- వరాలు కురిపించనుందా..? లేక గత బడ్జెట్ లానే ఉండనుందా..?
- ఇప్పుడిదే చర్చ దేశవ్యాప్తంగా ఉద్యోగుల్లో వెల్లువెత్తుతోంది. ఇంతకీ వీరి డిమాండ్లేమిటి..?
హ్యాట్రిక్ సాధించాలని భావిస్తోన్న మోడీ సర్కార్ కు .. త్వరలో రానున్న బడ్జెట్ టెన్షన్ పెట్టిస్తోంది. అటు వేతన జీవుల్నే కాక .. అధికార పార్టీలోనూ బడ్జెట్ ..చర్చలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

2022-23కు ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ వాస్తవానికి వేతన జీవులను నిరుత్సాహపరిచింది. కరోనాతో అప్పటికే ఆర్థికంగా చితికిపోయిన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు బడ్జెట్ పరంగా పలు కీలక నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదని అప్పట్లో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. అయితే ఈ సారి బడ్జెట్‌పై ఉద్యోగులు మంత్రి నిర్మలా సీతారామన్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు. మరి మంత్రివర్యులు వేతనజీవులపై కనికరిస్తుందా.
ఆర్థికమాంద్యం కూడా ఉంటుందన్న విశ్లేషణలు వినిపిస్తుండటంతో కేంద్రం ఎలాంటి చర్యలకు దిగుతోందనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రం పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. అయితే నిర్మలమ్మ బడ్జెట్ ఈ సారి చాలా కీలకం కానుంది. 2023-24కు బడ్జెట్‌ను ప్రవేశపెట్టి వచ్చే ఏడాది ఎన్నికలకు వెళ్లనుంది కేంద్రం. దీంతో బడ్జెట్‌లో అన్ని వర్గాల వారిని కేంద్రం ఆకట్టుకుని ఆకర్షించగలదా అనే చర్చ ప్రారంభమైంది.
గతేడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ పై వేతన జీవులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే కేంద్రం కూడా కరోనాతో వేతన జీవులకు పెద్ద బెనిఫిట్స్ ఇవ్వడం లేదంటూ స్పష్టం చేసింది. ఈ సారి ఆర్థికమాంద్యం కూడా దండెత్తుతుండటంతో వేతన జీవుల ఆశలు నిరాశే అవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సారి కేంద్రం దీన్ని సాకుగా చూపే ఛాన్సెస్ ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉంటే టాక్స్ ఎక్స్‌పెర్ట్స్ మాత్రం 2023-24 బడ్జెట్‌లో ఒక ఉద్యోగి స్థూల జీతంపై స్టాండర్డ్ డిడక్షన్‌లో పెంపు ఉండాలని సూచిస్తున్నారు. అంతేకాదు వేతన జీవులకు పన్ను ప్రోత్సాహకాలు ఇవ్వాలంటూ నిపుణులు సూచిస్తున్నారు. ఇక కరోనా తర్వాత ఆఫీసులు తిరిగి తెరుచుకోవడంతో ప్రస్తుతం అన్ని రంగాల్లో ధరలు పెరిగాయి. ఉదాహరణకు రవాణా ఛార్జీలు, అద్దెతో పాటు ఇతరత్రా ఛార్జీలు కూడా పెరిగాయి.
కరోనా కొనసాగుతుందనే భావనతో చాలా కంపెనీలు తమ ఉద్యోగస్తులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడంతో చాలామంది నగరాల్లోని తమ ఇళ్లను ఖాళీ చేసి సొంతూళ్లకు వెళ్లిపోయారు. తిరిగి కరోనా కంట్రోల్ కావడంతో ఉద్యోగస్తులను ఆఫీసులకు వచ్చి పనిచేయాలని ఆయా కంపెనీలు డిసైడ్ అయ్యాయి.దీంతో వారంతా మళ్లీ నగరాలకు చేరుకున్నారు. వారు ఉండేందుకు ఒక ఇళ్లను అద్దెకు తీసుకుని అధిక అద్దెలు చెల్లిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇంటి అద్దె నుంచి కూరగాయలు, నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో స్టాండర్డ్ డిడక్షన్ పెంచాలని ఉద్యోగస్తులు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. అన్ని పన్ను మినహాయింపులు పన్ను చెల్లింపుదారుని నిర్దిష్ట ఖర్చులపై ఉపశమనం పొందేందుకు వీలుగా ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలనే స్టాండర్డ్ డిడక్షన్ అని పిలుస్తారు.
జీతం పొందే వ్యక్తులకు రవాణా భత్యం, మెడికల్ అలవెన్సులకు బదులుగా రూ.40వేలు స్టాండర్డ్ డిడక్షన్ కింద 2018-19 కేంద్ర బడ్జెట్‌లో తిరిగి ప్రవేశపెట్టింది. అంతకుముందు తాము చెల్లించే పన్నులో నుంచే ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ కింద రూ.19200, మెడికల్ అలవెన్స్ కింద రూ.15000 క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇది మొత్తంగా రూ.34,200గా ఉండేది. ఆ తర్వాత వరుసగా రెండు బడ్జెట్‌లలో స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.40వేలు, రూ.50వేలకు పెంచడం జరిగింది.
ఇలా పెంచడంతో పన్ను చెల్లింపుదారు మొత్తం పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గిస్తుంది. తద్వారా పన్ను భారం తగ్గుతుంది. ఒక ఉద్యోగి స్థూల జీతం నుంచి తీసివేయడంతో మొత్తం స్టాండర్డ్ డిడక్షన్ సంబంధించిన ఖర్చులకు ఎలాంటి రుజువులు పొందపర్చాల్సిన అవసరం లేదు.
