Homeతెలంగాణటీఆర్‌ఎస్‌ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అంటున్న బీజేపీ

టీఆర్‌ఎస్‌ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అంటున్న బీజేపీ

ముందస్తు నగారా వేళ తెలంగాణలో బీజేపీ సైతం యాక్షన్ లోకి దిగిందా.ఓవైపు పాదయాత్ర .. మరోవైపు సెగ్మెంట్ల సమీక్షలు జోరందుకున్నాయా..? మరి ఈ దఫా అసెంబ్లీ పోరులోకి దిగుతోన్న బండి .. ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారన్నదే హాట్ టాపిక్ గా మారింది.

అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అంటున్న బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయంగా కనిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ వేస్తున్న అడుగులు చూస్తుంటే త్వరలోనే అసెంబ్లీ రద్దు చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అంటున్న బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ ముందస్తు ప్లాన్‌ రెడీ చేస్తున్నారు. పాదయాత్రలతో ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్న ఆయన ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో ప్లాన్‌ చేంజ్‌ చేసినట్లు తెలుస్తోంది.

సీఎం కేసీఆర్‌ త్వరలో అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతున్న సమయంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం అందుకు అనుగుణంగా తమ గేమ్‌ ప్లాన్‌ చేంజ్‌ చేసింది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాము సిద్ధమని చెబుతున్న కమలనాథులు ఇప్పటికే సమరోత్సాహంతో కదులుతున్నారు. సీఎం కేసీఆర్‌ సడన్‌ గా అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళితే దానికి తగ్గట్టుగా బీజేపీ కూడా యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసింది.

ఇప్పటికి నాలుగు విడతలుగా బండి సంజయ్‌ పాదయాత్రను కొనసాగించారు. ప్రస్తుతం ఐదో విడత పాదయాత్ర నిర్మల్‌ జిల్లాలో సాగుతోంది. ఈ క్రమంలో బండి సంజయ్‌ పాదయాత్రను రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేయడం కోసం అదనంగా సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది.

ఒకవేళ టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఊహించని విధంగా ముందస్తు ఎన్నికలకు నగారా మోగిస్తే బండి సంజయ్‌ పాదయాత్ర పూర్తయ్యే అవకాశం లేదు. దీంతో గేమ్‌ చేంజ్‌ చేసిన బీజేపీ బండి పాదయాత్ర నిలిపివేసి బస్సు యాత్ర చేయాలని ప్లాన్‌ చేస్తోంది. ఈ యాత్ర ద్వారా మరింత దూకుడు ప్రదర్శించాలని కాషాయ పార్టీ ఆలోచన చేస్తోంది.

టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్న నేపథ్యంలో బండి సంజయ్‌ జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఓ పక్క పాదయాత్ర నిర్వహిస్తూనే మరోపక్క సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

ఇక ఐదో విడత పాదయాత్రలో ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై పోరాటం చేయడంతోపాటు, యాత్ర ముగిసేసరికి ఉత్తర తెలంగాణ జిల్లాల ముఖ్య నేతలతో సమీక్షలు పూర్తిచేసి ఎన్నికలకు సమాయత్తం చేయాలని బండి సంజయ్‌ ప్లాన్‌ చేశారు. ఈ మేరకు ఆయన నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఆరు రోజులుగా నిర్మల్‌ జిల్లాలో సాగుతున్న ప్రజాసంగ్రామయాత్రలో బండి సంజయ్‌ ఎక్కడా స్పీడు తగ్గడం లేదు. జనమే బండిని నడిపిస్తున్నట్లుగా యాత్ర సాగుతోంది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సంజయ్‌ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో వచ్చే అసెంబ్లీ ఎన్నినకల్లో భైంసా నుంచే పోటీ చేయాలని స్థానిక నేతల నుంచి బీజేపీ చీఫ్‌కు విన్నపాలు అందాయి.

50 వేల మెజారిటీతో గెలిపిస్తామని భరోసా కూడా ఇచ్చారు. ఇక సంజయ్‌ సంగ్రామం షురూ.. తోనే కేసీఆర్‌కు వార్నింగ్‌ ఇచ్చారు. భైంసాకు అండగా ఉంటామని, అధికారంలోకి రాగానే దత్తత తీసుకుంటామని హిందువులై దాడిచేసిన వారిని వదిలి పెట్టమని స్పష్టం చేశారు. భైంసా పేరును మైపాగా మారుస్తామని తెలిపారు.

2023లో తెలంగాణలో అధికారం చేపట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.

మేమూ మీ వెంటే ఉంటాం అన్నట్లుగా బండి పాదయాత్రలో భైంసా మొత్తం నడిచింది. ముధోల్‌ నియోజకవర్గంలో దిలావర్‌పూర్‌లో బండి నిర్వహించిన సభకు స్థానిక దళితులు భారీగా తరలివచ్చారు.నాలుగు నెలల క్రితం ఇక్కడ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దళిత మహిళలు మంత్రిని తమకు దళితబంధు ఎందుకు ఇవ్వరని నిలదీశారు. దీంతో ఆగ్రహించిన మంత్ర ‘టీఆర్‌ఎస్‌ నేతలకు ముందు ఇస్తాం.. ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి’ అంటూ మహిళలు, దళితులు అని కూడా చూడకుండా అవమానించారు.

మంత్రి తీరుకు నిరసనగా మరుసటి రోజు దళిత సంఘాలు నిర్మల్‌లో నిరసన తెలిపాయి. ఇందులో బాధిత మహిళలు పాల్గొన్నారు. దీంతో మరింత ఆగ్రహించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దళిత మహిళలను అరెస్టు చేయించి కేసు పెట్టించారు. ఈ నేపథ్యంలో బండి దిలావర్‌పూర్‌కు రాగానే దళితులు తమ గోడు వెల్లబోసుకున్నారు.

