Homeతెలంగాణబండి సంజయ్..తన నోరే..తనకు శత్రువుగా మారిందా..?

బండి సంజయ్..తన నోరే..తనకు శత్రువుగా మారిందా..?

  • మహిళా కమిషన్ విచారణ వేళ..బండికి క్లాస్ పీకారంటూ వార్తలు వెల్లువెత్తాయి.
  • దీంతో అటువంటిదేమీ లేదని చెబుతున్నా, చర్చ మాత్రం ఆగడం లేదట.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కవితపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కి పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. కవితపై వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఒక్క పంజాగుట్ట మాత్రమే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లలో బండి సంజయ్ పై బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పలుచోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. అయితే, పంజాగుట్ట పోలీసులు మాత్రం విచారణకు పిలిచారు.

ఈ నెల 8వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సంజయ్‌ ..‘ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఎమ్మెల్సీ కవిత దోషిగా తేలితే అరెస్టు చేయకుండా ముద్దు పెట్టుకుంటారా’అని వాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చేసిన మూడు రోజుల తర్వాత బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆందోళనలకు దిగాయి. బండి సంజయ్‌ మహిళలకు క్షమాపణలు చెప్పాలని మంత్రులు డిమాండ్‌ చేశారు. ఆయనను బీజేపీ నుంచి బహిష్కరించాలని బీఆర్ఎస్ మహిళా నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ మహిళ అని చూడకుండా అనుచిత వ్యాఖ్యలకు పాల్పడ్డారని
బీఆర్‌ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఇప్పటికే ఆయనపై చర్యలు చేపట్టాలని మహిళా కమీషన్ కు సైతం ఫిర్యాదు చేశారు.

దీంతో బండి సంజయ్ కమిషన్ ముందు హాజరై లిఖితపూర్వక సమాధానమిచ్చారు. తాను ఉద్దేశపూర్వకంగా చేయలేదని, తెలంగాణ సామెతలను ఉపయోగించానని చెప్పారు. ఏదేమైనా ఇంకోసారి అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని మహిళా కమిషన్ చెప్పినట్లు సమాచారం. అయితే ఎంపీ బండి సంజయ్ పై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయిందని కొన్ని మీడియాలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని బండి సంజయ్ ఖండించారు. దీనిపై మండిపడ్డ బండి .. ఓ ప్రకటనలో కీలక వ్యాఖ్యలు చేశారు.

తనపై రాష్ట్ర మహిళ కమిషన్ సీరియస్ అయ్యిందంటూ మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, సమాజానికి మంచి జరిగే విషయాలు లీక్ ఇస్తే తప్పులేదు…కానీ అందుకు భిన్నంగా లీకుల పేరుతో ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదని మండి పడ్డారు. మహిళా కమిషన్ అడిగిన ప్రశ్నలకు సుహ్రుద్బావ వాతావరణంలో జవాబిచ్చానని బండి సంజయ్ పేర్కొన్నారు. అయినప్పటికీ బండి విచారణపై రచ్చ ఆగడం లేదు.

బీజేపీ మహిళలకు గౌరవం ఇచ్చే పార్టీ అని, కమిషన్ నోటీసులను గౌరవించి తాను విచారణకు హాజరైనట్లు బండి సంజయ్ చెప్పారు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు తాను పూర్తి సమాధానం చెప్పానని, తెలంగాణలో వాడే వాడుక పదాలు మాత్రమే వాడానని అన్నారు. మహిళల్ని కించపరచలేదని, ఎమ్మెల్సీ కవితపై ఉద్దేశపూర్వకంగా ఏ వ్యాఖ్యలు చేయలేదని, కేవలం ప్రజలు మాట్లాడే వాడుక పదాలే వినియోగించానని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ ఈ నెల 13న హాజరవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. అయితే పార్లమెంటు సమావేశాల కారణంగా 18న హాజరవుతానని ఆయన కమిషన్‌ను కోరారు. ఆ మేరకు హాజరయ్యారు.

మహిళలపై సామెతలను ప్రయోగిస్తూ ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మహిళా కమిషన్‌ హెచ్చరించింది. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలపట్ల తీవ్రంగా స్పందించింది. మరోమారు మహిళలను ఉద్దేశించి కించపరిచే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చింది. ఈ మేరకు తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని అంటూనే.. చింతిస్తున్నట్టు రెండు పేజీల సంజాయిషీని కమిషన్‌కు సమర్పించారని సమాచారం. 11 గంటలకు విచారణ నిమిత్తం మహిళాకమిషన్‌కు తన న్యాయవాదితో వచ్చారు.

