Homeఅంతర్జాతీయంపాకిస్తాన్ నాస్తికత్వం..

పాకిస్తాన్ నాస్తికత్వం..

పాకిస్థాన్‌ను ముంచింది ఆ దేశ పాలకులేనన్నది సుస్పష్టం అంటున్నారు నిపుణులు. రాజకీయాన్ని పాలనను మతంతో ముడిపెడుతూ చేసిన అవినీతి కారణంగానే దేశం దివాలా తీసిందని వారంటున్నారు. అంతకన్నాముందు మతమౌఢ్యం పాకిస్తాన్ ను కడతేర్చేదాకా వదలదని స్పష్టం చేసారు. మతాన్ని కేంద్రంగా చేసుకుని పరిపాలిస్తే ఒక దేశం ఏ విధంగా వెనుకబడిపోతుందనేది పాకిస్థాన్‌ను పరిశీలిస్తే అవగతమవుతుంది.

నిజానికి 1948లో పాకిస్తాన్ అన్న దేశం మత ప్రాతిపదికన ఏర్పడింది. మొదటి నుంచీ అనుసరించిన మత ప్రేరిత విధానాల వల్ల పాకిస్థాన్ అన్ని రంగాలలో వెనుకబడి పోయింది. పిల్లలకు చదువు నేర్పే క్రమంలో జ్నానానికి బదులుగా మతగ్రంధాలను నేర్పించడంతోనే వారి మనసుల్లో ప్రపంచజ్నానం చొరబడలేదు. అంతెందుకు ఇటీవల ఖతర్ పర్యటన నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన పాకిస్థాన్ ప్రధాని షహేబాజ్ షరీఫ్ పాకిస్తాన్ బ్రూరోక్రాట్ల సమావేశంలో పాల్గొన్నారు.

అక్కడ తన అంతర్మధనాన్ని బయటపెట్టారు. ‘తాము 75 ఏళ్ళుగా బిక్షాటన చేస్తున్నట్లు’ వాపోయారు. ఆ పనిచేస్తున్నందుకు సిగ్గుపడతున్నామని అన్నారు. భారత్ తో మూడు యుధ్దాలలో తాము నేర్చుకున్నదేమీ లేదని పూర్తి నిజాలు మాట్లాడారు. అఫ్ కోర్స్ ఒక రోజు గడిచేసరికి ఆయన ప్రసంగంలో మార్పు వచ్చిందనుకోండి. నిజానికి 1947లో స్వతంత్ర దేశంగా ఆవిర్భవించినప్పుడు పాకిస్థాన్‌కు వ్యవసాయమే ప్రధాన ఆదాయవనరుగా ఉండేది.

పాకిస్థాన్ భౌగోళికంగా భారత్ కంటే చిన్న దేశమే అయినప్పటికీ సమృద్ధ జలవనరులు, సారవంతమైన సాగు భూములకు నెలవైన ప్రాంతాలు ఉన్నాయి. అందులో పంజాబ్ ప్రాంతం వల్లనే పాక్ ఆర్థిక స్థితిగతులు చాల మెరుగైనవిగా ఉండేవి. అవిభక్త భారత్ విభజన నాటికి ఉన్న 921 ప్రధాన పరిశ్రమలలో కేవలం 34 మాత్రమే పాక్‌కు దక్కాయి. అవి కూడా ప్రధానంగా బెంగాల్‌లోని జనపనార పరిశ్రమలు మాత్రమే. 1950లో పాకిస్థాన్ తలసరి ఆదాయం 1268 డాలర్లు. ఇది అప్పట్లో భారత్ తలసరి ఆదాయం కంటే దాదాపు రెండు రెట్లు అధికం.

  • పాకిస్తాన్ ను పాలించిన నాయకులకు కశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవడమే ధ్యేయంగా మారిపోయింది..

స్వార్థం పెరిగిపోయింది. ఎక్కడెక్కడి సంపాదనను విదేశాలకు తరలించడం మొదలైంది. భారతదేశంలో అంతర్భాగమైన కశ్మీరును పాకిస్తాన్ లో కలుపుకోవడమే పాక్ జాతీయ రాజకీయాల ప్రధాన లక్ష్యమయింది. ఆ లక్ష్య సాధన కోసం భారత్‌కు వ్యతిరేకంగా యుద్ధాలకు సైతం తెగబడింది. ఈ యుద్ధాలు, రాజకీయాల వల్ల పౌర, సైనిక పాలకులు పలు విధాల ప్రయోజనాలు పొందారు. అయితే దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లడంలో మాత్రం అడ్డంగా విఫలమయ్యారు.

