Homeజాతీయంబండి సంజయ్, రేవంత్ రెడ్డి ... తెలంగాణలో ఆకర్ష్ మంత్రాన్ని ప్రయోగిస్తున్నారా..?

బండి సంజయ్, రేవంత్ రెడ్డి … తెలంగాణలో ఆకర్ష్ మంత్రాన్ని ప్రయోగిస్తున్నారా..?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తిరిగి బలోపేతం చేయడానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకడుగు ముందు పడితే.. నాలుగు అడుగులు వెనకకు అన్న చందంగా కాంగ్రెస్ పరిస్థితి తయారయ్యింది. నిన్న మొన్నటి వరకు సీనియర్ల తిరుగుబాటుతో రేవంత్ రెడ్డి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుతం పరిస్థితి కాస్త సద్దుమణగడంతో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం పార్టీలో సీనియర్ నేతలు ఉన్నా.. ప్రజాకర్షణ కలిగిన నాయకులు మాత్రం కాస్త తక్కువగానే ఉన్నారు. దీంతో ఇతర పార్టీల్లోని నేతలకు గాలం వేసే పనిలో పడ్డారు.

బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. బీజేపీలో కేసీఆర్ మనుషులు ఉన్నారంటూఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. వీటిని ఆధారంగా చేసుకొని రేవంత్ రెడ్డి రాజకీయం మొదలు పెట్టారు. బీజేపీలోని ఈటెల రాజేందర్ సహా ఇతర నేతలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. వాస్తవానికి రాజేందర్‌ను కాంగ్రెస్ లోనికి తీసుకొని రావడానికి గతంలో రేవంత్ విఫలయత్నాలు చేశారు.

తాజాగా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని కాంగ్రెస్ లోకి ఆకర్షించే ప్రయత్నం మొదలు పెట్టారు. ఈటల రాజేందర్, వివేక్, జితేందర్ రెడ్డి వంటి నేతలు బీజేపీ సిద్దాంతాలు నచ్చి వెళ్లలేదని.. వాళ్లు కేవలం కేసీఆర్‌పై ఉన్న వ్యతిరేకత కారణంగానే ఆ పార్టీలో ఉన్నారని రేవంత్ అంటున్నారు. ఇప్పుడు ఈ నేతలను తిరిగి కాంగ్రెస్‌లోకి తీసుకొని వచ్చేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీది తెలంగాణలో వాపే కాని బలం కాదని రేవంత్ అంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయిలో ఇంకా బలంగానే ఉన్నదని.. బీజేపీలో ఉంటే మీ లక్ష్యం నెరవేరదు కాబట్టి తమ పార్టీలోకి రావాలని ఆయన కోరుతున్నారు. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి బీజేపీ చేరాలని భావించారు. అయితే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయిలో బలంగా ఉండటం వల్లే ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్నే రేవంత్ రెడ్డి పలువురు బీజేపీ నేతలకు చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మీ అవసరం ఉందని చెబుతూ వారిని ఆకర్షించే పనిలో పడినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి చూసి చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎంత రెచ్చగొట్టినా బీజేపీ నేతల నుంచి మాత్రం మౌనమే సమాధానంగా వస్తోంది. దీంతో రేవంత్ మరింత దూకుడు ప్రదర్శించే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం టీ కాంగ్రెస్ లో సీనియర్ల లొల్లికి .. ఠాక్రే కాస్తంత బ్రేక్ వేయగలిగారు. దీంతో మళ్లీ జోష్ చూపించాలని రేవంత్ .. ఈటల టార్గెట్ గా వ్యూహాలు పన్నుతున్నారని టాక్ వినిపిస్తోంది. మరోవైపు బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా ఇతర పార్టీ నేతలను ఆకర్షించే పనిలో పడ్డారు. కాంగ్రెస్ పార్టీ నుంచే ఎక్కువ మంది బీజేపీలో చేరేలా ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణలో రాబోయేది తమ ప్రభుత్వమే అని.. కాంగ్రెస్‌లో ఉంటే మరింత కాలం అధికారానికి దూరంగా ఉండాల్సి వస్తుందని వారిని బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి రాష్ట్రంలో బలం పెంచుకోవడానికి బీజేపీ-కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై ఒకరు ఆపరేషన్ ఆకర్ష్‌ను మాత్రం ప్రారంభించాయని విశ్లేషకులు అంటున్నారు.

బీఆర్ఎస్ నేతలకు గాలం వేస్తే ఫామ్‌హౌస్ ఘటనలా మారుతుందనే భయంతోనే ఇలా రూటు మార్చినట్లు సమాచారం. దీనికితోడు ఈటల వ్యాఖ్యలతో తెలంగాణ బీజేపీలో కనిపించని అసంతృప్తి అంతకంతకూ పాకిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తమ పార్టీలోనూ కెసీఆర్ కోవర్టులున్నారని ఈటల రాజేందర్ ప్రకటించిన తర్వాత .. ఆ పార్టీలో అంతర్గత రాజకీయాలు మరింత విస్తృతం అయ్యాయి. టీ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ విషయంలో అడ్వాంటేజ్ తీసుకుని కేసీఆర్ ను ఓడించే విషయంలో బీజేపీ సీరియస్‌గా లేదని.. ఆ రెండు పార్టీల మధ్య అవగాహన ఉందని చెబుతున్నారు. కేసీఆర్ ను ఓడించాలన్న లక్ష్యం పెట్టుకున్నవారు బీజేపీలో ఉంటే సాధ్యం కాదని.. బయటకు రావాలని అంటున్నారు. అదే సమయంలో ప్రమాదాన్ని గ్రహించిన బండి సంజయ్.. బీజేపీని వీడిన వారు కూడా రావాలని పిలుపునిచ్చారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య పరస్పర వలసల యుద్ధం ప్రారంభమయిందన్న సూచనలు
కనిపిస్తున్నాయి.

