Homeఅంతర్జాతీయంతవాంగ్ లో చొరబాటు యత్నం వెనుక .. జిన్ పింగ్ యుద్ధ వ్యూహం దాగుందా..?

తవాంగ్ లో చొరబాటు యత్నం వెనుక .. జిన్ పింగ్ యుద్ధ వ్యూహం దాగుందా..?

తవాంగ్ లో చొరబాటు యత్నం వెనుక .. జిన్ పింగ్ యుద్ధ వ్యూహం దాగుందా..? భారత్ తో యుద్ధ వాతావరణాన్ని సృష్టించాలని చైనా అధినేత
జిన్ పింగ్ ఎందుకు భావిస్తున్నారు..?

సరిహద్దుల్లో ఉద్రిక్తతల వెనుక అసలు కథ వేరే ఉందన్న వాదనలు అంతర్జాతీయంగా వెల్లువెత్తుతున్నాయి. సొంత దేశంలో నిరసనలను
తప్పించుకోవడం కోసమే.. జిన్ పింగ్ ఈ ఉద్రిక్తతలకు తెర లేపారన్న చర్చ హాట్ టాపిక్ గా మారింది.

తవాంగ్ లో చైనా సైన్యం చొరబాటు యత్నంతో .. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారత్ పై యుద్ధానికి సన్నద్ధమవుతున్నారా..? అన్న చర్చ ఇప్పుడు
అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ముందుగా లఢఖ్ లో చొరబడి ఇప్పుడు తవాంగ్ లో చొరబడేందుకు ప్రయత్నించడం ఆకస్మికంగా
జరగలేదని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా భారత్ లో యుద్ద ఉద్రిక్తతలకు ప్రయత్నిస్తున్నారన్న వాదనలు
వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఇరు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో సైనిక కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఇరు దేశాలు తమ సరిహద్దుల్లో సైనిక
సామర్థ్యాలను కూడా వేగంగా పెంచుకుంటున్నాయి.

అయితే భారత దేశంతో యుద్ధ వాతావరణాన్ని పెంచుకోవడం వెనుక తన దేశ ప్రజల్ని కరోనా, బలహీన ఆర్థిక వ్యవస్థ సమస్యల నుంచి జాతీయవాదం వైపు మళ్లించడమే కారణమన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. ముఖ్యంగా దేశంలో అమలవుతోన్న జీరో కోవిడ్ విధానం దేశ ప్రజల్లో తీవ్ర నిరాశను కలిగిస్తోంది. కరోనా మహ్మవారిని నియంత్రించే పేరుతో దేశంలో బలవంతంగా జీరో కోవిడ్ అమలు చేయడం వల్ల చైనాలో జిన్ పింగ్ పై నిరసన పెరుగుతోంది. అనవసరమైన ఆంక్షలతో విసిగిన ప్రజలు ఇప్పుడు బహిరంగంగా వీధుల్లోకి వచ్చి చైనా కమ్యూనిస్ట్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. జిన్ పింగ్ రాజీనామాను డిమాండ్ చేస్తున్నారు.

దీనికితోడు వివిధ నగరాల్లో నిరంతర లాక్ డౌన్ కారణంగా పెద్ద ఫ్యాక్టరీలు, కంపెనీలు మూతపడ్డాయి. దీంతో చైనా సప్లై చైన్ గాడి తప్పింది. నష్టాలను నివారించడానికి కంపెనీలు భారీ తొలగింపులు చేస్తున్నాయి. దీని కారణంగా చైనాలో పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు. ఈ రెండు కారణాల వల్ల ఆయన కోవిడ్ ప్రోటోకాల్ లో కూడా సడలింపులు ఇవ్వాల్సి వచ్చింది.