- మధ్యతరగతి వారికి వ్యక్తిగత ఆదాయపు పన్ను రేటు గత మూడేళ్లుగా మారలేదు..
ఇక మధ్యతరగతి వారికి వ్యక్తిగత ఆదాయపు పన్ను రేటు గత మూడేళ్లుగా మారలేదు. తర్వాత సంవత్సరంలో, ప్రభుత్వం ‘సరళీకృత పన్ను విధానాన్ని ఓ ప్రత్యామ్నాయంగా ప్రవేశపెట్టింది. ఇందులో పన్ను రేట్లు తగ్గించినప్పటికీ ఒక ఉద్యోగస్తుడు పొందాల్సిన చాలా డిడక్షన్స్, మినహాయింపులను ఇచ్చేందుకు కేంద్రం నిరాకరించింది. నగదు ప్రవాహాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం కనీసం తక్కువ-ఆదాయ వర్గానికి స్పష్టమైన పన్ను తగ్గింపును ఈ సంవత్సరం ప్రకటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక స్టాండర్డ్ డిడక్షన్ పెంచడం వల్ల ఒక ఉద్యోగి టేక్-హోమ్-పే మెరుగుపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

లేదంటే కొన్ని మినహాయింపులను ఉద్యోగులు క్లెయిమ్ చేయలేరని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సారి రానున్న వార్షిక బడ్జెట్ కేంద్రానికి చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2024లో సార్వత్రిక ఎన్నికలు రావటమే ఇందుకు కారణం. చాలా కాలంగా మధ్యతరగతి, వేతనజీవులతో పాటు అనేక మంది కేంద్రంపై కోటి ఆశలతో ఉన్నారు. ఒక విధంగా నిర్మలమ్మకు ఇది టఫ్ బడ్జట్ అని చెప్పుకోవాల్సిందే. ఇప్పటికే వంటింటి ఖర్చులు ద్రవ్యోల్బణంతో పెరిగాయి.
గ్యాస్ సబ్సిడీ తొలగింపు నుంచి నూనెలు, కూరగాయలు, ధాన్యాలు ఆకరికి బియ్యం ధరలు కూడా పెరిగి జేబుపై భారాన్ని మోపాయి. ఈ సమయంలో కొంత ఊరట కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. కనీసం పన్నుల భారాన్ని తగ్గించాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈసారి బడ్జెట్లో అందరూ కోరుకుంటున్న ప్రధాన అంశం టాక్స్ శ్లాబ్ రేట్లలో మార్పులు. మారుతున్న కాలం, పెరుగుతున్న ఖర్చులు, టైమ్ వ్యాల్యూ ఆఫ్ మనీ వంటివి పరిగణలోకి తీసుకుంటే రూపాయి విలువ క్షీణించిందని చెప్పుకోక తప్పదు.
ఈ తరుణంలో కనీసం రూ.5 లక్షల వరకు సంపాదించే ఆదాయంపై ఆదాయపు పన్ను ఉండకూడదని సామాన్యులు బలంగా కోరుకుంటున్నారు. ఒకప్పుడు వచ్చే రూ.3 లక్షల ఆదాయం నేటి ఖర్చులకు అన్వయించుకుంటే రూ.5 లక్షల కంటే ఎక్కువ అవసరం ఉంది. పైగా ఇది దేశప్రజల న్యాయబద్ధమైన కోరిక అని చాలా మంది భావిస్తున్నారు.
ఇప్పటి వరకు ఉన్న ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం ఎవరైన వ్యక్తి ఆదాయం ఏడాదికి రూ.2.50 లక్షలకు లోపు ఉన్నట్లయితే ఎలాంటి టాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఆపై వచ్చే ఆదాయానికి మాత్రమే రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ పరిమితిని రూ.5 లక్షలకు పొడిగించాలని చాలా మంది కోరుతున్నారు. దేశంలోని పలు రాజకీయ పార్టీలు, ఆర్థికవేత్తలు కూడా ఇది అవసరమని చెప్పడంతో నోటిఫికేషన్ తప్పనిసరి అవుతుందని భావిస్తున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో రూ.5 లక్షల వరకు సంపాదించే ఆదాయానికి 100 శాతం పన్ను మినహాయింపు కావాలని దేశ ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. ఇది ప్రజల చేతిలో డబ్బును పెంచి పరోక్షంగా మార్కెట్లో డిమాండ్ మెరుగుపడేందుకు దోహదపడుతుంది. మాంద్యం భయాలతో ఆర్థిక వ్యవస్థ మందగించిన వేళ దేశ ఆర్థికానికి కూడా ఈ నిర్ణయం మంచిదేనని చాలా మంది అంటున్నారు. అందుకే ఇప్పుడు అందరి చూపు ఫిబ్రవరి 1న కేంద్రం ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్ పైనే ఉంది.
ఆపై ఏడాదిలోనే సార్వత్రిక ఎన్నికల నగారా మ్రోగనుండడంతో, బడ్జెట్ వేతన జీవులకు ఊరట ఇస్తోందన్న వాదన వెల్లువెత్తుతోంది. అయితే 2008లో, 2020లో కరోనా సందర్భంగా తలెత్తిన పరిస్థితి కంటే రానున్న మాంద్యం మరింత తీవ్రంగా ఉండనుందన్న హెచ్చరికల వేళ బడ్జెట్ 2023 దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.
ఓవైపు మాంద్యం, మరోవైపు సార్వత్రిక నగారా వేళ .. కేంద్ర బడ్జెట్ .. ఎలా ఉంటుందన్న చర్చ దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతోంది.