- బండి సంజయ్ దూకుడుకు అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందా..?
- వచ్చే ఎన్నికల్లో బీజేపీకి పట్టం గట్టడమే వ్యూహంగా పావులు కదుపుతున్నారా..?
- పార్టీలో వినిపిస్తోన్న అంతర్గత పోరుకు హైకమాండ్ తనదైన స్టైల్లో చెక్ చెప్పినట్లేనా..?
తెలంగాణ రాజకీయాల్లో తమదైన ముద్ర వేయాలని భావిస్తోంది బీజేపీ. ఇందుకోసం ఏ విధమైన ప్రయత్నాలు చేయాలనే దానిపై నిత్యం కసరత్తు చేస్తూనే ఉంది. ఇటీవల తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలను ఢిల్లీ పిలిపించుకుని మరీ వారితో సుదీర్ఘంగా చర్చించారు ఆ పార్టీ సీనియర్ నేత అమిత్ షా. తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఏం చేయాలనే దానిపై వారికి దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ఉన్నట్టు ఉంటే కుదరదని.. మరింత దూకుడుగా ప్రజల్లోకి వెళితేనే తెలంగాణలో బీజేపీకి అధికారం వస్తుందని అమిత్ షా పార్టీ నేతలకు స్పష్టం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వంపై ఆ పార్టీ జాతీయ నాయకత్వం సంపూర్ణ విశ్వాసం ఉంచింది.
బండి సంజయ్ నాయకత్వంలోనే పార్టీ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు వెళుతుందని బీజేపీ అగ్రనేత అమిత్ షా పార్టీ నేతలకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తెలంగాణలో పార్టీని మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లేందుకు ముందుకు జిల్లా అధ్యక్షులను మార్చాల్సి ఉందని ఎప్పటి నుంచో భావిస్తున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. ఈ క్రమంలోనే ఆయన తెలంగాణ జిల్లాలకు అధ్యక్షులుగా నియమించాల్సిన నేతల పేర్లతో కూడిన జాబితాను ఇచ్చిన తెలుస్తోంది. జిల్లా అధ్యక్షుల నియామకానికి సంబంధించి సర్వే నిర్వహించినట్లు.. ఆ ఫలితాలకు అనుగుణంగా తొలి దశలో 25 జిల్లాలకు సంబంధించి ప్రతిపాదనలను సమర్పించినట్లు తెలిసింది.
ఇందులో ఒక్క కామారెడ్డి జిల్లా తప్ప దాదాపు ఇతర అన్ని జిల్లాల్లో మార్పు అవసరమని సంజయ్ చెప్పినట్లు సమాచారం సమాచారం. అయితే దీనిపై బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకుందా ? లేదా ? అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు తమ సీట్లు ఉన్న జిల్లాల్లో అధ్యక్షులుగా తాము సూచించిన నేతలు ఉండాలని కొందరు నేతలు భావిస్తున్నారని.. ఈ విషయంలో ఆయా నేతలు బండి సంజయ్ తీరుపై అసంతృప్తితో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తమను సంప్రదించుకుండానే తమ జిల్లాలకు ఎవరు అధ్యక్షులుగా ఉండాలనే దానిపై బండి సంజయ్ పేర్లను ఖరారు చేయడంపైనా ఆయా నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
దీనికి తోడు తెలంగాణ బీజేపీ నేతల్లో అంతర్గత వివాదాలు చాలా ఎక్కువగా ఉన్నాయని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. పాత నేతలు, కొత్త నేతల మధ్య పంచాయతీ కొనసాగుతోంది. దీంతో పలుమార్లు బండి సంజయ్‌ను తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి మారుస్తారన్న ప్రచారం జరిగింది. దీనికి అమిత్ షాతో జరిగిన మీటింగ్‌లో క్లారిటీ ఇచ్చారని చెబుతున్నారు. బండి సంజయ్ నేతృత్వంలోనే అసెంబ్లి ఎన్నికలకు వెళ్లనున్నట్లు ఆ పార్టీ జాతీయ నాయకత్వం స్పష్టం చేసింది. అధ్యక్షుడి మార్పు ఇప్పట్లో ఉండదని, నేతలంతా కలిసికట్టుగా పనిచేసి తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఆదేశించారని తెలుస్తోంది. తెలంగాణలో గెలిచి తీరాలన్న పట్టుదలగా ఉన్న హోంమంత్రి అమిత్ షా..ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుంటున్నారు.
తెలంగాణలో తాజా పరిస్థితులను అధ్యయనం చేసిన అమిత్ షా, నడ్డాలిద్దరూ బండి సంజయ్ నాయకత్వంపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. సంజయ్ నాయకత్వంపట్ల ప్రధాని నరేంద్రమోడీకి కూడా నమ్మకం ఉంది. పలుమార్లు మోదీ..బండి సంజయ్‌ను అభినందించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారికి జాతీయస్థాయిలో ప్రత్యామ్న్యాయ పదవులు కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా బండి సంజయ్ నాయకత్వంలో పార్టీ ఎంతో బలోపేతమైందని, ఆయన చేస్తున్న పోరాటాలు, నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్రల వల్లే ఇది సాధ్యమైందని హైకమాండ్
నమ్ముతోంది. ఇటీవల జరిగిన బీజేపీ ప్లీనరీ సమావేశంలోనూ బండి సంజయ్ పనితీరును ప్రశంసించారు.
