉండే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కడప జిల్లాలపై ఫోకస్
పెంచనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే కేసీఆర్ స్ట్రాటజీ కరెక్టయ్యే అవకాశముంది. వాస్తవానికి వెలమ సామాజికవర్గంలో ఐక్యత ఎక్కువ. ప్రస్తుతం వైసీపీ, టీడీపీలో వెలమ నాయకులు కొనసాగుతున్నా.. వారి మధ్య పరస్పర సహకారం ఉంటుందన్న టాక్ వినిపిస్తుంటుంది. దీనినే ఆసరా చేసుకొని బీఆర్ఎస్ ను విస్తరించాలని కేసీఆర్ఉ వ్విళ్లూరుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ గెలుపోటములే కేసీఆర్ బీఆర్ఎస్ విస్తరణకు అవకాశాలు కల్పిస్తాయన్న వాదన వినిపిస్తోంది.
ఒక వేళ వైసీపీ కానీ ఓటమి చవిచూస్తే మాత్రం వైసీపీ నేతలను పార్టీలోకి రప్పించి నిర్వీర్యం చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంతకంటే ముందుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతలను భారతీయ రాష్ట్ర సమితిలోకి తేవాలని కేసీఆర్ వ్యూహం రూపొందించారు.
మరి బీఆర్ఎస్ వ్యూహం ఏమేరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాల్సిందే.