Homeజాతీయంహ్యాట్రిక్ గెలుపు కోసం ఉవ్విళ్లూరుతున్న బీజేపీ!!!

హ్యాట్రిక్ గెలుపు కోసం ఉవ్విళ్లూరుతున్న బీజేపీ!!!

మత రాజకీయాల్లో అందె వేసిన చేయి బీజేపీది.. అదే అంశాన్ని 2024 ఎన్నికల్లో మళ్లీ ప్రయోగించాలని కసరత్తు చేస్తోందా..? అందుకే ఎన్నికల వేళ రామ మందిరాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుందా..?

కేంద్రంలో వరుసగా మూడో సారి అధికారం దక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇందు కోసం ప్రజలను ఆకట్టుకొనే అస్త్రాలను సిద్దం చేసుకుంటోంది. అందులో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేసారు. ఈ ప్రకటన బీజేపీకి మైల్ స్టోన్ గా మారే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తం
అవుతున్నాయి. ఈ ఏడాది తొమ్మది రాష్ట్రాల్లో ఎన్నికలు.. 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం బీజేపీకి కలిసిస్తుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. వరుసగా మూడో సారి హ్యాట్రిక్ విజయం సాధించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది.

జనవరి 1, 2024 నాటికి రామ మందిరం సిద్దం అవుతుందని.. ప్రారంభం జరుగుతుందని అమిత్ షా ప్రకటించారు. రాహుల్ బాబా వినండి.. అయోధ్య రామ మందిరం ప్రారంభ తేదీలు ప్రకటిస్తున్నానని చెబుతూ.. జనవరి 1, 2024 న అందుకు ముహూర్తం కానుందని ప్రకటించారు. అప్పటికి రామ మందిరం భక్తుల
కోసం సిద్దంగా ఉంటుందని వెల్లడించారు. రామాలయాన్ని కాంగ్రెస్ అడ్డుకుందని షా ఆరోపించారు. సుదీర్ఘ కాలం అయోధ్య రామాలయం వ్యవహారం పైన వివాదం కొనసాగింది. సుప్రీంకోర్టు సుదీర్ఘ విచారణ తరువాత తుది తీర్పు వెల్లడించింది. రామాలయం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభింంచింది. 2020, ఆగస్టు 5న ప్రధాని మోదీ అయోధ్యలో భవ్యరామ మందిరానికి శంకుస్థాపన చేసారు. ఆలయ నిర్మాణ బాధ్యతలను రామతీర్ధ క్షేత్ర ట్రస్టుకు అప్పగించారు. ఇప్పటికే 55 శాతం పనులు పూర్తయినట్లు ట్రస్టు ప్రకటరించింది.

దేవీ దేవతా విగ్రహాలను పూర్తి చేసి2024 జనవరి నుంచి అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. మొత్తం 2.77 ఎకరాల్లో ఈ ఆలయ నిర్మాణం కొనసాగుతోంది. మొత్తం 392 స్థంభాలు..12 ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ నేత రాహుల్ జోడో యాత్ర ఉత్తర ప్రదేశ్ లో కొనసాగుతోంది. రామ మందిర్ ట్రస్టు ప్రముఖులు రాహుల్ ను కలిసారు. ఈ నేపథ్యంలో అమిత్ షా ఇప్పుడు చేసిన ప్రకటన ఎన్నికల ఏడాదిలో కీలకం కానుంది. అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేతకు దారితీసిన రామజన్మభూమి ఉద్యమంతోనే ఉత్తర్‌ప్రదేశ్ సహా ఉత్తర భారతంలో బీజేపీ తమ పట్టును పెంచుకుంది.

అయితే, ఆ తర్వాత ఆ వివాదం కోర్టుకు చేరడంతో పార్టీ దాన్ని పక్కనపెట్టింది. మోదీ ప్రధాని పదవిలో ఉన్న సమయంలోనే, అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఊపు మీదున్న బీజేపీ, మోదీ ప్రభుత్వంలో ఈ తీర్పు మరింత ఉత్తేజం నింపింది. ఆర్థిక మందగమనం, నిరుద్యోగం పెరుగుదల వంటి వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు సరైన సమయంలో ఈ తీర్పు వచ్చింది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అయోధ్య రామజన్మభూమి విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా అడుగు వేస్తోంది.

రాముడి మందిరం విషయాన్ని మళ్లీ కచ్చితంగా ఎన్నికలకు ముందే..తేవడానికి సుదీర్ఘమైన రాజకీయ కారణాలు ఉన్నాయి. చరిత్రలో చూస్తే.. భారతీయ జనతా పార్టీకి ఒకప్పుడు రెండు అంటే.. రెండు లోక్ సభ సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు 280 సీట్లు ఉన్నాయి. అంటే రెండు సీట్ల నుంచి 280 సీట్లకు బీజేపీ ఎదిగిపోయింది. ఈ ఎదుగుదలకు కారణం..రామమందిరమే. అయోధ్య వివాదాన్ని బీజేపీకి బాగా ఉపయోగించుకుంది. ఒక్క ఉత్తరప్రదేశ్ లో మాత్రమే కాకుండా.. దేశవ్యాప్తంగా ఆ పార్టీ ఎదుగుదలకు రామమందిర వివాదం కారణం అయింది. మరి బీజేపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో అదీ కూడా పూర్తి మెజార్టీ వచ్చినప్పటికి మందిరం నిర్మాణానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదు.

