షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే జంటగా నటించిన పఠాన్ సినిమా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. తాజాగా ఈ చిత్రంలోని ‘బేషరమ్ రంగ్’ అనే పాటను విడుదల చేశారు ఈ సినిమా మేకర్స్. ఈ సాంగ్ పై మిశ్రమ స్పందన వస్తోంది. ఈ పాటలో దీపికా పదుకొణె, షారుఖ్ ఖాన్ కలిసి చేసిన డ్యాన్స్ స్టెప్పులు ట్రోల్ అవుతున్నాయి.
బాయ్ కాట్ బాలీవుడ్ నినాదం పఠాన్ సినిమాను బలంగా తాకింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో ఒక్కసారిగా ఊపందుకున్న ఈ స్లోగన్, హిందీలో పెద్ద సినిమా రిలీజైన ప్రతిసారి తెరపైకొస్తోంది. ఎంతోకొంత ఆ సినిమాను ప్రభావితం చూస్తోంది. ఇప్పుడు షారూక్ ఖాన్ వంతు వచ్చింది. లాంగ్ గ్యాప్ తర్వాత షారూక్ నటించిన సినిమా పఠాన్. విడుదలకు సిద్ధమైన ఈ సినిమాపై ఓ రేంజ్ లో నెగెటివ్ ప్రచారం జరుగుతోంది. బాయ్ కాట్ పఠాన్ అనే హ్యాష్ ట్యాగ్ ఇండియా వైడ్ ట్రెండ్ అవుతోంది. దీనికితోడు ఎప్పుడూ ఉన్నట్టే బాయ్ కాట్ బాలీవుడ్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతోంది.
ముఖ్యంగా పఠాన్ సినిమా లోని భేషరమ్ సాంగ్‌పై వివాదం మరింత రాజుకుంది. ఈ పాటను చాలా అశ్లీలంగా చిత్రీకరించారని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ట్విట్టర్‌లో బాయ్ కాట్ పఠాన్ సినిమా అని ట్రెండ్ అవుతోంది. దీపికా పదుకొనే దుస్తులపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాషాయం బిక్నీ ధరించి డ్యూయెట్ సాంగ్‌లో నటించడంపై మండిపడుతున్నారు బీజేపీ నేతలు. ఈ సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హిందువుల మనోభావాలను ఈ పాట గాయపర్చిందని ఆరోపిస్తున్నారు.
విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ పాట యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. . కానీ, ఈ పాటలో దీపికా ధరించిన కాషాయ రంగు బికినీపై మాత్రం వివాదం చినికిచినికి గాలివానగా మారుతోంది. ఈ మధ్య బాలీవుడ్ పాటలు ఇన్స్టా రీల్స్ కంటే చెత్తగా ఉన్నాయని కొంతమంది విమర్శిస్తున్నారు. బేషరమ్ పాట లోని అభ్యంతరకరమైన సీన్లను తొలగించాలని మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా డిమాండ్ చేశారు. లేదంటే మధ్యప్రదేశ్‌లో సినిమా ప్రదర్శనకు అనుమతిపై ఆలోచిస్తామన్నారు. దీపికా పదుకోన్ జేఎన్‌యూలో తుక్డే తుక్డే గ్యాంగ్‌కు మద్దతిచ్చారని , ఇలాంటి పాటలో నటించి మరోసారి హిందువుల మనోభావాలు గాయపర్చారని అన్నారు.