HomePoliticsబాబు, పవన్ భేటీ..ఏపీలో అసలు ఏం జరుగుతోంది..?

బాబు, పవన్ భేటీ..ఏపీలో అసలు ఏం జరుగుతోంది..?

  • బాబు, పవన్ భేటీ అధికార పార్టీకి టెన్షన్ పెట్టిస్తోందా..?
  • అందుకే భేటీ వార్తలు రాగానే .. వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయా..?
  • ఏపీలో అసలు ఏం జరుగుతోందన్నదే హాట్ టాపిక్ గా మారిందా..?

ఏపీలో చకచకా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. నిన్నటిదాకా వేరు వేరు అనుకున్న పార్టీలు ఇపుడు ఒక్కటిగా చేతులు కలుపుతున్నాయి. ఏపీ రాజకీయాలను మార్చేసే గేమ్ చేంజర్ గా ఉన్న జనసేన తెలుగుదేశం పార్టీతో సన్నిహితంగా ఉండడం అంటే అది అత్యంత కీలకమైన రాజకీయ పరిణామంగా చూడాలనే అంటున్నారు. ఇప్పటిదాకా జనసేన ఈ విషయంలో ఎక్కడా బయటపడకున్నా ఫస్ట్ టైం పవన్ పనిగట్టుకుని మరీ చంద్రబాబు ఇంటికి తన కారుని పోనీయడం అంటే ఈ రెండు పార్టీలు పొత్తుల దిశగా ప్రయాణం చేస్తున్నాయని అంతా భావిస్తున్నారు.

అయితే కేవలం మర్యాదపూర్వక భేటీ అని పవన్ కళ్యాణ్ అనంతరం చెప్పారు. చంద్రబాబు హక్కులను కుప్పంలో వైసీపీ ప్రభుత్వం కాలరాయడం పట్ల తాను ఆవేదన చెంది ఆయనను పరామర్శించడానికి అని చెప్పారు. ఏపీ సర్కార్ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాల మీద ఏ విధంగా పోరాటం చేయాలి అన్నది కూడా చర్చించామని అన్నారు. ఆ సంగతి అలా ఉంచితే రెండు పార్టీలు జగన్ని ఉమ్మడి ప్రత్యర్ధిగా చేసుకుని చేతులు కలిపాయన్నది క్లారిటీ వచ్చేసింది.

దాంతో ఇపుడు వైసీపీ శిబిరంలో కలవరం రేగుతోంది. బాబు పవన్ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకొవడంతో వైసీపీ క్యాంప్ ఫుల్ షేక్ అవుతోంది అని అంటున్నారు. పవన్ ఇలా చంద్రబాబుతో భేటీకి వెళ్లారో లేదో వరసబెట్టి వైసీపీ మంత్రులు దాని మీద కామెంట్ చేయడం బట్టి చూస్తే వైసీపీకి ఈ కొత్త ఎత్తు పొత్తుల ఫీవర్ బాగానే ఉంది అని అంటున్నారు. చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్ వెళ్తున్నారు అని తెలిసిన నిమిషాల్లోనే భేటీ జరిగిపోయింది.

ఇలా జరుగుతుందని వైసీపీ నేతలకు సమాచారం లేదు. కానీ విషయం మీడియాలో వచ్చిన తర్వాత హాహాకారాలు మొదలు పెట్టారు. అదీ కూడా ఓ రేంజ్‌లో. సాధారణంగా ఎవరైనా ప్రతిపక్ష పార్టీల నేతలు కలిస్తే.. వారి భేటీ ముగిసి.. మీడియాతో మాట్లాడిన తరువాత వారు రాజకీయంగా ఏ అంశాలపై మాట్లాడారో .. ఆ అంశాలపై స్పందించడం రాజకీయం. కానీ వైసీపీ రూటే వేరు.

ఇక పవన్ కల్యాణ్ చంద్రబాబు ఇంటికి వెళ్లారని తెలియగానే.. వ్యక్తిగత బూతులతో ఒక్కో వైసీపీ రాజకీయ నేత దిగిపోయారు. సంక్రాంతికి అందరింటికి గంగిరెద్దులు వెళ్తాయని.. అలా చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్ళారని ట్వీట్ చేశారు. డుడు బసవన్నలా తల ఊపడానికి వెళ్లారని ట్వీట్ చేశారు. చంద్రబాబు దగ్గర పవన్‌ ఊడిగం చేస్తున్నాడని వెంటనే మీడియాకు పోన్ ఇన్ లు ఇచ్చి… తమ అధినేతను మెప్పించే ప్రయత్నం చేశారు.