అయితే న్యాయవాదిని లోపలికి అనుమతించకుండా.. బండి సంజయ్‌ని మాత్రమే విచారణకు రమ్మని కమిషన్‌ ఆదేశించింది. బండి సంజయ్‌ని మహిళాకమిషన్‌ దాదాపు రెండున్నర గంటలపాటు విచారించింది. అతను చేసిన వ్యాఖ్యల పట్ల రాష్ట్ర మహిళా కమిషన్‌ గట్టిగా నిలదీసినట్టు సమాచారం. గతంలో ఇలాగే మహిళలు, కవిత పట్ల అతను తప్పుగా మాట్లాడిన వీడియోలు ప్రదర్శించి మరీ క్లాస్‌ తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయటంతో.. మిన్నకుండిపోయారట బండి సంజయ్‌. ఇక కమిషన్‌
సంధించే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలిన బండి సంజయ్‌.. తప్పుడు వ్యాఖ్యలని సమర్థించుకునే ప్రయత్నం చేశారని తెలిసింది.

అయితే..తాను ఉద్దేశపూర్వకంగా కవితపై వ్యాఖ్యలు చేయలేదని, సామెతను మాత్రమే అర్థమయ్యేలా చెప్పానంటూ సంజాయిషీ ఇచ్చుకున్నట్టు తెలిసింది. కమిషన్‌ సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..తాను కవితను అక్కగా సంబోధించానని, మరోమారు అట్లాంటి వ్యాఖ్యలు చేయనని సంజాయిషీ ఇచ్చుకున్నట్టు సమాచారం. అయితే ఈ వ్యాఖ్యల అంశంలో రచ్చ మాములూగా లేదని టాక్ వినిపిస్తోంది.

బండి సంజయ్‌ ఇచ్చిన సంజాయిషికి తృప్తి చెందని మహిళా కమిషన్‌.. అతన్ని మరోమారు విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కమిషన్‌ చేసిన సూచనలకు తాను కట్టుబడి ఉన్నానంటూ విచారణ అనంతరం మీడియాతో చెప్పారు సంజయ్‌. తాను చెప్పిన విషయాలను స్టేట్‌మెంట్‌ రూపంలో రికార్డు చేశారని, తప్పు చేయలేదు కాబట్టే విచారణకు హాజరయినట్టు మీడియాకు తెలిపారు. న్యాయాధికారాలు కలిగిన రాష్ట్ర మహిళాకమిషన్‌ ఆదేశాలను పాటిస్తానని, కమిషన్‌పై గౌరవం, నమ్మకం ఉన్నాయని చెప్పారు.

దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్టుందన్న టాక్ వెల్లువెత్తుతోంది. ఏం మాట్లాడినా ఏదో ఒక వివాదం రేగుతోంది. మొన్న ఎమ్మెల్సీ కవితపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. చివరకు మహిళా కమిషన్ ఎదుట హాజరై.. వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు, మరోసారి రిపీట్ చేయొద్దంటూ కమిషన్ సీరియస్ వార్నింగే ఇచ్చింది. కవితను ఈడీ విచారించే సమయంలో ఈ ఇష్యూ చుట్టూ రచ్చ నడిచింది. బీఆర్ఎస్ వర్గాలు బండిని టార్గెట్ చేసి ధర్నాలు, దిష్టిబొమ్మ దహనాలు చేశాయి.

మరోమారు మహిళలను ఉద్దేశించి సామెతలను ప్రయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషన్ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చింది. మరి..బండి ఇది ఫాలో అవుతారా? అంటే కష్టమనే అంటున్నారు రాజకీయ పండితులు. ఎందుకంటే, ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలను టచ్ చేయడమే పనిగా పెట్టుకున్నారు సంజయ్. ఇప్పటివరకు ఆయన ప్రసంగాలను గమనిస్తే ఇది స్పష్టంగా అర్థం అవుతుందని అంటున్నారు. అలాంటిది సంజయ్ లో మార్పు
కష్టమనే అంచనా వేస్తున్నారు. ఫ్లోలో ఎక్కడో ఒకచోట తొందరపడి మాట్లాడే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని అంటున్నారు.

అదే జరిగితే, మళ్లీ రచ్చ తప్పదని కూడా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సొంత పార్టీలోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోన్న తరుణంలో .. ఈ తరహా వ్యాఖ్యలకు సరికాదన్న వాదనలు వెల్లువెత్తుతున్నాయి. దీనివల్ల అనవసరపు రాద్ధాంతాలే తప్ప .. ఉపయోగం ఏమీ ఉండదని కూడా టాక్ వినిపిస్తోంది. గతంలోనూ బండి ఇటువంటి వ్యాఖ్యలు చేసి, బీఆర్ఎస్ నేతలతో టగ్ ఆఫ్ వార్ ఆడేవారని, కానీ ఇప్పుడు ఓ చిన్న వ్యాఖ్య పరిధి దాటితే, ప్రమాదమవుతోందని కేడర్ సైతం చర్చించుకుంటోంది. ఈ నేపథ్యంలో బండి .. ఇకనైనా ఇటువంటి వ్యాఖ్యలు మరీ ముఖ్యంగా మహిళలపై విమర్శలు..ఆచి తూచి చేయాలన్న సూచనలు సర్వత్రా వినిపిస్తోంది.

మరి బండి సంజయ్..ఏం చేస్తారన్నదే ఆసక్తికరంగా మారింది..

Must Read

spot_img