తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరో విడత ప్రజా సంగ్రామ యాత్రకు ఆ పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో జనవరి
18 నుంచి యాత్రను ప్రారంభించేందుకు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరవ విడత పాదయాత్రను 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
కొడంగల్ నుంచి నిజామాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించేందుకు అధిష్టానం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్ర నాయకత్వం రూట్ మ్యాప్‌ను రూపొందించేందుకు కసరత్తులు ప్రారంభించింది. ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండటంతో తెలంగాణ వ్యాప్తంగా యాత్రను నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా పాదయాత్రను కొనసాగించాలని బండి సంజయ్ ను కోరుతున్నారు. దీంతో అధిష్టానం కూడా బండి సంజయ్ యాత్రకు గ్రీన్ సిగ్నల్ఇచ్చింది. ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా శ్రేణులంతా పనిచేయాలని బండి సంజయ్ పిలుపునిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలంగాణ బీజేపీలో వన్ మ్యాన్ షో లా పార్టీ వ్యవహారాలను నడుపుతున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న బండి సంజయ్‌కు హైకమాండ్ బ్రేక్ వేసినట్లుగా గతంలో టాక్ వినిపించింది. ఆయన పాదయాత్రలకు అడ్డు చెప్పని హైకమాండ్
ఇప్పుడు బస్సు యాత్ర చేస్తానంటే మాత్రం ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని చెబుతున్నారు. పాదయాత్ర లో వచ్చిన జనాన్ని చూసి ఓట్లు పడతాయని భావించకుండా క్షేత్ర స్థాయిలో పని చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ముందస్తు టాక్ వేళ హైకమాండ్ సూచనలతో పాదయాత్రకు
బ్రేక్ పడినట్లేనన్న టాక్ వెల్లువెత్తింది.
అంతేగాక .. పార్టీ సంస్థాగత నిర్మాణం పై దృష్టి పెట్టాలని సూచించడం సైతం చర్చనీయాంశంగా మారింది. బండి సంజయ్ ఇటీవలే ఐదో విడత ప్రజా సంగ్రామ పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. ఆ వెంటనే ఆరో విడత పాదయాత్రను కొనసాగించాలని భావించారు. అయితే దానికి పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలుస్తోంది. బండి సంజయ్ పాదయాత్రకు ప్రజా స్పందన బాగానే ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఆ యాత్రలకు బ్రేక్ ఇచ్చి తాము చెప్పిన పనులు ముందు పూర్తిచేయాలని పార్టీ పెద్దల నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.
దాంతో సంక్రాంతి లోపు ఆరో విడత పాదయాత్రను పూర్తి చేయాలని అనుకున్న బండి .. తాజాగా హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ తో బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చి, మరో దఫా పాదయాత్రకే సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ముందస్తు టాక్ వేళ రోజూ మూడు అసెంబ్లీల చొప్పున సంస్థాగత అంశాలపై సమీక్ష చేయాలని, బూత్ కమిటీలను నేరుగా కలిసి మాట్లాడాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, తెలంగాణ బీజేపీకి హైప్ వచ్చింది కానీ నియోజకవర్గాల్లో బలమైన నేతలు లేరన్న అభిప్రాయం ఉంది.
అందుకే సంస్థాగత ఎన్నికలపై ముందు దృష్టి పెట్టాలని బండి సంజయ్‌కు హైకమాండ్ సూచించినట్లుగా చెబుతున్నారు. జనవరి మొదటి వారంలోగా మండలాల వారీగా బూత్ కమిటీల సమావేశాలు పూర్తి చేయాలని ఆదేశించింది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కూడా ఆయనకు స్పష్టం చేసింది. జనవరి 7న రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల లో బూత్ కమిటీల తో అసెంబ్లీ సదస్సులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది అధిష్టానం. దీని కోసం ఇప్పటి నుంచే బూత్ కమిటీల సమావేశాలకు ఏర్పాట్లు చేయాలని సూచించింది. బూత్ కమిటీలతో నిర్వహించే అసెంబ్లీ సదస్సులలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వర్చువల్ గా ప్రసంగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈలోగా డిసెంబర్ 28,29,30 తేదీలలో దక్షిణాది రాష్ట్రాల పూర్తి సమయ కార్యకర్తల సమావేశం, తెలంగాణ అసెంబ్లీ కోర్ కమిటీ సమావేశం హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఇదేసమయంలో ఇతర సీనియర్లకు బండి సంజయ్ ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న విమర్శలు చర్చనీయాంశంగా మారాయి. పార్టీలో ఈటల రాజేందర్, డీకే అరుణ లాంటి సీనియర్ నేతలు ఉన్నప్పటికీ వారికి లభిస్తున్న ప్రాధాన్యం తక్కువేనని, మొత్తం వ్యవహారాలన్నీ బండి సంజయ్ చేతుల మీదుగా నడుస్తున్నాయని వీరంతా అసంతృప్తి చెందుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
వీరి ఫిర్యాదులపై స్పందించిన అధిష్టానం.. ప్రజా సంగ్రామ యాత్రను ఇప్పటికే ఐదు విడతలు పూర్తి చేసిన బండి సంజయ్.. దాన్ని జూన్ వరకు కంటిన్యూ
చేయాలని భావించినా బీజేపీ జాతీయ నాయకత్వం నో చెప్పిందని తెలుస్తోంది. పార్టీ పరంగా సంస్థాగత ఎన్నికలు కూడా పూర్తి చేసి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయాలని, క్షేత్ర స్థాయిలో పటిష్టంగా లేకపోతే ఎన్ని యాత్రలు చేసినా ఫలితం ఉండదని తేల్చి చెప్పిందని టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు ఈ నిర్ణయంపై హైకమాండ్ యూ టర్న్ తీసుకోవడమే చర్చనీయాంశంగా మారింది.