  • మంత్రి జోగి రమేష్‌ కామెంట్స్..!

ఇక గుడివాడ అమర్నాథ్ కూడా అంతే స్పందించారు. సంక్రాంతి పండుగ మామూళ్ల కోసం దత్త తండ్రి వద్దకు దత్త పుత్రుడు వెళ్లారంటూ ట్వీట్ చేశారు. మంత్రి జోగి రమేష్‌ సంక్రాంతి ప్యాకేజీ కోసమే చంద్రబాబు ఇంటికి పవన్‌ కల్యాణ్‌ వెళ్లారని విమర్శించారు. ఏపీని వదిలేసి పక్కరాష్ట్రంలో కూర్చుని జీవో నెంబర్-1పై చర్చించడమేంటని మల్లాది విష్ణు ప్రశ్నించారు. వీళ్ల కలయిక వల్ల ఏపీకి ఒరిగేది ఏమీ లేదన్నారు.

ఎంపీ మార్గాని భరత్ సహా అందరూ ఒకే విధంగా తమ ట్వీట్లు పెట్టారు. ఇదంతా ఐప్యాక్ ప్రణాళిక ట్వీట్లు అని అందరికీ తెలుసు కానీ.. ఇంత వేగంగా హాహాకారాలు ఎందుకని.. వారు మీడియాతో మాట్లాడేంత సేపు కూడా ఎందుకు ఆగలేకపోయారని టీడీపీ, జనసేన వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. కారణం ఏదైనా పవన్, చంద్రబాబు ఎప్పుడు కలిసినా వైసీపీ నేతల్లో అలజడి ప్రారంభమవుతుంది. దారుణమైన తిట్లతో విరుచుకపడుతున్నారు.

వారి భయం వారి మాటల్లోనే వ్యక్తమవుతోందని విపక్ష పార్టీల నేతలు అంటున్నారు. ఈ రెండు పార్టీలు కలిస్తే వ్యతిరేక ఓటు చీలకుండా ఉంటే కనుక అది కచ్చితంగా వైసీపీకి దెబ్బ అవుతుందని అనేక సర్వేలు నిరూపించిన నేపధ్యం ఉంది. 2014లో అది నిజం అయిన పరిస్థితి ఉంది. అందుకే వైసీపీలో ఇపుడు పెద్ద ఎత్తున రాజకీయ అలజడి రేగుతోంది.

జనసేన తెలుగుదేశం రెండు ఎపుడో కలసి ఉన్నాయని ఇపుడు బయటపడ్డాయని మరో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు పట్టని ఈ ఇద్దరు తమ సొంత రాజకీయం కోసమే చేతులు కలిపారని అన్నారు.

మొత్తానికి చూస్తే పొత్తుల విషయంలో మాత్రం రెండు పార్టీలు ఏమి మాట్లాడుకున్నాయన్నది తెలియకపోయినా వైసీపీలో మాత్రం వేడి బాగా పెరిగింది అని అంటున్నారు. నిజానికి రాజకీయాల్లో పొత్తులు సాధారణమైనవి. అవి తప్పు కూడా కాదు. ప్రతీ ఎన్నికలోనూ పొత్తులు పెట్టుకునే పార్టీలు చాలా కనిపిస్తాయి.

కానీ ఏపీలో మాత్రం జనసేన టీడీపీ పొత్తు పట్ల వైసీపీ చేస్తున్న విమర్శలు పెడుతున్న అభ్యంతరాలు చూస్తే కచ్చితంగా ఆ పార్టీకి ఏదో బెంగ బెదురు పట్టుకుందా అన్న డౌట్ అయితే కలగకమానదు. ఏది ఏమైనా బాబు పవన్ భేటీ వైసీపీ కి నోటి నిండా చేతి నిండా పని కల్పించింది అని అంటున్నారు. అందుకే వీరి భేటీపై
అప్పుడే అధికార పార్టీ నేతలు కూడా సెటైర్లు వేయడం మొదలుపెట్టారు.

మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో ఎద్దేవా చేశారు. టీడీపీ అధినేత, దత్తపుత్రుడు జనసేన పవన్‌ కల్యాణ్‌ మధ్య ఉన్న ముసుగు మరోసారి తొలగిపోయిందని, చంద్రబాబు, పవన్‌ కలిసినా తమకు నష్టం లేదని అన్నారు.

  • ఏపీలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు..!

ఏపీలో కుల సమీకరణాలతో రాజకీయాలు నడుస్తుంటాయి. అందుకే.. అక్కడి పాలిటిక్స్ ఎప్పుడూ ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీని గద్దె దించేందుకు టీడీపీ, జనసేన పోటీ పడుతున్నాయి. అయితే.. వేర్వేరు దారుల్లో వెళ్తున్న ఈ పార్టీలు ఒకే బాటలో నడిస్తే అనుకున్న లక్ష్యం నెరవేరే ఛాన్స్ ఉందని రెండు పార్టీల్లోనూ వినిపిస్తున్న మాట. ఈ క్రమంలో కీలక అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోంది.

టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. పైకి.. ఇది జీవో నెంబర్ 1పై చర్చల్లో భాగంగా జరిగిన భేటీ అని చెబుతున్నారు. కానీ, రాజకీయ పండితులు మాత్రం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి ఉంది. కేంద్రంలోని బీజేపీకి దగ్గరగా ఉంటోంది ఈ పార్టీ. రాష్ట్ర బీజేపీ నేతలు దీన్ని ఖండిస్తున్నా.. అనేక అనుమానాలున్నాయి.

ఇదే సమయంలో జనసేనతో తమకు పొత్తు ఉందని చెబుతున్నా.. పవన్ కళ్యాణ్ సైడ్ నుంచి అంత ఆసక్తి లేదనేది విశ్లేషకుల వాదన. మొన్నామధ్య ప్రధాని మోడీ వైజాగ్ పర్యటనకు వచ్చినప్పుడు పవన్ కలిశారు. ఈ మీటింగ్ టాక్స్ పై ఎలాంటి లీక్స్ ఇవ్వలేదు. ఏం జరిగిందో? దేనిపై మాట్లాడుకున్నారో ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే.. అనూహ్యంగా ఆ సమయంలో పవన్ ని కలిశారు చంద్రబాబు. దీంతో పొత్తుపై ఊహాగానాలు ఊపందుకున్నాయి.

ఆనాడు పవన్ టూర్ పై ఆంక్షలను ఖండిస్తూ చంద్రబాబు వెళ్లి కలిస్తే.. ఇప్పుడు చంద్రబాబు టూర్ పై ఆంక్షలను ఖండిస్తూ పవన్ కలిశారు. ఈ సందర్భంగా బాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి జీవో నెంబర్ 1పై చర్చించామని.. ఎన్నికలు, పొత్తులపై తర్వాత మాట్లాడుకుంటామని అన్నారు. అన్ని పార్టీలు, సంఘాలు కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.

ఎన్నికల సమయంలో చాలా పొత్తులు పెట్టుకుంటామని.. 2009లో టీఆర్ఎస్ తో కలిసిన విషయాన్ని గుర్తు చేశారు. ముందు పొత్తు పెట్టుకున్నా ఆ తర్వాత విభేదించామని వివరించారు. రాజకీయాల్లో సమీకరణాలు మారుతుంటాయని తెలిపారు చంద్రబాబు. అంటే.. జనసేనతో ముందు పొత్తు పెట్టుకున్నాం.. తర్వాత విభేదాలు వచ్చాయి.. ఇప్పుడు మళ్లీ కలుస్తాం అనేలా హింట్ ఇచ్చారని అంటున్నారు విశ్లేషకులు.

టీడీపీ, బీజేపీకి గత ఎన్నికల సమయం నుంచి పడడం లేదు. ఇప్పుడు జనసేన, టీడీపీకి దగ్గరైతే బీజేపీకి దూరం అవ్వాల్సిందే. చూడాలి.. రానున్న రోజుల్లో ఇంకెలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందేనని విశ్లేషకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.

Must Read

spot_img