Homeజాతీయంతెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ మళ్లీ రచ్చ షురూ ....

తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ మళ్లీ రచ్చ షురూ ….

తెలంగాణలో ఎన్నికల ఏడాది రాజకీయల హీట్ పెరుగుతోంది. ముందస్తు ఎన్నికలు వస్తాయో రావో కానీ..రాజకీయ పార్టీలు మాత్రం రెడీ అయిపోతున్నాయి. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన కేసీఆర్ మొదట తెలంగాణలో అధికారాన్ని నిలబెట్టుకోవడంపైనే దృష్టి పెట్టారు. అందుకే బీఆర్ఎస్ ఆవిర్భావ సభను తెలంగాణలోనే పెట్టారు. గతంలో ఢిల్లీలో లేదా యూపీలో భారీ బహిరంగసభ పెట్టి బీఆర్ఎస్ సన్నిహిత జాతీయ నేతలందర్నీ పిలిచి.. కొత్త పార్టీ విధి, విధానాలు, జెండా, అజెండాలను ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్లాన్ మార్చి.. ఖమ్మంలో ఆవిర్భావ సభను ఈనెల 18న పెడుతున్నారు.

ఈసారి ఖమ్మం టార్గెట్ గా నేతలు పావులు కదుపుతున్నారా..?

దీన్ని భారీగా నిర్వహించడానికి బీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఆ తర్వాత రోజే ప్రధాని మోదీ తెలంగాణకు వస్తున్నారు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వస్తున్నా.. పార్టీ పరంగా బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించడంతో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ప్రధాని అధికారిక కార్యక్రమాలకు వస్తున్నాకేసీఆర్ స్వాగతం చెప్పడం దాదాపుగా మర్చిపోయారు. ఈసారి కూడా ఆయన స్వాగతం చెప్పే అవకాశం ఉండకపోవచ్చు. మరోవైపు ప్రస్తుతం తెలంగాణలో రెండు పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

కేసులు, విచారణలతో ఎప్పుడేం జరుగుతుందో అన్న టెన్షన్ ఉంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ పర్యటన రాజకీయవర్గాల్లో సహజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది మరో వైపు ఖమ్మంలో కేసీఆర్ బహిరంగసభ పెట్టి బీఆర్ఎస్ సభ పెట్టే రోజున.. ఖమ్మం నుంచి బీఆర్ఎస్‌కు చెందిన కీలక నేతల్ని తమ పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ భావిస్తోంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పద్దెనిమిదో తేదీన తన అనుచరగణంతో బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఖమ్మంలో ఉన్న వర్గ పోరాటాల కారణంగా పార్టీ నేతల్ని కాపాడుకోవడం బీఆర్ఎస్‌కు ఓ సవాల్ గా మారింది. దీంతో స్వయంగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి.. పొంగులేటితో పాటు ఎవరూ బీజేపీలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

చేరికల విషయంలో ఫామ్ హౌస్ కేసు స్టింగ్ ఆపరేషన్ తర్వాత బీజేపీ కాస్త నెమ్మదించింది. ఇప్పుడు ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన తరవాత బీజేపీ మరింత దూకుడుగా రాజకీయాలు చేస్తుందని.. చేరికలు పెరుగుతాయని బీజేపీ నేతలంటున్నారు. పొంగులేటితో ప్రారంభించి బలమైన అభ్యర్థులు లేని చోటల్లా.. కీలక నేతల్ని చేర్చుకునేందుకు ఆపరేషన్ ప్రారంభిస్తామంటున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాలు ముందు ముందు మరింత హీటెక్కే అవకాశం కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే, భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన తర్వాత ఆయన నిర్వహించే తొలి భారీ సమావేశం ఇదే కావడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ సభ ద్వారానే ఆయన భారత రాష్ట్ర సమితి అడుగులకు సంబంధించి దిశా నిర్దేశం చేస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.. ఈ సభలో ఛత్తీస్ గడ్ ప్రాంతానికి చెందిన నేతలు భారత రాష్ట్ర సమితిలో చేరే అవకాశం కనిపిస్తోంది.. ఇదే వేదికపై కర్ణాటక, కేరళ, తమిళనాడు ప్రాంతాలకు చెందిన నాయకులు కూడా భారత రాష్ట్ర సమితిలో చేరుతారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
చెప్తున్నారు.

కొంతమంది కమ్యూనిస్టు నాయకులను కూడా ఈ సభకు ఆహ్వానించినట్టు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో ఇటీవల భారత రాష్ట్ర సమితికి కమ్యూనిస్టుపార్టీలు మద్దతు తెలిపిన విషయం విధితమే.. అయితే ఈ బంధాన్ని మరింత ముందుకు సాగించే విధంగా కేసీఆర్ యోచిస్తున్నారని సమాచారం. మరోవైపు బీజేపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా రాష్ట్రంలో కీలకమైన రాజకీయ పరిణామాలకు నాంది పలకాలని ఆ పార్టీ అధిష్టానం యోచిస్తోంది.. ఇప్పటికే పలు జిల్లాల్లో కీలకంగా ఉన్న భారత రాష్ట్ర సమితి నాయకులకు అమిత్ షా నుంచి ఫోన్లు వెళ్లాయని తెలుస్తోంది.