అందుకే ఆయనను తప్పించడానికి అవకాశం లేదని చెబుతున్నారు. ఇదిలా ఉంటే, బండి సంజయ్‌ను మార్చాలని కొంత మంది నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పార్టీ గెలిస్తే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉన్న వారికే సీఎం పోస్టు లభిస్తుంది. అందుకే ఆయనను తప్పించడానికి గట్టి ప్రయత్నాలు చేశారని చెబుతున్నారు. కానీ బండి సంజయ్ నాయకత్వంలో కచ్చి తంగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చి తీరు తుందని పార్టీ సీనియర్లు ఆయనతో సమన్వయం చేసుకుని ప్రజలకు చేరువై పనిచేయాలని చెప్పినట్లు సమాచారం. రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డిరాజగోపాల్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు పార్టీలోనే ప్రచారం జరిగింది. ఈ ప్రయత్నాలకు పార్టీ పెద్దలు అడ్డుకట్ట వేయడంతోపాటు భవిష్యత్‌లో బండి సంజయ్ నేతృ త్వంలోనే పార్టీ ముందుకువెళ్తుందని స్పష్టత ఇచ్చారు.
- బండి దూకుడు .. నెక్ట్స్ ఏం చేయనుందన్నదే ఆసక్తికరం..
బండి సంజయ్ ను మారిస్తే పెద్దఎత్తున చేరికలు ఉంటాయనే సంకేతాలు పంపినా కూడా హైకమాండ్ సంజయ్ పైనే నమ్మకం పెట్టుకుంది. కొత్తగా పార్టీలో చేరిన నేతలకు వారం, పది రోజుల్లో వాళ్లలో కొంతమందికి జాతీయస్థాయిలో కీలక పదవులను కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. సంజయ్‌ను విభేదిస్తున్న పలువురు నేతలతో సమావేశమైన అమిత్ షా, నడ్డా వారు చెప్పినవన్నీ ఆలకించారు. అంతిమంగా కలిసి పని చేయాలని సూచించారు. మొత్తంగా సంస్థాగత అంశాలు చర్చించామని తరుణ్ చుగ్ కూడా ప్రకటించారు.
ఇక సంజయ్ ఇప్పుడు హైకమాండ్ ఇచ్చిన శక్తితో మరింత దూసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. అందుకే సంజయ్.. ఇప్పుడు.. రేపిస్టుల ఇళ్లపై బుల్డోజర్లు పంపుతామని ప్రకటించేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఉన్నఫళంగా బీజేపీ రాష్ట్రనేతలకు ఢిల్లీ నుండి పిలుపు రావటంతో ఏం జరుగుతుందో? అమిత్ షా ఏమి చెప్తారో అని అంతా టెన్షన్ పడ్డారు. ఒక దశలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను మారుస్తున్నారని కూడా ప్రచారం జోరుగా సాగింది. అందికాదు ముందస్తు ఎన్నికలు వస్తాయని అందుకే రమ్మని పిలిచినట్టు కూడా ప్రచారం జరిగింది.
తెలంగాణా బిజెపి వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాల్సిందేనని హోం మంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఒక సభ నిర్వహించాలని, మొత్తం 119 నియోజకవర్గాలలో సభలను నిర్వహించే ఆపై, ఉమ్మడి జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని అమిత్ షా సూచించారు. నాయకులంతా ఏకతాటి మీద ఉమ్మడిగా ముందుకు సాగాలని, ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని ఉద్బోధించారు. అలాగే చేరికలపై ప్రత్యేక దృష్టి సారించాలని అమిత్ షా రాష్ట్ర నేతలకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులను తెలుసుకుని అందుకు అనుగుణంగా పని చెయ్యాలన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాలలో భారీ బహిరంగ సభలు నిర్వహించి ముగింపు సభకు ప్రధాన నరేంద్ర మోడీని ఆహ్వానించాలన్నారు. స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు విజయవంతంగా నిర్వహించడంపై అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. పార్టీలో ఉండే చిన్న చిన్న మనస్పర్ధలను పక్కనపెట్టి నేతలంతా ముందుకు నడవకపోతే నష్టం జరుగుతుందని అమిత్ షా హెచ్చరించారు. ఆపరేషన్ తెలంగాణలో 90 నియోజకవర్గాల్లో విజయం సాధించడానికి పక్కా ప్లాన్ తో ముందుకు సాగాలన్నారు. తాజా భేటీలో బండి సంజయ్ కు మద్ధతు ఇవ్వడంతో, ఇక బీజేపీ తెలంగాణలో మరింత దూకుడు రాజకీయాలకు సిద్ధమైందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో బండికి మరింత స్పీడ్ పెరిగినట్లేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మరి బండి దూకుడు .. నెక్ట్స్ ఏం చేయనుందన్నదే ఆసక్తికరంగా మారింది..