ఇన్ని పనులు పెట్టుకొని యాత్రలు చేస్తానని కోరడం వల్లే హైకమాండ్ నిరాకరించినట్లు సమాచారం. అయితే .. తాజా పరిణామాల వేళ బండి ఆరో విడత యాత్రకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో హైకమాండ్ మదిలో ఏముందన్న చర్చ సర్వత్రా వెల్లువెత్తుతోంది. ఇప్పటికే చేరికల కమిటీ పెట్టినా, పెద్దగా చేరికలు ఉండడం లేదు.
మరోవైపు తెలంగాణలో సెటిలర్ల ఓటు బ్యాంకున్న టీడీపీతో పొత్తుకు నో చెప్పింది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టకుండా.. యాత్రల వల్ల ఉపయోగం లేదని హైకమాండ్ తొలుత భావించింది. అయితే పాదయాత్ర వల్లే.. ప్రజల్లో బీజేపీ నిలబడగలుగుతోందన్న అంచనాలతోనే మళ్లీ ఆరోవిడతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే .. పార్టీకి పాదయాత్ర వల్ల ఉపయోగమున్నా.. ఓట్లు పడేంత పరిస్థితి లేదన్నది విశ్లేషకుల వాదన. దీంతో అధిష్టానం నిర్ణయం ఏమేరకు ప్లస్ అవుతుందన్న చర్చలు కమలదండులోనే వెల్లువెత్తుతున్నాయి. అదేసమయంలో పార్టీలోని సీనియర్ల పరిస్థితి ఏమిటన్న చర్చ కూడా వినిపిస్తోంది.
కనీసం వారికైనా పార్టీ బలోపేతానికి కీలక బాధ్యతలు అప్పగించాలని కూడా సూచనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే బండి యాత్ర .. టైంలోనే ముందస్తు నగారా మ్రోగితే, పార్టీ పరిస్థితి ముఖ్యంగా అభ్యర్థుల లేమితో కొట్టుమిట్టాడుతోన్న వేళ .. ఏమి కానుందన్నదే ఇప్పుడు పార్టీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు యాత్ర కొనసాగిస్తూనే, నియోజకవర్గాల సమీక్ష ను చేపట్టనున్నట్లు బండి చెప్పి ఉంటారన్న అంచనాలు సైతం వినిపిస్తున్నాయి. అయితే ఇదెంతమేరకు సక్సెస్ అవుతుందన్నదీ చర్చ రేకెత్తిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్ పట్టు దిశగా పయనిస్తోన్న వేళ .. క్షేత్రస్థాయిలో బలపడకుండా .. యాత్రలు .. ఎంతవరకు కరెక్టన్న చర్చ రాజకీయంగా వినిపిస్తోంది. అదేసమయంలో .. ఎన్నికల వేళ .. జంపింగ్ లు ఉంటాయని, ఆల్రెడీ లిస్ట్ రెడీ అయిపోయిందని కొందరు కమలనాథులు చెబుతున్నవేళ .. యాత్రలపై అనవసరపు రాద్ధాంతం వద్దన్న ఆలోచనలో హైకమాండ్ ఉండి ఉండొచ్చని కూడా అంచనాలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ఈ లిస్ట్ అగ్ర నాయకత్వానికి చేరిందని, దీనిపై చర్చలు సాగుతున్నాయని, అందువల్ల బండి యాత్రకు వచ్చిన నష్టమేమీ లేదని కూడా టాక్ వెల్లువెత్తుతోంది. అందుకే అధిష్టానం .. ఆరో విడత పాదయాత్రకు బండికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. అయితే ఈ యాత్ర .. ఎప్పటివరకు సాగనుందన్నదీ .. ఆసక్తికరంగా మారింది. దీంతో బండి ఆరో విడత .. ఏమాత్రం ప్రభావం చూపుతుందన్నదే చర్చనీయాంశంగా మారింది.