తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ .. ఇటీవల భారత్ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ గా మారిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే లక్ష్యంగా ఏర్పడిన టీఆర్ఎస్.. ఇప్పుడు దేశంలో మార్పు కోసం బీఆర్ఎస్‌గా మారింది. అయితే, టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారడంతో..టీఆర్ఎస్ పేరుపై కొందరు రాజకీయ నాయకులు కన్నేయడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. వివిధ రాజకీయ పార్టీల్లో అసంతృప్తులుగా ఉన్న బడా నాయకులు, కొందరు ప్రజాప్రతినిధులు కలిసి తెలంగాణలో టీఆర్ఎస్ పేరుపై దృష్టి సారించారు.
టీఆర్ఎస్ పేరుతో రాజకీయ పార్టీని పెట్టాలనే ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ పేరు అనేది తెలంగాణలో క్షేత్రస్థాయి వరకు పాతుకుపోయింది. ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఈ రాజకీయ నేతలు పావులు కదుపుతున్నారు. కరీంనగర్, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన కొందరు నాయకులు టీఆర్ఎస్ పేరుతో పార్టీ పెట్టాలనే ఆలోచనలు చేస్తున్నారు. వీరికి కొందరు బడా నేతలు పరోక్షంగా సహకరిస్తున్నట్లు సమాచారం. ప్రముఖంగా నల్గొండకు చెందిన బడా నేతల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వారిని టీఆర్ఎస్ పేరుతో పెట్టే పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ గుర్తులు ఎలా ఉన్నా.. పార్టీ పేరు మాత్రం టీఆర్ఎస్ వచ్చేలా చూసుకుంటున్నట్లు తెలిసింది.కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితిగా టీఆర్ఎస్ కొనసాగిన విషయం తెలిసిందే. అయితే, టీఆర్ఎస్ పేరుతోనే అంటే.. తెలంగాణ రైతు సమితి లేదా తెలంగాణ రక్షణ సమితి లేదంటే తెలంగాణ రాజ్య సమితి, ఇంకా తెలంగాణ రైతు సమాఖ్య పేరుతో రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. వీటన్నింటికి టీఆర్ఎస్ అనే సంక్షిప్త నామం వచ్చేలా జాగ్రత్త పడుతున్నారు. దీంతో బీఆర్ఎస్‌గా మారిన టీఆర్ఎస్‌కు ఇది మరో తలనొప్పిగా మారే అవకాశం లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
![](https://inewslive.net/wp-content/uploads/2023/03/trs.jpg)
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓట్లను సాధ్యమైనంత వరకు చీల్చేందుకు ఈ పేరు అనుకూలించవచ్చంటున్నారు. అయితే కేసీఆర్ వదిలేసిన టీఆర్ఎస్ పేరుతో రాష్ట్రంలో మరో కొత్త పార్టీ అవతరించనుందని వార్తలు వస్తున్నాయి. TRS అనే పేరును అస్త్రంగా మార్చుకొని..తెలంగాణ సెంటిమెంట్ ను తమకు అనుకూలంగా మార్చుకోవాలని కొంతమంది చూస్తున్నారట.
అయితే దీని వెనుక ఎవరున్నారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకవేళ ఇదే జరిగితే రాష్ట్ర రాజకీయాల్లో మరో పెను సంచలనం చోటు చేసుకోనుంది. కాగా తెలంగాణలో ఇప్పటికే చాలా పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఇంకో పార్టీ వస్తే ఏముందులే అనుకుంటే పొరపాటే. తెలంగాణ ప్రజల నోళ్లలో టీఆర్ఎస్ పేరు నేటికీ నానుతుంది. ఈ క్రమంలో ఆ పేరుతో పార్టీ పెడితే బీఆర్ఎస్ కు నష్టం తప్పదు.
టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ కు తీవ్ర పోటీ తప్పదు. ఈ కొత్త పార్టీని మాజీ ప్రతినిధులు, అసంతృప్తి నాయకులూ, ఉద్యమ సమయం నుండి పార్టీలో ఉంటూ రాజకీయంగా అవకాశాలు రాని వారంతా ఒక్కటై పార్టీ పెట్టాలని భావిస్తున్నారట. ఇందులో ముఖ్యంగా 4 జిల్లాలకు చెందిన నేతలు ఉన్నట్టు సమాచారం. తమకున్న ప్రజాబలం, టీఆర్ఎస్ పేరుతో ఎన్నికల్లో కీలకం కావాలని వీళ్లు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. అయితే ఇప్పటికిప్పుడు ఆ పేరుతో పార్టీ పెట్టడం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ టీఆర్ఎస్ పేరుతో పార్టీ రిజిస్టర్ చేయిస్తే బీఆర్ఎస్ కు నష్టం వాటిల్లే అవకాశాలు లేకపోలేదు. కారు గుర్తును కేటాయించనప్పటికీ కూడా టీఆర్ఎస్ పేరును కేటాయిస్తే మాత్రం రాజకీయంగా బీఆర్ఎస్ కు ఇబ్బందులు తప్పవు.
