Homeఅంతర్జాతీయంఆస్ట్రేలియా పరిశోధకులు కనిపెట్టిన మరో కొత్త టెక్నాలజీ ..?

ఆస్ట్రేలియా పరిశోధకులు కనిపెట్టిన మరో కొత్త టెక్నాలజీ ..?

డీజిల్ ఇంజన్ ను హైడ్రోజన్ ఇంజన్ గా మార్చే కొత్త టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. దీంతో చాలా విధాలుగా ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. అయితే ఈ తరహా ఇంజన్ లతో 90 శాతం హైడ్రోజన్, 10 శాతం డీజల్ ఉపయోగించడం తప్పనిసరి అంటున్నారు. అయితే ఈ రకంగా ఇంధనం ఉపయోగించడం వల్ల పర్యావరణ కాలుష్యాలు చాలా తగ్గిపోయినట్టు గుర్తించారు.

డీజిల్ ఇంజిన్‌ను హైడ్రోజన్ ఇంజిన్‌గా మార్చే ఈ కొత్త టెక్నాలజీని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు కనిపెట్టారు. పర్యావరణానికి హాని కలిగించని హైబ్రిడ్ ఇంజిన్ తయారు చేసేందుకు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. డీజిల్ ఇంజిన్‌ను హైడ్రోజన్ ఇంజిన్‌గా మార్చే ఈ కొత్త టెక్నాలజీతో వాహనాల కాలుష్యాలను గణనీయంగా తగ్గించవచ్చని అంటున్నారు. వీరు కనిపెట్టిన ఇంజన్ ద్వారా హైడ్రోజన్, కొద్ది పాటి డీజిల్ మిశ్రమం సరిపోతుంది. దీంతో నడిచేలా డీజిల్ ఇంజిన్‌ను వారు విజయవంతంగా మార్చారు. తమ టెక్నాలజీతో కర్బన ఉద్గారాలు 85శాతం తగ్గినట్లు యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ ఇంజినీర్లు చెబుతున్నారు. ఆస్ట్రేలియాలోని గనుల్లో వాడే డీజిల్‌తో నడిచే భారీ యంత్రాలు, ట్రక్కుల వల్ల కాలుష్యం బాగా పెరుగుతోంది. ఇటువంటి హైబ్రిడ్ ఇంజిన్లు ఆ సమస్యకు పరిష్కారం చూపగలవని వారు భావిస్తున్నారు.

తాము రూపొందించిన ఈ టెక్నాలజీ అందరి దృష్టిని ఆకర్షిస్తోందని… జర్మనీ, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, జపాన్, చైనా వంటి దేశాల నుంచి ఎంక్వైరీలు చేస్తున్నారని ప్రొఫెసర్ షాన్ కూక్ అన్నారు. ప్రస్తుత డీజిల్ ఇంజిన్లలో హైడ్రోజన్ డైరెక్ట్ ఇంజెక్షన్ సిస్టమ్‌ను ఉంచుతామని ఆయన కూక్ తెలిపారు. అయితే శిలాజ ఇంధనాల మాదిరిగా హైడ్రోజన్ మండినప్పుడు కార్బన్ డయాక్సైడ్‌ని ఉత్పత్తి చేయదు. కాబట్టి ఇది పర్యావరణానికి నష్టం చేయదని చెబుతున్నారు. ప్రొఫెసర్ కూక్ బృందం తయారు చేసిన హైబ్రిడ్ ఇంజిన్‌లో 90 శాతం ఇంధనం హైడ్రోజన్ ఉంటుంది. కానీ ఆ ప్రక్రియ సరిగ్గా జరగకపోతే మొత్తం ఇంజిన్ పేలిపోయే ప్రమాదం ఉంటుందని ఆయన తెలిపారు. ఇంజిన్‌లోని సిలిండర్ లోపల హైడ్రోజన్, గాలి మిశ్రమాన్ని నియంత్రించడం వల్ల హానికరమైన నైట్రోజన్ ఆక్సైడ్ ఉద్గారాలను లేకుండా చేయవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం ఇలా చేయడం పూర్తి స్థాయిలో సాధ్యం కాకపోవడం వల్లే భారీ స్థాయిలో హైడ్రోజన్ మోటార్ల వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం కాలేదు. మైనింగ్, రవాణా, వ్యవసాయ రంగాలలో ఎలాంటి డీజిల్ ట్రక్కులు, విద్యుత్ పరికరాలనైనా కేవలం రెండు నెలల్లోనే కొత్త హైబ్రిడ్ సిస్టమ్‌తో కలపవచ్చని సిడ్నీ పరిశోధనా బృందం అభిప్రాయపడింది.