అయితే తాజా పరిణామాలతో జిన్ పింగ్ పై ఈ నిరసనలు మరింత పెరగవచ్చన్న అభిప్రాయం సైతం వెల్లువెత్తుతోంది. ఈ పరిస్థితిని ముందే అంచనా వేసిన జిన్ పింగ్ .. ఇప్పుడు ప్రజల ఆగ్రహం నుంచి దృష్టి మరల్చి, జాతీయవాదం వైపు తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. దీనికోసమే ఆయన .. యుద్ధ వాతావరణాన్ని సృష్టించేందుకు సిద్ధమవుతున్నారన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వ్యూహంలో భాగంగా జిన్ పింగ్ తొలుత .. తైవాన్ వైపు మొగ్గు చూపినా.. అది మరో సమస్యను లేవనెత్తనుందన్న అంచనాలు వినిపించాయి. తైవాన్ పై యుద్ధానికి దిగినా, కనీసం వారివైపు
చూసినా .. అటు జపాన్ ఇటు అమెరికా నుంచి తలనెప్పులు తలెత్తే సమస్య ఉంది. దీంతో ఆ దిశగా అడుగులు వేయలేని పరిస్థితి నెలకొంది.

అదేసమయంలో భారత్ తో ఇప్పటికే 2 సంవత్సరాల నుంచి సరిహద్దు ఉద్రిక్తతలు ఉన్నాయి. గాల్వాన్ ఘటన జరిగినప్పటి నుంచి ఇరు దేశాల
మధ్య సత్సంబంధాలు లేవు. ఇక భారత్ కు మద్ధతుగా ఏ దేశమైనా స్పందించినా, పెద్దగా నష్టం ఉండకపోవచ్చని జిన్ పింగ్ అంచనా
వేసుకున్నారని రక్షణ రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. లఢఖ్ లో సైనిక ఆక్రమణ ద్వారా ఇప్పటికే ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని
చైనా సృష్టించింది. అయితే ఇప్పటికే లఢఖ్ లో చొరబాట్లకు ప్రయత్నించడం, భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవడంతో వెనుకంజ వేయడం
తెలిసిందే. ఈ వ్యవహారంపైనా దేశంలో వ్యతిరేకత వ్యక్తమైంది. అందుకే ఈ దఫా లఢఖ్ కాకుండా అరుణాచల్ ప్రదేశ్ దిశగా పావులు కదుపుతున్నట్లు
తెలుస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ లో ఇప్పటికే పలు నిర్మాణాలు చేపట్టింది. దీనిపై వ్యతిరేకత రాకపోవడంతో, పీఎల్ఏ ఆర్మీని అటు దిశగా వెళ్లాలని
సూచించింది.

అయితే గతంలో జరిగిన ఘటనల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్న భారత్ .. దీనికి గట్టిగానే సమాధానం చెప్పింది.

అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్వా స్తవాధీన రేఖ వద్ద ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ఇరువర్గాలవారికి గాయలైనట్లు తెలుస్తోంది. సరిహద్దుల్లో శాంతి, సమరస్యాలను నెలకొల్పే దిశగా ఇరు దేశాల మధ్య ప్రయత్నాలు జరుగుతున్న వేళ ఈ హఠాత్ పరిణామం కొత్త ఆలోచనలను రేకెత్తిస్తోంది. ఈ ఘర్షణల నేపథ్యంలో రెండు దేశాలకు సంబంధించిన బలగాలను వెనక్కి రప్పించినట్లుగా సమాచారం. గతంలో సుమారు రెండున్నర సంవత్సరాల క్రితం గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో మన సైనికులు 20మంది ప్రాణాలు కోల్పోయారు.

అదే ఘటనలో చైనాకు చెందిన 40మంది సైనికులు కూడా ప్రాణాలు పోగొట్టుకున్నట్లు చెప్పుకున్నారు. ఈ సంఘటనతో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ఏ స్థాయిలోనైనా చైనాను తిప్పికొట్టడానికి భారత్ సర్వ విధాలా సిద్ధమైంది కూడా. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సరిహద్దులకు వెళ్లి మన సైన్యానికి అచంచలమైన ధైర్యాన్ని ఇవ్వడమే కాక, చైనాకు గట్టి హెచ్చరిక కూడా చేశారు. సమాంతరంగా శాంతి స్థాపనకు పెద్దఎత్తున ప్రయత్నాలు జరిగాయి. ఇరు దేశాల ప్రతినిధులు పలుమార్లు చర్చలు జరిపారు. సుదీర్ఘకాలం పాటు వరుస చర్చల తర్వాత రెండు దేశాలు తమ బలగాలను చాలా వరకూ వెనక్కు తీసుకున్నాయి. దీనివల్ల ఆ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తగ్గి కొంత శాంతి వాతావరణం అలుముకుంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లో జరిగిన సంఘటనతో సరిహద్దుల్లో మళ్ళీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ తరుణంలో మనం అప్రమత్తమైనప్పటికీ, అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతో వుంది.