మొత్తానికి ఇంగ్లిష్ లో TRS వచ్చే విధంగా పార్టీని తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ టీఆర్ఎస్ పేరుతో పార్టీ ఏర్పాటు జరిగితే అది రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనంగా మారనుంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పేరు ఫలితాలను తారుమారు చేసే అవకాశం లేకపోలేదు. తెలంగాణ సెంటిమెంటే అస్త్రంగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా మారిపోయింది. ఈ క్రమంలో తెలంగాణ సెంటిమెంట్ ను ఉపయోగించుకునేందుకు కొత్తగా టీఆర్ఎస్ పార్టీని కొంత మంది కీలక నేతలు మళ్లీ ప్రారంభించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ అనే పేరు ఉంటుంది కానీ.. తెలంగాణ రాష్ట్ర సమితి కాదు..
తెలంగాణ రాజ్య సమితి లేదా తెలంగాణ రైతు సమితి అనే పేరు పెట్టే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికీ ఈ పార్టీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు పూర్తయ్యాయని చెబుతున్నారు. ఎవరో ఆషామాషీగా పెట్టిస్తున్న పార్టీ కాదని.. తెర వెనుక ఓ ముగ్గురు సీనియర్ కీలక నేతలు ఉన్నారని చెబుతున్నారు. వారు రేపోమాపో బయటకు వచ్చి.. తెలంగాణ రాజ్య సమితి లేదా తెలంగాణ రైతు సమితిని ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. పార్టీ గుర్తుగా పింక్ కలర్‌నే ఉపయోగించనున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఉపయోగిస్తున్న రంగు కాకుండా.. కాస్త కలర్ వేరియషన్ చూపించే అవకాశం ఉంది.
![](https://inewslive.net/wp-content/uploads/2023/03/tel-1.jpg)
ఇప్పటికే తెర వెనుక పార్టీకి సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయని చెబుతున్నారు. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చుకున్న అంశాన్ని ఉపయోగించుకుని తెలంగాణ సెంటిమెంట్‌తో కొత్త పార్టీ రేపి.. మంచి విజయం సాధించాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. టీఆర్ఎస్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో ఓడించాలన్న లక్ష్యంతో ఈ పార్టీ ఏర్పాటవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని… టీఆర్ఎస్ పేరుతో మరో పార్టీ ఉంటే అది్ బీఆర్ఎస్‌కే నేష్టమని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఆ ముగ్గురు నేతలెవరు అన్నది ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఇటీవల బీఆర్ఎస్‌తో విబేధించిన ఖమ్మం మాజీ ఎంపీ ఒకరు ఏ పార్టీలోనూ చేరకుండా, బీఆర్ఎస్ పై ఘాటు విమర్శలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో మాజీ ఎంపీ జాతీయ పార్టీలో చేరినప్పటికీ ఆయన కు అక్కడ ప్రాధాన్యత లభించడం లేదు. ఆ పార్టీ కార్యకలాపాల్లో పెద్దగా కనిపించడం లేదు. ఆయన లక్ష్యం కూడా టీఆర్ఎస్ పార్టీని ఓడించడమే. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మరో నేత కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆయన తన పై కుట్రలు చేస్తున్నారని..
దెబ్బకు దెబ్బ తీయాలన్న లక్ష్యంతో ఉన్నారని చెబుతున్నారు. ఉద్యమ బ్యాక్ గ్రౌండ్ ఉండటం ఆయనకు ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయనిచెబుతున్నారు. మొత్తంగా ఈ రాజకీయ పార్టీ అంశం ఉద్దృతంగా తెరపైకి వచ్చి.. తెలంగాణ అంశానికి దూరంగా జరగడం ఇష్టం లేని నేతలు ఈ పార్టీలో చేరితే.. బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. దీంతో తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్ పురుడు పోసుకుంటోందా? అన్నది ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. వివిధ పార్టీలో ఉన్న తెలంగాణవాదులు టీఆర్ఎస్ ఏర్పాటు సన్నాహాల్లో ఉన్నట్లుగా
తెలుస్తోంది.
బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలోని అసంతృప్త నేతలతో మంతనాలు జరుపుతున్నారని, టీజేఎస్ అధినేత కోదండరామ్ ని కూడా కలుపుకుని పోయేందుకు చర్చలు జరుగుతున్నాయని ప్రచారం కూడా జోరందుకుంది. తెలంగాణ రాజ్యసమితి పేరుతో ఇప్పటికే ఒక పొలిటికల్ పార్టీ రిజిస్ట్రర్ అయినట్లు సమాచారం అందుతోంది. పార్టీని రిజిస్టర్ చేసినట్టు, త్వరలోనే బహిరంగ ప్రకటనతో ఈ పార్టీ జెండా, అజెండాని జనంలోకి తీసుకు రానున్నట్టు మీడియాలో వార్తలొస్తున్నాయి. అయితే ఈ డూప్ షాట్ రాజకీయాలు ఎక్కువకాలం చెల్లవు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేవలం TRS పేరుని వాడుకుని రాజకీయ లబ్ధి పొందాలని చేస్తున్న ప్రయత్నాలు నెరవేరవని అప్పుడే సోషల్ మీడియాలో కౌంటర్లు మొదలయ్యాయి.