గుజరాత్ లో బీజేపీ విజయం.. వచ్చే సార్వత్రికంలో ప్రభావం చూపనుందన్న వాదనలు దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణం.. ఏకంగా
ఏడోసారి విజయమే కాక .. ప్రతిపక్షం బలహీనంగా మారడమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
024 ఎన్నికల్లో గుజరాత్ లో గెలుపు బీజేపీకి బూస్ట్ల్ లా మారనుందని విశ్లేషకులు చెబుతున్నారు. గుజరాత్ ఎన్నికల వేళ ప్రతిపక్షం ప్రధాన సవాల్ ను విసరలేకపోవడమే కాక .. ప్రభుత్వ వ్యతిరేక ఓటు సైతం చీలిపోవడమే కారణమని అంచనాలు వినిపిస్తున్నాయి.

ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి గుజరాత్‌లో బీజేపీ దుమ్ము రేపింది. వరుసగా ఏడోసారి విజయం సాధించిన ఆ పార్టీకి ఈ ఫలితాలు ఎంతో బూస్ట్
ఇస్తున్నాయి. చెప్పాలంటే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బలంగా నిలిచేందుకు ఈ ఫలితాలు బీజేపీకి పాజిటివ్ గా మారాయి. అయితే బీజేపీ విజయంలో మూడు అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఒకటి .. బీజేపీపై సహజంగానే ప్రజల్లో ఉన్న అభిమానం, రెండోది .. ప్రతిపక్ష కాంగ్రెస్ ఓటర్లకు ఏమాత్రం ఆసక్తి చూపించలేనంత బలహీనంగా మారడం, మూడోది ఆప్ ఇతర పార్టీల ఓట్లను చీల్చడమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జనరల్‌గా ఏదైనా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే.. వీలైనంతవరకూ ఆ అధికారాన్ని కోల్పోకుండా స్థిరంగా కొనసాగిస్తూ ఉంటుంది.
ఇది గుజరాత్‌లో అత్యధికంగా ఉందని ఫలితాలే చెబుతున్నాయి. బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందనీ.. అందువల్ల ఈసారి గుజరాత్‌లో ఆ పార్టీకి సవాళ్లు తప్పవని కొన్ని అంచనాలు మొదట్లో తెరపైకి వచ్చాయి. ఐతే.. కాంగ్రెస్ జోరుగా లేకపోవడం, ఆప్ లాంటి పార్టీలు.. ఉత్సాహం చూపించడంతో.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి బీజేపీకి కలిసొచ్చింది. ఇక మోదీ, అమిత్ షా ద్వయానికి గుజరాత్ పెట్టని కోట. అక్కడ అడుగడుగునా వారికి ప్రజామోదం ఉంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పట్టు మరింత పెరిగింది.
అందువల్లే ఈ ఫలితాలు వన్ సైడ్ అయ్యాయన్న అంచనాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ ఫలితాల్ని బీజేపీ కచ్చితంగా లోక్‌సభ ఎన్నికలకు ఉపయోగపడేలా చేసుకుంటుంది. తన మైలేజ్‌ని ఇలాగే కంటిన్యూ చేస్తూ… దేశవ్యాప్తంగా తన మార్క్ మరోసారి చూపించేందుకు ప్రయత్నిస్తుందని కూడా టాక్ వినిపిస్తోంది. అదేసమయంలో దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ బలహీనంగా ఉన్నందువల్ల.. 2024 ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలకు కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి.
ప్రధాని నరేంద్రమోదీ స్వరాష్ట్రంలో బీజేపీ విజయం
ప్రధాని నరేంద్రమోదీ స్వరాష్ట్రంలో బీజేపీ విజయం ఊహించిందే కానీ, అది ఇంత ఘనంగా ఉంటుందని అనుకోలేదు. ఆరుసార్లు అధికారంలో ఉన్న
తరువాత, ఇలా ఏడోసారి యాభైశాతాన్ని దాటిన ఓట్లతో గత రికార్డులన్నీ బద్దలుకొడుతూ అధికారంలోకి రావడం ఆశ్చర్యకరమైన విషయం. స్వరాష్ట్రంలో మోదీ ప్రాభవం చెక్కుచెదరలేదనడానికి ఇది నిదర్శనం.