దేశాన్ని అత్యధిక కాలం ఏలిన సైనికాధికారులు ఇస్లామిక్ భావజాలంతో కశ్మీర్‌ను బూచిగా చూపి పంజాబీలు, సింధీలు, బలూచీలు, పఠాన్లు, మహాజీర్లుగా విడిపోయిన దేశాన్ని ఒక్కటిగా నిలబెట్టారు. అయితే దానితో పాటు దేశ బడ్జెట్ కేటాయింపుల్లో సింహభాగాన్ని రక్షణ శాఖకు దక్కించుకోవడంలో సఫలీకృతులయ్యారు. అలా దక్కించకున్న సంపదను దుబాయ్ లండన్ చేర్చడంలోనూ విజయం సాధించారు.

ఆనాటి నుంచి నేటి దాకా సైనికాధికారులంతా విదేశాలలో వందల ఎకరాలలో నిర్మించుకున్న సొంతిళ్లలో స్థిరపడ్డారు. సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారు. వారినే నమ్ముకున్న పాకిస్తాన్ ప్రజలు మాత్రం ఇప్పడు దిక్కుతోచని స్థితిలో గోధుమ పిండి కోసం క్యూ లైన్లలో నిలబడుతున్నారు. అప్పట్లో అవిభాజ్య సోవియట్ యూనియన్, అమెరికా మధ్య సూపర్ పవర్ హోదా కోసం జరిగిన ప్రచ్ఛన్న యుద్ధం ప్రపంచంలో అనేక మార్పులకు కారణమైంది.

పాకిస్తాన్ పొరుగునే ఉన్న అఫ్ఘానిస్థాన్ ఒక పావుగా మారింది. పాక్ సైన్యంలో స్వతహాగా అత్యధికులుగా ఉన్న పఠాన్ల అంశం, అఫ్ఘాన్ లోని పరిణామాలు పాకిస్తాన్ కు జియోలాజికల్ అడ్వాంటేజ్ ను కలుగజేసాయి. ఎందుకంటే పాకిస్తాన్ చాల కీలక ప్రదేశంలో ఉండటం దానికి కలసి వచ్చింది. ఆ కారణంగానే పాకిస్తాన్ కు సహజంగా అంతర్జాతీయంగా ఒక సముచిత పాత్రను కల్పించాయి.

  • సోవియట్ ఎర్రసేనలను దెబ్బతీయడానికి అమెరికా జిహాద్‌ను ప్రొత్సహించి పాకిస్థాన్‌కు అన్ని రకాలుగా అండగా నిలిచింది..

బిలియన్ల కొద్దీ డాలర్లు ఈ నేలపై ఉత్తపుణ్యాన ప్రవహించాయి. సంపద వరదలా పాకిస్తాన్ నేతల అకౌంట్లలోకి వచ్చిపడింది. జనరల్ జియా ఉల్ హఖ్ హయాంలో జిహాద్ ఉగ్రవాదం పరాకాష్ఠకు చేరుకుంది. అమెరికా మద్దతుతో ఇస్లామాబాద్ పాలకులు ఆడింది ఆట పాడింది పాట అయింది. ఇదే సమయంలో పాక్ పాలకులు తాము అనుసరిస్తున్న మత ప్రేరిత భావజాలానికే మరింతగా నిబద్ధమయ్యారు.

సోవియట్ యూనియన్ కుప్పకూలిన తర్వాత జిహాద్ నుంచి అమెరికా వైదొలిగినా ఆ భావజాలం మాత్రం అదే విధంగా పాక్ రాజకీయాలు, సమాజంలోనూ దృఢంగా ఉండిపోయింది. మారిన అంతర్జాతీయ ద్రుక్పదానికి తగినట్టుగా మారలేకపోయారు. ప్రపంచంతో పాటు కాలంతో పాటు నడవకుండా తమదైన శైలిలో జీవించారు. ఎందుకంటే కష్టం లేకుండా వచ్చిపడే డాలర్లు వారి కళ్లను మసకబారేలా చేసాయి.

ఆ రకమైన సంపద కారణంగానే ఎవరికీ పనిచేయాల్సిన అవసరం కనిపించలేదు. అందుకే ఎక్కడా పరిశ్రమలు అభివ్రుద్ది చెందలేదు. చదువు లేదు వైద్యపరమైన అభివ్రుద్ద అసలే లేకుండాపోయింది. ఆయాచితంగా వచ్చిన ఆర్థిక నిధులు దేశం మొత్తంగా సోమరిపోతులను తయారు చేసాయి. ఇది ఇలాగే శాశ్వతంగా ఉంటుందని అనుకున్నారు. విద్య, మౌలిక వసతుల అభివృద్ధిలోనే కాదు అన్నింటా దేశ పురోగతి క్రమేణా కుంటుపడిపోయింది.

