Homeఅంతర్జాతీయంఅమెరికా సామ్రాజ్యవాద కుట్రలకు లొంగిపోయిన బ్రెజిల్‌

అమెరికా సామ్రాజ్యవాద కుట్రలకు లొంగిపోయిన బ్రెజిల్‌

బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు బోల్సనోరా అనుచరుల దాడిని ఖండిస్తూ ప్రజలు భారీ ప్రదర్శనలు నిర్వహించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామని లూలా సర్కార్‌కు మద్దతుగా నినదించారు. అమెరికా సామ్రాజ్యవాద కుట్రలకు లొంగిపోయిన బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు బోల్సనారో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఈ పరాజయాన్ని జీర్ణించుకోలేక దేశ న్యాయవ్యవస్థపైనా అభాండాలు మోపుతూ..గత ఆది, సోమవారాల్లో పార్లమెంట్‌, అధ్యక్ష భవనం, అత్యున్నత న్యాయస్థానాలపై బొల్సనారో తన అనుచరులతో మూకుమ్మడి దాడులు చేయించారు. ఈ దాడులు మంగళవారం దేశవ్యాప్తంగా జరిగాయి. అయితే వీటిని వ్యతిరేకిస్తూ రియో డీ జెనిరో, సావోపోలో సహా పలు నగరాల్లో వేలాదిమంది ప్రజాస్వామ్య అనుకూల ర్యాలీలు జరిగాయి.

‘క్షమాభిక్ష లేదు, బోల్సనారోను జైలుకు పంపాల్సిండే’ అంటూ నినదిస్తూ అతిపెద్ద నగరమైన సావోపోలోలో వేలాదిమంది ప్రజలు ప్రదర్శన నిర్వహించారు. బ్రెజిల్‌లో అత్యంత ప్రఖ్యాతి చెందిన వీధి పాలిస్టా అవెన్యూలో ఒక భాగం బ్రహ్మాండంగా సాగిన ప్రజా ప్రదర్శనతో పూర్తిగా నిండిపోయింది. మొత్తంగా ఎక్కడ చూసినా జనం…న్యాయం కోసం నినదిస్తూ ముందుకు సాగారు. ఆ ప్రాంతమంతా అరుణవర్ణమయమైంది.

లూలా వర్కర్స్‌ పార్టీ పతాకమైన ఎరుపు రంగులో అనేకమంది దుస్తులు ధరించారు. ‘కుట్రదారులకు క్షమాభిక్ష లేదు’ అని రాసివున్న ప్లకార్డులను ప్రదర్శించారు. ఆదివారం నాటి మూక దాడులకు కారకులైన వారిని శిక్షించాల్సిందే అంటూ డిమాండ్‌ చేశారు. బోల్సనారోకు జైలే గతి అంటూ నినాదాలు చెలరేగాయి. ”బ్రసీలియాలో ఆదివారం జరిగిన ఘటనలతో ఏకీభవించలేం, అదొక పీడకల మాదిరిగా వుంది. ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసమున్న వారెవరూ అలా వ్యవహరించలేరు” అని జనం చెప్పారు. ఎన్నికల ఫలితాలు చెల్లవంటూ దాడులకు దిగిన వారిని ప్రపంచ దేశాలు ఆశ్చర్యంతో చూశాయి.

అయితే ప్రభుత్వం పట్ల మాకు విశ్వాసముంది, మా ప్రజాస్వామ్యం పట్ల మాకు నమ్మకముంది అని అంటున్న వేలాదిమంది ఇప్పుడు వీధుల్లోకి వచ్చారు. బ్రెజిల్‌కు ప్రాతినిధ్యం వహించేది వారు కాదు, మేము అంటున్నారు లూలా మద్దతుదారు. దేశ రాజధానిలో చాలాచోట్ల పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. వాతావరణమంతా ఉద్రిక్తంగా వున్నట్లు కనిపిస్తోంది. కాగా మరోవైపు అమెరికాలో వుంటూ దేశంలో దాడులకు పాల్పడేలా తన అనుచరులను రెచ్చగొట్టిన బోల్సనారో కడుపు నొప్పితో సోమవారం ఫ్లోరిడాలోని ఆస్పత్రిలో చేరారు. ఆదివారం నాటి దాడుల ఘటనలో దాదాపు 1500 మందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

బ్రసీలియా గవర్నర్‌ ఇబనెస్‌ రోకాను 90 రోజుల పాటు ఆ పదవి నుండి తొలగిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అల్లర్లను, దాడులను నివారించడంలో గవర్నర్‌ విఫలమయ్యారని న్యాయ శాఖ మంత్రి అలెగ్జాండర్‌ డీ మోరెస్‌ విమర్శించారు. దాడులతో అల్లరి మూకలు రెచ్చిపోతుంటే మౌనంగా చూస్తూ కూర్చున్నారని విమర్శించారు. ఇన్నాళ్లూ రాజకీయ వార్తల్లో పెద్దగా కనిపించని బ్రెజిల్ పేరును బొల్సనోరా కారణంగా ప్రధాన మీడియా సంస్థలన్ని హైలెట్ చేశాయి. ఆ దేశంలో చోటు చేసుకున్న అనూహ్య రాజకీయ పరిణామాల గురించి రిపోర్టు చేశాయి.