ఈ సందర్భంగా సంజయ్‌ దళిత మహిళలపై కేసు పెట్టిన మంత్రిని అధికారంలోకి వచ్చాక జైల్లో పెడతామని హెచ్చరించారు. అదేసమయంలో తెలంగాణ
బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేయడంపైనా సందిగ్దత నెలకొంది. 2023లో తెలంగాణలో అధికారం చేపట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.

ఈ సారి ఎమ్మెల్యేగా ఎలాగైనా గెలిచి సీఎం రేసులో ఉండాలని సంజయ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి.. 2023లో
కరీంనగర్ లేదా వేములవాడ నుంచి పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు వేరే నియోజకవర్గాన్ని ఆయన టార్గెట్ చేస్తున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

ఏబీవీపీ నుంచి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఎదిగిన బండి సంజయ్.. 2005 నుంచి 2019 వరకు కరీంనగర్ కార్పొరేషన్ కార్పొరేటర్‌గా ఉన్నారు. 2019లో ఆయన ఏకంగా ఎంపీగా విజయం సాధించారు. అయితే, అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న తన ఆశ మాత్రం ఇంకా కలగానే మిగిలిపోయింది. 2014, 2018లో కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి.. రెండు సార్లు కూడా టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్‌పై ఓడి పోయారు.

మరోసారి కరీంనగర్ నుంచి పోటీ చేస్తే ఓటమి తప్పదని భావించి.. నియోజకవర్గం మార్చాలని సంజయ్ డిసైడ్ అయ్యారు. బీజేపీ అంటేనే మత రాజకీయాలు చేసే పార్టీ. ప్రతీ ఎన్నికల సమయంలో ఏదో ఒక ఉద్వేగాన్ని ప్రజల్లో ఉంచి కేంద్రంలో అధికారం దక్కించుకుంటోంది.

బండి సంజయ్ కూడా అదే ఫార్ములా ఫాలో అవ్వాలని అనుకుంటున్నారు. రాష్ట్రంలోని ముధోల్ నియోజకవర్గం కాస్త సున్నితమైన ప్రాంతం. ఈ నియోజకవర్గం పరిధిలోని భైంసా గత కొన్నాళ్లుగా వార్తల్లో ఉంటోంది. 2020లో భైంసా పట్టణంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి.

ఈ పట్టణంలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉంటారు. అక్కడి మున్సిపాలిటీలో ఎంఐఎందే అధికారం. కానీ ముధోల్ నియోజకవర్గం పరిధిలో భైంసా మున్సిపాలిటీ, మండలం మాత్రమే కాకుండా.. ముధోల్, కుంతాల, కుబీర్, లోకేశ్వరం, తానూర్, బాసర మండలాలు కూడా ఉన్నాయి. ముధోల్ నియోజకవర్గం
పరిధిలో దాదాపు 2 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.

ఇందులో బండి సంజయ్ సామాజికవర్గం అయిన మున్నూరు కాపు ఓట్లు దాదాపు 50 వేల వరకు ఉన్నాయి. ఇక్కడ హిందూ- ముస్లిం గొడవలు జరుగుతుండటంతో.. ఓ వర్గం ఓట్లు తనకే పడతాయని బండి సంజయ్ భావిస్తున్నారు. తన ప్రజా సంగ్రామ యాత్ర 5వ విడత ముధోల్ నియోజకవర్గం నుంచే ప్రారంభించడానికి కారణం కూడా అదేనని సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ తరపున విఠల్ రెడ్డి బలమైన అభ్యర్థిగా ఉన్నారు.

2004 తర్వాత 2018లో టీఆర్ఎస్ పార్టీని ముధోల్‌లో గెలిపించింది విఠల్ రెడ్డినే. ఎన్నాళ్ల నుంచో అక్కడ కాంగ్రెస్, టీడీపీ బలంగా ఉన్నాయి. కానీ 2004లో తొలి సారి నారాయణ్ రావు పటేల్ టీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచారు. 2009లో విఠల్ రెడ్డి పీఆర్పీ తరపున పోటీ చేసి 183 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే 2014లో కాంగ్రెస్ పార్టీ తరపున 14 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ కేవలం 29 శాతం ఓట్లు మాత్రమే సాధించింది.

2018లో విఠల్ రెడ్డి టీఆర్ఎస్ తరపున పోటీ చేసి 43 వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలిచారు. ఆ ఎన్నికల్లో బీజేపీ భారీగా ఓట్లను కోల్పోయింది. కేవలం 22 శాతానికే పరిమితం అయ్యింది. బీజేపీv తరపున 2014, 2018లో పోటీ చేసిన పడకంటి రమాదేవిని ఈ సారి పక్కన పెట్టి తానే స్వయంగా రంగంలోని దిగాలని బండి సంజయ్ భావిస్తున్నారు. హిందూ-ముస్లిం మధ్య ఉన్న గొడవల కారణంగా ఓ వర్గం ఓట్లు తనకు పడతాయని సంజయ్ అంచనా వేస్తున్నారు.

కరీంనగర్ లేదా వేములవాడ కంటే ముధోల్ తనకు సేఫ్ సెగ్మెంట్ అని సంజయ్ అనుకుంటున్నారు. స్థానిక క్యాడర్ కూడా బండి సంజయ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే గెలిపిస్తామని చెబుతున్నారు. ఈ డిమాండ్ పై బండి, హైకమాండ్ ఏం చేయనుందన్నదే చర్చనీయాంశంగా మారింది.

మరి సంజయ్ నిర్ణయాన్ని అధిష్టానం అంగీకరిస్తుందో లేదో వేచి చూడాలి.

Must Read

spot_img