Homeఆంధ్ర ప్రదేశ్బాబు వ్యూహం ఇక్కడ ప్లస్సా .. మైనస్సా

బాబు వ్యూహం ఇక్కడ ప్లస్సా .. మైనస్సా

ఏ పార్టీలో అయినా.. తమను నియోజకవర్గ నాయకుడు పట్టించుకోవడం లేదనే ఫిర్యాదులు ఉంటాయి.. కానీ ఆ నియోజకవర్గంలో మాత్రం మాకు ఇన్ ఛార్జిని నియమించండి మహాప్రభో అంటున్నారు.. తెలుగు తమ్ముళ్లు. అసలు మాకు సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలి.. తమకేంటీ ఈ బాధలు అంటూ అధినేతకు వినపడేలా చెబుతున్నారు. అసలు ఇంత సడన్ గా ఇన్చార్జ్ కావాలంటే ఎందుకు స్లోగన్ వచ్చింది .. అసలేమిటీ .. గందరగోళం.

ఉన్న నాలుకకు మందేస్తే కొండ నాలుక ఊడిందట.. ప్రస్తుతం అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా అలానే ఉంది. జిల్లాలో ఎక్కడా లేని విధంగా తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉన్న ప్రాంతం. పార్టీ కార్యక్రమాలు చేయడంలో వీరే ముందుంటారు. నిరసనలు, ఆందోళనలు చేయమంటే.. కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు అంతా సిద్ధం. కానీ ఏంటి ప్రయోజనం .. నడిపించే నాయకుడు మాత్రం లేరు.

గత మూడున్నరేళ్లుగా ఏర్పడిన ఈ సందిగ్ధతకు తెర దించాల్సిన అధిష్టానం.. అనాలోచిత నిర్ణయాలు మొదటికే మోసం వస్తున్నాయి. ఇంతకీ ఎందుకు ఇక్కడ గందరగోళ పరిస్థితి అంటే .. 2019 ఎన్నికల సమయం నుంచి ఈ విబేధాల పర్వం ప్రారంభమైంది. ఇక్కడ 2014లో ఎమ్మెల్యేగా ఉన్న యామిని బాలను కాదని యువ నాయకురాలు బండారు శ్రావణికి పార్టీ టికెట్ ఇచ్చింది అధిష్టానం. అయితే ఇక్కడ పార్టీ సరైన నిర్ణయం తీసుకుందనే చెప్పాలి.

ఎందుకంటే ఆ రోజున్న పరిస్థితులు అలాంటివి. కానీ జగన్ వేవ్ తో బండారు శ్రావణి ఎంత కష్టపడినా ఓటమి మాత్రం తప్పలేదు. అయితే ఈ ఓటమికి ఇంకో కారణం లేకపోలేదు. నియోజకవర్గంలో ఇద్దరు బలమైన సీనియర్ నాయకులు ఉన్నారు. వారు గెలుపోటములను డిసైడ్ చేసే పరిస్థితి ఉన్న నాయకులు .. అయితే వారిని కలుపుకుని పోకపోవడం వలనే శ్రావణికి ఆ స్థాయిలో ఓటమి వచ్చిందనేది ఆరోపణ. ఇంతకీ ఎవరా నేతలంటే నార్పల మండలానికి చెందిన నర్సానాయుడు, గార్లదిన్నె మండలానికి చెందిన కేశవరెడ్డి.

వీరిద్దరు వారి వారి మండలాల్లో పార్టీకి పిల్లర్స్ లాంటి వారు. కానీ శింగనమల నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం కావడంతో కేవలం మానిటర్ చేయడం వరకే వీరిద్దరూ పరిమితం అవుతున్నారు. నాయకుడు మాత్రం .. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతే కావాలి.

అయితే వీరిద్దరూ పట్టున్న నేతలు కావడంతో .. ఎస్సీ వర్గ నేత శ్రావణిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు.. అక్కడితో ఆగకుండా .. శ్రావణి వ్యవహారంపై అధిష్టానంకు చాలా ఫిర్యాదులు కూడా చేశారు. చివరకు ఈ విబేధాలు తారా స్థాయికి చేరడంతో పరిస్థితి చక్కదిద్దేందుకు అధిష్టానం నర్సా నాయుడు, కేశవరెడ్డిలతో కలసి టూమెన్ కమిటీ వేసింది. ఈ నిర్ణయం స్థానికంగా ప్ర కంపనల్ని సృష్టించింది.

