గోదావరి జిల్లాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండే ఆ పార్లమెంటు నియోజకవర్గంపై బిజెపి ఫోకస్ పెట్టింది. ఎన్నికల ఏడాది వేళ అక్కడ టిడిపి అభ్యర్థి విషయంలో ఇంకా చలనమే లేదు. అధికార వైసీపీ సైతం సిట్టింగ్ ఎంపీ బదులు మరొకరిని పోటీ చేయించే ప్రతిపాదనలో ఉంది. అయితే అనూహ్యంగా బిజెపి ఆ నియోజకవర్గ పార్లమెంటును చేజిక్కించుకోవడమే టార్గెట్ గా పావులు కదుపుతోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో అక్కడ బిజెపి అభ్యర్థి ఎవరు….? అన్నదే ఆసక్తికరంగా మారింది.
2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని బిజెపి పైకి చెబుతోంది. అయితే వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఏపీలో బిజెపి ప్లాన్ బి ని కూడా అమల్లోకి తెచ్చింది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని 25 పార్లమెంటు స్థానాల్లో 11చోట్ల గెలుపు లక్ష్యంగా ఓ కొత్త వ్యూహాన్ని మొదలుపెట్టింది. పార్టీ కేంద్ర నాయకత్వం చేసిన దిశా నిర్దేశం ప్రకారం రాజమండ్రి పార్లమెంటు స్థానాన్ని వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ దక్కించుకోవడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు బూత్ స్థాయి వరకు పనిచేయాలని ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్ మురళీధరన్ స్పష్టం చేశారు.
వచ్చే ఎన్నికల్లో బిజెపి గెలుపు లక్ష్యంగా పెట్టుకున్న స్థానాల్లో రాజమండ్రి కూడా ఉండటంతో ఇక్కడ పరిస్థితులపై బిజెపి అగ్రనాయకత్వం సీరియస్ గానే దృష్టి పెట్టిందని పార్టీ నాయకులకు అర్థమైంది. ఇదిలా ఉంటే టార్గెట్ పెట్టుకున్న రాజమండ్రి పార్లమెంటు నుంచి వచ్చే ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసేది ఎవరు అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు రాజమండ్రికి చెందిన వారే కావడంతో ఆయనే అభ్యర్థి అవుతారా అనే అంచనాలు మొదలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఎంపిక చేసిన లోక్ సభ స్థానాల్లో బీజేపీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు రాష్ట్ర బిజెపి ఇంచార్జ్ మురళీధరన్ బహిరంగంగానే వెల్లడించారు. పార్టీ నాయకులు చెబుతున్న ప్రకారం ఏపీలో 11 పార్లమెంటు నియోజకవర్గాలను 2024 ఎన్నికల్లో తమ ఖాతాలోకి వేసుకోవాలని బిజెపి టార్గెట్ చేసింది. ఈ 11 నియోజకవర్గాలు గతంలో బిజెపి గెలుపొందినవి కొన్ని అయితే మరికొన్ని నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలు ఉంటాయని బిజెపి భావిస్తోంది.
గెలుపు కోసం ఎంపిక చేసిన 11 నియోజకవర్గాలుగా వైజాగ్, అనకాపల్లి, రాజమండ్రి, కాకినాడ, నరసాపురం, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, నరసరావుపేట, తిరుపతి, కర్నూల్ ఉన్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఇంచార్జ్ కేంద్రమంత్రి మురళీధరన్ రాజమండ్రి వచ్చి ప్రత్యేకంగా పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయి క్యాడర్ నుంచికోర్ కమిటీ వరకు సమీక్షించారు. గెలుపు
వ్యూహంలో భాగంగా పోటీ చేసే అభ్యర్థులు కూడా ప్రధానం కావడంతో బిజెపి అగ్రనాయకత్వం ఎవరిని ఎంపిక చేస్తోంది అనేది ఆసక్తికరంగా మారింది.
బిజెపి టార్గెట్ చేసుకున్న 11 నియోజకవర్గాల్లో రాజమండ్రి పార్లమెంట్ ఆ పార్టీకి ఓ ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. గతంలో ఇక్కడ రెండుసార్లు బిజెపి అభ్యర్థులు గెలుపొందారు. అటల్ బిహారీ వాజ్ పాయ్ ప్రధాని అభ్యర్థిగా 1998లో జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీగా గిరిజాల వెంకట స్వామి నాయుడు సంచలన విజయం సాధించారు. ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా బిజెపి ఒంటరిగా రాజమండ్రి పార్లమెంటు స్థానాన్ని అనూహ్యంగా దక్కించుకుంది.
1999 సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రి నుంచి బిజెపి అభ్యర్థి ఎస్ పి బి కె సత్యనారాయణ రావు విజయం సాధించి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. 1999 ఎన్నికల నుంచి గత పోరులోనూ బిజెపి జెండా ఎగుర లేదు. 2004-2014 ఎన్నికల్లో టిడిపితో పొత్తు కారణంగా ఇక్కడ బిజెపి ఎంపీ అభ్యర్థులు పోటీ చేయలేదు. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన బిజెపి ఎంపీ అభ్యర్థికి నామ మాత్రపు ఓట్లు కూడా రాలేదు.
అయితే 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో 11 పార్లమెంటు స్థానాలను బిజెపి టార్గెట్ చేసుకోవడం అందులో రాజమండ్రి ఉండడంతో ఇక్కడ అభ్యర్థి ఎవరు అనేది ఇప్పటినుంచే చర్చగా మారింది. ప్రస్తుత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాజమండ్రికి చెందిన వారే కావడంతో ఆయన పేరే ఎంపీ అభ్యర్థిగా ప్రచారంలోకి వస్తుందని పార్టీ శ్రేణులు అనుకుంటున్నాయి.
ప్రస్తుతం రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గానికి వైసిపి నుంచి మార్గాన్ని భరత్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. గత కొంతకాలంగా రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గ వ్యవహారాలను ఎంపీ భరత్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన రాజమండ్రి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంపీ భరత్ ను ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపిస్తే వైసిపి నుంచి బలమైన ఎంపీ అభ్యర్థి ఎవరనేది పార్టీ శ్రేణుల్లో
ప్రశ్నగా మారింది. ఇటు టిడిపి విషయాని కొస్తే గత ఎన్నికల తర్వాత మాగంటి మురళీమోహన్ రాజమండ్రికి గుడ్ బై చెప్పేశారు.
2019 ఎన్నికల్లో మురళీమోహన్ కు రాజకీయ వారసురాలిగా పోటీ చేసిన ఆయన కోడలు మాగంటి రూప సైతం అప్పటినుంచి రాజమండ్రి నియోజకవర్గం వైపు చూడలేదు. టిడిపి నుంచి వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా ఆశావాహులు సైతం ఎవరూ తెరపైకి రావడం లేదు. జనసేన నుంచి సైతం రాజమండ్రి ఎంపీ అభ్యర్థి విషయంలో అదే రకమైన శూన్యత నెలకొంది. ఈ పరిస్థితుల్లో బిజెపి ఏపీలో ఎంపిక చేసిన పార్లమెంటు నియోజకవర్గాల జాబితాలో రాజమండ్రిని చేర్చి ఇక్కడ గ్రౌండ్ వర్క్ కూడా ప్రారంభించడం ఆసక్తికరంగా మారింది.
- బీజేపీ అడుగులు ఎటువైపు అన్నది మాత్రం వేచి చూడాల..
గతంలో రెండుసార్లు ఇక్కడ ఎంపీ అభ్యర్థులు కమలం గుర్తుపై గెలుపొందిన రికార్డు కూడా ఉండడంతో వచ్చే ఎన్నికల్లో పాత ఫలితాలను మరోసారి రిపీట్ చేయాలని ఉత్సాహం శ్రేణుల్లో కనిపిస్తోంది. అయితే గతంలో రాజమండ్రిలో బిజెపి అభ్యర్థులు గెలుపొందిన పరిస్థితులు వేరు ప్రస్తుతం పరిస్థితులు వేరు అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. వాజ్ పాయ్ హవాలో గతంలో రెండుసార్లు ఇక్కడ ఎంపీ అభ్యర్థులు గెలుపొందారు.
మోడీ నేతృత్వంలో ఏపీలో పార్లమెంటు స్థానాలను గెలుపొందడం అంతా సులువైన వ్యవహారం కాదని అందరికీ తెలిసిందే. పార్టీ ఎన్ని వ్యూహాలు అమలు చేసినప్పటికీ అభ్యర్థి కూడా ప్రధానం కావడంతో ఆ కోణంలోనూ పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. కాపు సామాజిక వర్గానికి చెందిన సోమ వీర్రాజును పోటీ చేయిస్తే బలమైన అభ్యర్థి అవుతారు అనే అంచనా ఉంది. జనసేనతో పొత్తు ఉంటే సోము గెలుపుకు
మరింత ప్లస్ అవుతుందని ధీమా బిజెపి శ్రేణుల్లో ఉంది.
అయితే సోము వీర్రాజు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపొందలేదు. మరోవైపు 2024 ఎన్నికల వరకు సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే ఎన్నికల సమయంలో ఆయన్ను ఒక నియోజకవర్గానికి పరిమితం చేస్తారా అనేది ప్రశ్నగా మారింది. సోము వీర్రాజుకు రానున్న ఎన్నికల తర్వాత రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇచ్చి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారనే అంచనా సైతం ఆయన మద్దతుదారుల్లో ఉంది. ఇదిలా ఉంటే మరికొందరు పేర్లు సైతం బిజెపి అభ్యర్థులుగా వినిపిస్తున్నాయి.
ప్రస్తుత నరసాపురం వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈసారి రాజమండ్రి నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా ప్రచారం ఎప్పటినుంచో ఉంది. అదే నిజమైతే రఘురామకృష్ణం రాజు బిజెపి నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది. పారిశ్రామికవేత్తలను సైతం వెతికే పనిలో బిజెపి అధినాయకత్వం ఉందని టాక్ వినిపిస్తోంది.
ఏదేమైనా ప్రస్తుతం బూత్ కమిటీల వరకు బిజెపిని బలోపేతం చేయాలని పార్టీ భావిస్తోంది. ఎంపీ అభ్యర్థిని మాత్రం ఎన్నికల సమయం వచ్చిన తర్వాతే ప్రకటిస్తారని అప్పటివరకు పార్టీ వ్యవహారాలపైనే సీరియస్ గా దృష్టి పెడతారని రాజమండ్రి బిజెపి శ్రేణులు చెబుతున్నాయి. ఏదేమైనా బిజెపికి టిడిపి, జనసేన తో పొత్తు ఉంటుందా ఉండదా అనేది ఒక ప్రశ్న అయితే పొత్తుకు అనుగుణంగానే ఎంపీ అభ్యర్థి ఖరారు అవుతారనే అంచనా సైతం ఉంది.
మరి బీజేపీ అడుగులు ఎటువైపు అన్నది మాత్రం వేచి చూడాల్సిందే..