Homeజాతీయందేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ చేస్తోన్న భారత్ జోడో యాత్ర..!

దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ చేస్తోన్న భారత్ జోడో యాత్ర..!

దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ చేస్తోన్న భారత్ జోడో యాత్ర చర్చనీయాంశంగా మారుతోందా..? ఈ యాత్రపై తొలుత వ్యక్తమైన వ్యతిరేకత క్రమక్రమంగా తగ్గుతోందా..? అసలు జోడో యాత్ర వెనుక ఉద్దేశ్యమేంటన్నదే ఆసక్తికర చర్చను లేవనెత్తుతోంది.

భారత్ జోడో యాత్రపై సెటైర్లు .. తగ్గాయా..? బీజేపీ తోడో యాత్ర అంటున్నా.. పెద్దగా స్పందన ఉండడం లేదా..? రాహుల్ యాత్ర .. ఏ ఉద్దేశ్యంతో సాగుతోందన్న చర్చ విశ్లేషకుల్లో భిన్నాభిప్రాయాలకు కారణమవుతోంది. ఇంతకీ వీరు చెబుతున్నదేమిటి..?

బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా రాహుల్ గాంధీ చేస్తున్నది భారత్ జోడో యాత్ర కాదు అది భారత్ తోడో యాత్ర అని వ్యాఖ్యానించారు. ఒకవైపు బీజేపీ, ఈ యాత్రను ‘భారత్ తోడో యాత్ర’గా అభివర్ణిస్తుంటే, మరోవైపు సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు ఈ యాత్రలో భాగం అవుతున్నారు. అయితే, రాహుల్ గాంధీ ఇప్పటివరకు చేసిన ఈ ప్రయాణాన్ని ఎలా అంచనా వేయాలనేది ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. రాహుల్ గాంధీ యాత్ర చేస్తోన్న సమయంలోనే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, దిల్లీ ఎంసీడీ ఎన్నికలు, లోక్‌సభలో ఒక స్థానంతో పాటు 5 రాష్ట్రాల్లోని 6 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి.

గుజరాత్‌లో బీజేపీ మునుపటి కంటే అతిపెద్ద విజయాన్ని నమోదు చేయగా, కాంగ్రెస్ పరిస్థితి దీనికి భిన్నంగా తయారైంది. అక్కడ కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారి ఘోర పరాజయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. హిమాచల్ ప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ విజయవంతమైంది. కానీ, దిల్లీ ఎంసీడీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత చెత్త ప్రదర్శనను కనబరిచింది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాలను రాహుల్ గాంధీ యాత్రతో ముడిపెట్టి చూడాలా? అన్నదే చర్చనీయాంశంగా మారింది. దీనిపై కాంగ్రెస్ మీడియా ఇన్‌చార్జి జైరామ్ రమేశ్ .. భారత్ జోడో యాత్ర అంటే ఎన్నికలు గెలిచే లేదా ఎన్నికల్లో గెలిపించే యాత్ర కాదు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, దాన్ని పునరుద్ధరించడం అనేది ఈ యాత్ర ఉద్దేశ్యమని చెప్పారు.

మోదీ ప్రభుత్వ ఉద్దేశాలు, విధానాల వల్ల ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. సమాజంలో చీలికలు వస్తున్నాయి. రాజకీయ నియంతృత్వం ఒక సాధారణ అంశంగా మారింది.

రాహుల్ గాంధీ చేస్తోన్న భారత్ జోడో యాత్ర అసలు ఉద్దేశం..?

రాహుల్ గాంధీ చేస్తోన్న భారత్ జోడో యాత్ర అసలు ఉద్దేశం ఈ మూడు అంశాలను భారత ప్రజలకు అర్థమయ్యేలా చేయడం అని ఆయన సూచనప్రాయంగా వివరించారు. అయితే, కాంగ్రెస్ నిర్దేశించుకున్న ఈ ఉద్దేశాల ప్రకారమే యాత్రను మూల్యాంకనం చేస్తే రాహుల్ గాంధీ ఇప్పటివరకు ఈ యాత్ర ద్వారా ఏం సాధించారు? ఏం పోగొట్టుకున్నారు? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. అయితే రాహుల్ గాంధీ ఒక తత్వవేత్త కాదు, ఒక మత గురువు కాదు. రాహుల్ గాంధీ పూర్తిగా ఒక రాజకీయ నాయకుడు. కాబట్టి ఆయనను రాజకీయాల నుంచి వేరు చేసి చూడలేమని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.

అదే సమయంలో యాత్ర సందర్భంగా ప్రజలు రాహుల్‌తో కలిసి రావడం స్పష్టంగా కనిపిస్తోంది. కానీ, రాజకీయ పరంగా చూస్తే ఆయన ఇప్పటివరకు ఏం సాధించారో చెప్పడం కష్టమేనని సైతం వీరు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ మనుగడలో ఉంది, కొన్ని రాష్ట్రాల్లో బలహీనంగా, మరికొన్ని రాష్ట్రాల్లో కనుమరుగు అయింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. అక్కడ సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వర్గాలు రెండూ కలిసి పనిచేశాయి. అక్కడ రాహుల్ గాంధీ యాత్ర చాలా విజయవంతమైంది. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ వెనుకబడింది. కానీ, అయినప్పటికీ రాహుల్ గాంధీ పర్యటన సమయంలో కాంగ్రెస్ పార్టీ బలంగా కనిపించింది.

