ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం కోల్పోవడం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు .. కష్టాల్ని తేనుందా..? ఇప్పటికే వెల్లువెత్తుతోన్న వ్యతిరేకత మరింత పెరగనుందా..?
ఏపీలో బీజేపీ పరిస్థితి మరింత దిగజారిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్సీ సీటు పోయింది. డిపాజిట్లు రాలేదు. ఎంత మంది పేపర్ టైగర్ నేతలు ఎన్ని చెప్పినా జరగాల్సింది మాత్రం జరిగిపోయింది,. ఇప్పుడు సోము వీర్రాజు వ్యవహారంపై మరోసారి చర్చ ప్రారంభమయింది. ఆయన పార్టీని వైసీపీకి తాకట్టు పెట్టేశారన్న అసంతృప్తి అంతకంతకూ పెరిగిపోతోంది. వైసీపీ, బీజేపీ దొందూ దొందే అని జనం భావిస్తున్నారని స్వయంగా ఆ పార్టీ సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు ఫీలయ్యారు. రాష్ట్ర నేతలే కాదు.. జగన్ కూడా వ్యూహాత్మకంగా అవసరం పడినప్పుడల్లా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా లతో ఫొటోలు తీసుకుని ప్రచారం చేసుకుంటున్నారని ఇది కూడా..
తమకు మైనస్‌గా మారిందని అంటున్నారు. జగన్ అలాంటి ఫీలింగ్ కల్పించడం ఇక్కడ నేతలు వైసీపీతో కలిసిపోవడంతో తమ పరిస్థితి దిగజారిపోయిందంటున్నారు. అందుకే ఇప్పుడు అందరి టార్గెట్ సోము వీర్రాజు అన్నట్లుగా మారిపోయింది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే మరోసారి పరువు పోతుందని కనీసం టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేద్దామన్న ఆలోచనకు వస్తున్నారు. బహిరంగంగా చెబుతున్నారు. చెప్పని వారు ఢిల్లీలో తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. బీజేపీ పొత్తు పెట్టుకోవాలి అనుకుంటే, టీడీపీ అధినేత వద్దని చెప్పకపోవచ్చన్న అంచనా ఉంది. అలా రాజకీయం మారాలంటే.. ముందుగా సోము వీర్రాజుకు గేటు చూపించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.
మొత్తంగా పార్టీని నాకించేసిన సోము .. ఇప్పుడు బయటకు వెళ్లిపోయినా ఆయనకు పోయేదేమీ ఉండదు. వైసీపీలో మంచి పదవే లభించవచ్చని టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్బీ జేపీలో సెగలు పుట్టిస్తున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడమే పెద్ద పరాభవం. అలాంటిది ఏకంగా డిపాజిట్ కూడా దక్కకపోతే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, దేశంలో తిరుగులేని పార్టీ ఏపీలో సిట్టింగ్ స్థానంలో డిపాజిట్ కోల్పోవడాన్ని ఆ పార్టీ నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇందుకు కారణాలేంటి.. అనే దానిపై ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు లెక్కలేసుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితంపై మొదట స్పందించాల్సింది ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. కానీ ఆయన దీనిపై ఇంతవరకూ నోరు తెరవలేదు.
అధికారంలో ఉన్న పార్టీ అడగకుండానే అన్నీ ఇస్తున్నప్పుడు ఇక మిగిలిన పార్టీల అవసరం ఏముంటుంది? అందుకే టీడీపీని దూరం పెడుతోంది బీజేపీ. కానీ పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ ఓటర్లు టీడీపీకి రెండో ప్రాధాన్యత ఓట్లు వేసిన దాన్ని బట్టి చూస్తే ఆ రెండు పార్టీలు కలిసి పని చేయాలని ఎంత బలంగా కోరుకుంటున్నారో అర్థమవుతుంది.ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో 73.6శాతం బీజేపీ ఓటర్లు రెండో ప్రాధాన్యత ఓట్లను టీడీపీకి వేశారు. అలాగే తూర్పు రాయలసీమలో 65.5శాతం, పశ్చిమ రాయలసీమలో 72.8 శాతం బీజేపీ ఓటర్లు రెండో ప్రాధాన్యత ఓటును టీడీపీకే వేశారు. దీన్ని బట్టి బీజేపీ అనుకూల ఓటర్లు మూడొంతుల మంది టీడీపీతో కలిసి వెళ్లాలని కోరుకుంటున్నట్టు అర్థమవుతోంది. బీజేపీ మిత్రపక్షం జనసేన కూడా ఇదే ఆశిస్తోంది.
టీడీపీ –బీజేపీ –జనసేన కలిసిపోటీ చేస్తే ఏపీలో వైసీపీని ఈజీగా ఓడించవచ్చనేది పవన్ కల్యాణ్ ఆలోచన.అయితే పవన్ సూచనలను బీజేపీ పట్టించుకోకపోవడంతో ఆయన బీజేపీకి దూరమయ్యారు. టీడీపీతో కలిసి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో బీజేపీ ఒంటరైంది. దీంతో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పై వేటు తప్పదా అంటే అవుననే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇటీవల బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ కి రాజీనామా చేసి టీడీపీ లో చేరారు. ఆ సందర్భంగా ఆయన సోము వీర్రాజు పైనే తీవ్ర విమర్శలు చేశారు. సోము వ్యవహార శైలి వల్లనే తాను బీజేపీకి రాజీనామా చేయాల్సి వస్తోందని బహిరంగంగానే విమర్శలు సంధించారు. అదేవిధంగా ఇటీవల పార్టీలో సోము వీర్రాజు వ్యతిరేక వర్గంగాముద్రపడ్డ కొంతమంది నేతలు విజయవాడలో సమావేశమయ్యారు. సోము వీర్రాజు ను పార్టీ అధ్యక్షుడి గా తప్పించాల్సిందేనని తీర్మానించారు. ఈ మేరకు ఢిల్లీ వెళ్లి ఏపీ బీజేపీ వ్యవహారాలు చూసే తరుణ్చుగ్, సునీల్ ధియోధర్ తదితర నేతలను కలిశారు. సోము వీర్రాజును తప్పించాలని డిమాండ్ చేశారు. మరోవైపు బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సైతం ఏపీ బీజేపీ తీరు పై ఇటీవల నిరసన వ్యక్తం చేశారు.
బందరులో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాట్లాడిన పవన్ కేంద్రంలో బీజేపీ పెద్దలు సహకరించినా రాష్ట్ర స్థాయి నేతలు మిలియన్ మార్చ్ కు ముందుకు రాలేదని తప్పుబట్టారు. పరోక్షంగా పవన్.. సోము వీర్రాజు వ్యవహార శైలినే తప్పుబట్టారని చెబుతున్నారు.మరోవైపు ఇటీవల భీమవరంలో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో సోము వీర్రాజునే 2024 ఎన్నికల వరకు అధ్యక్షుడిగా కొనసాగించాలని నిర్ణయించారు. ఆ తర్వాతే బీజేపీ నేతల అసంతృప్తి కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మార్పు వంటివన్నీ చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ నిరాశజనక ఫలితాలు నమోదు చేయడంపై సోమువీర్రాజు ను తొలగిస్తారనే చర్చ ఊపందుకుంది.