జవహర్ లాల్ నెహ్రూ కాలం నుంచి ఇప్పటి వరకూ జరిగిన పరిణామాల్లో చాలా వరకూ మన భూభాగాలను చైనా ఆక్రమించేసిందనే ఎక్కువమంది
పరిశీలకుల వాదన. ముఖ్యంగా జిన్ పింగ్ కాలంలో, భారత్ -చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయనే చెప్పాలి. అమెరికాను అధిగమించి
అగ్రరాజ్యంగా అవతరించాలనే ఆకాంక్ష, సామ్రాజ్య విస్తరణ కాంక్ష బలంగా ఉన్న నాయకుడిగా జిన్ పింగ్ కు ప్రపంచ దేశాల్లో పేరుంది. భారత్
సరిహద్దు దేశాలన్నింటినీ ఇప్పటికే చైనా తన గుప్పిట్లో పెట్టుకుంది.

ఇక అరుణాచల్ ప్రదేశ్ విషయానికి వస్తే అదంతా తమ భూభాగమనే భావనల్లోనే చైనా ఉంది.

సరిహద్దులు దాటి కూడా చాలా గ్రామాలను తమ కనుసన్నల్లో నిలుపుకుందనే పరిశీలకులు చెబుతున్నారు. రక్షణ రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం దీని వెనుక చైనా కు 2 స్పష్టమైన లక్ష్యాలు ఉన్నాయి. తొలుత భూటాన్ ను మూడువైపుల నుంచి ముట్టడించడం, రెండోది అరుణాచల్ ప్రదేశ్ ను భారతదేశం నుంచి లాక్కోవడం అని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం చైనా బలగాలు భూటాన్ కు పశ్చిమ డోక్లాం ముందు, ఉత్తర దిశలో ఉన్నాయి. తవాంగ్ ను చైనా స్వాధీనం చేసుకుంటే, చైనా సైన్యం భూటాన్ తూర్పు వైపు కూడా చేరుకుంటుంది. దీనితర్వాత ఎప్పుడైనా పెద్ద ఆపరేషన్ చేపట్టి భూటాన్ ను తన ఆధీనంలోకి తీసుకోగలదు.

అరుణాచల్ ప్రదేశ్ ను చేజిక్కించుకోవాలనే కుట్ర కూడా తవాంగ్ ను స్వాధీనం చేసుకునేందుకేనని భావిస్తున్నారు. చైనా ఈ ప్రాంతాన్ని దక్షిణ టిబెట్ అని పిలుస్తుంది. ఇది టిబెట్ లో భాగమని చెబుతుంది. 1962 యుద్ధంలో చైనా సైన్యం తవాంగ్ ను స్వాధీనం చేసుకుంది. అయితే తవాంగ్ ను గుప్పిట్లో ఉంచుకోలేకపోయింది. ఇన్నేళ్లలో చైనా బలమైన దేశంగా మారితే, భారత్ కూడా ఈ ప్రాంతంలో గట్టి సన్నాహాలు చేసింది.

జిన్ పింగ్ వ్యూహం ఏదైనా.. భారత్ మాత్రం ఈ దఫా గట్టిగానే సమాధానం ఇవ్వనుందని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు. అందులో
భాగంగానే తవాంగ్ లో పీఎల్ఏ ఆర్మీకి ఎదురుదెబ్బ ఎదురైందని అంటున్నారు.

Must Read

spot_img