అయితే ఎస్సీ రిజర్వ్ గా ఉన్న నియోజకవర్గంలో టూమెన్ కమిటీ ఏంటని విబేధాలు కాస్త మరింత పతాక స్థాయికి చేరాయి. కానీ అధిష్టానం మాత్రం టూమెన్ కమిటీకే బాధ్యతలు అప్పగించింది. అటు శ్రావణి నియోజకవర్గ ఇన్ ఛార్జిగా తొలగించకుండా.. అటు టూమెన్ కమిటీకి పగ్గాలు ఇవ్వడమే అధిష్టానం చేసిన పెద్ద తప్పు. పార్టీ ఏ కార్యక్రమం చేపట్టిన ఇటు శ్రావణి, అటు టూమెన్ కమిటీ సభ్యులు వేర్వేరుగా చేస్తూ వెళ్తున్నారు. దీంతో క్యాడర్ లో ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అసలు తాము ఎవరి నాయకత్వంలో పని చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయారు.

అధిష్టానం నుంచి తనకు పాజిటీవ్ సంకేతం లేకపోయినా.. శ్రావణి మాత్రం ఎక్కడా తగ్గలేదు. టూమెన్ కమిటీతో పాటు పార్లమెంట్ అధ్యక్షుడు కాల్వ శ్రీనివాసులు బ్యాచ్ నుంచి వ్యతిరేకత వస్తున్నా.. ఆమె మాత్రం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గాల వారీగా సమీక్ష చేస్తున్నారు. చాలా నియోజకవర్గాల తర్వాత శింగనమల వంతు వచ్చింది.

సాధారణంగా నియోజకవర్గ ఇన్ ఛార్జిని మాత్రమే పిలిచి.. అక్కడ పరిస్థితిని తెలుసుకుంటున్నారు చంద్రబాబు. కానీ శింగనమలలో మాత్రం శ్రావణిని కాకుండా టూమెన్ కమిటీ సభ్యులైన నర్సానాయుడు, కేశవరెడ్డిలను పిలిచారు. ఈ ఒక్క సంకేతంతోనే శ్రావణికి అధిష్టానం ప్రయార్టీ ఇవ్వడం లేదని పరోక్షంగా, ప్రత్యక్షంగా సంకేతం ఇచ్చినట్టైంది. ఇటు టూమెన్ కమిటీ సభ్యులకు కూడా చంద్రబాబు క్లాస్ ఇచ్చినట్టు సమాచారం. మిమ్మల్ని నమ్మి ఇన్ ఛార్జిని కూడా కాదని మీకు బాధ్యతలు ఇస్తే… మీలో మీరే విబేధాలు పెట్టుకోవడం ఏంటని చంద్రబాబు సున్నితంగా మందలించినట్టు సమాచారం.

సరిగ్గా మూడు నెలలు టైం..ఈ లోపు మీరు అందర్నీ కలుపుకుని పోవాలి… నియోజకవర్గంలో పార్టీ లైన్ లోకి రావాలి.. లేదంటే నేనే ఎవర్నో ఒకర్ని ఇన్ ఛార్జిగా తీసుకొస్తానంటూ వ్యాఖ్యానించినట్టు చెప్పుకుంటున్నారు. మరోవైపు పార్టీ అభ్యర్థి విషయంలో కూడా టూమెన్ కమిటీకి కొంత బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో అభ్యర్థిగా ఎవరైతే బాగుంటారని చంద్రబాబు ఆరా తీసినట్టు సమాచారం. బాబు కూడా కొందరు పేర్లను ప్రస్తావించగా.. టూమెన్
కమిటీ సభ్యులు మీరు ఎవరికి బాధ్యతలు ఇచ్చినా.. మేము పని చేస్తామని చెప్పారట.

అయితే నియోజకవర్గ ఇన్ ఛార్జి ప్రమేయం లేకుండా చంద్రబాబు మీటింగ్ జరగడంతో క్యాడర్ కు ఒక స్పష్టత వచ్చింది. ఇక శ్రావణి విషయంలో ఏం జరుగుతోందో ఒక స్టాండ్ కు వచ్చారు. అందుకే జేసీ వర్గానికి చెందిన పుట్లూరు, యల్లనూరు మండలానికి చెందిన టీడీపీ నాయకులంతా సమావేశమయ్యారు.

