Homeతెలంగాణబీజేపీ రాజకీయం సాగుతోందా..?

బీజేపీ రాజకీయం సాగుతోందా..?

తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా వచ్చే ఎన్నికల కోసం సిద్ధమవుతున్న బిజెపి ఇప్పటినుండే ప్రజా క్షేత్రంలోకి దూసుకు వెళుతోంది. ఉత్తర తెలంగాణలో పార్టీ కాస్త బలంగానే ఉన్నట్టు భావిస్తున్న బీజేపీ, దక్షిణ తెలంగాణ జిల్లాలలో పార్టీని బలోపేతం చేయడానికి ఫోకస్ చేస్తోంది. ఈ క్రమంలో బిజెపి హై కమాండ్ నేడు, రేపు పార్టీ కార్యవర్గ సమావేశాలను పాలమూరు కేంద్రంగా నిర్వహిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి రావాలని దృఢమైన సంకల్పంతో ఉన్న బిజెపి నేతలు నేడు, రేపు జరగనున్న కీలక సమావేశాలలో రాబోయే ఎన్నికల కార్యాచరణకు ప్లాన్ చేస్తున్నారు.

పార్టీ బలాబలాలపై నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలతో చర్చించి వచ్చే ఎన్నికలలో దక్షిణ తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహాలపై పాలమూరు వేదికగా యాక్షన్ ప్లాన్ రూపొందించనున్నారని సమాచారం. ఇప్పటికే బీజేపీ రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను బలోపేతం చేయడం కోసం గత డిసెంబర్లో 119 నియోజకవర్గాలకు పాలకులను నియమించింది. ఆపై 17 లోక్సభ స్థానాలకు 46 మంది కన్వీనర్లను, జాయింట్ కన్వీనర్లను, 17 మంది ప్రభారీలను నియమించింది.

ఆయా నియోజకవర్గాల వారీగా వారంతా ఏ విధంగా పనిచేస్తున్నారు అన్నదానిపై తాజా కార్యవర్గ సమావేశాలలో సమీక్ష చేయనున్నట్టు సమాచారం. అంతే కాక పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో చర్చించి వారికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చి పార్టీని ముందుకు తీసుకు వెళ్లేందుకు దిశా నిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు కేంద్రంలో బిజెపి సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత ఎక్కువగా తీసుకువెళ్లడం, అలాగే కేంద్ర సర్కార్ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని, తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఏమి ఇవ్వడం లేదని దుష్ప్రచారం
చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నేతల ప్రచారాన్ని తిప్పి కొట్టడానికి మాస్టర్ ప్లాన్ ని కూడా ఈ రెండు రోజుల సమావేశాలలో రూపొందించనున్నట్టు సమాచారం.

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కృష్ణ జలాల వినియోగంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు నల్గొండ జిల్లా, సహా దక్షిణ తెలంగాణ జిల్లాలకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా ప్రజాక్షేత్రంలో ఎండబెట్టడం కోసం బిజెపి ప్లాన్ చేస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ఘనత అని చెప్పుకుంటున్న డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు, రైతు వేదికలు, స్మశాన వాటికలు, క్రీడా మైదానాలు, జాతీయ రహదారులు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫండ్స్ తోనే చేస్తున్నట్టు ప్రజలకు వివరించేలాగా కార్యచరణ రూపొందిస్తున్నారు.

మొత్తంగా చూస్తే వచ్చే ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని, బిఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టడం కోసం, బలహీనంగా ఉన్న స్థానాలపై దృష్టి సారించడానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. బిజెపి ఈ సమావేశాల ద్వారా వచ్చే ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని ఖచ్చితమైన ప్రణాళికతో ముందుకు వెళ్లనున్నట్టు సమాచారం.

తెలంగాణా రాష్ట్రంలో ఈ సారి అధికారమే ధ్యేయంగా ఉన్న వేళ బీజేపీ చాలా యాక్టివ్ గా పాలిటిక్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. కర్ణాటకలో మరోసారి అధికారం కైవసం చేసుకోవడంతో పాటు.. తెలంగాణను కూడా తమ అడ్డాగా మార్చుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. తద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ విస్తరణను వేగవంతం చేయాలని చూస్తోంది. ఈ ఏడాది జరగనున్న కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటికే బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. మరోవైపు 2024 సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణాది నుంచి అత్యధిక పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవాలని చూస్తోంది.

గత ఎన్నికలకు మించిన మెజారిటీతో కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే గత ఏడాది డిసెంబర్ చివరలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా.. పార్టీ లోక్‌సభ ప్రవాస్ ప్రచారానికి సంబంధించిన 2.0ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం పార్టీ బలహీనంగా ఉన్న లోక్‌సభ స్థానాలపై బీజేపీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా బీజేపీ ఎక్కువగా దక్షిణాదిపై ఫోకస్ చేసింది. దీనిలో భాగంగానే పార్టీ అగ్రనాయకులు కొందరిని దక్షిణాది నుంచి బరిలో దింపాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది.