ఉత్తరప్రదేశ్‌లోనూ తిరుగులేని మెజార్టీతో.. ఆ పార్టీ అధికారంలో ఉంది. అయినప్పటికీ మందిర నిర్మాణ పరంగా ఒక్క అడుగు ముందుకు వేయలేదు. ఇన్నేళ్లు ఆగిన వారు.. ఇప్పుడే ఎందుకు తొందర పడుతున్నారు..? అంటే ఎన్నికల్లో లబ్ది కోసం మళ్లీ రామ మందిరాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికే వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చి తమ బలాన్ని చాటి చెప్పిన కాషాయ పార్టీ…హ్యాట్రిక్‌కు సిద్ధమవుతోంది.

ఈ సారి కూడా విజయం సాధించి..తిరుగులేని పార్టీగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అప్పుడే ఇందుకోసం రూట్‌మ్యాప్ సిద్ధమవుతోంది. “మిషన్ 2024” ఎజెండాపై అందరూ మేధోమథనం సాగిస్తున్నారు. జనతా పార్టీ విఫల ప్రయోగం తరువాత దానిలోనుంచి విడిపోయి 1980 లో జన్మించిన భారతీయ జనతా పార్టీ 1984 ఎన్నికల్లో గెల్చుకున్నది కేవలం రెండు సీట్లు మాత్రమే. ఆ తరువాత కూడా దాని ఎదుగుదల అంతంతమాత్రమే. మరొక పార్టీ ప్రభుత్వం ఏర్పరచాలనుకుంటే దానికి మద్దతు ఇచ్చే స్థాయికి ఎదిగింది. కానీ, దాని అసలు విస్తరణ రామజన్మభూమి, బాబరీమసీదు విధ్వసం అనే పునాదులతో మొదలైంది. ఆ తరువాత మూడేళ్ళలోనే మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పరిచే స్థాయికి ఎదిగింది.

అప్పట్లో అటల్ బిహారి వాజపేయి, ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి రాజనీతిజ్ఞులు భాజపాకు సారధులుగా ఉన్నారు. ఎల్కే అద్వానీ భారతదేశం మొత్తం రథయాత్ర చేసి బీజేపీ కోటను పటిష్టంగా నిర్మించారు. ఇక మోడీ బీజేపీకి సారధిగా మారాక తన ప్రసంగాలతో ప్రజలనుసమ్మోహితులను చేశారు. ఆయనకు జతగా అమిత్ షా కలిశారు. ఇద్దరూ తమదైన శైలిలో పార్టీని ప్రభావితం చేసి, మూలపురుషులను మూలకు నెట్టేసి రెండు సార్లు కేంద్రంలో సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి తీసుకుని రాగలిగారు.

అయితే రాజకీయాల్లోకి మతం అనే మత్తు మందు కలగలిపేసి దాన్ని విజయ సోపానాలుగా మార్చుకుంటున్న నేపధ్యంలో ఇపుడు అదే కార్డు ముందుకు వచ్చింది. ఇక హిందూత్వ నినాదం బీజేపీకి ప్రాణవాయువు లాంటిది అనే అంటారు. హిందూత్వతో బీజేపీ చాలా సార్లు గెలిచింది. దేశంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. గత ఎనిమిదేళ్ళుగా బీజేపీ రెండు పర్యాయాలు అధికారంతో కొనసాగుతోంది. మరోసారి బీజేపీ గెలవాలని చూస్తోంది. అందుకే 2050 దాకా అని బీజేపీ నినదిస్తూ వచ్చింది. ఈ నేపధ్యంలో బీజేపీలో హిందూత్వ అలా ఆరని జ్యోతిగా వెలుగుతూనే ఉంది. దాని మీద మేధావులు చదువరులూ వివేచనాపరులూ ఎన్నో డిబేట్లు చర్చలు పెడుతున్నా బీజేపీ నేతలు మాత్రం ఎక్కడా తగ్గడంలేదు.

మరో వైపు దీనికి మద్ధతుగా విపక్షాల శిబిరం కూడా హిందూత్వను అనుసరించే పనిలో పడింది. ఎందుకంటే ఇది రాజకీయం ఓట్లు ఎటువైపు మళ్ళితే అటు వైపే అందరి చూపు ఉంటుంది. ఈ నేపధ్యంలో బీజేపీ రూటే సరైనది అని శతాధిక వృద్ధ పార్టీ కాంగ్రెస్ కూడా భావిస్తోందా అన్నట్లుగా రాహుల్ గాంధీప్రియాంకా గాంధీ వంటి వారు కూడా గుళ్ళూ గోపురాలు దర్శిస్తూ వస్తున్నారు. ఇక మిగిలిన పార్టీలు ప్రాంతీయ నేతలు తామూ హిందూత్వ కి బ్రాండ్ అంటూ జబ్బలు చరుస్తున్నారు. ఒక విధంగా చూస్తే గత మూడు దశాబ్దాలుగా దేశ రాజకీయాలలో హిందూత్వ బలమైన నినాదంగా మారింది.

అలా మార్చిన ఘనత బీజేపీదే. ఇక ఎన్నిక ఎన్నికకూ హిందూత్వను రగల్చాలి. ఓట్లు రాల్చాలి అంటే ఇబ్బందే. కానీ పార్టీ ఫిలాసఫీని మించి కూడా వీర లెవెల్ లో హిందూత్వ ఇపుడు సాగడమే కాషాయానికి కూడా షాక్ కొట్టిస్తోంది. అయోధ్య వివాదాన్ని మూడు దశాబ్దాలుగా బీజేపీ తన పేటెంట్ హక్కుగా చేసుకుని పోరాడింది. దాని రాజకీయ ఫలితాలను అనుభవించింది.

గత ఎన్నికల్లోనూ రామాలయంతో రాజకీయం చేసిన బీజేపీ .. ఈ దఫా పోరులోనూ అదే ఏజెండాగా పావులు కదుపుతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదీ ఇవాల్టి ఫోకస్.. రేపటి ఫోకస్ లో మళ్లీ కలుద్దాం..

Must Read

spot_img