  • చంద్రబాబు మీటింగ్ మరుసటి రోజే ఈ పరిణామాలు ప్రారంభమయ్యాయి..

మా రెండు మండలాలకు ఇన్ ఛార్జి ఎవరూ లేరని.. మాకు ఏ కష్టం వచ్చినా ఇంత వరకు జేసీ ప్రభాకర్ రెడ్డి వద్దకే వెళ్లేవారమని అంటున్నారు. తాడిపత్రిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జేసీని ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదని.. అధిష్టానమే ఎవరో ఒక అభ్యర్థిని ఇన్ ఛార్జిగా నియమించాలని డిమాండ్ చేస్తూ ఒక తీర్మానం కూడా చేశారు. అధికార పార్టీ నుంచి వస్తున్న ఇబ్బందులు, కేసుల నుంచి మమ్మల్ని కాపాడే నాయకుడు కావాలని..మీ వద్దకు వచ్చి ఏదో ఫోటోలు చూపించి మెప్పు పొందే వారు వద్దని పరోక్షంగా తమ అభిప్రాయాన్నివ్యక్తం చేశారు.

శింగనమల నియోజవర్గంలో ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు.. ఇక నుంచి జరిగేది ఒక ఎత్తు. ఎందుకంటే అధిష్టానం మనసులో ఏముందో చంద్రబాబు టూమెన్ కమిటీతో మీటింగ్ అయిన తర్వాత కాస్త స్పష్టత వచ్చింది. దీనిపై బండారు శ్రావణి ఎలా స్పందిస్తారో.. ఆమె అడుగులు ఎలా ఉంటాయో చూడాలి. ఇక ఇన్ ఛార్జిని నియమించండి మహో ప్రభో అంటున్న క్యాడర్ ఆర్త నాదాలపై అధిష్టానం ఎంత వరకు స్పందిస్తుందో అన్నదీ క్లారిటీ రావాల్సి ఉంది.

దీంతో శింగనమలలో టూమెన్ కమిటీ.. రిజర్వుడు స్థానానికి సంబంధం లేకపోవడంతోనే అసలు రచ్చ షురూ కాగా, బాబు ఇప్పుడు ఈ టూమెన్ కమిటీకే ప్రాధాన్యత ఇవ్వడం క్యాడర్ ను మరింత డైలమాలో పడేసింది. గతంలో ఒకరికి చెక్ పెట్టేందుకు తీసుకువచ్చిన బండారు విషయంలో బాబు వైఖరి ఏమిటన్నది .. ఇప్పుడు క్లారిటీ రావడంతో.. సెగ్మెంట్లో ఏం జరుగుతోందోనన్న చర్చ సర్వత్రా వెల్లువెత్తుతోంది.

ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో టీడీపీకి గెలుపు అత్యవసరం.. ఈ తరుణంలో .. సెగ్మెంట్ నుంచి బరిలోకి దిగాల్సిన ఎస్సీ వర్గ నేతలను కాదని.. మరో వర్గ నేతలకు ప్రయార్టీ ఇవ్వడం ఎంతవరకు సబబు అన్నది చర్చనీయాంశమవుతోంది. దీంతో ఈ సెగ్మెంట్లో కేడర్ సైతం .. బాబు వ్యూహాన్ని వ్యతిరేకిస్తుండడంతో .. ఈ స్థానంలో పసుపు జెండా రెపరెపలాడుతుందా.. అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది ఎవరు..? అసలు అభ్యర్థిని ఎవరు నిర్ణయించనున్నారు..? అన్నది ఆసక్తికరంగా మారింది. టూమెన్ కమిటీ నేతలకు బాబు .. చెప్పిందేమిటి..వీరిద్దరూ కలిసివస్తే, అభ్యర్థిగా ఎవరికి మద్ధతు ఇస్తారు అన్న చర్చ కేడర్ లో వెల్లువెత్తుతోంది.

మరి బాబు వ్యూహం ఇక్కడ ప్లస్సా .. మైనస్సా అన్నదే చర్చనీయాంశంగా మారింది..

Must Read

spot_img