గుజరాత్ లో బీజేపీ అఖండ విజయానికి మోదీ కంటే కేజ్రీవాల్ ను ఎక్కువగా మెచ్చుకోవాలన్న రాజకీయ విశ్లేషకుల వ్యాఖ్యలను అటుంచితే, ఈ మారు బీజేపీ రాష్ట్రంలోని అన్ని దిక్కుల్లోకీ, పట్టణ గ్రామీణ తేడాలేకుండా అన్ని చోట్లకూ చొచ్చుకుపోయింది. ఆమ్ ఆద్మీ ముఖ్యమంత్రి అభ్యర్థితో సహా ఆ పార్టీకి చెందిన ప్రముఖులందరినీ ఓడించింది. సహజ ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమిస్తూ వరుసగా ఆరుసార్లు అధికారంలో సాగడం, ఏడోమారు 1985లో కాంగ్రెస్ సాధించిన 149స్థానాల రికార్డును కూడా చెరిపివేయడం చిన్న విషయం కాదు.
మూడేళ్ళనాటి లోక్ సభ ఎన్నికల్లో 62శాతం ఓట్లతో 173 అసెంబ్లీ స్థానాలకు సమానమైన 26 పార్లమెంటు స్థానాలను బీజేపీకి కట్టబెట్టిన గుజరాతీయులు ఇప్పటికీ అదే స్థాయిలో ఆ పార్టీకి, గుజరాత్ అంటే మోదీయే అన్న భావనకు కట్టుబడి ఉన్నారు.
మోదీ, హిందూత్వ, విపక్ష చీలికలు కలగలిసి ఈ విజయాన్ని అందించాయి. మోదీ దేశానికి ప్రధాని కావచ్చుగానీ, గుజరాత్ కు మాత్రం ఆయన జీవితకాలపు ముఖ్యమంత్రి అని ఫలితాలు చెబుతున్నాయి. 182 అసెంబ్లీస్థానాలున్న గుజరాత్ లో ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా నిలబెట్టకుండా, ముస్లిం జనాభా ఆధిక్యం ఉన్న 19 అసెంబ్లీస్థానాల్లో 17 స్థానాలు బీజేపీ గెలుచుకుంది. వ్యతిరేక ఓట్లు చీలిపోయి బీజేపీ వాటా పెరగడం వెనుకా, ఓట్లలోనూ సీట్లలోనూ కాంగ్రెస్ దెబ్బతినడం వెనుకా కొత్తగా రంగప్రవేశం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ పాత్ర స్పష్టంగానే కనిపిస్తోంది.
ఒకప్పుడు రాష్ట్రాన్ని వరుసగా మూడుసార్లు ఏలిన కాంగ్రెస్, ఏమాత్రం గట్టిపోటీ ఇవ్వకుండా చతికిలబడిపోతున్న స్థితిలో, ఇక్కడ తెచ్చుకున్న ఓట్లతో
ఆప్ జాతీయపార్టీగా అవతరించనుంది. ఈ రెండు రాష్ట్రాల ఫలితాలతో ఈ ఏడాది ముగిసిపోయినా, వచ్చే ఏడాది నాలుగు ఈశాన్య రాష్ట్రాలతోపాటు,
మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, తెలంగాణ తదితర రాష్ట్రాలు ఎన్నికలకు రానున్నాయి. సార్వత్రక ఎన్నికల్లో మోదీ ప్రభావం ఉన్నా, రాష్ట్రాల
ఎన్నికలకు వచ్చేసరికి ఇతరత్రా అంశాలు ఓటర్లను ప్రభావితం చేస్తాయన్న నమ్మకంతో విపక్షాలు ఆ ఎన్నికలకు సంసిద్ధం కావచ్చు.
అయితే బీజేపీని గట్టిగా ఢీకొనేందుకు ఒక ప్రధాన సవాలుదారు అవసరమన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ప్రధాన సవాలుదారు ప్రజలకు ఒక స్పష్టమైన
సందేశాన్ని ఇవ్వాలి, ప్రజలు ఆ సందేశకుడితో తాదాత్మ్యం పొందాలి. ప్రతిపక్షం దృఢ సంకల్పంతో, సంఘటిత పోరాటం చేయవలసి ఉంది. అదే, కాంగ్రెస్లో ప్రధానలోపంగా ఉంది. గుజరాత్, ఢిల్లీలో కాంగ్రెస్ ఒక పటిష్ఠ వ్యూహంతో ప్రజల ముందుకు రాలేదు. ఢిల్లీలో కొత్త నాయకుడిని ప్రజల ముందుకు తీసుకువచ్చి ఉండవలసింది. గుజరాత్లో ఒక కచ్చితమైన లక్ష్యంతో కాంగ్రెస్ పోరాడనే లేదు.
