తుర్కియే, సిరియా కేంద్రాలుగా సంభవించిన భారీ భూకంపం కారణంగా 4000కు పైగా జనం చనిపోయారు. మొదటి సారిగా అక్కడ వచ్చిన భూకంపం జనాన్ని అల్లకల్లోలం చేసింది. ఆపై వచ్చిన ప్రకంపనలు పగుళ్లు తేలిన భవనాలను కుప్పకూలిపోయేలా చేసాయి. ఇప్పటికీ ఆ శిధిలాలో క్షతగాత్రులు, మ్రుతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. చూస్తుంటే మ్రుతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
ప్రకృతి ప్రకోపానికి తుర్కియే, సిరియా దేశాలు అల్లకల్లోలమయ్యాయి. ఈ రెండు దేశాల సరిహద్దుల్లో సోమవారం తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం పెను విలయం సృష్టించింది. భూకంప తీవ్రతకు వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. అనేక నగరాలు మరుభూమిని తలపిస్తున్నాయి. భూకంపం ధాటికి ఇప్పటివరకు రెండు దేశాల్లో 4000 మందికి పైగా దుర్మరణం చెందగా.. వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. తుర్కియే కాలమానం ప్రకారం.. తెల్లవారుజామున 4.17 గంటలకు ఈ భూకంపం సంభవించింది. అంతా అదమరచి నిద్రపోతున్న సమయంలో భూకంప లేఖినిపై దీని తీవ్రత 7.8గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఆగ్నేయ తుర్కియేలోని గాజియాన్‌తెప్ ప్రాంతానికి 33 కిలోమీటర్ల దూరంలో 18 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.
దీంతో దక్షిణ తుర్కియే, ఉత్తర సిరియాలోని పలు ప్రాంతాల్లో భూకంపం తీవ్ర ప్రభావం చూపించింది. తుర్కియేలోని దియర్‌బకీర్, సిరియాలోని అలెప్పో, హమా నగరాల్లో వందలాది భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. 7.8 తీవ్రతతో తొలి భూకంపం సంభవించిన తర్వాత గంటల వ్యవధిలో మరో 20 సార్లు శక్తిమంతమైన భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రమాద తీవ్రతగా ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. నిజానికి తెల్లవారుజామున ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్నారు. సరిగ్గా ఆ సమయంలో ఈ విలయం చోటుచేసుకోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తుర్కియేలో మొత్తం 10 ప్రావిన్సుల్లో భూకంపం విలయం సృష్టించగా.. ఇప్పటివరకు 2500 మంది మరణించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. 5300 మందికి పైగా గాయపడినట్లు తెలిపారు.
భూకంప తీవ్రతకు తుర్కియేలో దాదాపు 3వేల భవనాలు ధ్వంసమయ్యాయి. ఇక సిరియా విషయానికొస్తే..ప్రభుత్వ నియంత్రణ ఉన్న ప్రాంతాల్లో 1500 కు పైగా జనం మరణించినట్లు సిరియా ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. మరో 639 మంది గాయపడినట్లు తెలిపింది. కాగా.. రెబల్స్ అధీనంలో ఉన్న ప్రాంతాల్లో కనీసం 450 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. భవనాల శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భూకంప విలయంపై భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆయా దేశాలకు అండగా ఉంటామని తెలిపారు. ఆ దేశాలకు అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మోదీ.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. అటు భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కూడా విచారం వ్యక్తం చేశారు. తుర్కియే, సిరియా దేశాల్లో ప్రకృతి వైపరీత్యానికి యావత్ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆ దేశాలకు ఆపన్నహస్తం అందించేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి. భారత్ సహా నెదర్లాండ్స్, గ్రీస్, సెర్బియా, స్వీడన్, ఫ్రాన్స్ తదితర దేశాలు సహాయక సామగ్రి, ఔషధాలు వంటివి పంపిస్తామని హామీ ఇచ్చాయి.
టర్కీ, సిరియాలో సోమవారం భారీ భూకంపం సంభవించి 4000 మందికి పైగా చనిపోవడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే ఈ ఉపద్రవాన్ని ఓ వ్యక్తి మూడు రోజుల ముందే ఊహించడం సంచలనం స్రుష్టిస్తోంది. టర్కీ, సిరియాలో త్వరలో భారీ భూకంపం రాబోతుందని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు.
కానీ ఎవరూ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆయన అంచనాలు ఎప్పుడూ నిజమైన దాఖలాలు లేవని కొట్టిపారేశారు. కానీ మూడు రోజుల తర్వాత ఆయన చెప్పిందే నిజమైంది. రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతో భూకంపం వచ్చి టర్కీ, సిరియా అతలాకుతలం అయ్యాయి. వేల భవనాలు నేలమట్టయ్యాయి. బిల్డింగులు పేక మేడల్లా కూలిపోయాయి. భూకంపాన్ని ముందే ఊహించిన ఈ వ్యక్తి పేరు ఫ్రాంక్ హూగర్‌బీట్స్. భూకంప కార్యకలాపాలను అధ్యయనం చేసే ‘సోలార్ సిస్టం జియోమెట్రిక్ సర్వే’ పరిశోధకులుగా పనిచేస్తున్నారు. ఈయన మూడు రోజుల క్రితం చేసిన ఇలా ట్వీట్ చేసారు..‘’అతి త్వరలో.. లేదా.. తర్వాత సౌత్ సెంట్రల్ టర్కీ, జోర్డాన్, సిరియా, లెబనాన్ ప్రాంతాల్లో 7.5 తీవ్రతో భారీ భూకంపం వస్తుంది.’’ అని ఫ్రాంక్ ఫిబ్రవరి 3న ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్‌ను కొందరు కొట్టపారేశారు. ఫ్రాంక్ నకిలీ శాస్త్రవేత్త అని విమర్శలు కూడా గుప్పించారు.