విద్యార్థులకు నవీన, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే అంశాల కంటే మధ్య యుగం నాటి ముస్లిం రాజుల యుద్ధాలు వగైరా గూర్చి ఎక్కువగా బోధిస్తూ వచ్చారు. నాణ్యమైన విద్యాలేమి కారణంగా అక్కడి యువత విదేశీ ఉద్యోగ విపణిలో అవకాశాలను అందుకోలేకపోయింది. పాకిస్థానీ ప్రవాసుల సంఖ్య 80 లక్షలు కాగా, అదే భారతీయ ప్రవాసుల సంఖ్య ఒక కోటీ 80 లక్షలుగా ఉంటుంది. విదేశాలలో పౌరసత్వం కలిగి ఉన్నవారి సంఖ్య దీనికి అదనం.

విదేశాలలో భారతీయులు అన్ని రంగాలలో నిపుణులుగా ఉండగా పాకిస్థానీయులు నిమిత్తమాత్ర కార్మికులుగా మాత్రమే జీవిస్తున్నారు. చిన్నాచితకా ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే విభజన అనంతరం భారతదేశం అనతికాలంలోనే శరవేగంగా పురోగమనం వైపు పయనించింది. స్వయంచలనంతో అనుకున్న విజయాలన్నీ సొంతం చేసుకుంది. అయితే పాకిస్థాన్ మాత్రం మతమౌఢ్యంలోకి జారిపోయింది. ఈ వాస్తవాన్ని గ్రహించే సరికి పాకిస్థాన్‌కు పుణ్యకాలం దాటిపోయింది.

దేశం పూర్తిగా దివాలా తీసి ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలోకి పాకిస్థాన్ దిగజారిపోయింది. తాము 75 ఏళ్ళుగా బిచ్చమడుక్కుంటున్నామన్న ప్రధానమంత్రి షహేబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలోనే అసలు వాస్తవం ఉంది. కల్లోలిత పాకిస్థాన్‌కు 200 కోట్ల డాలర్ల ఆర్థిక సహాయం చేయడానికి ఖతార్ ముందుకు వచ్చింది. సౌదీ అరేబియా, కువైత్ దేశాలు కూడ పాక్‌ను అన్ని విధాల ఆదుకోవడానికి ముందుకు వస్తున్నాయి.

కానీ ఇలా ఎంత కాలం.. అన్నదే పాకిస్తానీయుల ముందున్న ప్రశ్న. ఇవి ఖర్చయ్యాక తరువాత సంగతేంటన్నది వారి సందేహం. ఇప్పటికిప్పుడు పాకిస్తాన్ ముందు శాశ్వత ప్రతిపాదిక లేదా నిర్ణయాలంటూ ఏమీ లేవు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్న పాకిస్థాన్ ఒక దేశం నుంచి అప్పు చేస్తూ మరో దేశానికి దాన్ని చెల్లిస్తోంది. ఎక్కువ వడ్డీలు చెల్లించాల్సి రావడంతో అప్పులు పెరుగుతున్నాయి. తాజాగా ఇతర దేశాల్లో ఉన్న పాకిస్థాన్ ఆస్తులను అమ్మే వరకూ పరిస్థితి వచ్చింది.

గొప్పలకు పోయి అప్పులు చేసి తిప్పలు పడుతున్న దేశాలలో అగ్రగామిగా పాకిస్తాన్ ఘనత దక్కించుకుంది. సాయం అందించాలనుకునే భారత్ ను దొంగదెబ్బ తీయాలనుకోవడం.. జిత్తులమారి చైనాతో కలిసి దోస్త్ మేరా దోస్త్ అంటూ ఊరేగడం వంటివి చేసిన పాక్ కు నిజానిజాలు ఇప్పుడు తేటతెల్లమవుతున్నాయి. మత మౌఢ్యం తలకెక్కి హిందూ దేశం పై కక్షగట్టి ఎందరో మన జవానుల ఉసురుపోసుకుంది పాకిస్తాన్.

ఒడ్డుచేరాక తెప్పతగలబెట్టే దిగజారుడు గుణం కలిగిన పాకిస్తాన్ బుద్ధి ఎప్పుడూ కుక్క తోక వంకరగానే ఉంటుంది. మత పిచ్చితోనే మనబోటి దేశాలను కాదనుకుని ఇప్పుడు అన్నమో రామచంద్రా అనే స్థితికి చేరుకుంది. ఇది పాక్ దౌర్భాగ్యకర పరిస్థితి. మరికొన్ని మతోన్మాద దేశాలు ఏకమై సాయం చేసినా తేరుకోని స్థితికి చేరుకుంటున్న పాక్ కు భవిష్యత్తులో పరిష్కార మార్గాలు ఏ ఏ రూపాన కనిపిస్తాయో.. చూడాలి. అలా జరగకపోతే పాక్ లో ఆకలి చావులకు సమయం దగ్గరపడినట్టేనని అంటున్నారు పరిశీలకులు.

Must Read

spot_img