మొత్తంగా, ఆమ్ ఆద్మీ పార్టీలో ఒక దృఢసంకల్పం, పటిష్ఠ వ్యూహం కనిపించాయి. హిమాచల్లో తనకు అవకాశాలు లేవని గ్రహించిన వెంటనే ఆ పార్టీ తన శక్తియుక్తులను గుజరాత్లో కేంద్రీకరించింది. ఈ ఎన్నికల ఫలితాలు నేర్పే పాఠం ప్రతిపక్షానికి కొత్తదేమీ కాదు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఓటమి నుంచి కూడా ఇదే పాఠాన్ని నేర్చుకోవచ్చు. ఆ మాటకొస్తే కొత్త సాగు చట్టాలపై చరిత్రాత్మక రైతు పోరాటం నేర్పిన పాఠమూ భిన్నమైనదేమీ కాదు. అయితే అందుకు ప్రతిపక్షం
దృఢసంకల్పంతో, గట్టి పట్టుదలతో, వ్యూహాత్మకంగా పోరాడి తీరాలని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇదే సమయంలో 2024 ఎన్నికలను గుజరాత్ ఫలితాలు నిర్దేశిస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.. ఒకవేళ గుజరాత్ రాష్ట్రంలో బిజెపి ఓడిపోతే ఆ ప్రభావం దేశ రాజకీయాలపై ఉంటుందని వారు చెప్తున్నారు. గుజరాత్ ఎన్నికల తర్వాత దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణ, ఉత్తరాదిలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి. ఒక రాష్ట్ర ఎన్నికలు ఇంకో రాష్ట్రం ఎన్నికలను ప్రభావితం చేయకపోయినప్పటికీ.. ఇక్కడ గుజరాత్ రాష్ట్రం అనేది మోడీ సొంత ప్రాంతం కాబట్టి అందరి దృష్టి ఆ ఎన్నికలపైనే ఉంది.
అయితే బిజెపికే ఓటర్లు జై కొట్టడంతో, దేశ రాజకీయాల్లో నరేంద్ర మోడీ చరిష్మాకి డోకా ఉండదు. అయితే గుజరాత్ లో కాంగ్రెస్ ఘోర పరాజయం వెనుక ‘ఆప్’ వాటా కూడా ఉండడం చర్చనీయాంశంగా మారింది. మతతత్వ బీజేపీకి ‘పరోక్షంగా’ లాభం చేకూర్చే కార్యకలాపాలపై ఆప్ లో సమీక్ష అవసరమని విశ్లేషకులు అంటున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలు మరింత కలిసికట్టుగా పనిచేయాల్సిన అనివార్యత ఏర్పడుతుంది. అయితే ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇది సాధ్యమేనా అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. ఇక ప్రాంతీయ పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్నా.. వాటి మధ్య ఐక్యత కనిపించట్లేదు.
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం కేసీఆర్ వంటి వారు బీజేపీకి వ్యతిరేకంగా బలంగా తమ వాణి వినిపిస్తున్నా.. వారితో కలిసొచ్చేందుకు ఇతర ప్రాంతీయ పార్టీలు అంతగా ఆసక్తి చూపట్లేదు. దానికి తోడు ఈ పార్టీలేవీ కాంగ్రెస్‌తో జట్టు కట్టేందుకు సిద్ధంగా లేవు. ఇలా ప్రతిపక్షాల్లో ఉన్న చీలిక, ఎత్తుగడలను బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో గుజరాత్ గెలుపు.. 2024 ఎన్నికల్లో బీజేపీకి
బూస్ట్ ఇస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఓ రాష్ట్ర ఎన్నికలు దేశవ్యాప్త పోల్స్ పై ప్రభావం చూపకున్నా.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి మాత్రం అవి.. మరింత బలాన్నిస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.