Homeఅంతర్జాతీయంభారత ప్రధానిపై బీబీసీ డాక్యుమెంటరీ…

భారత ప్రధానిపై బీబీసీ డాక్యుమెంటరీ…

మొదట భారత ప్రధానిపై బీబీసీ డాక్యుమెంటరీ విషయం బయటపడినప్పుడు వెర్సన్ వేరు..ఇప్పుడు యూకే మాట్లాడుతున్నది పూర్తిగా వేరుగా ఉంది. మరి ఎవరి వత్తిడి పనిచేస్తోందో కానీ యూకే పూర్తి యూ టర్న్ తీసుకుంది. పైగా బీబీసీకి ఆ స్వేచ్ఛ ఉందని కితాబిచ్చింది. అంతే కాదు బీబీసీ కార్యాలయంలో ఐటీ దాడుల విషయాన్ని తప్పు పట్టింది. ఈ పరిణామంపై నేరుగా పార్లమెంటులోనే స్పందించింది.

బీబీసీకి ఆ స్వేచ్ఛ ఉందని అంటోంది బ్రిటన్..తాజాగా భారత్‌లో పరిణామాలపై బ్రిటన్‌ స్పందన విచిత్రంగా ఉంది. భారత ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీ పెనుదుమారమే రేపింది. తదనంతర నాటకీయ పరిణామాల నడుమ.. ఆ సంస్థ కార్యాలయాలపై ఐటీ పరిశీలనలు కొనసాగాయి. ఐటీ లెక్కల్లో పలు అవకతవకలు ఉన్నట్లు గుర్తించింది భారత ఐటీ శాఖ. ఈ పరిణామంపై యూకే ప్రభుత్వం పార్లమెంట్‌లో స్పందించింది. పైగా బీబీసీ సంపాదకీయ స్వేచ్ఛను సమర్థించింది కూడా. ఈ మేరకు హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో లేవనెత్తిన అత్యవసర ప్రశ్నకు విదేశాంగ కామన్వెల్త్‌ అభివృద్ధి కార్యాలయం‘ఎఫ్‌సీడీఓ’ జూనియర్ మంత్రి డేవిడ్‌ రూట్లీ స్పందిస్తూ మంగళవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఐటీ శాఖ చేసిన ఆరోపణల గురించి అక్కడి(భారత) ప్రభుత్వంపై వ్యాఖ్యనించలేమన్నారు.

కానీ మీడియా స్వేచ్ఛ, వాక్‌ స్వాంతంత్య్రం గురించి నొక్కి చెప్పారు. పైగా బలమైన ప్రజాస్వామ్యానికి అవే ముఖ్యమైన అంశాలన్నారు. అంతేగాదు భారతదేశంతో ఉన్న విస్తృతమైన లోతైన సంబంధాల గురించి ప్రస్తావించారు. అలాగే భారత ప్రభుత్వంతో అనేక సమస్యలను నిర్మాణత్మాకమైన పద్ధతిలో చర్చించేందుకు యూకేకు వీలు కల్సిస్తుందని నమ్మకంగా చెప్పారు. అంతేగాదు తాము బీబీసీ కోసం నిలబడతాం, నిధులు సమకూరుస్తాం అని రూట్లీ కుండబద్ధలు కొట్టారు. బీబీసీ వరల్డ్‌ సర్వీస్‌ అత్యంత ముఖ్యమైనదని భావిస్తున్నామని తేల్చి చెప్పారు. అందుకే బీబీసీకి సంపాదకీయ స్వేచ్ఛ ఉండాలని కోరుకుంటున్నామని రూట్లీ అన్నారు. బీబీసీ మా ప్రభుత్వాన్ని, ప్రతిపక్ష లేబర్‌ పార్టీని కూడా విమర్శిస్తుంది, దానికి ఆ స్వేచ్ఛ ఉందన్నారు. ఆ స్వేచ్ఛ చాల కీలకమైనదని అన్నారు.

అయితే ఒక దేశపు మీడియా సంస్థ మరో దేశపు అంతర్గత విషయాలలో జోక్యం కలిగించుకోవడం ఎంత వరకు సమంజసమన్నది మాత్రం తెలియజేయలేదు.

పైగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మన స్నేహితులకు అంటే భారతదేశంలోని ప్రభుత్వంతో సహా దీని ప్రాముఖ్యతను తెలియజేయగలగాలన్నారు. బీబీసీ సంపాదకీయంగా స్వతంత్రంగా ఉంటుందని నొక్కి చెప్పారు. ఈ పబ్లిక్‌ బ్రాడ్‌కాస్టర్‌ ముఖ్యమైన పాత్ర పోషించడమే గాక నాలుగు భారతీయ భాషలతో సహా మొత్తం 12 భాషల్లో సేవలు అందిస్తోందన్నారు. ఎందుకంటే ఇది మన స్వరం మాత్రమే గాదు బీబీసీ ద్వారా మన స్వతంత్ర స్వరాన్ని ప్రపంచవ్యాప్తంగా వినిపించేలా చూసుకోవడం అతి ముఖ్యమని చెప్పారు. ఇదిలా ఉండగా, ఉత్తర ఐర్లాండ్‌ ఎంపీ జిమ్‌ షానన్‌ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో ఈ అత్యవసర ప్రశ్నను లేవనెత్తారు.

ఆయన ఈ చర్యను దేశ నాయకుడి గురించి పొగడ్త లేని డాక్యుమెంటరీ విడుదల చేయడంతో ఉద్దేశపూర్వకంగా సాగిన బెదిరింపు చర్యగా ఆరోపణలు చేశారు. ఈ సమస్యపై స్పందించడంలో విఫలమైనందుకు యూకే ప్రభుత్వాన్ని కూడా విమర్శించారు. అంతేకాదు బ్రిటన్‌ పార్లమెంట్‌లో ప్రతిపక్ష ఎంపీలు ఈ విషయంపై భారత ప్రభుత్వంతో చర్చలు గురించి ప్రస్తావించారు కూడా. ఈ విషయంలో విదేశీ కామన్వెల్త్‌ అభివృద్ధి కార్యాలయం కూడా నిశబ్దంగా ఉందని అందువల్లే దీన్ని ఖండించేలా ప్రభుత్వాన్ని పోత్సహించడానికీ ఈ ప్రశ్నను తాను లేవనెత్తినట్లు డెమోక్రటిక్‌ యూనియనిస్ట్‌ పార్టీ‘డీయూపీ’ పార్లమెంటు సభ్యుడు షానన్‌ అన్నారు. దీన్ని ఆయన పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగా పేర్కొన్నారు. ఐతే ఇది సంభాషణలో భాగంగా లేవనెత్తిన ప్రశ్న అని, అయినా తాము ఈ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని మంత్రి రూట్లీ తెలిపారు.

మరోవైపు బ్రిటీష్‌ సిక్కు లేబర్‌ పార్టీ ఎంపీ తన్మన్‌జీత్‌ సింగ్‌ ధేసీ కూడా ఈ విషయంపై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు. భారతదేశంలోని అధికారులు ప్రభుత్వాన్ని విమర్శించే మీడియా సంస్థలపై దాడులు చేపట్టడం ఇదేమి మొదటిసారి కాదని లేబర్‌పార్టీ ఎంపీలు విమర్శలు ఎక్కుపెట్టారు. అంతేగాదు భారత ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్, భారత్‌లోని ఐటీ అధికారులు ఏడేళ్లుగా బీబీసీని దర్యాప్తు చేస్తున్నారో లేదో నిర్ధారించాలని మంత్రిని రూట్లీని కోరారు. దీనిపై వ్యాఖ్యానించేందుకు మంత్రి నిరాకరించారు. కాగా, ఫిబ్రవరి 14న ముంబై, ఢిల్లీలోని బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడులు నిర్వహించింది. ఆ తర్వాత మూడు రోజుల తర్వాత ఇది రైడ్‌ కాదు సర్వేగా ఐటీ శాఖ పేర్కొంది. అంతేగాదు సర్వే తదనంతరం బీబీసీ లావాదేవీలు భారత్‌ కార్యకలాపాల స్థాయికి అనుగుణంగా లేవని ఐటీ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Must Read

spot_img