ఈటల రాజేందర్ బీజేపీపై ఎప్పుడు అసంతృప్త వ్యాఖ్యలు చేశారో అప్పుడే రేవంత్ రెడ్డి కూడా ఈటలపై సానుభూతి చూపించడం ప్రారంభించారు. ఈటల మంచి నేత అని, రైట్ లీడర్ ఇన్ రాంగ్ పార్టీ అన్నట్లుగా సానుభూతి చూపిస్తున్నారు. ఆయన నేరుగా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఈటలను పిలవడం లేదు. కానీ ఆయన సందేశం మాత్రం సులువుగా అర్థమైపోతుంది.

అయితే ఆయనను మాత్రమే కాదు మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, వివేక్ తో పాటు విశ్వేశ్వర్ రెడ్డిని కూడా ఆయన టార్గెట్ చేశారు. వీరి లక్ష్యం బీజేపీలో ఉంటే నెరవేరదని.. ఆయన అంటున్నారు.నిజానికి వీరంతా బీజేపీలో చేరారు కానీ ఎలాంటి ప్రాధాన్యం లేకుండా గడిపేస్తున్నారు. విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చి పాతికేళ్లయిన సందర్భంగా రేవంత్ కూడా సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు. అందుకే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా రాజకీయం చేస్తున్నారని.. బీజేపీపీలో చేరిన వారందర్నీ మళ్లీ కాంగ్రెస్‌కు తెచ్చే ప్రయత్నంలో ఉన్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు బీజేపీలో చేరికలు అంతంత మాత్రంగా ఉన్నాయి. పెద్ద ఎత్తున చేరికల్ని ప్రోత్సహించాలనుకుంటున్నా సాధ్యం కావడం లేదు. ఈ లోపు రేవంత్ రెడ్డి ఉన్న నేతల్ని కూడా ఆకర్షించేందుకు ప్రయత్నిస్తూండటంతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అప్రమత్తమయ్యారు.విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చి పాతికేళ్లయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. నిజానికి బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడయ్యాక.. తనకు ప్రాధాన్యత లేదని విజయశాంతి ఫీలవుతున్నారు.

ఈ భావన తొలగించడానికి ఆయన విజయశాంతి కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రధానంగా బీజేపీలో బండి సంజయ్ డామినేషన్ వల్లే ఎక్కువ మంది అసంతృప్తిలో ఉన్నారని చెబుతున్నారు.కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అనే అడ్వాంటేజ్‌కు తోడు తెలంగాణలో పుంజుకున్నామన్న నమ్మకంతో ఉన్న బీజేపీలోకి నేతలు వెల్లువలా వస్తారని ఆ పార్టీ నేతలనుకున్నారు. కానీ అలా జరగడం లేదు. పై స్థాయిలో ఎంత పెద్ద హామీలు ఇచ్చినా నేతలు రావడం లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ గుడ్ బై చెప్పాలనుకున్నారు కానీ.. బీజేపీలో మాత్రం చేరడానికి సంశయిస్తున్నారు. దీనికి కారణం… కాంగ్రెస్ పార్టీ ఇంకా క్షేత్ర స్థాయిలో బలంగా ఉండటమే.

పార్టీ క్యాడర్ బలంగా ఉండటంతో.. కాంగ్రెస్ ఇంకా గట్టిపోటీ దారుగానే ఉంది. బలమైన అభ్యర్థులు ఉన్న చోట్ల మాత్రమే బీజేపీ పోటీ ఇస్తుందనే అంచనాలు ఉన్నాయి. అందుకే కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు నేతల్ని ఆకర్షించేందుకు ఓ రకంగా వార్ ప్రారంభించాయి. అయితే రేవంత్ కు సీనియర్లతో లొల్లికి కాస్తంత బ్రేక్ పడడం ప్లస్ పాయింట్ కాగా, బండికి .. ఆయనపై ఉన్న వ్యతిరేకతే మైనస్ గా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే బీజేపీలో ఉండే సీనియర్లకు ఎటువంటి పని లేదని, వీరంతా సైలెంట్ అయిపోవాల్సి వస్తోందని సర్వత్రా టాక్ వినిపిస్తోంది. దీనికి ఉదాహరణగా ఈటలను భావించవచ్చన్న వాదనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో చేరికల కన్నా ఉన్నవారిని కాపాడుకోవడమే పెద్ద పనిగా బీజేపీకి మారింది. ఈ నేపథ్యంలో ముందస్తు టాక్ వేళ రేవంత్ దూకుడుకు బండి ఏవిధంగా బ్రేక్ వేయగలగుతారన్నదే ఆసక్తికరంగా మారింది.


Must Read

spot_img