ఈ క్రమంలోనే తెలంగాణ నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను సార్వత్రిక ఎన్నికల బరిలో దింపాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అనేక పరిశీలనల అనంతరం.. పాలమూరు నుంచి అమిత్ షాను బరిలో నిలపాలని నిర్ణయానికి వచ్చినట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు బీజేపీ కోర్‌ గ్రూప్‌ సంకేతాలు ఇస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఆరెస్సెస్, సంఘ్‌పరివార్‌ నేతలతో బీజేపీ జాతీయ, రాష్ట్రపార్టీల ముఖ్యుల భేటీ సందర్భంగా ఈ అంశంపై చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ నుంచి అమిత్‌షా లోక్‌సభకు పోటీ చేస్తే, పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం నింపడటంతో పాటు.. రాష్ట్రంలో పార్టీ గురించి మరింత చర్చ పెరుగుతుందని భావిస్తున్నారు. పాలమూరు నుంచి బరిలో దిగితే అమిత్ షా పలుమార్లు రాష్ట్రానికి వస్తారని.. ఆ ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.

గత ఎన్నికల్లో రాష్ట్రంలో నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకున్న బీజేపీ.. ఈ సారి 10కి పైగా స్థానాలను గెలుచుకునేలా వ్యుహాలను సిద్దం చేసుకుంటుంది. మరోవైపు పాలమూరు నుంచి బీజేపీ జాతీయ నేతలు పోటీ చేయాలనే రాష్ట్ర నాయకులు కూడా కోరుతున్నారు. పాలమూరు నుంచి ప్రధాని మోదీ పోటీ చేయాలని మాజీ ఎంపీ జితేంద ర్రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ ద్వారా ఓ వీడియో విడుదల చేశారు. ప్రధాని మోదీ తెలంగాణ నుంచి పార్లమెంట్‌కి పోటీ చేస్తే రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్‌ స్థానాలు క్లీన్‌ స్వీప్‌ చేస్తామన్నారు.

ఇదే టైంలో టీఆర్ఎస్, కాంగ్రెస్‌లో అసంతృప్తితో ఉన్న లోకల్ లీడర్లను టార్గెట్ చేసి.. బీజేపీలో చేర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మధ్యకాలంలో
పాలమూరు జిల్లాలో బీజేపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కాషాయం పార్టీ వలలో గులాబీ కేడర్ పడకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. ఫోకస్ పెంచారు. అయినప్పటికీ.. పట్టు వదలకుండా జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు, బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు మహబూబ్‌నగర్ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇదిలా ఉంటే, 2019 సార్వత్రిక ఎన్నికల్లో గుజరాత్ లోని వడోదరతోపాటు వారణాసి ఎంపీ స్థానాల్లో పోటీచేశారు ప్రధాని మోడీ. ఈ రెండూ చోట్ల గెలిచారు. చివరకు వడోదర సీటుకు రాజీనామా చేసి యూపీలోని పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రం వారణాసి నుంచి గెలుపొందారు. ఆ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేశారు.
ఇప్పుడు తెలంగాణపై ఫోకస్ చేసిన మోడీ ఈ రాష్ట్రంలో పోటీచేయడం ద్వారా తెలంగాణ సీఎం కేసీఆర్ ను సవాల్ చేయాలని చూస్తున్నట్టు సమాచారం. దీంతో మోడీ ఈసారి తెలంగాణ నుంచి పోటీచేస్తారని, మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగడానికి సర్వే చేస్తున్నారని ప్రచారం సాగుతోంది.

ప్రాథమిక స్థాయి సర్వే పూర్తి చేశారని..సెకండ్ ఫేజ్ అధ్యయనం త్వరలో మొదలవుతోందని సమాచారం. ఈ పోటీ ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం అయ్యేందుకు ఆస్కారం ఉంటుందని ఆలోచిస్తున్నట్టు టాక్వి నిపిస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇప్పుడు బీజేపీలో ఉండడంతో ఆయన వ్యక్తిగత ఇమేజ్ కూడా ఈసారి పార్టీకి కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. ఈ జిల్లాకే చెందిన డీకే అరుణ ఇప్పటికే పార్టీకి జాతీయ స్థాయి నాయకురాలిగా ఉన్నారు. మోడీ పోటీ ఖరారైతే యావత్తు పార్టీ యంత్రాంగం భారీ మెజార్టీతో గెలిపించేందుకు సమష్టిగా పనిచేస్తుందని టాక్ వినిపిస్తోంది.

Must Read

spot_img