ఈ దేశంలో చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తే అమెరికాలో జరిగిన ఘటన గుర్తుకురాకుండా ఉండదు. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో జోబైడెన్ గెలవగానే అల్లరల్లరి చేసారు ట్రంప్. రిపబ్లికన్ల తరపు దేశాధ్యక్ష పదవి కోసం పోటీ పడి.. చివరకు ఓటమి పాలైన ట్రంప్.. అచ్చం ఇలాగే తన మద్దతుదారులను రెచ్చగొట్టారు. ఆ తర్వాత ఆగ్రహంతో పెద్ద ఎత్తున హింసాకాండకు తెర తీయటం.. పార్లమెంట్ భవనాన్ని టార్గెట్ చేసేందుకు వెనుకాడకపోవటం.. అందులోకి చొచ్చుకుపోయిన తీరు పెను సంచలనంగా మారింది. ఆ సందర్భంగా చోటు చేసుకున్న హింస ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనంగా.. భారీ షాకింగ్ గా మారింది.

అయితే.. ఇలాంటి ఉపద్రవాల్ని కంట్రోల్ చేయటానికి సుశిక్షితులైన బలగాలు అమెరికాలో ఉన్నప్పటికీ.. అల్లర్లు.. ఆందోళనను కంట్రోల్ లోకి తేవటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇదంతా ఎందుకంటే.. ట్రంప్ మద్దతుదారులు తమ అధినేత ఎన్నికల్లో ఓటమి పాలు కావటంతో ఆగ్రహానికి గురైన పరిస్థితుల్లో ఇలా జరిగినట్లుగా చెప్పటం జరిగింది. అయితే.. ఈ ఆరాచకం వెనుక ట్రంప్ ఆశీస్సులు ఉన్నాయన్న విషయం అందరికీ తెలుసు. సరిగ్గా ఇలాంటి పరిస్థితే బ్రెజిల్ లోనూ చోటు చేసుకుంది. ఉత్తర అమెరికాలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటిగా బ్రెజిల్ ను గురించి చెబుతుంటారు.

విస్తీర్ణం లెక్కన చూస్తే.. మన దేశం కంటే మూడు రెట్లు ఎక్కువ విస్తీర్ణం ఉన్న బ్రెజిల్ జనాభా మాత్రం కేవలం 20 కోట్లు మాత్రమే. తాటిచెట్ల భూమిగా పేరున్న ఈ దేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటిగా పేరుంది. అలాంటి ఈ దేశంలో ఇటీవల దేశాధ్యక్ష ఎన్నికలు జరిగాయి. అందులో లూయిజ్ ఇన్సియో లూలా డసిల్వా చేతిలో ఆయన ప్రత్యర్థి జైర్ బోల్సోనారో ఓటమిపాలు అయ్యారు. దీంతో తమ నాయకుడి ఓటమిని జీర్ణించుకోలేని ఆయన మద్దతుదారులు.. దేశ రాజధాని బ్రసీలియాలోని దేశాధ్యక్ష భవనంతో పాటు.. సుప్రీంకోర్టు.. కాంగ్రెస్ భవనాల్ని అక్రమించే ప్రయత్నం చేశారు.

ఇందులో భాగంగా ఆయా భవనాల ముందున్న బారికేడ్లను బద్దలుకొట్టి.. భవనాల గోడలు ఎక్కేశారు. అద్దాలు.. కిటికీల్ని ధ్వంసం చేశారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు కూర్చునే టేబుళ్లను ధ్వంసం చేయటం చూస్తే.. ఓటమి పాలైన నేత మద్దతుదారుల ఆరాచకం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసకోవచ్చు. ఇక.. అక్కడి ఫర్నీచర్ ను.. సామాన్లను ఇష్టారాజ్యంగా ధ్వంసం చేసిన వారిని అదుపులోకి తీసుకోవటం కోసం భద్రతా దళాలు పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఊహించని రీతిలో చోటు చేసుకున్న పరిణామాలతో ఉలిక్కిపడిన సైన్యం ఎంట్రీ ఇచ్చిన తర్వాత కానీ సీన్ మారలేదు.

మొత్తంగా 300 మందిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై దేశాధ్యక్షుడు సీరియస్ గా స్పందించటం వరకు ఓకే కానీ.. ఇలాంటిదేదో జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు పెద్ద ఎత్తున హెచ్చరిస్తున్న వైనం చూసినప్పుడు.. నిఘా వ్యవస్థ నిద్ర పోతుందా? అన్న సందేహం కలుగక మానదు. అధ్యక్ష ఎన్నికల్లో డసిల్వాగత ఏడాది అక్టోబరు 30న విజయం సాధించిన తర్వాత నుంచి ఓటమికి పాలైన వర్గంనుంచి నిరసనలు.. ఆందోళనలు చోటు చేసుకుంటున్నాయి. తాజా పరిణామాలపై స్పందించిన అధ్యక్షుడు డసిల్వా గవర్నర్ పై వేటు వేశారు. మిగిలిన వారిపై చర్యలకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే.. ఈ మొత్తం ఎపిసోడ్ కు కేంద్ర బిందువుగా మారిన మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనార్ మాత్రం కడుపు నొప్పి కారణంగా ఆసుపత్రిలో చేరటం గమనార్హం.

ఆయన తీవ్రమైన కడుపునొప్పితో బాధ పడుతున్నట్లుగా ఆయన సతీమణి పేర్కొన్నారు. ఇక్కడో ఆసక్తికర విషయాన్ని ప్రస్తావించాలి. ప్రస్తుతం ఈ పెద్ద మనిషి ఎక్కడ ఉన్నారో తెలుసా? అమెరికాలో. అవును.. ఫ్లోరిడాలో ఉన్న ఆయన.. అడ్వెంట్ హెల్త్ సెలబ్రేషన్ అక్యూట్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎన్నికల్లో ఓడినప్పటికీ ఆయన పదవీ కాలం జనవరి 2 వరకు ఉంది. అయితే.. దానికి రెండు రోజుల ముందే అంటే.. డిసెంబరు 31న ఆయన అమెరికాకు వెళ్లిపోవటం.. ఇది జరిగిన తొమ్మిది రోజులకే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవటంపై పలు సందేహాలు.. అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Must Read

spot_img