రాజస్తాన్ విషయానికొస్తే అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ యాత్ర కోసం ప్రజలను సమీకరించడంలో కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా మారిందనడానికి వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలు అసలు పరీక్షగా మారనున్నాయి. కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ సహా మొత్తం 13 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.

ద్రవ్యోల్బణం, నిరుద్యోగం అనేవి ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలు. రాహుల్ గాంధీ ఈ సమస్యలపై తన గొంతు వినిపిస్తే 2024 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రయోజనం కలుగుతుంది. గత కొన్నేళ్లలో సమాజంలో చీలిక పెరిగిందన్నది నిజమేనని, ఈ విషయంలో బీజేపీ చాలా విజయవంతమైందని, రాహుల్ గాంధీ మాటలు ప్రజలను ప్రభావితం చేయట్లేదని అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఈరోజుకీ ప్రజల్లో నరేంద్ర మోదీపై అభిమానం చాలా ఎక్కువ స్థాయిలో ఉంది. నియంతృత్వ అంశం ప్రజల మనస్సుల్లోకి ఎక్కడం లేదు.

మోదీ ఎమర్జెన్సీ అయితే విధించలేదు కదా, అలాంటప్పుడు నియంతృత్వం అని ఎలా చెబుతాం అని ప్రజలు అంటున్నారని వీరంతా చెబుతుండడం గమనార్హం. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి సెప్టెంబర్ 7వ తేదీన రాహుల్ గాంధీ ఈ భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. రాహుల్ గాంధీ చేస్తోన్న ఈ యాత్రలో సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన ప్రజలు భాగస్వాములు అవుతున్నారు. అయితే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం బీజేపీ సిద్ధాంతానికి పూర్తిగా భిన్నమైన భావజాలాన్ని ప్రజల ముందు ఉంచడమేనని విశ్లేషకులు అంటున్నారు. ఈ యాత్ర ద్వారా కాంగ్రెస్ తన సైద్ధాంతిక సంక్షోభాన్ని అధిగమించింది.

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల సిద్ధాంతాలను పూర్తిగా వ్యతిరేకిస్తూ కనిపిస్తోందని అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎన్నికల సమయంలో మాత్రమే భావజాలం గురించి మాట్లాడుతున్నారు. అలా కాకుండా బీజేపీ నిరంతరం ప్రస్తావించే లవ్ జిహాద్, గోహత్య వంటి అంశాలపై తరచుగా కాంగ్రెస్ స్పందించాల్సి ఉందని వీరంతా సూచిస్తున్నారు. రాహుల్ గాంధీ ప్రస్తుతానికి ఏ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల గురించి ఆందోళన చెందడం లేదని, ఆయన దృష్టి అంతా 2024 సార్వత్రిక ఎన్నికలపైనే కేంద్రీకృతమై ఉందని అంటున్నారు.

అయితే ఈ యాత్రకు ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ చెబుతోంది. అయితే అవినీతికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ యాత్ర చేసినప్పుడు, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ యాత్ర చేపట్టినప్పుడు కూడా ఇది ఎన్నికల యాత్ర కాదు అనే చెప్పారు. కానీ అది పూర్తిగా రాజకీయ యాత్ర అని అందరికీ తెలిసిందే. ఈ పర్యటన వల్ల రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి లాభం జరిగిందన్నదే చర్చనీయాంశంగా మారింది.

ఈ యాత్ర అన్నింటికంటే ఎక్కువగా రాహుల్ గాంధీ వ్యక్తిగత ఇమేజ్‌పై ఎక్కువ ప్రభావం చూపిందని వీరంతా అభిప్రాయపడుతున్నారు. రాహుల్ గాంధీ గురించి మీడియా ఇప్పుడు చాలా తక్కువగా మాట్లాడుతోందని, ఇది రాహుల్ గాంధీ విజయమని చెప్పారు. ఇంతకుముందు రాహుల్ గాంధీ గురించి మీడియా చాలా విద్వేషంగా ఉండేదని అన్నారు. తాను నిరుద్యోగులు, యువత, దళితులు, గిరిజనులు, పేదలు, రైతులు, ముస్లింలకు అండగా నిలుస్తున్నానని, 2024 ఎన్నికల్లో సరళమైన సైద్ధాంతిక రేఖను గీయడానికి ప్రయత్నిస్తున్నానని రాహుల్ గాంధీ ఇస్తోన్న సందేశం ఈ యాత్ర ద్వారా స్పష్టంగా తెలుస్తోంది.

‘మోదీ ప్రభుత్వ హయాంలో భారతదేశంలోని కొన్ని ఎంపిక చేసిన వ్యాపార సంస్థలు మాత్రమే అన్ని ప్రయోజనాలను పొందుతున్నాయని, మిగిలిన సమాజంలోని వారు నష్టపోతున్నారని ప్రజలను నమ్మించేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారు. మోదీ ప్రభుత్వాన్ని, కొన్ని వ్యాపార సంస్థలను వ్యతిరేకిస్తున్నామని, వారి కారణంగా బాధపడుతున్నవారికి అండగా నిలిచేందుకే తాను ప్రయత్నిస్తున్నట్లు రాహుల్ గాంధీ ఈ పర్యటన ద్వారా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ ఎంత విజయవంతం అయ్యాడనేది ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రమే తెలుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

2024 ఎన్నికలే టార్గెట్ గా రాహుల్ పాదయాత్ర సాగుతోందన్న అంశాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నా.. ఫలితం తేలాలంటే, మాత్రం సార్వత్రిక ఎన్నికల తర్వాతేనని స్పష్టం చేస్తున్నారు.

Must Read

spot_img