తెర వెనుక వ్యవహారాలను ఈటల రాజేందర్ పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం.. బలమైన నాయకులను చేర్చుకోవడం ద్వారా పశ్చిమ బెంగాల్ నమూనాను తెలంగాణలో అమలు చేయాలని అమిత్ షా ప్లాన్ గా ఉన్నట్టు సమాచారం. పొంగులేటి తర్వాత కొంతమంది ధైర్యం చేసి బిజెపిలో చేరితే ఇక్కడ ఆ పార్టీ రావడం ఖాయం.. అదే జరిగితే ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు మరింత రసవత్తరమవుతాయి. అయితే సరిగ్గా ఆవిర్భావ సభ నిర్వహించేనాటికే కేసీఆర్ కు గట్టిగా ఝలక్ ఇవ్వాలని తెలంగాణలో విపక్షాలు వ్యూహరచన చేస్తున్నాయి. ఖమ్మంలో సీఎం కేసీఆర్ సభ పెడుతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లా కీలక నాయకుల్ని.. తమ పార్టీలో చేర్చుకుంటే అది కేసీఆర్ ఇమేజికి పెద్ద దెబ్బ అవుతుందని వారు అంచనా వేస్తున్నారు.

18న జరిగే సభకు ముందురోజు పొంగులేటి పార్టీ మారి.. కేసీఆర్ మీద విమర్శనాస్త్రాలు సంధిస్తే.. ఆవిర్భావ సభ జరిగేరోజున పత్రికల్లో పతాక శీర్షకలన్నీ ఆ వార్తలే ఉంటాయి. అది జాతీయ స్థాయి నాయకుల ఎదుట కేసీఆర్ కు డేమేజి అవుతుందని బీజేపీ భావిస్తోంది. ఇలాంటి సమయానుకూల, టైం బౌండ్ వ్యూహాలను అమలు చేయడంలో బిజెపికి చాలా అనుభవం ఉంది. కేసీఆర్ ఇమేజిని దెబ్బకొట్టడానికి, ప్రజలతో మైండ్ గేమ్ ఆడటానికి వారి దగ్గర చాలా ట్రిక్కులు ఉంటాయి. మునుగోడు ఎన్నిక జరుగుతున్న సమయంలో గులాబీ పార్టీ నుంచి తమ పార్టీలోకి అనేకమంది చేరికల్ని ప్రోత్సహించారు.

భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కూడా ఈ వ్యూహాల్లో భాగంగా.. కమలతీర్థం పుచ్చుకుని.. కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డెడ్ అన్నట్టుగా ఆ మైండ్ గేమ్ బాగానే వర్కవుట్ అయింది గానీ.. మునుగోడు ఎన్నికలో మాత్రం గెలవలేకపోయారు. ఇప్పుడు మళ్లీ అదే తరహా మైండ్ గేమ్ కు తెరలేపుతున్నారు. ఇక ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు పెద్ద బలగం లేదనే ఆరోపణలున్నాయి. అయినా అక్కడే ఆవిర్భావ సభను నిర్వహించడం ద్వారా సత్తా చాటాలనుకుంటున్నారు కేసీఆర్. ఇక్కడ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తన అనుచరులంతా పోటీ చేస్తారని.. పదవులు లేకుండా చాలా కాలం ఉండలేమని ఇటీవల పొంగులేటి చేసిన కామెంట్స్ హీట్ పెంచాయి. పొంగులేటి పార్టీ మారడం ఖాయమనే నిర్ణయానికి వచ్చారు కేసీఆర్.

సభ టైంలోనే బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరడానికి ఇదే మంచి సమయం అని కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు. ఆవిర్భావ సభ రోజు ఆదే జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలను బీజేపీలో చేర్చుకోవడం ద్వారా ఆ పార్టీని దెబ్బ కొట్టవచ్చని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే బీఆర్ఎస్ కు గట్టి దెబ్బ తగిలినట్లేనని విశ్లేషకులు అంటున్నారు. ఖమ్మం జిల్లాలో బీజేపీకి బలమైన నేత అవసరం. అది పొంగులేటి రూపంలో వస్తుంటే కాదనుకోదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి సామాజికవర్గంగా, ఆర్థికంగా బలవంతుడు కావడంతో ఆయన అనుకున్నట్లుగానే ఆయన కోరుకున్న సీటుతో పాటు అనుచరులకు కూడా టిక్కెట్లను కేటాయించే వీలుంది. దీంతో దీన్ని అడ్డుకునేందుకు కేసీఆర్ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే పొంగులేటి జంప్ కన్ఫర్మ్ కావడంతో, ఆయనతో పాటు అనుచరులు చేజారకుండా కేసీఆర్ పావులు కదుపుతున్నారని టాక్ వినిపిస్తోంది. దీంతో సభ వేళ ఖమ్మం నాట రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.

Must Read

spot_img