డీజిల్ కార్ల స్థానంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలను రీప్లేస్ చేస్తున్న ఈ రోజుల్లో కార్ల ఇండస్ట్రీ హైబ్రిడ్ ఇంజిన్ల మీద అంతగా ఆసక్తి చూపించకపోవచ్చని అంటున్నారు ప్రొఫెసర్ కూక్. కానీ డీజిల్‌తో నడిచే భారీ వాహనాలు గల వేలాది కోట్లు విలువజేసే ఆస్ట్రేలియా మైనింగ్ పరిశ్రమకు ఇది ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు. హైబ్రిడ్ ప్లాన్ ఏంటంటే హైడ్రోజన్-డీజిల్ మిశ్రమాన్ని అమలు చేయడం, ఒకవేళ హైడ్రోజన్ లేకపోతే డీజిల్‌కు వెళ్లొచ్చు.

ప్రొఫెసర్ కూక్ తన కొత్త తరం ఇంజిన్ రెండేళ్లలో వాణిజ్య ఉత్పత్తిగా మారుతుందని ఆశిస్తున్నారు. ఈ టెక్నాలజీ ఆస్ట్రేలియన్ మైనింగ్ పరిశ్రమను మార్చివేసే సామర్థ్యాన్ని కలిగి ఉందని సిడ్నీలోని క్లైమేట్ ఎనర్జీ ఫైనాన్స్ డైరెక్టర్ టిమ్ బక్లీ అభిప్రాయపడ్డారు.”ప్రచారం, నమ్మకాన్ని అంచనా వేసేటపుడు నాకు ఎప్పుడూ సంశయం ఉంటుంది. అయితే న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం సాధించిన ఈ పురోగతి చాలా విశేషంగా కనిపిస్తుంది. దాన్ని ఇంకాస్త లాగితే పెద్ద అవకాశంగా మారుతుంది” అని టిమ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. హైబ్రిడ్ డీజిల్-హైడ్రోజన్ ఇంజిన్‌లను అభివృద్ధి చేయడంలో ఆస్ట్రేలియా బృందం గ్లోబల్ రేసులో ఉంది. ఎలక్ట్రోలైజర్‌ని ఉపయోగించి నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్ అణువులుగా విభజించడానికి పునరుత్పాదక శక్తి నుంచి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయవచ్చు.

కానీ దీనికి టెక్నాలజీ, అవసరమైన విద్యుత్తు ఖరీదైనది కాబట్టి ప్రస్తుతానికి కొద్ది మొత్తంలో హైడ్రోజన్ మాత్రమే ఉత్పత్తి అవుతోంది. అయితే ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. సూర్యరశ్మి, గాలితో ఆస్ట్రేలియా పునరుత్పాదక విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి చాలా సామర్థ్యాన్ని కలిగి ఉంది, ఇది గ్రీన్ హైడ్రోజన్‌ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతానికి యూఎన్‌ఎస్‌డబ్ల్యూ ప్రాజెక్ట్ ల్యాబొరేటరీలో ప్రయోగాత్మక దశలోనే ఉంది. శాస్త్రవేత్తల దృష్టి మొదట ఆస్ట్రేలియన్ మైనింగ్, వ్యవసాయం, నిర్మాణ పరిశ్రమలను ఆకర్షించడం. ఆ తరువాత ఇతర దేశాల మీద ఉంది. ఆస్ట్రేలియాలో అతి పెద్ద మైనింగ్ కంపెనీలు ఉన్నాయి. అవన్నీ కర్బన ఉద్గారాలను తగ్గించాలనే లక్ష్యంతో ఉన్నాయి. మరి వీరిని ప్రొఫెసర్ కూక్ బృందం రూపొందించిన హైబ్రిడ్ ఇంజిన్ ఆకర్షిస్తుందో లేదో చూడాలి

Must Read

spot_img